సంపాదకీయం

స్వచ్ఛతా సంరంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ నడిచెడి దారులందు
గరికె పూలు పూస్తున్నవి,
నీ ఇంటికి వెనుక, ముందు
ఊట చెఱువులుంటున్నవి,
చెఱువులందు పరిమళాల
సుమ సరములు వెలసినవి
పరిశుభ్రత సభలు తీరి
పరిసరాలు మురిసినవి..
‘‘అయనే తే పరాయణే దూర్వారోహన్తి పుష్పిణీ... హ్రదాశ్చ పుండరీకాణి...’’ అన్నది ప్రకృతి పరిరక్షణ పట్ల మన ఆకాంక్ష. తరతరాల ఈ సనాతన ఆకాంక్ష స్వచ్ఛతను పరిరక్షించింది, పెంపొందింపచేసింది. ‘గరికె’ గడ్డి స్వచ్ఛతకు ప్రతీక, ప్రకృతికి ఆకుపచ్చని పతాక... ఓషధీ రస గుళిక! ‘గరికె’లు జీవజాల స్వస్థతకు చిహ్నాలు. అందుకే మానవులు నడిచేదారుల పక్కన పొలాల సరిహద్దులలో వనాల ప్రాంగణాలలో గరికె గడ్డి పెరగడం శుభ సూచకం, ఆరోగ్యదాయకం. గరికెలను మేసిన ఆవుల పాలు తాగాలన్నది యుగయుగాల భారతీయ జీవన విధానం. గరికె, దర్భ ఒకే ‘జాతి’కి చెందిన ‘గడ్డి’జంటలు- దూర్వాయుగ్మాలు! వర్షాకాలంలో ‘గణపతి’కి గరికెలతో హారాలను సమర్పించి అర్పించడం ఆనవాయితీ! ప్రకృతి పరివర్తన కోసం పర్యావరణ పరివర్తన కోసం అమెరికాలోని న్యూయార్క్‌లో ‘ఐక్యరాజ్యసమితి’ ఆధ్వర్యవంలో జరుగుతున్న సదస్సులో సోమవారం ప్రసంగించిన మన ప్రధాని నరేంద్ర మోదీ గరికె గడ్డిని ప్రస్తావించడం స్వచ్ఛతా పరిరక్షణ ధ్యాస సజీవత్వానికి నిదర్శనం. పర్యావరణ- క్లయిమేట్- పరిరక్షణ గురించి ప్రసంగాలు, చర్చలు చాలా జరిగిపోయాయని ఇప్పుడు కార్యాచరణ జరగాలని ప్రపంచ దేశాలకు మోదీ ఇచ్చిన పిలుపు ‘స్వచ్ఛ పథం’లో కొత్త మలుపు. ‘పర్యావరణ పరిరక్షణ కార్యాచరణ శిఖర సభ’- క్లయిమేట్ యాక్షన్ సమ్మిట్-లో ప్రసంగించగల దాదాపు యాబయి నలుగురు ప్రభుత్వాధినేతలు, ప్రభుత్వాల ప్రతినిధులలో మన ప్రధాని నాలుగవ స్థానంలో ఉండడం ‘ భారతీయ స్వచ్ఛత’కు వినూతన పరిగణన. గత ఐదేళ్లుగా ‘స్వచ్ఛ్భారత’ పునర్ నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అంతర్జాతీయ పరిగణన! వేద శాస్త్ర పురాణ ఇతిహాస తదితర తరతరాల భారత జాతీయ సాహిత్యానికి ఇతివృత్తం స్వచ్ఛత.. స్వచ్ఛమైన ప్రకృతి మధ్య స్వచ్ఛమైన జీవనం పరిఢవిల్లడం, స్వచ్ఛమైన మానవ జీవన విధానం ద్వారా స్వచ్ఛమైన ప్రకృతి వికసించడం హైందవ జాతీయ చరిత్ర! గాలి ‘తేనె’వలె మధురంగా స్వచ్ఛంగా పరిమళించడం- మధువాతా ఋతాయతే- భారతీయుల ప్రాకృతిక ఆకాంక్ష. గాలి మాత్రమే కాదు నదుల నీరు, పరిసరాలు, ఓషధులు, వృక్షజాలం.. ఇలా మొత్తం ప్రకృతి ‘మధుమయం’- తేనెల సమూహం- కావాలన్నది స్వచ్ఛ భారతీయుని జీవన రీతి. ఈ రీతిని విదేశీయ దురాక్రమణకారులు ధ్వంసం చేశారు. బ్రిటన్‌కు వ్యతిరేకంగా ‘క్విట్ ఇండియా’ ఉద్యమం జరిగిన సమయంలో మహాత్మా గాంధీ అనుచరులు ‘వృక్ష హంతకుల’ను నిరోధించడం చరిత్ర. వృక్ష హననం ‘కాలుష్య భారత్’కు ఆరంభం. అందువల్లనే మళ్లీ ‘స్వచ్చ భారత్’ నిర్మించడానికి ‘ఆకుపచ్చదనం’ మొదటి అనివార్యం! మోదీ ప్రస్తావించిన అనివార్యం పచ్చదనం!!
ప్రకృతి మన అవసరాన్ని తీర్చగలుగుతోంది, మన అత్యాశను, దురాశను తీర్చదు- అన్న వాస్తవాన్ని మహాత్మా గాంధీ పునరుద్ఘాటించాడు. పర్యావరణ పరిరక్షణ కార్యాచరణ సభలో ఇవే మాటలను మోదీ ప్రస్తావించాడు. గాంధీ మహాత్ముని నూట యాబయ్యవ- సార్థ శతతమ జయన్తి సంవత్సరం ఇది. స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణం మహాత్మునికి ఘటించదగిన నిజమైన నివాళి-అన్నది ప్రభుత్వ అభిమతం. ఈ అభిమతాన్ని మోదీ న్యూయార్క్ సభలో మరోసారి ప్రస్ఫుటింపచేశాడు. ‘అత్యాశ- గ్రీడ్-కాదు, అవసరం-నీడ్- మాత్రమే మాకు మార్గదర్శక సూత్రం. ‘పర్యావరణ పరిరక్షణ’కు ప్రజలు ఉద్యమించడం ఈ సమయంలో అనివార్యం’’అన్నది ప్రపంచ దేశాలకు మోదీ చెప్పిన హితవు. ‘‘కొండంత ప్రచారం కంటె- ఉపదేశం కంటె- గోరంత ఆచరణకే బలం ఎక్కువ’’ అన్న మోదీ చెప్పిన వాస్తవం కాలుష్యం పెంచుతున్న సంపన్న దేశాల వారికి, కాలుష్యాన్ని పంచుతున్న ‘‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’’- మల్టీ నేషనల్ కంపెనీస్- వారికి తీవ్రమైన అభిశంసనకు సాక్ష్యం. కాలుష్య కారకమైన పదార్థాలను ఉత్పత్తిచేసి ప్రకృతి నెత్తికి, ప్రపంచం నెత్తికి ఎత్తుతున్నది సంపన్న దేశాల వారు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రకృతిని ధ్వంసం చేసి పర్యావరణాన్ని గాయపరుస్తున్న పదార్థాలన్నీ అభారతీయమైనవి, భారతీయ జీవన పద్ధతికి విరుద్ధమైనవి. శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, క్రిమి సంహార ఔషధాలు, రసాయనపు ఎఱువులు, ఆహారం రంగులను ఆకర్షణీయంగా నిగనిగలాడించే ‘రసాయన రజాలు’- కెమికల్ పౌడర్స్- ఇంకా ఇంకా మరెన్నో ప్రకృతిని పరోక్షంగా గాయపరుస్తున్న కాలుష్యాలు. పరిశ్రమల నుంచి, యంత్ర వధశాలల నుంచి, బహిరంగ మలమూత్ర విసర్జనాల నుంచి, ‘ప్లాస్టిక్’నుంచి వెలువడుతున్న దుర్గంధాలు, కాలుష్యాలు ప్రత్యక్షంగా ప్రకృతిని ధ్వంసం చేశాయి, చేస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షక అంతర్జాతీయ ఉద్యమంలో మన దేశం అగ్రగామి కావడం గత ఐదేళ్ల చరిత్ర. అందువల్లనే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాధాన్యం పెరిగింది. మన ప్రభుత్వ వాణిని అందరూ వింటున్నారు. ‘పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ’- పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిపోవడం గత మూడేళ్ల పాలనలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన వైపరీత్యం. పర్యావరణ పరిరక్షక ప్రక్రియలో మన దేశం అమెరికా ‘భిన్నధ్రువాలు’గా అవతరించి ఉన్నాయి. న్యూయార్క్ సదస్సులో అమెరికాకు ప్రాధాన్యం తగ్గింది. అయినప్పటికీ ‘కార్యాచరణ సదస్సు’లో నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో డొనాల్డ్ ట్రంపు దొర అకస్మాత్తుగా సమావేశ భవనంలో ప్రవేశించడం మన ‘పర్యావరణ పరిరక్షక వాణి’కి పెరిగిన ప్రాధాన్యం. అమెరికా అధ్యక్షుడు అతిశయానికి ప్రతిరూపం. ఈ అతిశయం ట్రంపు దొర విషయంలో అహంకారంగా మారింది. స్వతంత్ర దేశాల ప్రభుత్వ అధినేతలను ట్రంప్ వారి ముఖం మీదనే పరుష పదజాలంతో విమర్శించడం రెండున్నర ఏళ్ల కథ.. అలాంటి ట్రంపు‘దొర’ నరేంద్ర మోదీ ప్రసంగం వినడం కోసం సమావేశంలో ఊహించని రీతిలో ఉపస్థితుడు కావడం భారతీయ స్వచ్ఛ ఉద్యమానికి పెరిగిన ప్రాధాన్యం.
పర్యావరణ పరిరక్షణ సమావేశంలో ప్రసంగించిన తరువాత నరేంద్ర మోదీ ‘ప్రపంచ ఆరోగ్య పరిరక్షణ’- యూనివర్సల్ హెల్త్ కవరేజ్- సదస్సులో కూడ ప్రసంగించాడు. మానవ ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వాల అధినేతల సమావేశం జరగడం ఇదే మొదటిసారట. ప్రకృతి ఆరోగ్య పరిరక్షణ, మానవ స్వాస్థ్యరక్షణ పరస్పరం ముడివడి ఉన్నాయన్నది మోదీ ‘న్యూయార్క్’ సభా ప్రసంగాలలో ‘్ధ్వనించిన’ వాస్తవం! భారతీయ ఆరోగ్య పరిరక్షణ ఉద్యమ శకటం నాలుగు చక్రాలపై నడుస్తోందన్నది మోదీ చెప్పిన మాట. యోగం- ఆరోగ్య బీమా పథకం, ఆయుష్మాన్ భారత్, వైద్య చికిత్సకు వౌలిక వ్యవస్థ, మాతాశిశు సంరక్షణ - అన్నవి సమాజ వైద్య చికిత్సా రథానికి నాలుగు చక్రాలు. యోగాభ్యాసం ద్వారా ఆయుర్వేద ఔషధాలు సేవించడం ద్వారా సూర్యోపాసన ద్వారా రోగాలు సంక్రమించకుండా నిరోధించడానికి భారతీయ జీవనం విధానంలో ఉన్న ప్రాధాన్యం ‘నరేంద్రుని’ ప్రసంగంలో ప్రస్ఫుటించింది. సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేవడం మనం సూర్యుడికి ఘటించే గౌరవం. ఇదే సూర్యోపాసన. ఇదే జీవన ‘యోగం’లో వౌలికమైన అంశం! సౌరశక్తి దేశాల కూటమికి మన దేశం నాయకత్వం వహిస్తుండడం ‘స్వచ్ఛ ఇంధనం’ ఉత్పత్తికి ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ప్రాధాన్యానికి చిహ్నం. సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరుగుతున్నకొద్దీ ప్రకృతిలో కాలుష్యం తగ్గిపోతుంది. ఈ దిశగా ఆలోచించే దశనుంచి కార్యాచరణ దశలోకి అంతర్జాతీయ సమాజం అడుగుపెట్టాలన్నది న్యూయార్క్‌లో ఆవిష్కృతమైన భారత జాతీయ అంతరంగం...