సంపాదకీయం

పాపం..ప్రకృతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల భూమి సేకరణ విధానాలు వివాదగ్రస్తం అవుతుండడానికి ప్రధాన కారణం ప్రపంచీకరణ వ్యవస్థ పేరుతో విస్తరిస్తున్న కాలుష్యం..పారిశ్రామిక కాలుష్యం మొదటిది, రెండవది అవినీతి కాలుష్యం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను బృహత్ హైదరాబాద్ నగర పాలక సంస్థ-జిహెచ్‌ఎంసి-కమిషనర్ బి. జనార్ధన రెడ్డిని అరెస్టు చేయవలసిందిగా పోలీసులను జాతీయ హరిత న్యాయ మండలి, చైన్నయ్ ధర్మాసనం వారు ఆదేశించడం బుధవారం నాటి పరిణామం. హరిత నియమావళిని ఉల్లంఘిస్తున్నట్టు దాఖలైన అభియోగాలకు ఆరువారాలలో సమాధానం దాఖలు చేయాలని నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయమండలి ఆదేశించడం గురువారం నాటి పరిణామం. హైదరాబాద్ నగర పాలిక పరిధిలో భూమి దురాక్రమణలు జోరుగా సాగుతున్నాయట. అమరావతి పరిధిలో ప్రభుత్వమే హరితహననం సాగిస్తోందట. ఇవీ అభియోగాలు. ఇలా హరిత పరిరక్షణ నియమావళిని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్న అభియోగాలు వెల్లువెత్తుతుండడం ఆశ్చర్యకరం కాదు. ప్రభుత్వాలు హరిత నియమావళిని ఉల్లంఘిస్తుండడం ప్రపంచీకరణ వ్యవస్థ స్వభావం. హరిత పరిరక్షణ ఉద్యమకారులు న్యాయస్థానాలకు ప్రభుత్వాల హరిత హనన చర్యలను నివేదిస్తుండడం సంభవిస్తున్న సమాంతర పరిణామం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను జాతీయ హరిత న్యాయ మండలి నిలదీస్తుండడం ఈ సమాంతర పరిణామం ప్రక్రియలో సరికొత్త ఘట్టం. నగరాలలో పట్టణాలలోప్రభుత్వ స్థలా లు, ప్రభుత్వేతరుల ఖాళీ స్థలా లు ఉన్నది కబ్జాలకు గురి కావడానికేనన్నది ప్రపంచీకరణ వాణిజ్య స్వభావమైపోయింది. ఈ దురాక్రమణ దారులతో జిహెచ్‌ఎంసి అధికారులలోనే కొందరు కుమ్మక్కయ్యారన్నది ‘జనం కోసం’ అన్న స్వచ్ఛంద సంస్థవారు ఎన్‌జిటిలో దాఖలు చేసిన పిటిషన్‌లోని ప్రధాన అభియోగం. హైదరాబాద్ చందానగర్ ప్రాంతంలో పంతొమ్మిది ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న గృహ సముదాయ ప్రాంగణంలో మూడెకరాల భూమిని హరిత మైదానం- పార్క్- కోసం కేటాయించారట. 1997 నుంచి హరిత మైదానంగా ఉన్న ఈ మూడెకరాలను దురాక్రమించి ఇళ్ల స్థలాలుగా తీర్చిదిద్దే అక్రమ కలాపం ఇప్పుడు మొదలైందట. ఈ హరిత హనన కార్యక్రమానికి జిహెచ్‌ఎంసికి చెందిన కొందరు అధికారులు, ఉద్యోగులు అండదండలు కావడం అవినీతి విస్తరణలో భాగం. ఈ అభియోగం విచారణకు హాజరు కావలసిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిహెచ్‌ఎంసి కమిషనర్ న్యాయమండలి నిర్దేశించిన రోజులలో హాజరు కాలేదట. అందువల్ల వారి అరెస్టునకై న్యాయస్థానం వారెంట్ జారీ చేయడం సహజం. హరిత హారం కార్యక్రమం ద్వారా రాష్టమ్రంతటా పచ్చని చెట్ల పరిమళాలను పంచడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ ఉన్న పచ్చదనాన్ని పాడు పెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగంలోని వారే పాటుపడుతుండడం ‘‘దీపం పెట్టిన తరువాత దిగనేసిన చందం..’’
న్యాయ మండలి ఆదేశాలను ధిక్కరించి అమరావతి ప్రాంగణంలో నూతన రాజధానిని నిర్మిస్తున్నట్టు దాఖలైన అభియోగానికి ఆరు వారాలలోగా అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది. హరిత నియమావళికి సంబంధించిన పర్యావరణ అనుమతులు లభించే వరకు రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను చేపట్టరాదని నేలను సైతం చదును చేయరాదని న్యాయమండలి ఆదేశించిన సంగతి బహుశా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుర్తులేదు. కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వశాఖ వారు అనుమతులను మంజూరు చేసిన జాడ ఇప్పటికీ గోచరించడం లేదు. ఈ అనుమతులు లభించేవరకు నేలను సైతం చదును చేయరాదన్న తాత్కాలిక ఆదేశాన్ని న్యాయమండలి అక్టోబర్ 11వ తేదీన మరోసారి పొడిగించింది. ఈ ఉత్తర్వులను గమనించనట్టు అభినయం చేసిన అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 22న భారీ ఆర్భాటాల మధ్య రాజధాని నిర్మాణాన్ని మొదలు పెట్టింది. శంకు స్థాపన లాంఛనం ముగిసిన తరువాత న్యాయమండలి తుది నిర్ణయం వెలువడే వరకు నిర్మాణం కొనసాగదన్న భావం అప్పుడు కలిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం అనుమతులను పొందలేదు. న్యాయమండలిలో వాదించి అనుకూలమైన తీర్పును పొందడానికి సైతం ప్రయత్నించలేదు. తాత్కాలిక రాజధాని భవన సముదాయం జూన్ నాటికి ఏర్పడిపోతుందన్న ప్రచారం కూడ జరిగిపోయింది. న్యాయ ధిక్కార ప్రవృత్తికి ఇదంతా నేపథ్యం...
రాజధాని నిర్మాణంకోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వారు అనుమతులను మంజూరు చేయాలన్నది ఏళ్ల తరబడి ప్రచారవౌతోంది. ఈ అనుమతులను ప్రసాదించే వ్యవహారాన్ని నీరు కార్చడానికి నిబంధనలను సడలింప జేయడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు బహిరంగంగాను, ప్రచ్ఛన్నంగాను చేస్తున్న ప్రయత్నాలు అవినీతి విస్తరింపజేస్తున్నాయన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇదం తా ధ్యాసలేని వ్యవహారం. ఎందుకంటె రాజధాని నిర్మాణం కోసం హరిత అనుమతులను కేంద్రం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వారి పర్యావరణ ప్రభావ నిర్ధారణ సంస్థ అనుమతిని ప్రదానం చేసిందట. ఈ అనుమతి ప్రాతిపదికగా రాజధానిని నిర్మించేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారించడం విచిత్రమైన వ్యవహారం. న్యాయమండలి వారు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తెచ్చుకోవాలని ఆదేశించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు తానే అనుమతి ఇచ్చుకుందట. మాగాణి, మెట్ట భూములను విడివిడిగా గుర్తించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని నిర్మించడానికి పూనుకుంది. ఈ ప్రాంతంలో అంతస్థుల భవనాలను ఆకాశ హార్మ్యాలను నిర్మించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు పెద్ద ఎత్తున విరుచుకుపడే ప్రమాదం ఉన్నట్టు పర్యావరణ శాస్తవ్రేత్తలు చేస్తున్న హెచ్చరికలు కూడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి చెవులకు సోకినట్టు లేదు. లేదా ప్రభుత్వం వారు విననట్టు అభినయ విన్యాసాలు సాగిస్తున్నారేమో. రాజధాని నిర్మాణం కోసం విదేశీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడమే ఈ విన్యాసాల లక్ష్యం. వంద అంతస్థుల భవనాలను, ఆకాశ హార్మ్యాలను నిర్మించడానికై చైనా సంస్థలు సైతం తహతహలాడి పోతుండడం పర్యావరణాన్ని విలవిలలాడిస్తున్న దృశ్యం...చైనా మన భూమిని దురాక్రమించి తిష్ఠ వేసి ఉన్న శత్రు దేశం.
పర్యావరణం పాడు పడని రీతిలో పారిశ్రామిక ప్రగతిని సాధించాలన్న విధానం ఇప్పటికీ మనదేశంలో రూపొందకపోవడం ప్రాకృతిక వైపరీత్యాలకు మూల కారణం. నగరాలను పట్టణాలను రెండు అంతస్థులకు మించని భావనలతో విస్తరింపజేయడం హరిత పరిరక్షణకు దోహదం చేస్తుంది. నైపుణ్య పాటవాలను ప్రదర్శించుకొనడానికై ఎక్కడో ఒకచోట అంతస్థుల భవనాలను ప్రభుత్వం నిర్మించవచ్చు. అలాంటి అంతస్థుల భవనం చుట్టూ విశాలమైన హరిత ప్రాంగణం ఏర్పాటు చేయాలి. కానీ కనుచూపు మేరలో పచ్చని మొక్క మొలవడానికి వీలులేని రీతిలో పరుసగా అంతస్థుల భవనాలను నిర్మించడం వల్ల ప్రకృతి క్షతగాత్ర అయిపోతోంది..