సంపాదకీయం

ఊపిరాడని ఉనికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయుకాలుష్యం వల్ల మానవుల ఆయుర్దాయం తగ్గిపోతోందన్నది మరోసారి జరిగిన ధ్రువీకరణ. కానీ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏవన్నది మాత్రం స్పష్టం కావడంలేదు. శాస్తజ్ఞ్రుల నిర్ధారణలో స్పష్టత లేదు, ప్రభుత్వాల విధానాలలో స్పష్టతలేదు. కాలుష్యం వల్ల ప్రాణాపాయం కలుగవచ్చునన్నది సామాన్య పరిజ్ఞానం. దీన్ని కనిపెట్టడానికి పరిశోధనలు అక్కరలేదు. కానీ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలుకొని దేశ విదేశాలలోని స్వచ్ఛంద, ప్రభుత్వేతర ప్రభుత్వ సంస్థలెన్నో నిరంతరం పరిశోధన చేసి ఈ మహా విషయాన్ని మళ్లీ మళ్లీ కనిపెడుతూనే ఉన్నాయి. వాయు కాలుష్యం వల్ల ఆయుఃప్రమాణం తగ్గిపోతోంది. వాయుకాలుష్యం కాని ఏర్పడకుండా నిరోధించడానికి వలసిన పద్ధతుల గురించి విరివిగా పరిశోధనలు జరగాలి. కానీ అలాంటి పరిశోధనలు పెద్దగా జరగడంలేదు. జరిగినప్పటికీ శాస్తవ్రేత్తలు తేల్చిన సంగతులను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ‘ప్లాస్టిక్’ వినియోగం కాలుష్యానికి ఒక ప్రధాన కారణమన్న పరిశోధనల ఫలితాలను ప్రభుత్వాలు కార్యాచరణకు తేలేకపోవడం ఒక ఉదాహరణ మాత్రమే. లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. అందువల్ల గతంలో ప్రపంచ ఆరోగ్యసంస్థవారు కనిపెట్టిన కాలుష్యం గురించి ఇప్పుడు ఉష్ణమండల పర్యావరణ పరిశోధక భారతీయ సంస్థ-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటరాలజీ-ఐఐటిఎమ్-వారు మళ్లీ కనిపెట్టి ధ్రువీకరించారు. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం సగటున ఆరేళ్ల నాలుగు నెలలు తగ్గిపోతుందట. వందేళ్లు బతకవలసినవారు కాలుష్యపు గాలి పీల్చుకున్న కారణంగా తొంబయి మూడేళ్ల ఎనిమిది నెలలు మాత్రమే జీవిస్తారు. సహజంగానే వంద ఏళ్లకంటె తక్కువకాలం జీవించేవారి ఆయుఃప్రమాణం మరో ఆరేళ్ల నాలుగు నెలలు తగ్గిపోతుందట. ఢిల్లీ ప్రజల ఆయుర్దాయం ఇలా తగ్గిపోవడం ప్రతీక మాత్రమే. దేశమంతటా విలయతాండవం చేస్తున్న కాలుష్య పిశాచం అసలు సమస్య. ఢిల్లీలో మాత్రమే వాయు కాలుష్యం ఏర్పడి ఉందని భావించరాదు. అన్ని నగరాలలోను పట్టణాలలోను చివరికి గ్రామాలలోను వనసీమలలోని గూడేలలో సైతం గాలి మాత్రమే కాదు పరిసరాలు మొత్తం కాలుష్యభరితమై ఉండడం ప్రభుత్వాలు, ప్రజలు ఆందోళన చెందవలసిన అంశం. 2011వ సంవత్సరంలో ఢిల్లీలోనే దాదాపు పదివేల మంది వాయు కాలుష్యం వల్ల నిర్ణీత వ్యవధికంటె ఆరేళ్ల ముందుగానే మృత్యువుపాలయ్యారట.
వాయు కాలుష్యం కారణంగా ఏఏ రాష్ట్రాల్లో ఎంతమేరకు ఆయుర్దాయం తగ్గిపోతుందన్న వివరాలను సైతం ఈ ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థ వారు మహారాష్ట్ర పూణే నగరంలో జూన్ ఆరవ తేదీన వెల్లడించారట. ఢిల్లీ తరువాత పశ్చిమ బెంగాల్‌లో ఆయుర్దాయం ఎక్కువగా నష్టమవుతోంది. సగటున దేశ ప్రజల ఆయుర్దాయం వాయుకాలుష్యం వల్ల నాలుగేళ్ల పాటు తగ్గిపోతోందట. ఉత్తర ప్రదేశ్‌లోనే వాయు కాలుష్యం వల్ల 2011లో ఎనబయి ఆరువేల మంది మరణించారట. వాయు కాలుష్యం వల్ల జరిగిన అనర్థం ఇదంతా...మిగిలిన కాలుష్యాలవల్ల దేశవ్యాప్తంగా ఎంతమంది దుష్ప్రభావాలకు గురవుతున్నారో మరి. పరిసరాల కాలుష్యాన్ని తగ్గించడానికి వీలుగా హరిత నియమాలను అమలు జరపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నది సమాంతర పరిణామం. పరిశ్రమలు ఇంధన కాలుష్యాన్ని ఇతర కాలుష్యాన్ని తగ్గించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్పాదక పద్ధతులను ఆధునీకరించుకోవలసి ఉంటుందట. ఫలితంగా పరిశ్రమల నిర్వాహక వ్యయం పెరగనున్నదట. ‘‘తాగేవాడే కడతాడు తాటిపన్ను.’’ అన్న చందంగా ఈ నిర్వహణ వ్యయాన్ని భరించవలసిన వారు వినియోగదారులు మాత్రమే. పెట్రోలు, డీజిల్ విద్యుత్తు వంటి ఇంధనాల ధరలు రాబోవు రోజులలో భారీగా పెరగడానికి మాత్రమే పరిశ్రమలవారు చేపట్టనున్న స్వచ్ఛవాయు చర్యలు దోహదం చేయనున్నాయి. అంతర్జాతీయ అనుసంధానం కారణంగా విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పర్యావరణ పరిరక్షణ పేరుతో ఇంధనం తదితర పారిశ్రామిక ఉత్పత్తుల ధరలను భారీగా పెంచడం ఖాయం. కార్ల ధరలనుంచి కందిపప్పు ధరల వరకు పెంచచడానికి పారిశ్రామిక వాణిజ్య రంగాలవారు స్వచ్ఛ పర్యావరణం కార్యక్రమాలను వినియోగించుకోనున్నాయి. మంచినీటిని ప్లాస్టిక్ సంచులలోను సీసాలలోను నింపి అమ్ముతుండడం నేటి సంగతి. ఆధునికతకు అలవాటు పడిన మనం ఈ పారిశ్రామిక వాణిజ్య జలాలను కొని ‘అమృతం’లాగా సేవిస్తున్నాము. స్వచ్ఛమైన గాలి తిత్తులను, ఆ తిత్తులను ముక్కులకు తగిలించుకునే పరికరాలను సైతం విరివిగా కొనుగోలు చేయడానికి జనం ఉవ్విళ్లూరడం బహుశా రేపటి సంగతి...
నగరాలలోను పట్టణాలలోను కాలుష్యం కేంద్రీకృతం అవుతుండడానికి ప్రధానకారణం నిర్మాణపు పద్ధతులు, నిర్మాణ ప్రణాళికలు. నగరాలు పట్టణాలు ఒకటి రెండు అంతస్థుల భవనాలలో అడ్డంగా విస్తరించిన సమయంలో కాలుష్య ప్రభావం తక్కువ, కానీ కొన్ని దశాబ్దులుగా నగరాలు, పట్టణాలు నిలువునా పెరుగుతున్నాయి. మనిషి నిలువునా పెరగడం ఆరోగ్యకరం, పట్టణాలు, నగరాలు అడ్డంగా పెరగడం ఆరోగ్యకరం. కానీ పెరుగుదల పద్ధతి మారిపోయింది. మనుషులు చాక్లెట్లను, ఐస్‌క్రీములను, నూనె నిండిన అనవసరపు తినుబండారాలను నిరంతరం ఆరగిస్తున్నారు. బొజ్జలు పెంచుకొని అడ్డంగా పెరుగుతున్నారు..కుర్చీలు పట్టడం లేదు. ఇందుకు విపరీతంగా నగరాలలో పట్టణాలలో నిర్మాణాలు నిలువునా పెరిగి అంబరాన్ని చుంబిస్తున్నాయి. నాలుగు ఇళ్లు అడ్డంగా విస్తరించిన చోట ఇరవై ఇళ్ల అంతస్థుల భవనం తయారవుతోంది. నాలుగిళ్లను కూల్చివేసిన నిర్మాతలు-బిల్డర్లు- ఆ స్థలాలలో ఐదారు అంతస్థుల భవనాన్ని వెలయిస్తున్నారు. ఇది సగటు పెరుగుదల. అంటే ఒక ఇల్లు ఉన్న భూమిపై ఐదు ఇళ్లు ఏర్పడుతున్నాయి. ఐదుమంది ఉన్న చోట ఐదు కుటుంబాలు అంటే ఇరవై ఐదుమంది చేరుతున్నారు. పది వాహనాలు నిలిచినచోట యాబయి వాహనాలు నిలుస్తున్నాయి. ఈ వాహనాలన్నీ స్త్భించిపోతున్నాయి. ఇంధన కాలుష్యం కేంద్రీకృతం అయిపోతోంది. ఐదుమంది గాలిపీల్చి వదిలిన స్థలంలోనే ఇరవై ఐదుమంది గాలిపీల్చి వదులుతున్నారు. వాయు కాలుష్యం ఏర్పడడానికి ఇదీ ప్రధాన కారణం..
అంతస్థుల భవనాల నిర్మాణానికి అనుమతించడం ప్రభుత్వాలు ఆపివేసినట్టయితే మూడువంతుల కాలుష్యం తగ్గిపోతుంది. లేదా అంతస్థులకు అనుగుణంగా హరిత ప్రాంగణాలను ఏర్పాటు చేసేవిధంగా నిర్మాణ నియమాలను సవరించాలి. నాలుగు అంతస్థుల భవనం చుట్టూ ఎన్నివందల చదరపు గజాల హరిత ప్రాంగణం ఉండాలి? పది అంతస్థుల భవనం చుట్టూ ఎంతమేర చెట్లను పెంచాలి? ఇలాంటి హరిత నియమాలను ప్రభుత్వాలు పురపాలక సంస్థలు రూపొందించాలి. కేంద్రీకరణ వాయు కాలుష్యాన్ని మాత్రమే కాదు జల కాలుష్యాన్ని కూడ, నీటికొరతను సృష్టిస్తోంది. వేల అడుగుల లోతులో కన్నాలు వేసి నేల తల్లిని గాయపరచడం వల్ల భూగర్భం ఎండిపోతోంది. ప్రత్యేక పారిశ్రామిక ఆర్థిక మండలాలకు సమానంగా ప్రత్యేక హరిత మండలాలను ఎందుకని ఏర్పాటు చేయరు?