సంపాదకీయం

శభాష్.. సింధు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక దేశం ఉప్పొంగింది. ఒక జాతి సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. ఓ తెలుగు తేజం ఇందుకు ఉద్దీపనగా నిలిచింది. రియో వేదికగా తెలుగమ్మాయి సింధు చేసిన భారతీయ సింహనాదం దశదిశలా పిక్కటిల్లింది. స్వర్ణమే లక్ష్యంగా ఒలింపిక్స్ బాడ్మింటన్ ఫైనల్ బరిలోకి దిగి విశ్వ విజేతను ముప్పుతిప్పలు పెట్టిన వైనం, క్రీడల్లో భావి భారత పోరాట పటిమను కళ్లకు కట్టింది. రియోనుంచి రిక్తహస్తాలతో ఒకొక్కరుగా నిష్క్రమిస్తూ..ఇక ఆశలు ఆవిరే..తట్టా బుట్టా సర్దుకుని వందమందీ ఇంటికేననుకుంటున్న తరుణంలో ఓ అద్భుతం జరిగింది. అందుకు హర్యానా క్రీడాకారిణి సాక్షి నాంది పలికితే..దాన్ని సింధు మరింత ముందుకు తీసుకెళ్లింది. సెమీ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణిని సునాయాసంగానే ఓడించి కాంస్యాన్ని ఖరారు చేసుకున్న సింధు అదే స్ఫూర్తితో ఫైనల్‌లోనూ ప్రత్యర్థితో తలపడింది. అనుభవంలో తలపండిన కరోలినా మారిన్ ముందు తెగువగా నిలబడి, దీటుగా ఎదుర్కొని ‘వహ్వా’ అనిపించింది. యావద్భారతానికి ఎనలేని ఖ్యాతినార్జించి పెట్టిన సింధూ మన తెలుగమ్మాయి కావడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం. విశ్వవేదికలపై రాణించాలంటే కేవలం ఆశ ఉంటే సరిపోదు. అందుకు తగ్గ పోటీ పటిమ, పోరాట స్ఫూర్తి మెండుగా ఉండాలి. వాటన్నింటినీ ఒడిసి పట్టి, క్రీడాకారుల ప్రతిభకు పదును పెట్టే రీతిలో వ్యవస్థాగతంగా సన్నద్ధం కావాలి. ఇవాళ సింధు విజయాన్ని యావద్భారతం స్ఫూర్తిగా తీసుకుంటోందంటే.. పదును పెడితే మన క్రీడాకారులు ఎలాంటి విజయాన్నయినా, ఎంతటి ఘనతనైనా సాధించగరలన్న వాస్తవం కళ్లకు కడుతోంది.
బాడ్మింటన్‌లో అంతర్జాతీయ టైటిళ్లు గెలిచిన భారతీయులు ఉన్నప్పటికీ, ఒలింపిక్స్ విషయానికొస్తే మన ప్రదర్శన తీసికట్టే. క్రికెట్, హాకీ, కబడ్డీల తర్వాత మన దేశంలో అత్యధికులు ఆడే ఆట బాడ్మింటన్. అయినా ఒలింపిక్స్‌లో పతకాలు దక్కిన దాఖలాలు మాత్రం బహు అరుదు. ఈ రంగంలో భారత క్రీడాకారులు కాలు నిలదొక్కుకుని, అప్పటికే దిగ్గజ దేశాలుగా పేరుపడిన చైనా, చైనీస్ తైపీ, డెన్మార్క్, ఇండొనేసియా, ఇంగ్లాండ్‌లకు సవాల్ విసిరింది మాత్రం 1980 దశకం నుంచే. బాడ్మింటన్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను 1980లో ప్రకాశ్ పదుకొనే గెలుచుకున్నాడు. ఈ విజయంతో అప్పటివరకూ మన దేశాన్ని తేలిగ్గా తీసుకున్న బాడ్మింటన్ దిగ్గజాలు కాస్తంతైనా జాగ్రత్తపడటం మొదలుపెట్టాయి. అయినా పుల్లెల గోపీచంద్ (2001) రూపంలో మరో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ గెలిచేందుకు మనకు పట్టిన సమయం 21 ఏళ్లు. కొత్త సహస్రాబ్దిలోకి అడుగిడాకే ఈ క్రీడలో భారత్, పతకాల రేసులో సత్తా చూపించడం మొదలుపెట్టింది. మాజీ ఆటగాళ్లు విమల్ కుమార్, గోపీచంద్ వంటి వారి నేతృత్వంలో బాడ్మింటన్‌కు దక్షిణ భారతం కోచింగ్ హబ్‌గా అవతరించింది. క్రీడాకారులకు సైతం దక్షిణ భారతదేశమే కేంద్ర స్థానంగా మారడం గర్వించదగిన అంశం. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్న గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్, పివి సింధు, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తదితరులంతా దక్షిణాది కోచింగ్ కేంద్రాల్లో తమ ప్రతిభకు సానబెట్టుకుంటున్నవారే. అటు పురుషుల్లోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ బాడ్మింటన్‌లో భారత్ ఇంతవరకూ ఒలింపిక్స్‌లో ఎప్పుడూ ఫైనల్ చేరుకోలేదు. ఆ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణి సింధు కావడం విశేషం. లండన్ ఒలింపిక్స్‌లో సెమీస్‌వరకూ వెళ్లి, ప్లే ఆఫ్‌లో గెలిచి కాంస్యం సంపాదించి, ఇప్పటి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంపై ఆశలు రేకెత్తించిన సైనా నెహ్వాల్, మోకాలి గాయంతో రియోలో క్వార్టర్స్‌కైనా చేరుకోకముందే ఓటమి పాలవడం దురదృష్టకరమే. లేనిపక్షంలో పసిడి, రజత పతకాలు మన ఖాతాలోనే పడేవేమో. దాదాపు వందేళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో ఇండివిడ్యువల్ మెడల్స్ గెలుచుకున్న మహిళలు... నిన్నటి సాక్షి మాలిక్ సహా నలుగురేనన్న సంగతి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ నలుగురూ కాంస్య పతక విజేతలే కావడం మరీ విచారించదగ్గ విషయం. అయితే మరో మెట్టు ఎక్కి రజత పతకాన్ని సాధించి భారత పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపజేసిన పివి సింధును చూసి 125 కోట్ల భారతీయులు గర్విస్తున్నారు.
దేశ జనాభాకు తగినట్టే, అంతర్జాతీయ క్రీడా వేదిక ఏదైనా, ఆర్భాటంగా కనిపించేది భారత బృందమే. ఈసారీ అందుకు ఏ మాత్రం తీసిపోని విధంగా భారత బృందం బ్రెజిల్‌కు బయల్దేరింది. రాజు వెడలె...రవి తేజములలరగ...చందంగా 14 క్రీడాంశాల్లో పోటీ పడేందుకు 118 మంది క్రీడాకారులతో వెళ్లిన భారత బృందం ఇప్పటివరకూ గెలుచుకున్నది రెండే రెండు పతకాలు! ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో రెండో స్థానం ఆక్రమించుకున్న సువిశాల భారతావని, ఆటల విషయంలో చతికిలపడటానికి కారణాలు బోలెడు. రాజకీయాలకు ఆలవాలమైన క్రీడా సంఘాలు, పోరాటమే ఊపిరిగా, పట్టుదలే ప్రాణంగా భావిం చి, బరిలోకి దిగే క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపాల్సింది పోయి వెన్నుపోటు పొడిచే కుత్సిత మనస్తత్వంగల ‘ద్రోణాచార్యులు’ పెచ్చుమీరిన కారణంగా క్రీడలు కునారిల్లుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. క్రీడా సంఘాల్లో రాజకీయుల జోక్యం సహించరానిదని న్యాయస్థానాలు నెత్తీనోరూ బాదుకున్నా చీమ కుట్టినట్టయినా లేని ప్రభుత్వ పెద్దల ఉదాసీన వైఖరీ ఇందుకు కారణమే. ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, వారికి స్పాన్సర్లుగా వ్యవహరించడంలో ప్రైవేటు సంస్థలు వహిస్తున్న పాటి బాధ్యతను ప్రభుత్వాలు తలకెత్తుకోకపోవడం విచారకరం. ఆటలతోటే జీవితాన్ని ఆరంభించి, వాటిలో రాటు తేలేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టే క్రీడాకారులకు మన దేశంలో ఆదరణ కరవవుతోంది. వయసు పైబడి, క్రీడలకు గుడ్‌బై చెప్పాక ఎటు పోవాలో తెలియని అయోమయ స్థితి ఇప్పటి మన క్రీడాకారులది. వారిని అక్కున చేర్చుకుని ఆదరించని ప్రభుత్వాల వైఖరే భావితరాలకు క్రీడలంటే అయిష్టత ఏర్పడటానికి కారణమవుతోంది. అంతెందుకు...ఒలింపిక్స్ పతకాలు గెలుచుకున్న సైనా నెహ్వాల్, సింధులాంటి వారిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది స్పాన్సర్లే. సింధు విజయంతోనైనా పాలకులు కళ్లు తెరవాలి. భారతీయ క్రీడాంగణాన్ని విశ్వ వేదికలపై విజయ దుందుభి మోగించేలా చేయాలి. అంతర్జాతీయ వేదికలపై గెలుపొందిన క్రీడాకారులకు లక్షలు, కోట్లు కుమ్మరించడానికి ముందుకొచ్చే ప్రభుత్వాలు, క్రీడల ప్రోత్సాహానికి దీర్ఘకాలిక ప్రణాళికలకు వ్యూహ రచన చేయాలి. పాఠశాలస్థాయినుంచే ప్రతిభను గుర్తించి, సానబెట్టేందుకు పటుతరమైన కృషి సల్పాలి. ప్రతిభకూ, పట్టుదలకూ భారతీయులు పెట్టింది పేరు. వారికి కావలసిందల్లా ప్రోత్సాహం. ఆ పాటి వెన్నుతట్టి, భుజం చరిచి, బరిలోకి దింపే బాధ్యత తీసుకోని ప్రభుత్వాలెందుకు?