సంపాదకీయం

తీరుమారని ఎర్రతేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కాశ్మీర్‌లోని లడక్‌లో ఏర్పడిన వాస్తవ అధీనరేఖ- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్-ఎల్‌ఏసి- పొ డవునా ఉద్రిక్తతలను ఉద్ధృతం చేయడానికి చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం అమలుజరుపుతున్న విష వ్యూహంలో ఇది మరో ఘట్టం. చుమార్ ప్రాంతంలోని ‘డెమ్‌చోక్’ వద్ద చైనా వారి ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’- పిఎల్‌ఏ- మరోసారి ‘రేఖ’ను దాటి మన వైపునకు చొరబడింది. చొరబడిన ‘దళాలు’ ముందుకు సాగకుండా మన ‘్భరత-టిబెట్ సరిహద్దు రక్షక దళాలు’- ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్- ఐటిబిపి- వారు బుధవారం నుండి నిరోధిస్తున్నారు. ప్రశాంతంగా వ్యవసాయపు నీటి కాలువను నిర్మించుకొంటున్న స్థానిక సిబ్బందిని బెదిరించి ‘కాలువ’ నిర్మాణాన్ని నిలిపివేయాలని ‘పిఎల్‌ఏ’ సాయుధులు కోరుతున్నారట! ఈ సమాచారం అందిన వెంటనే ‘ఐటిబిపి’ జవానులు కాలువ నిర్మిస్తున్న గ్రామం వద్దకు వెళ్లి ‘పిఎల్‌ఏ’ దళాలను నిరోధించారు. ‘రేఖ’కు ఇరువైపులా జరిగే రక్షణ సంబంధ నిర్మాణాల గురించి ఉభయ దేశాలు పరస్పరం సమాచార వినిమయం చేసుకోవాలనే ఒడంబడిక గతం లో కుదిరిందట! అయి తే ‘డెమ్‌చోక్’ ప్రాంతం లో ప్రస్తుతం జరుగుతున్న కాలువ నిర్మా ణం రక్షణ వ్యవహారాలకు సంబంధం లేని అంశం. ఒక వేడినీటి బుగ్గ నుంచి సమీప గ్రా మానికి ఈ కాలువను నిర్మిస్తున్నారు. ఈ పంట కాలువ నిర్మాణం గురించి ‘సమాచార వినిమయం’ అవసరం లేదు. అయినప్పటికీ చైనీయ సైనికులు కాలువ నిర్మాణాన్ని అడ్డుకొనడానికి యత్నించడం కేవలం కవ్వింపుచర్య. చుమార్-డెమ్‌చోక్ ప్రాంతం లడక్ దక్షిణ భాగంలో హిమాచల్ ప్రదేశ్‌కు చేరువలో ఉంది. ఈ ప్రాంతంలోనే సింధూనది టిబెట్ నుంచి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశిస్తుంది. సింధూనది జన్మస్థలి అయిన ‘మానస సరోవరం’ ఉత్తరాఖండ్‌కు చేరువలో ఉంది. సమీపంలోనే కైలాస పర్వతం ఉంది. ‘కైలాస-మానస’ ప్రాంతం అనాదిగా భారతీయులకు సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రం. టిబెట్‌ను చైనా దురాక్రమించేవరకూ మన దేశం వారు నిర్నిరోధంగా ‘మానస-కైలాస’ ప్రాంతానికి వెళ్లి వచ్చేవారు. ఇపుడు చైనా అనుమతి తీసుకొనవలసి రావడం చారిత్రక వైపరీత్యం! టిబెట్ దురాక్రమణ తరువాత 1959-1962 సంవత్సరాల మధ్యలో చైనా లడక్‌లోని మరిన్ని ప్రాంతాలను ఆక్రమించింది. 1962లో మరిన్ని ప్రాంతాలను ఆక్రమించింది. లడక్‌లోని మన భూభాగంపై తిష్ఠ వేసిన చైనా 1962లో ఏకపక్షంగా ‘వాస్తవ అధీనరేఖ’ను నిర్ణయించింది. ఫలితంగా 39వేల చదరపు కిలోమీటర్ల లడక్ ప్రాంతం ఇప్పటికీ చైనా అక్రమ అధీనంలో ఉంది. కానీ ఈ వాస్తవ అధీనరేఖను కూడా నిరంతరం మనవైపునకు జరపడానికి చైనా యత్నిస్తోంది..
ఎందుకంటే లడక్‌ను పూర్తిగా కబళించాలన్నది చైనా దురాక్రమణదారుల అసలు లక్ష్యం. ఈ లక్ష్యం ఎప్పటికీ నెరవేరబోదన్నది చైనాకు కూడా తెలుసు. కానీ సరిహద్దులలో సడలని ఉద్రిక్తతలను కొనసాగించాలన్నది 1962 నుంచీ చైనా విధానమైంది. గత దశాబ్దికి పైగా ఈ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. సరిహద్దు వివాదంతో సంబంధం లేకుండా చైనాతో మైత్రిని పెంపొందించుకోవాలన్న మన ‘పథభగ్న’ విధాన ఫలితమిది. 1988 వరకూ ప్రభుత్వం చైనాతో అంటీముట్టనట్టుగా వ్యవహరించింది. కానీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చైనాకు వెళ్లి వచ్చిన తరువాత అంతవరకూ మన ప్రభుత్వం ‘నడచిన’ విధాన పథాన్ని పగులగొట్టారు. కొత్త విధానం మొదలైంది. సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యేవరకూ చైనాతో ఇతర రంగాలలో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకోరాదని 1985 వరకూ మన ప్రభుత్వం భావించింది. చైనా దురాక్రమణ గ్రస్తమైన మన సీమలను విముక్తి చేయడం అప్పటివరకూ మన విధాన లక్ష్యం. 1962 నుంచి, చైనా దురాక్రమణ చేసిన నాటి నుంచి కొనసాగిన ఈ విధానం 1988లో రద్దయిపోయింది. సరిహద్దు సమస్య పరిష్కారం అయినా కాకపోయినా, మన భూమి కబంధ బంధం నుంచి విముక్తి అయినా కాకపోయినా మన దేశానికి చైనాతో మైత్రి కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆరంభించిన ‘పథభగ్న’- పాత్ బ్రేకింగ్ విధానం.. ఈ పథభగ్న విధానం నిజానికి 1947-62 సంవత్సరాల నడుమ అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కొనసాగించిన విధానానికి పునరావృత్తి! మన ప్రభుత్వ నిర్వాహకులు చైనా మైత్రితో మత్తెక్కిపోయారు. ‘చైనాను చూసి నేర్చుకోవాలి...’ అని కొందరు ముఖ్యమంత్రులు, దేశంలోని ఇతర రాజకీయ ప్రముఖులు పదే పదే వాక్రుచ్చుతున్నారు..
ఈ ‘మైత్రి’ చాటున పనికిరాని, అక్కరలేని నాసిరకం చైనా వస్తువులు మన దేశంలో దిగుమతి అయిపోతున్నాయి. విలువైన మన ఇనుప రజం భారీగా చైనాకు తరలిపోతోంది. అయినప్పటికీ మన ఎగుమతుల కంటే చైనా నుంచి చొరబడుతున్న వస్తువుల విలువ ప్రతి సంవత్సరం సగటున రెండు లక్షల కోట్ల రూపాయ లు అధికంగా ఉం టోంది. అంటే ఏమిటి? వాణిజ్య లోటు రూ పంలో ఏటా మనం చైనాకు రెండు లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాము. ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- మన దేశం నుంచి చైనాకు తరలిపోతోంది! ఈ వాణిజ్యం వద్దని మనం నిర్ణయించుకున్నట్టయితే మనకు ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల నిధుల ఆదా అవుతాయి. ‘నల్ల బంగారం’ వంటి మన ‘ఇనుప రజం’ మన దేశంలోనే ఉంటుంది! కానీ మన ప్రభుత్వాలకు ఈ ధ్యాస పెరగడం లేదు. మన సరిహద్దు గోడను కూల్చడానికి నిరంతరం యత్నిస్తున్న చైనాకు మనమే ‘గునపాల’ను అందిస్తున్నాము. ఈ ‘గునపాలు’, ‘గడ్డపారలు’ మన ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ రూపంలో చైనాకు తరలిపోతుండడం దశాబ్దుల వైపరీత్యం! మనం ఏటా చైనాకు రెండులక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న వాస్తవాన్ని గుర్తించని వివిధ రాష్ట్రాల ప్రభుత్వ నిర్వాహకులు చైనా నుంచి మనకు ‘పెట్టుబడులు వస్తున్న’ లాలసకు లోనవుతున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని ఇపుడు ప్రజలు చేయడానికి పూనుకుంటున్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న ఉద్యమాన్ని మొదలుపెట్టారు. చైనా బెంబేలెత్తుతోంది. ఉద్యమ విజయం చైనా అక్రమ లాభాలకు నిరోధకం కాగలదు..
అందువల్ల దురాగ్రహానికి గురైన చైనా ప్రభుత్వం లడక్‌లో ఈ దుశ్చర్యకు పూనుకొంది! చుమార్ ప్రాంతంలోకి చైనా 2014 నవంబర్‌లో చొరబడింది. 750 మంది చైనా ముష్కరులను తొమ్మిది నెలల పాటు నిర్బంధించిన మన ‘ఐటిబిపి’ దళాలు 2015 జూలైలో వారందరినీ మెడలు పట్టుకొని నెట్టుకుంటూ వెళ్లి ‘రేఖ’ను దాటించాయి. కానీ మళ్లీ గత ఏడాది సెప్టెంబర్‌లో చైనా ‘దీపసంగ్’ మైదాన ప్రాంతంలోకి చొరబడింది. ‘దీపసంగ్’ మైదానం లడక్ ఉత్తర భాగాన ఉంది. ఇప్పుడు మళ్లీ దక్షిణ ప్రాంతమైన చుమార్‌లోకి చైనా చొరబడుతోంది. ‘రేఖ’ పొడవునా ఉద్రిక్తతలను సృష్టించడం చైనా వ్యూహం. టిబెట్ మాజీ అధినేత బౌద్ధ ధర్మాచార్యుడు దలైలామా అరుణాచల్‌లోని తవాంగ్‌ను సందర్శిస్తున్నాడు. దీన్ని మన ప్రభుత్వం నిరోధించాలట! నిరోధించబోమని మన ప్రభుత్వం ఇదివరకే చైనాకు స్పష్టం చేసింది. లడక్‌లో ప్రస్తుతం చైనా చొరబాటుకు ఇది మరో నేపథ్యం..