సంపాదకీయం

‘నకిలీ’ల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదకొండు వేల ‘ప్రభుత్వేతర సంస్థ’- నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్-లకు ఇక విదేశీయ నిధులు లభించవన్నది హర్షణీయ పరిణామం. విదేశీయ నిధులను పొందడానికి అవసరమైన ‘అనుమతి’ గడువు ముగిసిపోవడం ఇందుకు కారణం! ‘అనుమతి’ని కొనసాగించాలని కోరుతూ ఈ ‘నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ - ఎన్‌జిఒలు అభ్యర్థనలను దాఖలు చేయలేదట! అందువల్ల వీటికి ఇకపై విదేశీయ నిధులు పొందగల అర్హత లేదు! 2014 మే నెలలో పాలన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్‌జిఒల పనితీరును క్రమబద్ధీకరిస్తోంది. ఫలితంగా స్వచ్చంద సంస్థల ముసుగు వేసుకున్న అనేక అక్రమ సంస్థల అసలు రంగు బయటపడింది, పడుతోంది. ‘విదేశీయ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం-్ఫరిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్-ఎఫ్‌సిఆర్‌ఎ’ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు పదివేల ఎన్‌జిఒల విదేశీయ నిధులను పొందకుండా ప్రభుత్వం ఇదివరకే నియంత్రించింది. రెండేళ్ల క్రితం వీటికి విదేశీయ నిధులు పొందే అవకాశం రద్దయిపోయింది. ఫలితం గా మొత్తం 20 వేలకు పైగా ఎన్‌జిఒలు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించజాలని స్థితి ఏర్పడింది. విదేశీయ విరాళాలు, వాటిని స్వీకరిస్తున్న ఎన్‌జిఒలలో అధికశాతం ఆంతరంగిక భద్రతకు విఘాతకరంగా పరిణమించడం దశాబ్దుల అనుభవం. గత ప్రభుత్వాలు ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల అనేక దేశద్రోహ, దేశ వ్యతిరేక, ప్రత్యక్ష, ప్రచ్ఛన్న బీభత్స సంస్థలు ‘స్వచ్ఛందం’ మాటున భారీగా విరాళాలను విదేశాల నుంచి తెచ్చుకున్నాయి. జకీర్ నాయక్ అనే ప్రచ్ఛన్న ఉగ్రవాది ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’- ఐఆర్‌ఎఫ్ - పేరుతో నడిపిన సంస్థ దేశద్రోహ కలాపాలకు కేంద్రంగా మారడం ఈ వైపరీత్యానికి పరాకాష్ఠ. ఇలా విదేశాల నుంచి భారీగా నిధులను పొందుతున్న ఎన్‌జిఒల నిర్వాహకులలో అత్యధిక శాతం దుర్బుద్ధి పూర్వకంగాను, అనభిజ్ఞత కారణంగాను దేశవిద్రోహులుగా మారారు, మారుతున్నారు. విదేశీయ నిధులను స్వీకరించినప్పకీ విరాళాల ప్రదాతలకు దళారీలుగా మారని ఎన్‌జిఒలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అధికశాతం ఎన్‌జిఒలు విరాళాలు ఇస్తున్నవారికి దళారీలుగాను, ప్రతినిధులుగానూ పనిచేయడం పరిపాటైపోయింది. కొన్ని విదేశీయ సంస్థలు తమ దేశంలో గూఢచర్యం సాగించడానికి, విద్రోహం సాగించడానికి ఎన్‌జిఒలను తామే తయారుచేస్తున్నాయి కూడా.
గత రెండేళ్లకు పైగా ప్రభుత్వం వారి నిఘా నేత్రాలు ‘స్వచ్ఛంద సేవ’ మాటున జరుగుతున్న ప్రభుత్వేతర సంస్థల విద్రోహ కలాపాలను పసిగడుతున్నాయి. ఫలితంగా ఏళ్ల తరబడి గుట్టుచప్పుడు కాకుండా దేశ వ్యతిరేక కలాపాలను సాగించిన ‘నకిలీ’ స్వచ్ఛంద సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. నిజంగా మనదేశ ప్రజల హితం కోరి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు ‘పారదర్శకత’ను చూసి భయపడవలసిన పనిలేదు. ప్రభుత్వ నిబంధనావళిని చూసి ఆందోళనగ్రస్తం కావలసిన అవసరం లేదు. ‘నీతిఅయోగ్’ వద్ద నమోదు చేసుకొని పరిగణన పొందిన ప్రభుత్వేతర సంస్థలు యథావిధిగా కొనసాగవచ్చు. విదేశాల నుంచి సక్రమ పద్ధతిలో పారదర్శక మాధ్యమాల ద్వారా ఈ సంస్థలు నిధులు స్వీకరించవచ్చు. ఆ నిధులను అభివృద్ధికి, సంక్షేమానికి, అధ్యయనాలకు ఖర్చు పెట్టవచ్చు. వివరాలను నియతకాలంలో వెల్లడించడం ద్వారా తమ సేవా పారదర్శకతను నిరూపించుకోవచ్చు. కానీ, రెండేళ్ల క్రితమే విదేశీయ నిధులను స్వీకరించడానికి ప్రభుత్వ అనుమతిని కోల్పోయిన ఎన్‌జిఒలు కాని, ఇప్పుడు అనుమతి పునరుద్ధరణ కోసం దరఖాస్తులు పెట్టని ఈ 11వేల ఎన్‌జిఒలు పారదర్శకత పట్ల భయపడుతున్నాయి. అంటే వీటిలో అధిక సంస్థలు అక్రమాలకు ఒడిగట్టాయన్నది స్పష్టం. ఈ అక్రమాలు రెండు రకాలు. విదేశాలలోను, స్వదేశంలోను నిధులను సేకరించే పద్ధతిలోనే అక్రమాలు మొదటి తరగతికి చెందినవి. నిధులను ఖర్చుపెట్టే పద్ధతిలో జరుగుతున్న అక్రమాలు రెండో తరగతికి చెందినవి. నిర్దిష్ట పథకాల పేరుతో వసూలు చేసుకుంటున్న నిధులను ఇతర ప్రయోజనాలకు ఖర్చు పెడుతున్నవారు ఎజిఒల నిర్వాహకులలో అధిక సంఖ్యాకులు! గిరిజనుల కోసం, వికలాంగుల కోసం, దళితుల కోసం, వెనుకబడిన ప్రాంతాల, వనవాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం వసూలు చేసిన నిధులలో సొంతానికి ఇళ్లు నిర్మించుకుంటున్న నకిలీ స్వచ్ఛంద సేవకులు ఎందరెందరో ఉన్నారు. స్థిరాస్తి వ్యాపారులు స్వచ్ఛంద సేవకులుగా చెలామణి అవుతున్నట్లుగా కూడా ప్రచారమైంది.
కొన్ని ప్రభుత్వేతర సంస్థలు-ఎన్‌జిఒలు-తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నిస్తున్నట్లు గత ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ సం స్థల ఆదాయ వ్యయ వివరాలను బహిర్గతం చేయాలని తమ ప్ర భుత్వం కోరడం వాటికి ఆగ్రహం తెప్పించింద ని, అందువల్ల ఈ సం స్థలు తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి గానీ, ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వానికి గానీ స్వచ్ఛంద సంస్థలు పనిచేయడం చట్టానికి వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ, ఆదాయ వ్యయాలను వెల్లడించడం ఈ సంస్థల విధి. ఆ విధిని నిర్వర్తించవలసిందిగా ఆదేశించే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకోవడం దుర్మార్గం.. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దప్రమాదం కాదు. ఈ వ్యతిరేక కలాపాలకు విదేశీయులు నిధులను సమకూర్చడమే అసలు ప్రమాదం. ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ సంస్థలు ఆగడం లేదు. దేశవ్యతిరేక కలాపాలను కొనసాగిస్తున్నాయి. ఇది నిరంతరం పొంచి ఉన్న ప్రమాదం. మనదేశంలో ఏళ్లతరబడి జిహాదీ ఉగ్రవాదులను తీర్చిదిద్ది, ఇక్కడి నుంచి పారిపోయి సౌదీఅరేబియాలో ఉంటున్న జకీర్‌నాయక్ నాయకత్వంలోని ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ - ఐఆర్‌ఎఫ్- వందల కోట్ల రూపాయలను విదేశాల నుంచి సంగ్రహించింది. ఈ సంస్థ జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పినట్లు ఇప్పుడు ధ్రువపడింది. ఈ సంస్థ ‘రాజీవ్‌గాంధీ ఫౌండేషన్’కు రూ. 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చిందట! ఆరోపణలు, నిరాకరణలు, ఖండనలు, నిరసనలు యథావిధిగా జరిగిపోతున్నాయి. కానీ, చాపకింద నీరులా రకరకాల దళారీలు దేశమంతటా వ్యాపించారు, వ్యాపిస్తున్నారు - ఎన్‌జిఓల ముసుగులో!
న్యాయంగా, సమాజ నిష్ఠతో, దేశభక్తియుతంగా సేవచేస్తున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలూ ఉన్నాయి. కానీ ‘నకిలీ’ల సంఖ్య నానాటికీ పెరిగిపోవడం దశాబ్దుల చరిత్ర. మతం మార్పిడి ముఠాలు, వివిధ మతాల మధ్య, కులాల మధ్య విద్వేషం రగిలిస్తున్న తండాలు ‘స్వచ్ఛందం’ రూపమెత్తి ఉన్నాయి. 2002లో ఆఫ్రికాలోని దర్బన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కొన్ని ఎన్‌జిఒలు ఒక నకిలీ అధ్యయన పత్రాన్ని సమర్పించాయి. భారతదేశంలోని ఈశాన్యప్రాంతం విదేశీయుల పాలనలో మగ్గుతున్నట్లు ఆ అధ్యయన పత్రంలో పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతం భారత్‌లో భాగం కాదట! ఇలాంటి విద్రోహ సంస్థలెన్నో మరి?