సంపాదకీయం

వాణిజ్యమే పరమావధి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంలో ఘరానా నేరాలు చేసి బ్రిటన్‌లో సురక్షితంగా తిష్ఠవేసి ఉన్న యాబయి ఏడుగురు నేరస్థుల గురించి దేశ ప్రజలకు మరోసారి ధ్యాస కలిగింది. మన దేశానికి బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మాయ్ విచ్చేయడం ఈ ‘్ధ్యస’ను కలిగించిన సరికొత్త పరిణామం. ఈ యాబయి ఏడుగురిని మన దేశానికి తరలించాలని బ్రిటన్ ప్రధానమంత్రిని మన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో కోరారు. అయితే, వీరందరినీ కాని కొందరిని కాని మన దేశానికి తిప్పి పంపగలమన్న స్పష్టమైన హామీని థెరిసా మాయమ్మ ప్రకటించక పోవడం విచిత్రమైన వ్యవహారం. విజయ్ మాల్యా, లలిత్ మోదీ, క్రిస్టియన్ మైకెల్ వంటి అప్రతిష్ఠిత నేరస్థుల గురించి మాత్రమే ప్రధానంగా ప్రచారమైంది. కానీ, భారత వ్యతిరేక ఉగ్రవాద కలాపాలకు పాల్పడిన బీభత్సకారులు, కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించిన ఆర్థిక నేరస్థులు, ఇతర భయంకర నేరస్థులు మన దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో కొన్నాళ్లుగా నివసించగలగడమే విచిత్రం. మనదేశంతో పాటు జిహాదీ బీభత్సకాండకు గురి అవుతున్న బ్రిటన్ ఈ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు పిలుపునివ్వడం ఆశ్చర్యకరం కాదు. ధెరిసా మాయ్ ఢిల్లీలో మన ప్రధానితో కలసి ఇలా పిలుపునిచ్చింది కూడా. 2008లో ముంబయిలో భయానక మారణకాండ జరిపిన జిహాదీ ఉగ్రవాదులను శిక్షించనందున ఉభయ దేశాల ప్రధానమంత్రులూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అభిశంసించారు కూడా. మనదేశానికి వ్యతిరేకంగా నేరాలకు ఒడిగట్టిన యాబయి ఏడుమందిని బ్రిటన్ ఇదివరకే మనదేశానికి తిప్పి పంపకపోవడం ఉభయ దేశాల సంబంధాలలో గొప్ప అపశ్రుతి. బ్రిటన్‌లోను మనదేశంలో వలెనే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోంది. పారదర్శక సమాజం వర్ధిల్లుతోంది. అందువల్ల విజయ్ మాల్యా, లలిత్ మోదీ, సమీర్ అలీ వంటివారు తమ దేశంలో ఉన్నట్టు వెల్లడయిన వెంటనే బ్రిటన్ ప్రభుత్వం ఈ నేరస్థులను మన దేశానికి పంపించి ఉండాలి. మన ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను, చూపించిన సాక్ష్యాధారాలను బ్రిటన్ ఇన్నాళ్లుగా పట్టించుకోలేదన్నది ఇలా స్పష్టమైంది. పట్టించుకుని ఉంటే ‘మాయమ్మ’ పర్యటనకు ముందే వీరందరినీ బ్రిటన్ మన దేశానికి తరలించి ఉండేది. 2002లో గుజరాత్‌లో భయంకర కల్లోలాలకు దారితీసిన గోద్రా రైలు దహనకాండ సూత్రధారుడు సమీర్ అలీ అన్నది అభియోగం. మద్యం వ్యాపారి విజయ్ మాల్యా వందలాది కోట్లను అక్రమంగా గడించిన ఆర్థిక నేరస్థుడు. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ క్రికెట్‌ను భ్రష్టుపట్టించి వందల కోట్లు కాజేసిన లలిత్ మోదీ 2010లోనే దేశం నుంచి పారిపోయి లండన్‌లో ఉంటున్నాడు. ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ‘నిర్బంధ ఆదేశాల’- అరెస్ట్ వారంట్‌ల-కు అందువల్ల అర్థం లేకుండా పోయింది.
ఈ ఆరేళ్లలో మన ప్రభుత్వాధినేతలు బ్రిటన్‌లోను, బ్రిటన్ ప్రధానులు మనదేశంలోను పర్యటనలు జరుపుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఘరానా నేరస్థులను మనదేశానికి తరలించుకొని రాలేకపోయాము! బ్రిటన్‌తో మన సంబంధాలు ప్రధానంగా వ్యాపారం చుట్టూ కేంద్రీకృతమై ఉండడం ఇందుకు ఒక ప్రధాన కారణం. ఈ వ్యాపారం ప్రధానంగా బ్రిటన్ నుంచి మనం ఆయుధాలను ఇతర రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం. ఈ రక్షణ కొనుగోళ్ల ఒప్పందాలు అవినీతిగ్రస్తం కావడం నడుస్తున్న చరిత్ర! జెక్ దేశం నుంచి దిగుమతి అవుతున్న ‘తాత్రా’ రక్షణ వాహనాల వ్యవహారం కావచ్చు.. ఇటలీ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదిరిన హెలికాప్టర్ల దిగుమతి వ్యవహారం కావచ్చు.. అవినీతిని, అక్రమాలను నిర్వహించిన దళారీలు బ్రిటన్‌లోనే తలదాచుకున్నారు. 1986 నుంచి దిగుమతి అయిన ‘తాత్రా’ ట్రక్కుల ధరలు విపరీతంగా పెరగడానికి ఈ ‘జెక్’ దేశపు సంస్థ మన దేశంలోని ఘరానాలకు భారీగా లంచాలను చెల్లించడం తెలిసిందే. 2012 నాటికి దాదాపు ఏడువేల తాత్రా వాహనాలు మన రక్షణ దళాలలోకి చేరాయి. ఇలా లంచాలను ఇవ్వడంలో ప్రధానపాత్ర పోషించిన రవిరుషి అనేవాడు బ్రిటన్ రాజధాని లండన్‌లో ఘరానా వ్యాపారి. ‘తాత్రా’ సంస్థలో అత్యధికంగా వాటాలు ఇతనివే. మనదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఘరానా అవినీతిపరులు గొప్ప ప్రజాస్వామ్య దేశమైన బ్రిటన్‌లో స్థిరపడడం, వారిని బ్రిటన్ మనదేశానికి తరలించకపోవడం ‘మాయమ్మ’ పర్యటనకు నేపథ్యం.. ఇక ముందు తరలిస్తారా?
అప్పటి మన సైనికదళాల ప్రధాన అధికారి జనరల్ విజయకుమార్ సింగ్‌కు సైతం 2012లో పదునాలుగు కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి ఈ ‘రవిరుషి’ దళారీలు ప్రయత్నించారు, విఫలమయ్యారు. ‘తాత్రా’ అవినీతిని విజయకుమార్ సింగ్ స్వయంగా బయటపెట్టాడు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ అవినీతి మరో ‘బోఫోర్స్’ అవినీతి వంటిది! కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఈ రెండు అవినీతి వ్యవహారాలలోను ఆరోపణలకు గురి అయ్యారు. కానీ ‘బోఫోర్స్’ అవినీతి నిర్వాహకుడు బట్టోవియో కుత్రోచీ జీవితాంతం పట్టుబడలేదు. దాదాపు 3,700 కోట్ల రూపాయల విలువైన 12 ‘గగన శకటాల’-హెలికాప్టర్ల-ను మనదేశానికి అమ్మడానికై ఒప్పందం కుదుర్చుకొన్న ఇటలీ అగస్టా సంస్థ దాదాపు 360 కోట్ల రూపాయల లంచాలను చెల్లించింది. ఈ లంచాలను పంపిణీ చేసిన దళారి క్రిస్టియన్ మైకేల్ అని ఇటలీ కోర్టు నిర్థారించింది. ఇతగాడు లండన్‌లోనే ఉన్నాడు. ఈ ఘరానా నిందితుడిని మన దేశానికి తరలించవలసిందిగా మన ప్రభుత్వం గత ఏప్రిల్‌లో బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. ఆరునెలలు గడిచిపోయినప్పటికీ తరలించలేదు. ఎందుకు తరలించలేదని నిజానికి మన ప్రధాని ఇప్పుడు బ్రిటన్ ప్రధానిని నిలదీయాలి. కానీ నిలదీయలేదు.. యధావిధిగా జాబితాలో అతగాడి పేరు చేర్చి సమర్పించారు. అయితే క్రిస్టియన్ మైకేల్ ఇపుడు లండన్‌లో లేడు, బ్రిటన్‌లోనూ లేడు.. దుబాయ్‌లో విలాసంగా విశ్రాంతి తీసుకుంటన్నాడట! అతగాడిని దుబాయ్‌లో పట్టుకుని బ్రిటన్ మనకు అప్పగిస్తుందా? క్రిస్టియన్ మైకేల్ లండన్ నుంచి బ్రిటన్ నుంచి ఎలా జారుకున్నాడు?
వాణిజ్యం, పెట్టుబడులు మాత్రమే కేంద్ర బిందువులుగా బ్రిటన్ మనతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తోందనడానికి ధెరిసా మాయ్ పర్యటన మరో మంచి ఉదాహరణ! తరచూ బ్రిటన్‌కు రాకపోకలు సాగించి వ్యాపారాన్ని పెంపొందించే భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం ఇకపై అతి త్వరగా ‘వీసా’ ప్రవేశ అనుమతి పత్రాలను మంజూరు చేస్తుందట! వాణిజ్యేతర కార్యక్రమాల కోసం బ్రిటన్‌కు వెళ్లేవారికి ఈ సదుపాయం ఉండదని మాయ్ పర్యటన వల్ల ధ్రువపడింది. వాణిజ్యం కోసం బ్రిటన్ వెళ్లే వారికి ‘ఐరోపా సమాఖ్య’ దేశాలను సందర్శించడం కూడా సులభమైపోతుంది. కానీ తమ జాతీయ వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ కోసమే తమ దేశం ఐరోపా నుంచి నిష్క్రమించాలని బ్రిటన్ పౌరులు గత జూన్‌లో నిర్ధారించారు. మాయ్ ప్రధానమంత్రి కావడానికి సైతం ఈ వాణిజ్య నిర్ణయమే కారణం. ‘ఐరోపా సమాఖ్య’లో తమ దేశం కొనసాగాలని వాదించిన డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయడం వల్ల థెరిసా మాయ్ ప్రధాని కాగలిగింది. ప్రజల తీర్పును పార్లమెంట్ ఆమోదించిన తరువాతనే బ్రిటన్ ‘సమాఖ్య’ నుంచి వైదొలగాలని ఇటీవల లండన్ హైకోర్టు తీర్పు చెప్పింది. థెరిసా మాయ్ మన దేశ పర్యటనకు ఇదీ నేపథ్యం.