సంపాదకీయం

బలిగొన్న ‘వేగం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధి విధానాన్ని అతిక్రమించడం మానవులకు, జీవ జాలానికి సాధ్యం కాదన్నది ఇలా మరోసారి ధ్రువపడింది. భువనేశ్వర్ నుంచి సోమవారం సాయంత్రం బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుండిన వోల్వో బస్సు మంగళవారం ఉదయం గమ్యం చేరకపోవడం ‘విధి’ చే సిన వికృత వికటాట్టహాసం! బస్సును డ్రైవర్ పైశాచిక వేగంతో నడిపినప్పటికీ సోమవారం రాత్రి, తెల్లవారుజామున ప్రయాణీకులు బెంబేలెత్తలేదు! ‘ఏమయ్యా ఇంత వేగంగా బస్సునెందుకు పోనిస్తున్నావు? ఇంత నిర్లక్ష్యం గా బస్సునెందుకు నడుపుతున్నావు?’ అని ప్రయాణీకు లు ప్రశ్నించకపోవడం విస్మయకరం కాదు! ఎందుకంటే ఆ తెల్లవారు జామున ప్రయాణీకులు గాఢంగా నిద్రపోయారు! రాత్రి రెండు గంటల వరకు ప్రభుత్వేతర బస్సులలో ‘దృశ్యమాధ్యమం’లో చిత్ర విచిత్ర వికృత చలనచిత్రాలను ప్రసారం చేస్తూనే ఉంటారు. ప్రయాణీకుల్లో ఎ క్కువ మందికి వాటిని చూడడం ప్రయాణంలో అత్యంత ప్రధానమైన అంశం! రాత్రి రెండు గంటల వరకు మేలుకునే వారు తెల్లవారుజామున సహజంగానే గాఢంగా నిద్రపోవడం ఖాయం! అందువల్ల భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండిన ‘దివాకర్ ట్రావెల్స్’ వారి ‘వో ల్వో’ బస్సును ఆదినారాయణరెడ్డి అనే డ్రైవర్ గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో నడిపిన సంగతి నిద్రిస్తుండిన ప్రయాణీకులకు తెలీదు. ఇదీ ‘విధి’ జరిపిన వికృత క్రీడ! మేలుకొని ఉండిన ఒకరిద్దరికి బస్సు భయంకర వేగంతో ఎగిరిపోతున్నట్టు తెలిసినప్పటికీ డ్రైవర్‌ను ప్రశ్నించే సాహసం చేయలేదు! ఎందుకంటే ప్రభుత్వేతర బస్సులను నడిపే చోదకులలో అత్యధిక సం ఖ్యాకులు అసాంఘిక ప్రవర్తకులు.. గూండాలు..తాగుబోతులు! వారు ప్రయాణీకులపై జులుం చెలాయించగలరు, తిట్టగలరు,కొట్టగలరు! ప్రభుత్వేతర వాణిజ్య వాహనాల యజమానుల్లో సైతం అత్యధికులు నేర ప్రవృత్తి కలవారు, నల్లడబ్బును చెలామణి చేస్తున్నవారు, హత్యలు చేయడానికి, చేయించడానికి వెనుదీయని వారు! మంచివారు, ని బంధనలను పాటించేవారు చాలా తక్కువ మంది! ఇ దంతా ప్రయాణీకులలో అత్యధికులకు తెలుసు! అయినప్పటికీ ప్రయాణీకులలో అత్యధికులు ప్రయివేటు బస్సులలోనే పయనించడానికి ఇష్టపడుతున్నారు. విజయవాడకు హైదరాబాద్‌కు రెండున్నర గంటలలో వెళ్లవచ్చు! హైదరాబాద్ నుంచి కర్నూలుకు రెండు గంటలలోపే చేరవచ్చు! హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు, విజయవాడ నుంచి విశాఖపట్నానికి మూడు గంటలే ప్రయాణం.. అంటూ అద్భుత కథనాలను, అతిశయోక్తులను ఆవిష్కరించడం కూడ విచిత్ర జనాలకు అలవాటైపోయింది! బస్సులను రాక్షస వేగంతో నడిపే నికృష్ట స్వభావం కల చోదకులను నియంత్రించే వారు లేరు. ఇదీ విధి విషాదం! ఈ విషాదానికి ‘దివాకర్ ట్రావెల్స్’ బస్సు ప్రయాణీకులలో తొమ్మిది మంది బలైపోయారు. నిర్లక్ష్య చోదకుడు కూడ ధరాతలం నుంచి నిష్క్రమించాడు! ‘విధి’ని దాటలేని ఆధునిక విజ్ఞాన గరిమకు ఇలా ఇది నిదర్శనం!
హైదరాబాద్‌కు చేరవలసిన బస్సు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు సమీపంలో వంతెన పక్కగోడను ఢీకొని కాలువలో పడిపోయింది. పెళ్లికి వెడుతున్నవారు, పెళ్లి చూపులకు వెడుతున్నవారు, నిశ్చితార్థం చేసుకోవడానికి బయలుదేరినవారు...ఇలా సుదీర్ఘ జీవన శుభయాత్ర చేయవలసిన వారి బతుకులు ఈ ప్రమాదం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయాయి! ‘వేగం ముఖ్యం కానీ ప్రాణం అంతకన్నా ప్రధానం..’ ‘వేగం కాదు ప్రాణం ప్రధానం..’ వంటి ఆదర్శాలు ఆచరణకు రాకపోవడానికి కారణం వాహన చోదకుల నిర్లక్ష్యం! మితిమీరిన వేగంతో వాహనాలను నడపడానికి మరో కారణం సకాలంలో నిర్ణీత స్థలం నుండి బయలుదేరకపోవడం. బయలుదేరిన స్థలంలోను, ఆ తరువాత దారి పొడవునా ఈ ‘ప్రైవేట్ బస్సుల’ డిక్కీలకు, పై కప్పులకు విపరీతంగా సరకులను ఎక్కిస్తున్నారు. ఇలా దారిపొడుగునా సరుకులను ఎక్కించడం వల్ల, దించడంవల్ల ప్రతిచోట విలంబనం జరుగుతోంది. ఈ ఆలస్యాన్ని అతిగమించడం కోసం డ్రైవర్లు వేగం పెంచుతున్నారు! ప్రైవేట్ బస్సులు ప్రయాణీకులను మాత్రమే గమ్యాలకు తీసుకుని వెళ్లడం లేదు. లారీలుగా, ట్రక్కులుగా మారి సరుకుల రవాణా కూడ చేస్తున్నాయి! నిబంధనలకు విరుద్ధమైన ఈ కలాపాన్ని ప్రభుత్వాలు నియంత్రించడం లేదు! ఎందుకంటే ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులలో పలువురు ప్రయివేటు ట్రావెల్స్ యజమానులు! అందువల్ల ప్రభుత్వేతర రంగంలోకి అవినీతి, అక్రమాలు నిర్నిరోధంగా కొనసాగుతున్నాయి! అక్రమ వాణిజ్యవేత్తలు రాజకీయ వేత్తలను నియంత్రించడం గతం.. అక్రమ వాణిజ్యవేత్తలు రాజకీయవేత్తలైపోవడం వర్తమానం.
ప్రభుత్వేతర రంగంలోని వాణిజ్య వాహన చోదకుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిరంతరం బలి అవుతున్న తీరుకు ఇది మరో ఘోర నిదర్శనం. మరో పదిమంది అకాల మృత్యువు పాలయ్యారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆ పదిమందికి అది అంతిమ ప్రయాణం కావడానికి కారణం బస్సు డ్రైవర్ ఒడిగట్టిన ఘోర నిర్లక్ష్యం. గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బస్సును నడిపిన ఆ ‘నిర్లక్ష్య హంతకుడు’ తాను బలయ్యాడు, మరో తొమ్మిదిమందిని బలి చేశాడు! నిరంతరం జరిగిపోతున్న ఇలాంటి బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయివేటు వాహనాలకు అనుమతి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి! ఎప్పుడో జరగవలసిన ఈ సమీక్ష ఇప్పటికీ జరగకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతీక! వేగం గురించి, వేగాన్ని నియంత్రించడం గురించి ఈ సమీక్ష ఇప్పుడైనా వెంటనే జరుగవలసి ఉంది! విదేశాల నుంచి బస్సుల దిగుమతిని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా నిరోధించాలి! వోల్వో బస్సులు మన ‘రహదారుల’కు పనికిరావని నిపుణులు నిర్ధారించారు. స్వదేశీయ ఉద్యమకారులు స్పష్టీకరించారు. విదేశాలకు చెందిన వోల్వో వంటి బ హుళ జాతీయ సంస్థల బస్సులను మనం ఎందుకని దిగుమతి చేసుకుంటున్నాము? స్వదేశీయ స్ఫూర్తి లేకపోవడం మొదటి కారణం! ఈ స్ఫూర్తి లేకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం ‘వోల్వో’ల చొరబాటును దశాబ్దికి పైగా ప్రోత్సహించింది! స్వదేశీయ స్ఫూర్తి లేనందునే మన ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వేతర రంగ సంస్థలు ‘వోల్వో’లను కొని రహదారి ప్రమాదాలను పెంచుతున్నాయి. స్వదేశీయ స్ఫూర్తికి దూరమైన మనం నిర్లజ్జగా ఈ ‘వోల్వో’లనెక్కి ఊరేగుతున్నాము! జాతీయతా నిష్ఠ గురించి ప్రవచనాలు చెబుతున్నవారు కొందరు ఈ ‘వో ల్వో’ బస్సులెక్కి ‘ప్రవచన’ స్థలాలకు చేరుకుంటున్నారు. ఈ సిగ్గులేని, చిత్తశుద్ధి లేనితనం సంగతి వేరే కథ.. కానీ రహదారి భద్రత, ప్రయాణం భద్రత గురించి ధ్యాసతోనైనా మనం ‘వోల్వో’ బస్సులను బహిష్కరించలేమా?
గతంలో అనేక చోట్ల ‘వోల్వో’ బస్సులలో మంటలు చెలరేగాయి, ప్రయాణీకుల బతుకులు బుగ్గి అయ్యాయి. ఇదంతా జరిగిపోతుండడానికి కారణం ‘వోల్వో’ బస్సు లు సుఖప్రదం, అమిత వేగంగా పయనించగలన్న మహాభ్రమ! ఈ భ్రమ నుంచి ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రయాణీకులు బయటపడాలి! ‘్భరత్‌లో నిర్మించండి’ స్ఫూర్తికి వోల్వో బస్సుల దిగుమతి విఘాతకరం! మన దేశపు శాస్త్ర విజ్ఞాన ప్రగతికి అవమానకరం! ఉపగ్రహాలను అంతరిక్షానికి చేర్చుతున్న వాహనాలను నిర్మించగల మనం మంచి బస్సులను తయారు చేయలేమా?