సంపాదకీయం

మందుకు ముద్రా విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందు విలువ రూపాయి, దళారీలు దోచుకుంటున్నది పది రూపాయలు.. వెరసి వినియోగదారుడు చెల్లిస్తున్నది పదకొండు రూపాయ లు. ఈ దళారీలు మందుకు ‘ముద్ర’ వేస్తున్న ఘ రానా వాణిజ్య సంస్థలు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు, ‘ముద్ర’ను ప్రచారం చేస్తున్న వైద్య ప్రతినిధులు, ఫలానా ‘ముద్ర’ కలిగిన మందును మా త్రమే వాడాలని ఆ ‘ముద్ర’కు నోచుకోని మందులను వాడినట్టయితే ప్రమాదమని వినియోగదారుని వంచిస్తున్న ఘరానా వైద్యులు.. ఇలా వైద్యరంగాన్ని దోపిడీకి చట్టబద్ధమైన మాధ్యమంగా మార్చిన దళారీలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించడం ఆలస్యంగానైనా సంభవించిన హర్షణీయ పరిణామం. ముద్ర ఉన్నప్పటికీ, లేనప్పటికీ మందు మందే. కానీ, మందు విలువ వంద రూపాయలు, ముద్ర విలువ వెయ్యి రూపాయలు. ఇలా దశాబ్దులుగా, శతాబ్దికి పైగా వినియోగదారులు మందుతోపాటు ‘ముద్ర’- బ్రాండ్-ను కూడా కొన్నారు. లక్షల కోట్ల రూపాయల శ్రమ జీవనుల డబ్బు ‘ముద్ర’ను వేస్తున్న వాణిజ్య సంస్థలు దోచుకున్నాయి, ఈ సంస్థల ప్రతినిధులు దోచుకున్నారు. ఈ సంస్థల నుండి ప్రచ్ఛన్న రూపంలో లంచాలు దిగమింగి మానవీయతను మరచి వైద్యులు దోచుకున్నారు. ఈ మొత్తం దోపిడీ ప్రహసనంలో అత్యంత క్రూర స్వభావులు ప్రచ్ఛన్నపు లంచాలను మరగిన వైద్యులు. ఈ లంచాలకు ముద్దుపేరు ‘బహుమతులు’- గిఫ్ట్‌లు- నమూనా- శాంపిల్-లు! మానవీయ స్వభావంతో రోగులకు చికిత్స చే స్తున్న మహనీయులు వైద్యులలో ఇప్పటికీ ఉన్నారు. కానీ క్ర మం గా వారి శాతం తగ్గిపోయింది, తగ్గిపోతోంది. వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- మొదలైన తరువాత పుట్టలు ప గిలిన అవినీతి కేంద్రాలు ‘కార్పొరేట్ హాస్పటల్స్’గా చెలామణి అవుతున్నాయి. రోగిని చూడగానే దండుకోవడం, పిండుకోవడం ఎలా అన్న వికృతమైన ఆలోచనలు ఈ ‘కార్పొరేట్ హాస్పటల్స్’లో విషవృక్షాలుగా మారి ఉన్నాయి. ఇన్ని దశాబ్దుల తరువాత కేంద్ర ప్రభుత్వం నిద్ర లేచింది. మందుకు ‘ముద్ర’ నుంచి విముక్తి లభించనుంది. ముద్ర లేని మందులకు విస్తృతిని కల్పించడం ద్వారా వినియోగదారులను వైద్యరంగపు దళారీల దోపిడీ నుంచి రక్షించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విప్లవాత్మక ప్రతిపాదన.
ముద్రలేని మందుల- జెనరిక్ మెడిసిన్స్-ను చికిత్సార్థులకు వైద్యులు నిర్దేశించాలన్న నిబంధనను చట్టంలో చేర్చనున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. ఫలితంగా పెద్ద, పేరుమోసిన వాణిజ్య సంస్థల ముద్రాంకిత ఔషధాలను భారీ ధరలకు చికిత్సార్థుల చేత కొనుగోలు చేయించి లాభంలో వాటా పొందుతున్న వైద్యుల వంచన క్రీడ ఇక అంతం కాగలదు. ముద్ర ఉన్న మందుల కంటే ముద్రలేని మందుల ధర చాలా తక్కువ కనుక చికిత్సార్థులు దోపిడీ నుంచి విముక్తం కాగలరు. ముద్ర ఉన్నా, లేకున్నా మందు మాత్రం ఒకటే. అందువల్ల వౌలిక ఔషధం- జెనరిక్ మెడిసిన్- కారుచౌకగా లభిస్తుంది కనుక జనం వైద్యమంటే బెంబేలెత్తిపోయే వైపరీత్యం తొలగిపోనుంది. జెనరిక్ మెడిసిన్స్ గురించి దశాబ్దుల తరబడి దేశంలో ప్రచారం జరగలేదు. దళారీలు తమ దోపిడీ రహస్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకున్నారు మరి.. పది పదిహేనేళ్లుగా నగరాల్లో ఎక్కడో అక్కడ జెనరిక్ మందుల దుకాణాలు నడుస్తున్నాయి. కానీ ఈ దుకాణాలు దూర ప్రాంతాల్లో ఉన్నందువల్ల చికిత్సార్థులకు అందుబాటులో లేవు. జెనరిక్ మందులంటే ఏమిటి?- అన్న ప్రశ్నకు సమాధానం కూడా బహుళ ప్రచారానికి నోచుకోలేదు. చిన్న పట్టణాలలోను, గ్రామీణ ప్రాంతాలలోను ఈ ముద్ర లేని మందుల గురించి రోగులకు బహుశా ఇప్పటికీ ఏమీ తెలియదు. దళారీలు వ్యాపార రహస్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ప్రభుత్వం ఇపుడు జోక్యం చేసుకొంది. రానున్నది జెనరిక్ మందుల యుగం!
ప్రపంచీకరణ వల్ల జరిగిపోతున్న మోసాలలో అతి ప్రధానమైనది ముద్ర! ఉత్పత్తిదారులకు, సాంకేతిక పరిజ్ఞాన ప్రదాతకు ఆయా ఔషధ ఔషధేతర ఉత్పత్తులపై నిర్ణీత సమయం వరకూ ‘ముద్రాధికారం’-పేటెంట్ రైట్- లభిస్తోంది. అందువల్ల కొత్త ఉత్పత్తులకు ఈ ముద్రాకాలం ముగిసేవరకూ ఆయా సంస్థల ముద్రలతోనే ఆయా ఉత్పత్తులను అమ్మాలి. కానీ గడువుముగిసిన తరువాత కూడా ముద్రలు కొనసాగించడం వాణిజ్య వంచన. ఈ వంచనను క్యాన్సర్, మధుమేహం, హృద్రోగాలు, శ్వాసకోశ వ్యాధులు వంటి తీవ్ర రుగ్మతల చికిత్సకు అవసరమైన మందుల విషయంలో మరింత విస్తృతంగా కొనసాగిస్తుండడం ప్రపంచీకరణలో భాగం. కార్పొరేట్ వైద్యశాలల యాజమాన్యాల వారు తమ ప్రాంగణంలోనే దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. బయట దుకాణాల్లో కంటే ఈ వైద్యశాలల దుకాణాల్లో ఔషధా లు, చికిత్సా ఉపకరణాల ధరలు ఇరవై శాతం అధికం. వైద్యసేవలు అందించి ‘శు ల్కం’ వసూలు చేయవలసిన వైద్యశాలలు మందులను విక్రయించి అక్రమ లా భాలను పొందుతున్నాయి. చివరికి బిస్కెట్లు, చాకొలెట్లు, బ్రెడ్డు, మినరల్ వాటర్ వంటి ఆహారాలను సైతం కార్పొరేట్ కామందులు బయటి దుకాణాల్లో కంటే అధిక ధరలకు విక్రయించి చికిత్సార్థులను దోచిపారేస్తున్నారు. ఈ ఆసుపత్రులలో ఒకే గదికి తెరలు కట్టి మూడుగా నాలుగుగా విడగొట్టి, ఒక్కో మంచం పట్టే స్థలాన్ని ఒక గదిగా మార్చి, ఒక ‘గది’ ద్వారా నాలుగు రెట్లు అక్రమ లాభం పొందడం కార్పొరేట్ దోపిడీలో భాగం. ఇలా యాజమాన్యం మందులను అక్రమ లాభాలకు అమ్మే ప్రక్రియను ఇటీవల ప్రభుత్వం చట్టవిరుద్ధమని ప్రకటించింది. వైద్యులకు మందుల తయారీ, సరఫరా సంస్థలు వెయ్యి రూపాయలకు మించిన బహుమతి ఇవ్వరాదని కూడా ప్రభుత్వం నిర్దేశించింది.
ఇలా వాణిజ్య వైద్యుల దోపిడీని నిరోధించడంలో జెనరిక్ మందులను విధిగా ఉపయోగించాలన్న నిబంధన మరో ముందడుగు. ‘నిరుపేద ప్రజలకు అర్థం కాని విధంగా వైద్యులు మందుల చీటీలను వ్రాసి ఇస్తున్నారు. డాక్టర్ల చేతి వ్రాత అర్థం కాని రోగులు వారు నిర్దేశించిన దుకాణంలోనే మందులను కొనవలసి వస్తోంది..’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించడం వైద్యుల తీరునకు అభిశంసన! అందువల్ల వైద్యులే జెనరిక్ మందులను కొనిపించే విధంగా నిబంధనలను మార్చడం వల్ల చికిత్సార్థులకు ఊరట కలగనున్నది..