సంపాదకీయం

వ్యవసాయంపై పన్ను?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయం వల్ల లభించే ఆదాయంపై పన్ను వసూలు చేయాలని ‘నీతి ఆయోగ్’ కోరుతుండడం జాతీయ ఆర్థిక నీతికి దాపురించిన ‘ప్రపంచీకరణ’ ప్రభావ ఫలితం! వ్యవసాయ రంగం ‘ప్రపంచీకరణ’కు బలి కాకుండా నిరోధించాలన్న స్వదేశీయ ఉద్యమం ఒక వైపున నడుస్తోంది. మరో వైపున మన వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ‘ప్రపంచీకరణ’ శక్తుల కుతంత్రం కొనసాగుతూనే ఉంది. సంపన్న దేశాల ప్రభుత్వాలు, ఆ దేశాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు-మల్టీ నేషనల్ కంపెనీస్-, వాటి దళారీలు ఈ ప్రపంచీకరణ శక్తులు! రైతులు విత్తనాలను కొనడానికి ఎరువులను కొనడానికి మన ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. సమాంతరంగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు విత్తనాల ధరలను ఎరువుల ధరలను పెంచుతున్నాయి. సేద్యానికి అవసరమైన విద్యుచ్ఛక్తిని ఉచితంగా సరఫరా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి యత్నిస్తున్నాయి. కానీ నీటిని రైతులు కొనుగోలు చేసే పరిస్థితి కల్పించడానికి బహుళ జాతీయ సంస్థలు రెండు దశాబ్దులుగా కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలకు దళారీలుగా పని చేస్తున్న నకిలీ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న అధ్యయనాల లక్ష్యం ఎప్పటికైనా మంచినీటిని, సేద్యపునీటిని వాణిజ్య జలాలుగా మార్చడం! గతంలో మన్‌మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నీటి నిర్వహణను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించాలన్న అంతర్జాతీయ ‘నీతి’ని ప్రచారం చేసింది కూడ! ‘సబ్సిడీ’లను సంపూర్ణంగా తొలగించడమన్నది అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి ‘ప్రపంచీకరణ’ వ్యవస్థలు ప్రచారం చేస్తున్న సంస్కరణలలో భాగం! వ్యవసాయం ద్వారా లభిస్తున్న ఆదాయంపై ఇప్పటి వరకు పన్నులేదు. అయినప్పటికీ రైతన్నలు ఆర్థిక సంక్షోభ వలయంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రైతులకు లభించడం లేదు. వినియోగదారులకు, వ్యవసాయ దారులకు మధ్య అనుసంధానకర్తలైన దళారీలు, అక్రమ వ్యాపారులు మాత్రమే అధికార లాభాలను భోం చేస్తున్నారు! ఇలా అధిక లాభాలను దండుకుంటున్న వ్యాపారులు చెల్లిస్తున్న ఆదాయం పన్ను నిజానికి వ్యవసాయదారుల నుండి ప్రభుత్వానికి లభిస్తోంది! ఎందుకంటే వ్యాపారులు దళారీలు ఆర్జిస్తున్న అక్రమ లాభాలు, అధిక లాభాలు అతి తక్కువ ధరలకు వ్యవసాయ దారులనుంచి ఉత్పత్తులను కొనడం వల్ల లభిస్తున్నాయి, వినియోగదారులకు ఎక్కువ ధరలకు అమ్మడం వల్ల లభిస్తున్నాయి! అందువల్ల వ్యవసాయదారులు ఇప్పటికీ పరోక్షంగా పన్ను చెల్లిస్తున్నారు, ఇప్పుడిక ప్రత్యక్షంగా చెల్లించాలన్నది ‘నీతి ఆయోగ్’ వారి ఉవాచ!
వ్యవసాయదారులు చెల్లించవలసిన ఋణాలను రద్దు చేయడం సరికాదని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల ప్రధాన సలహాదారుడు అరవింద సుబ్రహ్మణ్యన్ వాక్రుచ్చడం కూడ వ్యవసాయ రంగాన్ని ప్రపంచీకరణ భూతం ఆవహించడానికి యత్నిస్తోందనడానికి మరో నిదర్శనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు ఒకవైపున అన్నదాత పట్ల ఆవేదనలను ప్రదర్శిస్తున్నారు, రైతుల ఋణాలను రద్దు చేస్తున్నారు. ఋణాల రద్దులో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పథ నిర్దేశనం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంకూడ ఇప్పుడు ముప్పయి ఆరువేల కోట్ల రూపాయల మేరకు వ్యవసాయదారుల ఋణాలను రద్దు చేసింది. కానీ మరో వైపున ప్రభుత్వ నియుక్త ఆర్థిక వేత్తలు ఈ రద్దు చేసే విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇలా తప్పుపట్టడం ద్వారా ఈ అరవింద సుబ్రహ్మణ్యన్ మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం నాటి అంతర్జాతీయ ఆర్థిక గీతాన్ని మరోసారి వినిపించాడు. అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగిన అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల ఉమ్మడి సమావేశం ముగిసిన తరువాత సుబ్రహ్మణ్యన్ ఈ ఆందోళన స్వరాలను సంధించడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మెచ్చుకుంటున్న పరిణామం..
ఇలా రైతుల ఋణాలను రద్దు చేయడం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్నట్టు ఈ సుబ్రహ్మణ్యన్ ధ్వనింపచేయడం విస్మయకరమైన విచిత్రం. రైతుల ఋణాలను రద్దు చేసే పథకాన్ని దేశమంతటా అన్ని రాష్ట్రాలలోను అమలు జరిపినట్టయితే ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-జిడిపి-లో రెండు శాతం కోత పడుతుందట. అందువల్ల ఆర్థిక రంగంలో ‘జిడిపి’ ప్రాతిపదికగా లోటు మరో రెండు శాతం పెరుగుతుందట! ‘దీర్ఘకాలపు’ లోటును తగ్గించి ఆర్థిక రంగాన్ని కుదుట పరచడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి విరుద్ధమైన చర్యలను తీసుకుంటున్నాయన్నది సుబ్రహ్మణ్యన్ నిగ్గుతేల్చిన నిజం! అంటే రైతుల ఋణాలను రద్దుచేయడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదన్నది సుబ్రహ్మణ్యన్ అంతర్జాతీయ వేదికలపై రాద్ధాంతీకరిస్తున్న సిద్ధాంతం. ఇలా ‘అంతర్జాతీయ ఆర్థిక వేత్తల మెప్పుకోసం’ అంతర్గతంగా కేంద్రప్రభుత్వానికి సుబ్రహ్మణ్యన్ చెడ్డ పేరు తెస్తున్నాడు. అయితే వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి స్పష్టం చేయడం అరవింద్ సుబ్రహ్మణ్యన్‌వంటి వారికి, నీతిఆయోగ్ విధానాలకు అభిశంసనవంటిది. సకాలంలో జోక్యం చేసుకోవడం ద్వారా జైట్లీ తమ ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయడం ముదావహం. కేంద్రంలోను ఉత్తరప్రదేశ్‌లోను భారతీయ జనతాపార్టీ వారు ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు! ఉత్తరప్రదేశ్‌లో ఒక విధానాన్ని కేంద్ర స్థాయిలో దానికి విరుద్ధమైన విధానాన్ని భాజపా పాటిస్తోందన్న ‘భ్రాంతి’ ఈ అరవింద సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలవల్ల కలుగుతోంది..
మన్‌మోహన్‌సింగ్ అంతర్జాతీయ ఆర్థిక వేత్త. అందువల్ల ‘సంకుచిత’ జాతీయ ప్రయోజనాలకంటే విస్తృత అంతర్జాతీయ ప్రయోజనాలు ఆయన ఆర్థిక విధానాలకు ప్రాతిపదిక! అంతర్జాతీయ హితం అని అంటే అమెరికా, ఐరోపా, చైనా, దక్షిణ కొరియా వంటి ఆర్థిక సామ్రాజ్యవాదుల హితం మాత్రమేనన్నది ధ్రువపడిన వాస్తవం! ‘అమెరికా అధ్యక్షుడు బర్రాక్ హుస్సేన్ ఒబామాకు అమెరికా హితం గురించి తెలుసు..్భరత ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌కు అమెరికా హితం గురించి తెలుసు...’ అన్నది 2009వ 2014వ సంవత్సరాల మధ్య వినబడిన ఆర్థిక చతురోక్తి! మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నాటి ‘ప్రపంచీకరణ’ వారసత్వ వైపరీత్యం ఇప్పటికీ వదలలేదన్నది అరవింద సుబ్రహ్మణ్యన్ వంటివారి సిద్ధాంత రాద్ధాంతాలవల్ల ధ్రువపడుతున్న సంగతి.. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలన్న ప్రతిపాదన ఈ వారసత్వ వైపరీత్యాన్ని కొనసాగించాలని ‘నీతి ఆయోగ్’ భావిస్తోందనడానికి నిదర్శనం. వ్యవసాయదారులు కానివారు తమ అక్రమ ఆదాయాన్ని వ్యవసాయానికి అంటగట్టి పన్నును తప్పించుకుంటున్నారు. అలాంటి అక్రమాలను నిరోధించాలి, నేరస్థులను శిక్షించాలి! కానీ మన్మోహన్‌సింగ్ విధానాల వారసత్వాన్ని కొనసాగించడం మాత్రం అన్యాయం కాగలదు.