సంపాదకీయం

ఏకకాలంలో ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించాలన్న ప్రతిపాదన కొత్తది కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఈ సంగతిని పదేపదే ప్రస్తావించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై అధ్యయనం చేసి ఆచరణాత్మక మార్గదర్శక సూత్రాలను నిర్ధారించడానికి గత జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల బృందాన్ని నియమించింది. న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ‘అధ్యయన బృందం’ నిర్ధారణల వివరాలు వెల్లడి కావలసి వుంది. అయినప్పటికీ ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఇలా సమాంతరంగా లోక్‌సభకు, శాసనసభలకు ఎన్నికలు జరపడం మేలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు! ఇలా సమాంతర ప్రాతినిధ్య వరణ ప్రక్రియ వల్ల ఎన్నికల ఖర్చులు తగ్గిపోవడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి! వివిధ సమయాలలో వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభకు ఎన్నికలు మరో సమయంలో జరుగుతున్నా యి. ఈ నిరంతర ఎన్నికల కారణంగా ప్ర భుత్వాల, ప్రజల దృష్టి ప్ర గతి కలాపాల నుండి భంగపడుతోందన్నది మరో వాదం. ‘ఎన్నికల సంఘం’ వారు ఇదివరకే ఈ సమాంతర ప్రజాస్వామ్య ప్రక్రియ ను ఆమోదించారట! వివిధ రాజకీయ పక్షాలతో చర్చలు జరిపిన తరువాత ఏకాభిప్రాయం ద్వారా ఏకకాలంలో ఎన్నికలు జరపడానికి వీలుగా సమగ్ర చట్టం రూపొందించడానికి ప్రభుత్వం సమాయత్తవౌతుంది! దేశంలో 1952లో దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి. 1967 వరకు లోక్‌సభకు నియతంగా ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ ఏకకాలంలో ఎన్నికలను జరిపే ప్రక్రియ 1957 నాటికే భంగపడింది. 1955లో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలను జరిపించవలసి రావడం ఈ ‘్భంగపాటు’కు ఒక ఉదాహరణ మాత్రమే! 1972లో జరుగవలసిన ఐదవ లోక్‌సభ ఎన్నికలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1971లోనే జరిపించడంతో నియతంగా ఐదేళ్లకోసారి లోక్‌సభకు ఎన్నికలు జరిగే ప్రక్రియ కూడా భంగపడింది! మధ్యంతర ఎన్నికల ప్రక్రియకు కాని, ఏకకాలంలో ఎన్నికలు జరుగకపోవడానికి కారణం వివిధ రాష్ట్ర మంత్రివర్గాలు శాసనసభలలో అర్ధంతరంగా ‘మెజారిటీ’ని కోల్పోవడం. లోక్‌సభ విశ్వాసాన్ని కేంద్రమంత్రి వర్గం కోల్పోవడమూ! అందువల్ల ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఈ సమస్యకు రాజ్యాంగపరమైన పరిష్కారం కనుగొనవలసి వుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని, ప్రజాప్రాతినిధ్యపు చట్టాన్ని సవరించవలసి ఉంది!
శాసనసభ, లోక్‌సభ కాలపరిమితి పూర్తయ్యేలోగా రద్దు చేయరాదన్నది ఈ సమాంతర ప్రక్రియను నిర్వహించడానికి అనివార్యమైన ప్రాతిపదిక! అందువల్లనే మధ్యంతరంగా ‘సభ’లను రద్దు చేయకుండా అవి పూర్తి కాలం కొనసాగడానికి వీలు కల్పించాలన్న వాదం కూడా అనేక ఏళ్లుగా కొనసాగుతోంది! ఇలా చట్టసభలకు ‘స్థిరమైన కాలవ్యవధి’- ఫిక్స్‌డ్ టర్మ్ ఏర్పడినట్టయితే అన్ని సభలకూ ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడానికి వీలుంది. ఉదాహరణకు 2019లో లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకు ఎన్నికలు జరిపించడానికి వీలుగా చట్టం రూపొందించినట్టయితే ఆ తరువాత నియతంగా ఐదేళ్ల కోసం లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి- ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే పద్ధతి వ్యవస్థీకృతవౌతుంది! కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బహుళ పక్షం జాతీయ వ్యవస్థ వున్న మన దేశంలో ఇలా ‘స్థిరమైన కాలవ్యవధి’ చట్టసభలకు ఎలా ఏర్పడగలదు? అమెరికా వంటి ‘అధ్యక్ష ప్రజాస్వామ్య’ వ్యవస్థలో ప్రజలే ‘నిర్ణీత కాలవ్యవధి’కల అధ్యక్షుడిని, రాష్ట్రాల గవర్నర్లను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన అధ్యక్షునికి, గవర్నర్‌లకు సంబంధిత ‘చట్టసభల’లో ‘మెజారిటీ’ ఉండవలసిన పనిలేదు. అందువల్ల ప్రభుత్వం నాలుగేళ్లపాటు లేదా ఐదేళ్లపాటు స్థిరంగా వుంటుంది! చట్టసభలు కూడా నిర్ణీత కాలవ్యవధి పూర్తయ్యేవరకు రద్దుకావు.. రద్దుచేసే అధికారం, ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’లో వలె అధ్యక్షునికి గాని, గవర్నర్‌కు కాని లేదు! అధ్యక్షుని మనుగడ పార్లమెంటుపై కాని, పార్లమెంటు మనుగడ అధ్యక్షునిపై కాని ఆధారపడి లేవు.. అలా శాసనసభ మనుగడ రాష్ట్ర ప్రభుత్వంపై కాని, రాష్ట్ర ప్రభుత్వం మనుగడ శాసనసభపై కాని ఆధారపడి ఉండడం లేదు! అందువల్ల కార్యనిర్వాహక విభాగం- ఎగ్జిక్యూటివ్-, శాసన నిర్మాణ విభాగం- లెజిల్లేచర్- నిర్ణీత కాలంలో ఎన్నిక కావడానికి, కాలవ్యవధి పూర్తయ్యేవరకు కొనసాగడానికి ‘అధ్యక్ష ప్రభుత్వం’కు ప్రజాస్వామ్యంలో వీలుంది- కాని ‘చట్టసభల’లో నిరంతరం ‘మెజారిటీ’ అవసరమైన ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’లో ఈ నిర్ణీత కాలవ్యవధి, ఏకకాలంలో ఎన్నికలు ఎలా సాధ్యం?
లోక్‌సభలో కేంద్ర మంత్రివర్గం ‘మెజారిటీ’ కోల్పోయిన సందర్భాలలో, ప్రత్యామ్నాయ మంత్రివర్గం ఏర్పడవచ్చు. అలా వీలుకానపుడు లోక్‌సభ ఐదేళ్లు పూర్తికాకముందే రద్దయిపోతుంది. ప్రస్తుతం అమలులో వున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇలాంటి సందర్భాలలో ఐదేళ్లపాటు లోక్‌సభను కొనసాగించడం అసంభవం. మధ్యంతర ప్రజాభిప్రాయ సేకరణ అనివార్యం! ఇలాంటి సందర్భాలలో గడువు పూర్తికాని శాసనసభలకు ఎన్నికలు లోక్‌సభతోపాటు జరిపిస్తారు. ఏకకాలంలో ఎన్నికలు ఎలా సాధ్యం? ఇరవై తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకూ లోక్‌సభతోపాటు 2019లో ఒకేసారి ఎన్నికలు జరిపించినప్పటికీ 2024 వరకూ ఈ అన్ని చట్టసభలలోనూ ఆయాప్రభుత్వాలకు ‘మెజారిటీ’ ఉంటుందా? అలా వున్నప్పుడు మాత్రమే 2024లో మళ్లీ చట్టసభలన్నింటికీ ఒకేసారి ఎన్నికలను జరిపించవచ్చు! ఒక్క శాసనసభలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల గడువులోగా మెజారిటీ కోల్పోయినప్పటికీ ఏకకాలంలో ఎన్నికలు జరిగే ప్రక్రియ మళ్లీ భంగపడుతుంది. 1952లో ఏకకాలంలో జరిగిన ఎన్నికలు తరువాతి కాలంలో అలా జరుగకపోవడానికి చట్టసభలలో మెజారిటీపై ఆధారపడి ప్రభుత్వాలు మనుగడ సాగించే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కారణం..
దీన్ని అధిగమించడానికై రాజ్యాంగంలో అనేకమైన మార్పులు అనివార్యం. మధ్యలో రద్దయి మళ్లీ ఏర్పడే సభ నిర్ణీత కాలవ్యవధిలో మిగిలిన గడువు పూర్తయ్యే వరకూ మాత్రమే పనిచేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించడం ఒక ప్రత్యామ్నాయం. ఉదాహరణకు 2019లో ఒకేసారి ఏర్పడే లోక్‌సభ, శాసనసభలు 2024వరకు పనిచేస్తాయి. మధ్యలో లోక్‌సభ కాని ఏదైనా శాసనసభ కాని- ప్రభుత్వాలు మెజారిటీ కోల్పోయిన కారణంగా రద్దు కావచ్చు! అలాంటి సమయంలో మళ్లీ ఎన్నికయ్యే లోక్‌సభ లేదా శాసనసభల గడువు మిగిలిన చట్టసభలతోపాటు 2024లోనే పూర్తికావాలి! ఇలాంటి నిబంధనను కాలరాస్తూ రాజ్యాంగాన్ని సవరించాలి! అలా జరిగినపుడే ఏకకాలంలో ఎన్నికలు జరిగే ప్రక్రియ స్థిరపడుతుంది. ఇది ఒక ప్రత్యామ్నాయం మాత్రమే!!