ఈ వారం కథ

శనివారంపేట కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శనివారం సంత జరిగే ఊరని పొరబాటు పడుతుంటారు విన్నవారు. అది కాదు.
ఆ ఊరి కొండమీద నిలువుగా పాతిపెట్టిన ఎత్తయిన శిల ఉంది. శనిగ్రహ దోషాలున్నవారు ఆ శిలను శనివారంనాడు నువ్వుల నూనెతో అభిషేకిస్తే గ్రహదోషం తొలగిపోతుందని పురాతన కాలంనించీ నమ్మకం ఉంది.
ఆదిమానవుల నివాసాలు ఇక్కడ ఉండేవనీ, మరణించినవారిని పూడ్చిపెట్టి తలవైపున పెద్ద శిలను స్థాపించేవారని- ఈ శిల అటువంటిదేనని కొందరి అభిప్రాయం.
అట్లయితే ఈ శిలారూపం ఎంతో మహత్తు గలదని నమ్మాల్సిందే. ఆనాడు, ఎవరో మహానుభావుడు, శని దేవతను ఉపాశించిన వానిని ఇక్కడ పూడ్చిపెట్టి ఉంటారు. శనిదోష పరిహారార్థం ఆ శిలను నూనెతో అభిషేకించడం ఆనాటి ఆచారమే అయి ఉంటుంది!
-ఒక మేధావి నిర్థారించాడు.
ఎవరు అవునన్నా, ఎందరో కాదన్నా, నమ్మకం బలమైనది. తమకు శనిదేవత అనుకూలంగా లేనందున, ఎన్నో కష్టాలు వస్తున్నాయని నమ్ముతున్నవారిలో గొప్ప విద్యావంతులూ ఉన్నారు. వీరంతా ఆ శిలారూపాన్ని దర్శిస్తూనే ఉన్నారు.
క్రమంగా ఆ కొండ చుట్టూ జనావాసాలు ఏర్పడినాయి. అన్ని వృత్తులవారూ చేరారు.
కొండ అని పేరేగాని అది పెద్ద గులకరాళ్ళ గుట్ట అనడం యధార్థం. గుట్ట పర్యాటక స్థలం అయింది. భూమి గులకరాళ్ళమయం కావడంవల్ల, జలవనరులు లేనందున, అక్కడి జనం కేవలం కూరలు, ఆకులు సేద్యం చేస్తారు. ఊరి జనాభా అయిదు వందలకుపైగా ఉంది. పాఠశాల ఉంది. విద్యుత్తు, హెల్త్ సెంటర్ ఉన్నాయి.
గ్రామస్థులకు ప్రధాన ఆదాయం యాత్రికులవల్లనే వస్తుంది. యాత్రికుల కోసం లాడ్జిలు ఉన్నాయి. గ్రామాన్ని, ప్రధాన రహదారితో కలిపే తారు రోడ్డు ఉంది.
గ్రామంలో అందరూ అక్షరాస్యులే అయినా ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య అత్యల్పం.
ఆ ఊర్లో సూరిబాబు బాగా చదివాడు. కొడుకును విదేశాలకు పంపాలని తండ్రి రామయ్య సంకల్పం.
***
‘దేవత లేదూ! గాడిద గుడ్డూ లేదు’. ఆ ఊరివాడెవడో మోసగాడు ఇదంతా చేశాడు. జనాభా అతి తక్కువగా ఉన్న కాలంలో - ఈ మారుమూల ఊళ్ళో- గుట్టమీద ఈ నిలువు రాతిని పాతి, నెత్తిన నూనె పోశాడు.
ఒక అతివాది తీర్మానించాడు.
‘చాలామంది యాత్రికులు, బాగా చదువుకున్నవారే అంటుంటే విన్నాను. ఇటువంటి శిల, పక్కనున్న గులకరాళ్ళు భూమిమీద దొరికేవు కావుట. అందుచేత ఈ శిలకు మహత్తు ఉంది. శిలను దర్శించిన తరవాత ఒక గులకరాయిని ఇంటికి తీసుకుపోయి పూజా మందిరంలో పెట్టుకుంటున్నారు.
ఊళ్ళో బాగా వృద్ధుడయిన రాజయ్య స్థల చరిత్ర చెబుతుంటాడు. సమీపంలో వున్న ఉన్నత పాఠశాలలోని సోషల్ స్టడీస్ టీచరు చర్చను మరింత కొనసాగించాడు.
ఆదిమానవుల సమాధి స్థలం ఇది. రాక్షసి గుళ్ళు అంటారు. ఈ పరిసరాల్లో ఇటువంటివి చాలా ఉండి ఉంటాయి. కొన్ని సమాధుల్లో విలువయిన వస్తువులు దొరకవచ్చు. కాబట్టి ఆర్కియాలజీ వారికి చెప్పడం మంచిది!
‘గ్రామం ఈ శిలవల్ల బతుకుతూ వుంది. దయచేసి దీనికి జోలికి రావద్దు’- ఇది గ్రామస్తుల విన్నపం.
‘దీనిని ఇలాగే వదిలేస్తే ఈ మూఢ నమ్మకం మరింత పెరుగుతుంది. దీనిని శాస్ర్తియంగా ఆలోచించాల్సిందే’.
జనవిజ్ఞాన వేదిక వాదించింది.
వాదనలు వివిధ పత్రికల్లో వస్తున్నాయి. టీవీవారికి మంచి అంశం దొరికింది. ఏ విధంగానూ గుర్తింపులేని కొందరికి టీవీలో కనిపించడం గొప్పగా ఉంది. అశాస్ర్తియమైన ఎన్నో అంశాలు శాస్ర్తియంగా చర్చించబడుతున్నాయి. చిత్రమేమంటే శిలలకు ప్రాధాన్యం ఇయ్యడం ఏ దేశంలోనూ లేనట్లూ, మన దేశంలో మాత్రమే ఈ మూఢాచారం ఉన్నట్లు చర్చిస్తున్నారు.
గ్రామస్థులకు భయం పట్టుకుంది. తమ ఆదాయానికి గండిపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎవరితోనో రాయించి ఒక సుదీర్ఘమైన వివరణ పత్రికల్లో విడుదల చేశారు శనివారంపేట గ్రామస్థులు.
‘ఇక్కడి శిల ఏదైనా కావచ్చు. దీనివలన ఎవరికీ అపకారం జరగడంలేదు. ఏవో బాధలతో ఇబ్బందులు పడుతున్నవారు ఇక్కడికి వచ్చి మానసిక స్వస్థత పొందుతున్నారు. ముఖ్యంగా మానసిక రోగులకు ఇది బాగా ఉపకరిస్తూ ఉంది.
ఇక్కడ పూజారి లేడు. పోసే నూనె పరిమితి అత్యల్పం. కాబట్టి ఆ రూపంలో కాలుష్యం లేదు. ఇక్కడ హుండీలు లేవు. లాడ్జిలో ఛార్జీలు అతిస్వల్పం. భోజనమూ అతి తక్కువ వెలకే లభిస్తున్నది. అనవసరమైన చర్చలతో మా జీవనాధారం పోగొట్టవద్దు. ఎటువంటి నేరాలూ ఇక్కడ జరగలేదు. ఒక సైకియాట్రిస్ట్‌వలన లభించే స్వస్థత వంటిదే ఈ శిలవల్ల లభిస్తూ ఉంది. ఈ చర్చలను ఇంతటితో ఆపండి- ఇలా సాగింది ఆ వివరణ.
కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నామంటూ ప్రజల మనస్సులో అశాంతి రేపడం ఆధునిక నాగరికతలో ఒక భాగం.
ఇక్కడ దొరికే రాళ్ళలో అరుదైన మూలకాలున్నాయి. వీటిని వెలికితీస్తే ప్రభుత్వానికి మంచి ఆదాయం.
-ప్రజల నమ్మకాన్ని ఎవరూ కాదనడంలేదు. పరిసరాల్లో తవ్వకాలు జరిపి పరిశీలిద్దాం.
ఇది బలమైన వాదం. మేధావులు దీనికి వత్తాసు పలికారు. స్థానిక మండల కేంద్రంలో- మేధావుల వినతి పత్రం అధికారికి చేరింది. కలెక్టరుకు, భూగర్భశాఖకు ప్రతులు పంపారు.
శనివారంపేట పరిసరాల్లో భూపరీక్షలు జరపడానికి డిపార్టుమెంటు తీర్మానించింది. ఇందుకు సంబంధించిన భూహక్కుదారుల వివరాలు, జన నివాసాలకు సంబంధించిన వివరాలు అందించవలసినదిగా కోరడమైనది.
స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలొచ్చాయి.
స్థానిక మండల కేంద్రంలో కాగితాలు చురుకుగా కదిలాయి. ఇదొక సువర్ణావకాశం!
నూరుమంది కూలీలు ఏర్పాటు చేయబడ్డారు.
‘రేపు పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిగినప్పుడు మీరు ఉద్యోగులుగా పరిగణించబడతారు. ప్రస్తుతం రోజుకు మూడు వందలు కూలీ ఇస్తారు. సంవత్సరం తరువాత నెలకు కనీసం పదిహేను వేలు జీతం వస్తుంది’!
పరిసర గ్రామాలనుండి ఈ కూలీల ఎంపిక జరిగింది. ఒక్కొక్కరివద్దనుండి యాభై వేలకు తక్కువ కాకుండా ముడుపులందాయి.
వారి వారి స్థాయినిబట్టి ఉద్యోగులు వాటాలు పంచుకున్నారు.
ఈ లంచం విషయం అత్యంత గోప్యంగా జరిగింది. పంటలు పండని తమ భూములకు అధిక విలువ లభించబోతున్నదని రైతులు ఆనందించారు. వారివైపునుండి ఎటువంటి విమర్శలూ రాలేదు.
‘ఇదంతా పెద్ద పరిశ్రమ అవుతుంది. పెద్ద ఉద్యోగులొస్తారు. పాలు, కూరగాయలు, ఇళ్ళలో పనిచేసే మనుషులు- అన్నిటికీ మనమే దిక్కు- ప్రధాన రహదారి పక్కన మనకు ఇళ్ళు ఇస్తారట- మనకు గుర్తింపు కార్డులిచ్చి- నిర్మించబోయే కాలనీలోకి పోనిస్తారు.
తియ్యటి కబుర్లతో జనం కడుపులు నింపుకుంటున్నారు.
‘మీరు అక్కడే పొరబడుతున్నారు. ప్రశాంతంగా జీవిస్తున్న మీరు ఇలా ఉండలేరు. ఇప్పటిదాకా ఈ ఊళ్ళలో సారా లేదు. రేపు గ్రామానికొక సారా దుకాణం వెలుస్తుంది. ఇంకా అనేక ఆకర్షణలుంటాయి. సంపాదించిన డబ్బు ధనవంతుల సంచుల్లోకి పోతుంది. బొగ్గు గనుల కార్మికులను చూస్తున్నాము కదా! మిగిలేవి రోగాలే!
-‘పంతులుగారూ మీరు మంచివారే గాని లోకం పోకడ తెలీదు’.
రెండు మూడు తరాలనుంచీ మన బతుకుల్లో మార్పు లేదు. ఇప్పుడు మంచి రోజులొస్తున్నాయి. పెద్ద డాక్టర్లు వస్తారు. మంచి మందులొస్తాంయి. మనం అంతా కలిసికట్టుగా ఉంటే ఇక్కడి పెత్తనం మనదే అవుతుంది. మనలను కాదనే ధైర్యం ఎవరికీ ఉండదు. తన కలలను పండించుకోవాలని ఒక యువ నాయకుడు-
-‘కొండయ్యా! నీకు అర్థం కావడంలేదు. జాతీయ పార్టీల నాయకులు తమ తాబేదార్ల చేత ఇక్కడ యూనియన్లు పెట్టిస్తారు. ఇప్పటిదాకా మనమంతా ఒకటిగా ఉన్నాము. ఇకమీదట అలా ఉండదు.
ముందు శాంపిల్ పరీక్షల ఫలితాలు చెప్పమనండి. ఏ ఏ మూలకాలున్నాయి. వాటి డిమాండు ఎంత? ఎంతకాలం ఇది సాగుతుంది. ఈ వివరాలు తెలియకుండా వాళ్ళు అంతటా గోతులు తవ్విపోతే?
పంతులుగారి ఆలోచన ఎవరికీ నచ్చలేదు.
‘పోనీ మనూరి పిల్లవాడు సూరిబాబును రమ్మనమనండి. అతగాడి మాటలు విందాము’.
ఈ ముసలాయన పని చెడగొడతాడు- అందరిలో ఈ ఆలోచనే మెదిలింది. సూరిబాబు వస్తే ఏమి అడ్డాలు పెడతాడో-
కాని తండ్రి ద్వారా సూరిబాబుకు సమాచారం అందింది.
‘నాన్నా! నేను మూడు నెలలు ఫారిన్లో ఉండడానికి అధికారులు నిర్ణయించారు. నువ్వు ఎవరికీ అనుమానం రాకుండా అక్కడొకటి, ఇక్కడొకటి గులకరాళ్ళు ఏరి నాకు పంపించు. నేను తీసుకుపోయి పరీక్షలు చేయిస్తాను’!
***
ఇదంతా యాత్రికులకూ తెలిసింది. తలా ఒకట మాట చెప్పుకుంటున్నారు.
‘గుట్ట తవ్వకపోతే పనులు పూర్తికావు. అపుడు శిలారూపాన్ని ఎక్కడ పెడతారు?
‘దూరంగా ప్రధాన రహదారి పక్కన గొప్ప గుడి కట్టి శిలామూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేస్తారట.
ఏనాటిదో ఈ శిల! మొదట ఎఱ్ఱ మట్టి రంగులో ఉండేదట. ఇక్కడి గులకరాళ్ళూ అదే రంగు. క్రమంగా రంగు వెలిసిపోయింది. శిలపై నూనె పోస్తున్నందున క్రమంగా నల్లబడిపోయింది. ఇది అంతరిక్షం నుండి పడిన శిల అయి ఉంటుంది. మంత్ర పూర్వకంగా శనిదేవతగా ఇక్కడ ఎవరో నిలిపారు.
అనుకున్నట్లుగానే ఆఫీసర్ల వాహనాల తాకిడి ఎక్కువైంది. కొంత మిషనరీ వచ్చింది. ఎవరూ ఏమీ చెప్పరు అడిగినా!
‘సారూ! మాకు ఇళ్ళు కట్టి యిస్తే మేము ఇక్కడి వసతులు కాళీ చేస్తాము. వానాకాలంలోపల ఈ పని జరుగుతుందన్నారు. ఇప్పటికీ ఆ ప్రయత్నమే మొదలవ్వలేదు. మాకు కాంపెన్‌సేషన్ ఇచ్చిన తరువాతనే పొలాల్లో దిగుతామని కదా ఒప్పందం?
‘అదే జరగబోతూ ఉంది. వానాకాలానికి మీకు అన్నీ అమరుతాయి. ఈలోపుగా గుంటలు తవ్వి లోనున్న గులకరాళ్ళనూ పరీక్షించాలి. అదే గదా మేము చేయడం?’
పోలీసు ఠాణాలో ఒక క్రిమినల్ మరణిస్తే, ప్రధాన రహదారిమీద గంటల తరబడి ధర్నాలు చేయించే పౌర హక్కుల సంఘంవారు ఈ గొడవ జోలికి పోలేదు. జాతీయ పార్టీలవారి యూనియన్ల నాయకులు ఒకరిద్దరు వచ్చారు- వారూ ఇదేమని అడగలేదు. తమ యూనియన్లో ఎందరు చేరతారో- ప్రాథమిక అంచనాలు వేసుకుంటున్నారు.
మానసిక రోగులకు కొంత స్వస్థత లభిస్తున్నది కదా- దీనిని పట్టించుకునే వారే లేరు గదా? ఇది మూఢ నమ్మకమే కావచ్చు- ఫలితం కనబడడంవల్లనే కదా జనం వస్తున్నారు. ఇక్కడ ప్రజా పీడన లేదు. ఎవరికీ నష్టం కలగలేదు. ముందు పరీక్షలు పూర్తిగా జరిగాయా?
-ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?
****
నాలుగు నెలల్లోనే యాత్రికుల సంఖ్య పడిపోయింది. శిలారూపాన్ని తవ్వేశారని వార్తలు వ్యాపించాయి.
వానం కాలం వచ్చింది.
గుట్ట చుట్టూ గోతులు-
గోతుల్లోకి నీళ్ళు వచ్చాయని పని ఆపేశారు.
ఆ రాళ్ళలో అరుదైన మూలకాలు ఏవీ లేవని సూరిబాబు తండ్రికి రహస్యంగా చెప్పాడు.
ఆఫీసర్లకూ అటువంటి రిపోర్టు వచ్చింది. పనులు ఆగిపోయాయి.
ఆదాయం పడిపోయి జనం దీనంగా చూస్తున్నారు.
పాత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఒంటరిగా శిలామూర్తి మిగిలింది.
*

రచయిత సెల్ నెం:9441084316

-పమిడిఘంటం సుబ్బారావు