కృష్ణ

తుపాకులు ఎక్కుపెట్టినా వెనక్కి తగ్గం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మార్చి 10: నోటీసులు జారీ చేయకుండా తమ భూముల్లోకి అడుడుపెట్టనివ్వబోమని రైతులు అధికారులను అడ్డుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణలో భాగంగా ఏలూరు కాల్వ మళ్లింపునకు ఎంజాయిమెంట్ సర్వే నిర్వహించేందుకు గురువారం వెళ్లిన రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. మీరు ఎందుకు సర్వే చేస్తున్నారో లిఖితపూర్వకంగా రాసిస్తినే సహకరిస్తామన్నారు. సమాచారం చెప్పకుండా ఎలాంటి సర్వేలు జరగనిచ్చేదిలేదని కరాఖండిగా చెప్పారు. జక్కులనెక్కలం నుండి కేసరపల్లి వరకు ఏలూరు కాల్వను మళ్లించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు పోలీసు బలగాలతో సర్వేకు రంగం సిద్ధం చేశారు. గన్నవరం తహశీల్దార్ ఎం మాధురితో రైతులు కొద్దిసేపు చర్చలు జరిపారు. సర్వే చేసినంత మాత్రాన మీ భూములు ఏమీ తీసుకోరని, అవగాహన కోసం సర్వే చేస్తున్నామని మాధురి వివరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సర్వేకు అంగీకరించేది లేదని రైతులు తెగేసి చెప్పారు. తొలి నుండి కాలువ మళ్లింపును వ్యతిరేకిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే చేస్తున్నామని, ఇందుకు సహకరించాలని మాధురి రైతులను కోరారు. భూముల్లోకి వెళుతున్న అధికారులను రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. రైతులు తమ కుటుంబ సభ్యులతో నిరసన వ్యక్తం చేశారు. తమ బాధలు అర్థం చేసువాలని మహిళలు అధికారులను అర్థించారు. కోట్ల రూపాయల విలువైన భూములు కాజేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. మేమందరం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అధికారులను వేడుకున్నారు. అధికారులకు అండగా సిఐ అహ్మద్ అలీ నిలిచి భూముల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైతులు, సిఐ మధ్య వాగ్వాదం జరిగింది. తమను తుపాకులతో కాల్చినా, లాఠీలతో కొట్టినా వెనక్కి తగ్గేదిలేదని రైతులు మొండికేశారు. ఈనేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రైతులు ఎంవిఎల్ ప్రసాద్, గూడవల్లి నర్సయ్య మాట్లాడుతూ సర్వే చేసేముందు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులను ముందుపెట్టి సర్వేకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. పోలీసులను పెట్టి భయభ్రాంతుల్ని చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సుబ్రహ్మణ్యం, జాస్తి నాని, కె శ్రీను, మాధవ్, రామారావు, తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాలకు కేటాయింపులు భేష్
* బడ్జెట్‌పై బచ్చుల
మచిలీపట్నం, మార్చి 10: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఈ బడ్జెట్ మార్గదర్శకంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయింపు చేయడం హర్షణీయమన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65కోట్లు, రుణమాఫీకి రూ.3500కోట్లు, మహిళా సాధికారతకు రూ.642కోట్లు కేటాయించి మంత్రి యనమల ఆయా వర్గాల మన్ననలు పొందారని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా ధ్వజస్తంభ గ్రామోత్సవం
మైలవరం, మార్చి 10: స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ ధ్వజస్తంభానికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం ధ్వజస్తంభానికి వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. మైలవరం వీధుల్లో ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు స్తంభానికి స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. కొందరు భక్తులు ధ్వజస్తంభాన్ని తాకుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొందరు ధ్వజస్తంభాన్ని మోస్తూ పట్టణమంతా తిరిగారు. అన్ని బజార్లలో ధ్వజస్తంభానికి మహిళల నుండి విశేష స్వాగతం లభించింది. ఉదయం నుండి సాయంత్రం వరకూ గ్రామోత్సవం కొనసాగటం విశేషం. ఈ ధ్వజస్తంభాన్ని ఈ నెల 11న ఉదయం ఆలయం ఎదుట ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఎదుట బంగారం వర్తకుల ధర్నా
మచిలీపట్నం , మార్చి 10: బంగారం వ్యాపారంపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నిబంధనలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ది మచిలీపట్నం బులియన్ జ్యూయలరీ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తొలుత పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన వ్యాపారులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినియోగదారునికి కూడా ఈ చట్టం వల్ల ఎంతో నష్టం జరిగే ప్రమాదం ఉందని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల గిరీష్, ఉడత్తు కిషోర్, ముజాహెద్ హుస్సేన్, ఉదయగిరి మురళి, జంగాల హరనాధ బాబు, ఉడత్తు ప్రసాద్, వాకమూరి శ్రీనివాస్, కోట జయరామ్, తదితరులు పాల్గొన్నారు.

బీసీల అభ్యున్నతికి చంద్రబాబు కృషి
తోట్లవల్లూరు, మార్చి 10: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని టిడిపి జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2016-17 బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బీసీల సబ్‌ప్లాన్ కింద రూ.8832 కోట్లు కేటాయించటం పట్ల జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా గత సంవత్సరంలో రూ.6640 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం అధికంగా కేటాయించటం అభినందనీయమన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా బాధ్యతగా వ్యవహరించి ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిందిపోయి కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం సబబు కాదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రంలో ఎక్కడా విధ్వంస ఘటనలు జరిగిన దాఖలాలు లేవని, అలాంటి రాష్ట్రంలో జగన్ డైరెక్షన్‌లో అరాచకం సృష్టిస్తూ పారిశ్రామికవేత్తలను రాకుండా చేసి రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కలిగించటం పద్ధతి కాదని గురుమూర్తి ఖండించారు. గ్రామ టిడిపి అధ్యక్షుడు నెక్కలపూడి మురళి, కార్యదర్శి గొరిపర్తి రమేష్, పాముల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ నాగేశ్వరస్వామి రథోత్సవం
కృత్తివెన్ను, మార్చి 10: కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలో వేంచేసి వున్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి రథోత్సవాన్ని గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై దేవేరులతో ఆశీనులైన స్వామివారిని దర్శించిన భక్తులు పులకించారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా కృత్తివెన్ను పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి శింగనపల్లి శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న మైలవరం
మైలవరం, మార్చి 10: ద్వారకా తిరుమలకు దత్తత ఆలయమైన స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకుని మైలవరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇప్పటికే పట్టణాన్ని రంగుల విద్యుదీప కాంతులతో నింపేశారు. ప్రతి కూడలితో పాటు ప్రధాన రహదారుల వెంట రంగుల విద్యుత్ దీపాలతో దేవతారూపాలు ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ, యూనియన్ బ్యాంకు ఎదురుగా ఏర్పాటు చేసిన దేవతారూపాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పట్టణం చుట్టూ ప్రధాన స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులలో చలువ పందిళ్లు వేశారు. ఉదయం నుండి నిత్య విధులను నిర్వహించారు. ప్రతిష్ఠకు ముందు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం నుండి హోమాలను నిర్వహిస్తున్నారు. ద్వారకా తిరుమల నుండి వేదపండితులను రప్పించి శాస్త్రోక్తంగా కార్యక్రమాలను వేదమంత్రాల నడుమ నిర్వహిస్తున్నారు. దాదాపు 30వేల మందికి పైబడి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అంచనా వేసి ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. పట్టణంలోని నూజివీడు రోడ్‌లో భోజన ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం భద్రాచలం రోడ్డును సిద్ధం చేశారు. ఇందుకోసం పందిళ్లు వేసి తోపుడు బండ్లను తొలగించి ట్రాఫిక్‌ను మరో మార్గానికి మళ్లించారు. సుమారు 50లక్షల రూపాయలకు పైబడి వ్యయంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మైలవరం పట్టణం ఆసాంతం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, విగ్రహ ప్రతిష్ఠాపకులు త్రిదిండి చిన్నజీయరు స్వామివారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠా కార్యక్రమాన్ని పురస్కరించుకుని పట్టణం సందడితో పాటు రద్దీగా మారింది.

జగన్ నీడ నుండి ముద్రగడ బైటపడాలి
కూచిపూడి, మార్చి 10: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి డైరెక్షన్ నుండి తప్పుకోవాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సూచించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాపు వర్గాలతో జగన్మోహనరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. కాపుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించిందన్నారు. లేనిపోనివి సృష్టించి ఆ వర్గాల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఏలూరులో నిర్వహించిన రుణమేళా ద్వారా రూ.192 కోట్ల రుణాలు అందచేశామన్నారు. ఈ నెల 27న రాయలసీమలో రుణమేళా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కాపు కార్పొరేషన్‌కు 3లక్షల 43వేల 500 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. వీటిని పరిశీలించి రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముద్రగడ పద్మనాభం దివంగత రాజశేఖరరెడ్డి అనుయాయుడిగా పేరొందిన కరుణాకరరెడ్డిని కలవడంలో అంతర్యమేమిటని రామాంజనేయ ప్రశ్నించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టిడిపి మండల అధ్యక్షులు పోతుల నాగదేవ చంద్రహాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపిపి కిలారపు మంగమ్మ, వైస్ ఎంపిపి నన్నపనేని వీరేంద్ర, మాజీ ఎంపిపి తాతా నారాయణరావు, తాతా ప్రభాకరరావు, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

ఇసుక క్వారీలకు అనుమతి ఇవ్వండి
జగ్గయ్యపేట, మార్చి 10: జగ్గయ్యపేట నియోజకవర్గంలోని మునే్నరు, కృష్ణా నదుల ఇసుక క్వారీల నుండి ఉచిత ఇసుక పొందేందుకు అనుమతులు ఇప్పించాలని మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు సబ్ కలెక్టర్ సృజనను కలిసి వినతి పత్రం సమర్పించారు. జగ్గయ్యపేట తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సబ్ కలెక్టర్‌ను కలిసిన నేతలు దూరం నుండి జగ్గయ్యపేటకు ఇసుక రవాణా భారంగా మారిందని, దగ్గర లోని క్వారీలకు అనుమతి ఇస్తే వేలాది రూపాయల భారం తగ్గుతుందని వివరించగా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని, ఇసుక దిగుమతికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు ఎంవి చలం, ఫిరోజ్‌ఖాన్, ఎం నర్శింహారావు తదితరులు పాల్గొన్నారు.

దుర్గగుడి ఇవోగా నరసింగరావు తగడు
ఇంద్రకీలాద్రి, మార్చి 10: దుర్గగుడి అర్చకుడు యం సుబ్బారావు ప్రాణాలతో ఆటలాడిన దుర్గగుడి ఇవో నరసింగరావు అసలు ఏ దేవస్థానంలోనూ ఇవోగా పనికి రాడని, జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని వెంటనే సస్పెండ్ చేయాలని స్వరూపనంద స్వామిజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం స్వామిజీ ఇంద్రకీలాద్రికి చేరుకొని ఆందోళన చేస్తున్న అర్చకులు, దుర్గగుడి సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ బ్రాహ్మణులంటే భూమిమీద నడిచే దేవతలతో సమానమని పలు శాస్త్రాలు స్పష్టం చేస్తుండగా వారిని అకారణంగా వేధించటం ఎంతవరకు సమజంజమని స్వామిజీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవోను సస్పెండ్ చేసి ఇటువంటి సంఘటనలు భవిష్యత్‌లో ఏ ఆలయంలో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.