రాష్ట్రీయం

వెంకన్న ఆదాయానికి వర్షాల గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

22 రోజుల్లో 46 కోట్లే
తిరుపతి, నవంబర్ 23: వర్షాలు ప్రజలకు ఎంత నష్టాన్ని మిగిల్చాయో అదేవిధంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదాయానికి కూడా గండి కొట్టాయనే చెప్పాలి. గతేడాది నవంబర్ మాసంలో 30 రోజుల్లో 76కోట్ల 50లక్షల రూపాయలు టిటిడి ఆదాయం లభించింది. ఈ వర్షాల కారణంగా రైలు, బస్సుమార్గాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు జలాశయాలు పొంగిపొర్లుతుండటంతో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలోనే గత 15 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి గరిష్టంగా 3 నుంచి 4గంటలు పడితే కనిష్ఠంగా అరగంట నుంచి గంట సమయం పట్టిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో గత 22 రోజుల్లో శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 46కోట్లు ఆదాయం లభించింది. ఇందులో సోమవారం 2కోట్లు ఆదాయం లభించింది. ఇక మిగిలిన 8 రోజుల్లో రోజుకు రెండు కోట్లు వచ్చినా మాసాంతానికి 62 కోట్లు మించే అవకాశం లేదు. సర్వసాధారణంగా ప్రతి నిత్యం 70 నుంచి 80వేల మంది సాధారణ రోజుల్లో స్వామివారిని దర్శించుకునేవారు. దీంతో రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు ఆదాయం లభించేది. వర్షాల కారణంగా ఈ ఆదాయం కోటిన్నరకు పడిపోయింది.

తిరుమల ఘాట్‌లో మళ్లీ విరిగిపడిన కొండచరియలు
తిరుమల, నవంబర్ 23: తిరుమల రెండో కనుమదారిలో సోమవారం తెల్లవారుజామున మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కనుమ దారిలోని 16వ కిలోమీటరు వద్ద భారీ బండరాళ్లు, మట్టి పెళ్లలు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. సమాచారం అందుకున్న టిటిడి అధికారులు వెంటనే స్పందించి వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో ఆదివారం రెండో కనుమ మార్గంలోని పలుచోట్ల కొండచరియలు జారిపడిన విషయం విదితమే. అయితే సోమవారం కూడా 16వ కిలోమీటరు వద్ద గతంలో బండరాళ్లు జారినపడిన చోటే మళ్లీ పడ్డాయి. దీంతో రోడ్డు పాక్షికంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన టిటిడి ఆదివారం రాత్రి 10.30 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు రెండోకనుమదారిని మూసివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే వర్షాల కారణంగా తరచూ కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రయాణించేందుకు భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

డెంగ్యూతో ఇద్దరు చిన్నారుల మృతి
నాగలాపురం, నవంబర్ 23: చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం బీరకుప్పం దళితవాడ,చిన్నాపట్లు గ్రామాల్లో డెంగ్యూ జ్వరం లక్షణాలతో ఇద్దరు చిన్నారులు సోమవారం మృతి చెందారు. బీరకుప్పం దళితవాడకు చెందిన కామరాజ్, తమళఅరసి కుమార్తె ప్రవీణ (8) నాగలాపురం విజ్ఞానసుధ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈమె గత వారం రోజులగా జ్వరంతో బాధపడుతుండడంతో నాగలాపురం, సత్యవేడు గ్రామాల్లో ప్రైవేటు డాక్టర్ల వద్ద చికిత్స చేయించారు. అయినా ప్రయోజనం లేకపోవడం తో మెరుగైన వైద్యంకోసం చెన్నై లో ఎగ్మోర్ బేబి హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. చిన్నాపట్టు గ్రామానికి చెందిన గుర్రప్ప, రేవతి దంపతుల కుమార్తె శ్రావణి (3) అనే చిన్నారికి గత 5 రోజులుగా జ్వరం రావడంతోపుత్తూరు, ఊత్తుకోట ప్రాంతాల్లో చికిత్స చేయించారు. ప్రయోజనం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడైన తిరవళ్లూరు గవర్నమెంటు ఆసుపత్రిలోచికిత్సకోసం చేర్పించి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది.

హిందువులపై దాడులు సహించం
భీమవరం, నవంబర్ 23: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని, హిందువులపై ఎవరైనా దాడులకు పాల్పడితే సహించబోమని హిందూ చైతన్యవేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార ప్రతినిధి త్రివిక్రమ్‌జీ పేర్కొన్నారు. అవసరమైతే ప్రతి దాడులకు దిగుతామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం జరిగిన వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి, ఇతర మతస్థులు అనధికార నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. దేవాలయాలు, గోమాత సంరక్షణ బాధ్యతను హిందూ చైతన్యవేదిక తీసుకోవాలని సూచించారు. మతమార్పిళ్లను తిప్పికొట్టాలన్నారు. హిందూ యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకుంటున్నారని, ఇటీవలి కాలంలో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని త్రివిక్రమ్‌జీ ఆవేదన వ్యక్తంచేశారు. మత్తుపదార్ధాలను విద్యార్ధులకు అందించి హిందూ సమాజాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు నాగార్జున వర్సిటీకి మంత్రి గంటా
గుంటూరు, నవంబర్ 23: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ చోటుచేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం వర్సిటీకి రానున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి ఘటనను మరువకముందే మరో ఉందతం చోటుచేసుకోవటంతో వర్సిటీ అధికారులు సత్వర నివారణ చర్యలు తీసుకున్నారు. ఆదివారం వర్సిటీలో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ రాజశేఖర్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్కిటెక్చర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శే్వత, వినితేశ్వర, మణిసాయినాథ్‌లను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. సురేంద్రబాబు, మనోహర్‌లను 2 నెలలపాటు సస్పెండ్ చేశారు. ఈసందర్భంగా రిజిస్ట్రార్ రాజశేఖర్ మాట్లాడుతూ వర్సిటీలో ర్యాగింగ్‌పై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామన్నారు. హాస్టళ్లు, ముఖ్యమైన ప్రదేశాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఎలాంటి అవకతవకలు జరగకుండా అధ్యాపకులు, సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అందువల్లనే సంఘటన తమ దృష్టికి వచ్చిందని, వెనువెంటనే చర్యలు తీసుకున్నామని రిజిస్ట్రార్ రాజశేఖర్ వివరించారు.

ప్రత్యేక హోదా కోసం నిరంతర పోరాటం
నర్సీపట్నం, నవంబర్ 23: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి సత్యాగ్రహం చేపట్టిందని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మట్టి సత్యాగ్రహం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎఐసిసి ఎస్సీ విభాగం కార్యదర్శి కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్‌దాస్, ఎఐసిసి ఎస్టీ సెల్ చైర్మన్ ప్రదీప్ మాంజీయాలు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు. పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం, రామాలయం, మసీదుల్లో సేకరించిన మట్టిని కుండలో భద్రపరిచి స్థానిక నాయకులు ఈ సందర్భంగా ఎఐసిసి ప్రతినిధులకు అందజేసారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ఎన్నికల్లో నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలన్నారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తే. ఢిల్లీ నుండి నీరు, మట్టి తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేశారన్నారు. ప్రధాన మంత్రి తీరుకు నిరసనగా మట్టి సత్యాగ్రహం చేపట్టామని స్పష్టం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన మట్టిని ప్రధానికి పంపిస్తామన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 97 జిఓను విడుదల చేసి మన్యంలో దురదృష్టకరమైన వాతావరణాన్ని కల్పించిందన్నారు. అధికారంలో లేనప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. బాక్సైట్ తవ్వకాల జిఓలను రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామన్నారు.

అమరావతిలో కాన్సులేట్ పెట్టండి
చైనా ప్రతినిధులకు యనమల విజ్ఞప్తి
విజయవాడ, నవంబర్ 23: ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతున్న అమరావతిలో చైనా కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. రెండురోజుల పర్యటనకు సోమవారం ఉదయం నగరానికి చేరుకున్న చైనా దేశ మంత్రి ఛెన్ పెంగ్జియాంగ్ తన బృందంతో కలిసి గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. ఈసందర్భంగా మంత్రులు యనమల, రావెల కిషోర్‌బాబు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ వారిని సాదరంగా ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శులు పివి రమేష్, ఎస్‌ఎస్ రావత్, జాయింట్ సెక్రటరీ అశోక్, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి వారు రోడ్డు మార్గాన నగరానికి చేరుకున్నారు. దారిపొడవునా భారత్ - చైనా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. వీరి రాకకోసం ప్రజలు వీక్షిస్తూ గడిపారు. చేతులూపుతూ ఘన స్వాగతం పలికారు. హోటల్‌కు చేరుకున్న వెంటనే మంత్రులు, కలెక్టర్‌తో కలిసి అల్పాహార విందు స్వీకరించారు.