గుంటూరు

గుర్తుకొస్తున్నారుూ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 12: వారంతా రాజకీయాల్లో ప్రత్యర్థులు.. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఎన్నో పదవులు అనుభవించిన వారు..కొందరు బ్యూరోక్రాట్లుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. మరికొందరు కళారంగంలో నిష్ణాతులయ్యారు.. ఎవరి అనుభవాలు వారివి.. రాజకీయాలకతీతంగా ఒకే వేదికపై చిన్ననాటి అనుభవాలను ఒకరినొకరు పంచుకున్నారు 132 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎసి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కళాశాల పూర్వ విద్యార్థులైన ప్రముఖులు హాజరై అలనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ముఖ్యఅతిథిగా శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఎసి కళాశాలలో విద్యనభ్యసిస్తూ కుటుంబ పరంగా ఇరువురు సోదరులు, సోదరిలను అప్పట్లో విషజ్వరం మట్టుబెట్టిందని, అందువల్లే తాను వైద్య వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పారు. స్తోమత ఉన్నా మందులు అందుబాటులో లేని కారణంగా వారిని పోగొట్టుకోవాల్సిందనే బాధతో వైద్యం వృత్తిగా రాజకీయాలు ప్రవృత్తిగా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దోహదపడిన కారణాలను అవలోకించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు నడయాడిన కళాశాలలోనే తాను విద్యార్థి జీవితం గడపడం మరపురాని అనుభూతిగా చెప్పారు. అది ఓ మధురస్మృతి అన్నారు. పేరుకే కళాశాల విద్యాలయమని, తనకు దేవాలయంతో సమానమన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా తన తండ్రి ఆలపాటి శివరామకృష్ణయ్య కళాశాల నుంచి సస్పెండ్ అయ్యారని, అదే ఉద్యమ స్ఫూర్తితో జై ఆంధ్ర ఉద్యమంలో తాను బాధ్యత తీసుకుంటే కళాశాల యాజమాన్యం విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పిందని ఏసి కళాశాల అంటే ఓ వర్గానికి పరిమితం కాదన్నారు. లౌకిక భావాలకు కళాశాల మారు పేరన్నారు. విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేదన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో అనేక సంఘటనలు ఎదురవుతున్నా కళాశాల విద్యార్థిగా తాను సమన్వయం చేసుకుంటున్న తీరును వివరించారు. కళాశాల అభ్యున్నతికి తనవంతుగా ఐదులక్షల విరాళాన్ని ప్రకటించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కళాశాలలో చదువుకున్నందునే తాను ఉన్నత స్థాయికి ఎదగటానికి కారణమన్నారు. పాతికేళ్ల రాజకీయ జీవనంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేసే భాగ్యాన్ని కళాశాల అందించిందని తెలిపారు. వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తన అభివృద్ధికి కళాశాలలోనే బీజాలు పడ్డాయన్నారు. గురువుల సందేశమే తన జీవితాన్ని మార్చిందన్నారు. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ సభ్యుడు బెనర్జీ మాట్లాడుతూ విజయవాడ లయోలా కళాశాలలో సీటు వచ్చినప్పటికీ వదులుకుని ఎసి కళాశాలలోనే విద్యను పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది తన అదృష్టమన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ మంత్రి జెఆర్ పుష్పరాజ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ముత్యం, డాక్టర్ కె.మోజెస్, కొలకలూరి ఇనాక్, గ్రంథాలయాల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కూచిపూడి సాంబశివ రావు, మద్దిరాల మ్యానీ, ఉడా మాజీ చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, కో కన్వీనర్ ఎజ్రా తదితరులు ప్రసంగించారు. ఏసి కళాశాలను విశ్వ విద్యాలయంగా స్థాయిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
పాముకాటుకు మహిళ మృతి
నగరం, జనవరి 12: రెక్కాడితే గానీ డొక్కాడని, కూలి పనులు చేసుకుని జీవనం సాగించే మహిళ పాముకాటుకు గురై మృతిచెందిన సంఘటన ఇది. గురువారం నగరం ఎస్‌ఐ అశోక్‌కుమార్ కథనం ప్రకారం... నగరం మండలం మాన్యంవారిపాలెం గ్రామానికి చెందిన చిరకాల వెంకట రమణ భార్య మాధవిలత (35) అనే మహిళ పొలం వద్దకు వరికోతకు వెళ్లగా కాలిపై పాము కాటేయడంతో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఆమె భర్త, బంధువులు హుటాహుటిన రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు సమయం దాటిపోయిందని, వెంటనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. మార్గమధ్యలో మాధవి మృతిచెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు.