గుంటూరు

ఎమ్మెల్సీల విజయం ప్రతిపక్షానికి చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 20: రాష్ట్రంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం కల్పిస్తున్న ప్రతిపక్షానికి స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు చెంపపెట్టుగా నిలుస్తాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయం సాధించిన అనంతరం వెలగపూడి శాసనసభలో మంత్రి సిద్ధా మీడియాతో మాట్లాడారు. ప్రజలు మరోసారి అభివృద్ధికే పట్టం కట్టారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రజా విజయంగా భావిస్తున్నామన్నారు. నెల్లూరు, కడప, కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వాకాటి నారాయణరెడ్డి, బిటెక్ రవి, శిల్పా చక్రపాణిరెడ్డిలను మంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం వేల కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకై ఆకర్షితులై ప్రజలు ఎమ్మెల్సీ అభ్యర్థులకు పట్టం కట్టారన్నారు. రాయలసీమ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షానికి కనువిప్పు కావాలన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారే తప్ప ఫ్యాక్షన్ రాజకీయాలను కాదన్నారు. ఈ విజయానికి కారకులైన నాయకులను, ప్రజలను అందిస్తున్నామన్నారు. ఇకనైనా ప్రధాన ప్రతిపక్షం అనవసర రాద్దాంతాలు మాని నవ్యాంధ్ర నిర్మాణానికి, అభివృద్ధికి నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

కొల్లూరు ఎస్సీకాలనీలో అగ్ని ప్రమాదం
నాలుగేళ్ళ చిన్నారి సజీవ దహనం
తెనాలి, మార్చి 20: మండల కేంద్రమైన కొల్లూరు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి సజీవ దహనమైంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం కాలనీకి చెందిన చొప్పర ముసలయ్య తన భార్యతో కలసి కూలీపనులకువెళ్లారు. ఆ సమయంలో కొంతకాలంగా తనవద్దనే ఉంటూ అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకొంటున్న ముసలయ్య మేనకోడలు కొలకలూరి జ్యోతి(4) పెద్దలు లేనిసమయంలో గృహంలో నిద్రకు ఉపక్రమించింది. ఈక్రమంలో విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగి ముసలయ్య గృహానికి అంటుకున్నాయి. క్షణాల్లోనే గృహం, అందులోని గృహోపకరణాలు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ముసలయ్య అతని భార్య హుటాహుటిన గృహానికి చేరుకొని గ్రామస్థులతో కలిసి మంటలను ఆర్పివేసే ప్రయత్నంచేసి విఫలమైయ్యారు. అప్పటికే గృహంలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు మంటలు అంటుకోవటంతో సిలిండర్ పేలి ఈభారీ ప్రమాదం జరిగి గృహం పూర్తిగా కాలిపోవటంతో చేసిదిలేక కుట్టుబట్టలతో బయటపడి బోరున విలపించారు. ఇదిలాఉండగా తనవద్దనే ఉంటూ అంగన్‌వాడీ కేంద్రానికి వెళుతున్న మేనకోడలు జ్యోతి కనిపించక పోవటంతో గ్రామస్తుల సాయంతో మసలయ్య గ్రామంలో వెతికించారు. తుదకు జ్యోతి మంటల్లో సజీవంగా కాలిపోయి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించటంతో ఆప్రాంతమంటా విషాదఛాయలు అలముకున్నాయి. అయితే పెద్దలులేని సమయం కావటం, చిన్నారి జ్యోతి అంగన్‌వాడీ కేంద్రం నుండి సాయంత్రం గృహానికి వచ్చిన తరువాత నిద్రకు ఉపక్రమించిన సమయంలో ఈదుర్గఘటన జరగటం పలువురిని కలచివేసింది. సంఘటన సమాచారం అందుకున్న ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు తన సిబ్బందితో హుటాహుటిన కాలనీకి చేరుకొని కాలిపోయిన జ్యోతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాధమిక విచారణ, పంచనామా అనంతరం బాలిక జ్యోతి మృతదేహాన్ని రేపల్లె ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించినట్లు, ఈమేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా ఈఅగ్ని ప్రమాదం ఎస్సీకాలనీలోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల (ఎల్‌ఇ) సమీపంలో జరగటం గమనార్హం.