గుంటూరు

ప్రజాదరణతోనే ప్రగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్లెనపల్లి, అక్టోబర్ 22: రాజకీయాలలో వున్న సుదీర్ఘ అనుభవం పల్నాటి పౌరుషం, పట్టుదలతోనే సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సత్తెనపల్లిలో కుల మతాలకు అతీతంగా ఆదివారం నిర్వహించిన కార్తీక వనసమారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ తనయుడు, నియోజకవర్గ యువనాయకుడు కోడెల శివరామ్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ ప్రజాదరణ, అభిమానం సహకారంతో ఏదైనా సాధించవచ్చునని అన్నారు. ఇక్కడ నిర్వహించిన వన సమారాధన రాష్ట్రానికి ఆదర్శం కావాలని అన్నారు. సత్తెనపల్లిలో ఇరిగేషన్ గెస్ట్‌హౌస్, జెడ్పీ గెస్ట్ హౌస్‌లు, షాదిఖానా పునర్‌నిర్మాణం, వాకింగ్ ట్రాక్, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు, మోడల్ పోలీస్టేషన్ నిర్మాణంవంటి అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, స్వర్గపురి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఇటు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతోనే సాధ్యమైందని వివరించారు.
అభివృద్ధికి హాల్‌మార్క్ కోడెల: అయ్యన్న
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ అభివృద్ధికి హాల్‌మార్క్ డాక్టర్ కోడెల అని, అందుకే ఆయనను ఆదర్శంగా తీసుకున్నామని అన్నారు.
తండ్రిని మించిన తనయుడు శివరామ్: రాజకుమారి
తండ్రి ఆశయాలను ఆచరణలోకి తీసుకువస్తూ నియోజకవర్గ ప్రజలకు చేదోడుగావుంటూ తండ్రిని మించిన తనయుడిగా కోడెల శివరామ్ పేరుతెచ్చుకుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలను గమనించుకుంటూ వుండాల్సిన రోజులు వచ్చాయని అన్నారు.
న్యాయవ్యవస్థలను బ్లాక్‌మెయిల్ చేస్తున్న జగన్: వర్ల
వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవ్యవస్థలను సైతం బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, కోర్టు అనుమతులు లేకుండా పాదయాత్ర ప్రకటించడం బ్లాక్‌మెయిల్ చేయడమేనని విమర్శించారు. సత్తెనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆదర్శవంతమైన కార్యక్రమాలు పెద్దాయన కోడెల ఒక్కరికే సాధ్యమని అన్నారు.

పుట్టగొడుగుల్లా ఫాస్ట్ఫుడ్ సెంటర్లు!

చేబ్రోలు, అక్టోబర్ 22: గుంటూరు అర్బన్ పరిధిలోని చేబ్రోలు మండలంలో రెస్టారెంట్‌లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, న్యూడిల్స్, బిర్యానీ పాయింట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీధివీధినా బిర్యానీ పాయింట్లు వెలుస్తున్నాయి. మండలంలో ప్రధానంగా నారాకోడూరు, వడ్లమూడి అడ్డరోడ్డు, వేజండ్ల అడ్డరోడ్డు, చేబ్రోలు ప్రాంతాల్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు తామరతంపరగా ఏర్పాటు చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రం దగ్గరగా ఉండటంతో పాటు చేబ్రోలు ప్రాంతం లో ఇంజనీరింగ్ కళాశాలలు, స్పిన్నింగ్ మిల్లులు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పెద్ద ఎత్తున ఇక్కడ తిష్టవేసి ఎలాంటి అనుమతులు లేకుండానే ఆహార పదార్థాల తయారీలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే తయారు చేసి విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో అయితే రోడ్లపైనే బిర్యానీ పాయిం ట్లు, న్యూడిల్స్ బండ్లు ఏర్పాటుచేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
నిబంధనల ప్రకారం హోటల్స్, బిర్యానీ పాయింట్లు, రెస్టారెంట్ల నిర్వహణకు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం సంబంధిత అధికారుల నుండి లైసెన్సు తీసుకోవాలి. అలాగే పనిచేసే సిబ్బందికి ఎలాంటి అంటువ్యాధులు లేవని డాక్టర్లు నిర్ధారించి ఇచ్చిన మెడికల్ సర్ట్ఫికెట్‌లు ఉండాలి. అయితే ఇలాంటి నిబంధనలేవీ వ్యాపారులు పాటించడం లేదు. నాణ్యతలేని నూనెలు, రా మెటీరియల్స్ వాడటం వలన ఇవి తిన్న ప్రజలు గ్యాస్‌ట్రబుల్స్, బిపి, సుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో పాటు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అమరావతిలో క్రీడలకు మహర్దశ

*ఎంపి గల్లా జయదేవ్

గుంటూరు (స్పోర్ట్స్), అక్టోబర్ 22: నవ్యాంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో రాబోయే రోజుల్లో 100 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ అన్నారు. స్థానిక ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ 2020లో విశాఖపట్నంలో ఆసియా బీచ్ గేమ్స్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్రంలోని క్రీడాసంఘాలకు కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. క్రీడల అభివృద్ధికి క్రీడా శిక్షకులను భర్తీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన ఒలంపిక్ సంఘ సర్వసభ్య సమావేశంలో రాష్ట్రంలోని ఒలంపిక్ సంఘ సభ్యులు వివిధ క్రీడాసమాఖ్యల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని రాష్ట్రంలో క్రీడలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. గతంలో క్రీడాసంఘాల మధ్య జరిగిన వివిధ సంఘటనలను చర్చించి, రాబోయే రోజుల్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా నియమ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒలంపిక్ సంఘ కార్యదర్శి పురుషోత్తం, రాష్ట్ర షటిల్ బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి పున్నయ్యచౌదరి, వివిధ సంఘాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రౌడీషీటర్ దారుణహత్య

తెనాలి, అక్టోబర్ 22: తెనాలిలో రౌడీషీటర్ మర్రి శ్రీనివాసరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారణంగా హత్యచేసి రైల్వేస్టేషన్ సమీపంలోని పొదల్లో పడవేశారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన మర్రి శ్రీనివాసరెడ్డి(32) ఇటీవల తన స్నేహితులైన అదే కాలనీకి చెందిన సురేష్, గంగానమ్మపేటకు చెందిన నరేంద్రతో గొడవలు పడ్డాడు. అదే రోజు తాను నివాసముంటున్న గృహ యజమానితోనూ వాదనలకు దిగాడు. ఈక్రమంలో అనారోగ్యంతో స్థానిక తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. అయితే శనివారం రాత్రి నుండి అతడు కనిపించక పోవటంతో బంధువులు వెతుకులాట ప్రారంభించారు. ఈక్రమంలో తెనాలి రైల్వేస్టేషన్ సమీపంలోని 5వ ప్లాట్‌ఫారమ్‌కు అవతలి ప్రక్క ముళ్ళపొదల్లో ఓ యువకుని మృతిదేహం పడివుందని ఆదివారం సాయంత్రం పట్టణంలో వార్తలు రావటంతో వారు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు శ్రీనివాసరెడ్డిగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పీ స్నేహిత, 3వ పట్టణ సిఐ అశోక్‌కుమార్, 2వ పట్టణ ఎస్‌ఐ క్రాంతికుమార్‌లు తమ సిబ్బందితో హత్యజరిగిన ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. శ్రీనివాసరెడ్డి తలకు తీవ్రగాయాలు కావడాన్ని గుర్తించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమ్తితం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే గతంలో మృతుడు శ్రీనివాసరెడ్డి ఓహత్యాయత్నం కేసులో జైలు జీవితం అనుభవించాడని, బయటకు వచ్చిన నాటి నుండి జులాయిగా జీవనం సాగిస్తున్నట్లు ప్రాధమిక విచారణలో తెలిందని పోలీసులు తెలిపారు. అయితే మృతుని బంధువులు మాత్రం శ్రీనివాసరెడ్డికి సన్నిహితులైన సురేష్, నాగేంద్రలే ఈహత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తించేసినట్లు పోలీసులు వివరించారు. మృతుని బంధువులు ఫిర్యాదు ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అశోక్‌కుమార్ తెలిపారు.

ఆలోచింపజేసిన ‘గుప్పెడంత గుండె’లో

*పద్మశ్రీ ఆళ్ల గోపాలకృష్ణకు అపూర్వ సత్కారం

గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 22: ‘త్యాగానికే త్యాగమూర్తివమ్మా, నీ త్యాగమే నిజమైన అమృతత్వమమ్మా అనే గీతాల నడుమ అభినయ ఆర్ట్స్ గుంటూరు కళాకారులు ఆయా పాత్రలకు జీవం పోస్తూ నటించి మెప్పించిన ‘గుప్పెడంత గుండెలో’ సాంఘిక నాటకం దానాలన్నింటి కన్నా అవయవదానమే మిన్న అన్న సత్యాన్ని ప్రస్పుటంగా చాటిచెప్పింది. ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలచి, మనదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హృద్రోగ నిపుణుల్లో మన తెలుగువాడైన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆ మాత్రం తీసిపోడన్న వాస్తవాన్ని ప్రపంచానికి మరొక్క పర్యాయం గుర్తుచేస్తూ ఆదివారం రాత్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర వేదికపై ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనసన్మానం అపూర్వంగా జరిగింది. సత్కార సంరంభానికి ముందు ప్రముఖ నాటక రచయిత శిష్ట్లా చంద్రశేఖర్ రచించిన గుప్పెడంత గుండెలో నాటకాన్ని అభినయ ఆర్ట్స్ నటీనటులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కళాకారుల నటనాకౌశలానికి ఈ నాటకం అద్దంపట్టింది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన లారీ డ్రైవర్ తన కుమార్తెను పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళ్లి పరీక్ష రాయించి తిరిగి ఇంటికి చేరవలసి ఉంది. తన కూతురికి కొత్తబట్టలు కొని తిరిగి వస్తున్న సమయంలో ఆకస్మికంగా స్కూటర్‌కు యాక్సిడెంట్ కావడం, ఆ ప్రమాదంలో అతను మరణించడం, బ్రెయిన్‌డెడ్ కావడం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఈ వేదనను తట్టుకోలేని భార్య, కుమార్తె శోకసముద్రంలో మునిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా అతన్ని కాపాడలేకపోయారు. ప్రాణశక్తిని ప్రసాదించేది గుండె అని గోపాలకృష్ణ గోఖలే పాత్రలో నటించిన డాక్టర్ ఆ తల్లీ, కుమార్తెను ఓదార్చి, అతను మరణించినా అవయవదానం చేసినట్లయితే అనేక మందికి ప్రాణదానం చేసినవాడవుతాడని వారికి విజ్ఞప్తి చేయడంతో దానికి సమ్మతించారు. మృతుని శరీరం నుండి గుండెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించడం, వేరే పేషెంట్‌కి అమర్చడం, ఈ సన్నివేశాలన్నీ కూడా యధాతధంగా స్క్రీన్‌పై చూపించారు. ఆనాడు డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలోని బృందం గుండె మార్పిడి చికిత్సను చేసి, వైద్య చరిత్రలో గుంటూరు వైద్యులు ఏ మాత్రం తక్కువకాదని నిరూపించడం తదితర అంశాలన్నీ కూడా కళ్లకు కట్టేలా ఆపరేషన్ దృశ్యాలను ప్రత్యేక స్క్రీన్‌పై చూపించారు. ఈ దృశ్యాలను తిలకించిన ప్రతి ప్రేక్షకుడు కంటనీరు కారుస్తూనే వైద్యులు సాధించిన ఘనతను జ్ఞప్తి చేసుకుంటూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేయడంతో గుప్పెడంత గుండెలో నాటకం ముగిసింది. అనంతరం జరిగిన సభలో సీనియర్ ఐఎఎస్ అధికారి కాంతిలాల్ దండే, డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు, భాష్యం రామకృష్ణ, చుక్కపల్లి రమేష్, గోరంట్ల పున్నయ్య చౌదరి, డాక్టర్ డిఎస్ రాజునాయుడు, డాక్టర్ జి సుబ్బారావు, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు, షేక్ లాల్‌వజీర్, వ్యాపారవేత్తలు దాసరి శేషగిరిరావు, కందిమళ్ల శ్రీనివాసరావు, నన్నపనేని రాఘవరావు, వంకాయలపాటి బలరామకృష్ణయ్య, ప్రకాశరావు, ఆహ్వాన కమిటీ పక్షాన సామినేని కోటేశ్వరరావు, వారుపల్లి నాగేశ్వరరావు, సిహెచ్ మస్తానయ్య తదితరులు గోఖలే దంపతులను అపూర్వంగా సత్కరించారు. ప్రతి ఒక్కరూ అవయవదానం కోసం పాటుపడాలని డాక్టర్ గోఖలే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తాను నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ విజ్ఞాన మందిర వేదికపై స్మరించుకుని ధన్యవాదాలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో భాగంగా అభినయ ఆర్ట్స్ కళాకారులు, రచయిత శేఖర్, దర్శకుడు ఎన్ రవీంద్రరెడ్డి, నిర్వాహకుడు వాల్మీకిలను కూడా ఆహ్వాన కమిటీ ఘనంగా సత్కరించింది. ప్రస్తుతం నరసాపురం పర్యటనలో ఉన్న పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కోన శశిధర్ డాక్టర్ గోఖలే సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలు పంపారు.

ఆటవిడుపుతోనే ఆహ్లాదం

గుంటూరు, అక్టోబర్ 22: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం స్థానిక ఎన్‌టి ఆర్ స్టేడియంలో నగరపాలక సంస్థ, పెస్ట్ సమాచార్, రాష్ట్ర భాషా సాంస్కృతిక విభాగం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆనంద లహరి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌లు ఎం ఏసుదాసు, డి శ్రీనివాసరావు తెలిపారు. ఆటవిడుపుతోనే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోందని వారు పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా స్థానికంగా ఉన్న బాలబాలికల్లోని సృజనాత్మకత, కళాప్రావీణ్యతను గుర్తించే అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వహ్వా అనిపించిన వనసమారాధన

సత్తెనపల్లి, అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనతో ఆదివారం సత్తెనపల్లి జన సంద్రంగా మారింది. సుమారు 20వేల మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా హాజరై వన సపమారాధనను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా అలరించాయ. సుమారు 30కి పైగా వివిధ కళా ప్రదర్శనలతో కళాకారులను సైతం అబ్బురపరచారనడంలో అతిశయోక్తిలేదు. పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఫ్లెక్సీలతో నిండిపోయింది. డివైడర్‌పై ఏర్పాటు చేసిన పార్టీ జెండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పండుగ వాతావరణాన్ని తలపించింది. స్పీకర్ కార్యాలయం నుండి అట్టహాసంగా జరిగిన బైక్‌ర్యాలీ, డిజె సౌండ్ బాక్సులు ముందువరసలో కదులుతుంటే స్పీకర్ కోడెల, మంత్రులతోవున్న వాహనానికి ఘన స్వాగతం పలుకుతూ కోడెల తనయుడు కోడెల శివరామ్ కార్యకర్తలు, టిడిపి నాయకులతో పాదయాత్రగా కార్తీక వనసమారాధన ప్రాంగణానికి చేరుకోవడం చూపరులను విశేషంగా ఆకర్షించింది. అనంతరం భోజన కార్యక్రమాన్ని స్పీకర్ కోడెల ప్రారంభించారు. సుమారు 50 స్టాల్స్‌ను ఏర్పాటుచేసి భోజనాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. పల్లెల నుండి ప్రజలు తండోప తండాలుగా కదలిరావడం కనిపించింది. సాయంత్రవరకు భోజన కార్యక్రమం కొనసాగింది. ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి నాయకులు, కార్యకర్తలకు, పురప్రజలకు కోడెల శివరామ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

లలితరాగరంజితం ‘మహతీ’ కళాకారుల గానం

గుంటూరు (కల్చరల్), అక్టోబర్ 22: ‘సలలిత రాగ సుధారసగానం, సర్వకళామయ నాట్య విహారం’తో పాటు అనేక సంప్రదాయ, భక్తి, దేశభక్తి, లలిత గీతాలను రెండున్నర గంటల పాటు ఒక్కక్షణం విరామం ఇవ్వకుండా ఆలపించిన మహతీ కళాకారులు సమర్పించిన అలనాటి సినీ, భక్తి, దేశభక్తి సౌరభాల కార్యక్రమం లలిత రాగ రంజితమైంది. ఆదివారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై గుంటూరు గానకోకిల పత్రి నిర్మల స్వీయ పర్యవేక్షణలో సీనియర్ గాయనీ గాయకులు సిహెచ్ రాజ్యలక్ష్మి పి లాలిత్య, డాక్టర్ జి కుసుమ గాయత్రి, ఎస్ సుఖి, సిహెచ్ స్టాలిన్‌బాబు, ఎస్‌కె రసూల్‌బాబు, కెజె ఉపేంద్రసింగ్, వీరయ్యలు బాక్సాఫీసు వద్ద అనేక దశాబ్దాల పాటు విజయపరంపర కొనసాగించిన హిట్ చిత్రాల్లోని గీతాలను ఆ బాణీలకు అర్ధం చెడకుండా, అదే రాగాలతో తమ కోయిలలాంటి కంఠ స్వరాలను మేళవించి మధురంగా ఆలపించారు. లలిత కళాభిమానుల మన్ననలు కూడా చూరగొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన చిట్టా ముకుందరామశాస్ర్తీ, భారతీదేవి దంపతులు శ్రీరామకృష్ణ హిందూ ఉన్నత పాఠశాలల కమిటీ కరస్పాండెంట్ (అమరావతి) మల్లెల శ్రీనాథ్‌చౌదరి, వెంకన్న ఆలయ సభ్యుడు పి ప్రభాకరరావు స్వరసుధ వ్యవస్థాపించిన నాటి నుండి చేస్తున్న కళారాగ సేవను ప్రశంసించి తమ సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కీబోర్డుపై కె రవి, ప్యాడ్స్‌తో కె చంద్ర, పి బాలాజీ, ఎస్ వెంకట్ తబలతోనూ, ఎం వ్యాస్‌కుమార్ ధ్వని సహకారాన్ని అందించి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. డి గోపాల్ సందర్భ సహిత వ్యాఖ్యానాన్ని అందించగా స్వరసుధ కార్యనిర్వాహక కార్యదర్శి కె మదన్మోహనరావు గాన లహరిని పర్యవేక్షించారు.

మైనార్టీల అభివృద్ధికి బాబు చేసింది శూన్యం

గుంటూరు, అక్టోబర్ 22: రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బాబు సర్కార్, వారి అభివృద్ధికి చేసింది శూన్యమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఆదివారం 18వ డివిజన్ నల్లచెరువులో అధ్యక్షుడు షేక్ ఖాజా మొహిద్దిన్ ఖాన్ నేతృత్వంలో నాయకులు సయ్యద్ బుజ్జి, ఎస్‌కె సుభాని తదితరులు వైసిపిలో చేరారు. వారికి అప్పిరెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అప్పిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీల అభివృద్ధికి 4 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు. మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న వైసిపికి మైనార్టీలు అండగా నిలవాలని, చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసరాజు, బాలరాజు, గౌస్, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.