గుంటూరు

మద్యం మత్తులో ఎస్సై వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, నవంబర్ 20: పర్యాటక కేంద్రమైన అనుపులో ఓ ఎస్సై మద్యం సేవించి పర్యాటకులపై దౌర్జన్యం చేసి పోలీసులపై దురుసుగా ప్రవర్తించగా, కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంఘటన విజయపురిసౌత్‌లో చోటు చేసుకుంది. వివరాలలోకెళ్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్‌లోని కొమరోలు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న జి.ప్రభాకరరెడ్డి, అతని స్నేహితులు వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కె నాగూర్, అహ్మద్‌లు ఆదివారం రాత్రి నాగార్జునసాగర్ లోని అనుపు ప్రాంతానికి వచ్చారు. అక్కడ స్నేహితులతో ఎస్సై మద్యం సేవించి పర్యాటకులపై దౌర్జన్యం చేసి హల్‌చల్ సృష్టించాడు. ఈ విషయాన్ని పర్యాటకులు విజయపురిసౌత్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు పోలీసులు అనుపుకు చేరుకొని ఏమిటీ గోల అని ప్రశ్నించగా నేను ఎస్సైను, మీరెవరు నన్ను ప్రశ్నించటానికి అని పోలీసులతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడి రహదారికి అడ్డంగా కారును ఆపి గొడవకు దిగాడు. ఎట్టకేలకు ఎస్సై ప్రభాకరరెడ్డి, మరో ముగ్గురిని విజయపురిసౌత్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి హెడ్ కానిస్టేబుల్ బాబురావు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఎస్సై ప్రభాకరరెడ్డిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చి మద్యం తాగాడా లేదా అని వైద్యపరీక్షలు నిర్వహించారు. రూరల్ సి ఐ దిలీప్‌కుమార్ వైద్యశాలకు చేరుకొని సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఎస్సై ప్రభాకరరెడ్డి కారంపూడి తిరునాళ్లకు వచ్చి పర్యాటక కేంద్రమైన అనుపుకు వచ్చినట్లు సమాచారం.

రెండు కోట్లు ఇవ్వకపోతే నీ కుమారుడిని కిడ్నాప్ చేస్తా...
* బెదిరింపులకు పాల్పడిన యువకుని అరెస్ట్
నరసరావుపేట, నవంబర్ 20: రెండు కోట్లు రూపాయలు ఇవ్వాలని, లేకపోతే నీ కుమారుడిని కిడ్నాప్ చేస్తానని బెదిరింపు లేఖలు రాసి, వ్యాపారవేత్తను భయబ్రాంతులకు గురిచేసిన యువకుడిని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని మానికల బావి వీధిలో పెయింట్స్ వ్యాపారి కోటా లక్ష్మీనారాయణ ఇంట్లో గత 15రోజుల వ్యవధిలో మూడు లేఖలు ఇంట్లోకి పడవేశారు. ఈ లేఖలు అదే ప్రాంతానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు బింగి సాయి భరత్ పడవేశాడు. తనకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే లక్ష్మీనారాయణ చిన్న కుమారుడిని కిడ్నాప్ చేసి, చంపేస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి చందు ఫాస్ట్ఫుడ్ సెంటర్‌కు ఎదురుగా ఉన్న ఇసుక కుప్పలో రెండు కోట్లు పెట్టి వెనుకకు తిరగకుండా వెళ్ళిపోవాలని ఆ లేఖలో రాశాడు. దీంతో భయభ్రాంతులకు గురైన లక్ష్మీనారాయణ డీఎస్పీని ఆశ్రయించగా , ఆయన టూటౌన్ సిఐ సురేంద్రబాబు, ఎస్‌ఐ సీహెచ్ లోకనాథం, వారి సిబ్బందితో ఒక పథకం ప్రకారం ఆదివారం రాత్రి చీకటిలో కాపు కాశారు. లక్ష్మీనారాయణకు న్యూస్ పేపర్లు నింపిన బ్యాగ్‌ను అప్పగించి ఇసుక కుప్ప వద్ద పెట్టి ఇంటికి వెళ్లిపోవాలని పోలీసుల సూచనతో లక్ష్మీనారాయణ అలాగే చేశాడు. కొంత సేపటి తర్వాత డబ్బుకోసం వచ్చిన యువకుడిని సిఐ పట్టుకున్నారు. లక్ష్మీనారాయణ మెడికల్ ఏజన్సీలో గుమస్తాగా పని చేస్తున్నట్లు వివరించాడు. లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళి తన పిల్లలతో తరచూ ఆడుకుంటూ ఉండేవాడినని, లక్ష్మీనారాయణ వద్ద డబ్బులు చాలా ఉన్నాయని గుర్తించానని, బెదిరిస్తే ఒక్కసారిగా డబ్బులు వస్తాయని, తానే పథకం పన్ని ఈ చర్యలు పాల్పడ్డానని సాయిభరత్ తెలిపాడు. ఇంకా ముద్దాయి జేబులో మరో నాలుగు బెదిరింపు లేఖలు ఉన్నాయని డీఎస్పీ వివరించారు. సమావేశంలో టూటౌన్ సీఐ సురేంద్రబాబు, ఎస్‌ఐ లోకనాథం, సిబ్బంది పాల్గొన్నారు.