గుంటూరు

మహిళలపై అరాచకాలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 25: తెలుగుదేశం పార్టీకి ఓటేసిన పాపానికి మహిళలు తీవ్ర మనోవేదనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నేరుగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన వివాహితపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బుధవారం వాసిరెడ్డి పద్మ, ఇతర మహిళా నేతలు పరామర్శించారు. అనంతరం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు నిరసనగా జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, నిందితులను తక్షణమే అరెస్ట్‌చేయాలని కోరారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా తనకే రక్షణలేదని, ప్రజలే రక్షణ కల్పించాలని అడిగితే ఇక మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళలను కాపాడలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదుగురు ప్రజాప్రతినిధులు, మహిళలపై దాడులకు పాల్పడినట్లు రుజువులు ఉంటే కనీసం వారిపై చర్య తీసుకునే దమ్ము లేదని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే మహిళాలోకం తిరగబడేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కనీసం బాధితులను పరామర్శించాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం నాయకులకు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడును కలిసి బాధితురాలికి అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి, విజయలక్ష్మి, గంటా మరియమ్మ, శారద, స్వప్న, ప్రమీల, భవానీజ్యోతి, భాను తదితరులు పాల్గొన్నారు.