గుంటూరు

ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితాయే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 11: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైంది ఓటర్ల జాబితాయేనని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇఆర్‌ఒ, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేష్ బి లత్కర్, పశ్చిమ నియోజకవర్గ ఇఆర్‌ఒ, అదనపు కమిషనర్ కె రామచంద్రారెడ్డితో కలిసి బూత్ లెవల్ అధికారులు, ఏజంట్లతో సమన్వయ సమావేశం స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 01-01-2018 వరకు నమోదైన ఓటర్ల జాబితాను ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రచురించడం జరిగిందన్నారు. సంబంధిత జాబితాలో నూతన ఓటర్లు, తొలగింపులు, మార్పులు, చేర్పులకు ఫారం-6, 6ఎ, 7,8,8ఎల అర్జీలను బిఎల్‌ఒలు పరిశీలించి ఎఇఆర్‌ఒల ద్వారా ఇఆర్‌ఒలకు పంపుతున్నారని చెప్పారు. జనవరి 2019న ఓటర్ల తుదిజాబితా ప్రచురితమవుతుందని చెప్పారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూరె్తైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల వారు ఓటర్ల జాబితా పరిశీలన కోసం గతంలో అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించి చెప్పినప్పటికీ బూత్ లెవల్ ఏజంట్లను ఇప్పటికీ ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో ఆయా పార్టీల అధ్యక్షుల లిఖితపూర్వక ఆమోదంతో వార్డుల వారీ బూత్ లెవల్ ఏజంట్లను ఎంపిక చేసి వివరాలను ఇఆర్‌ఒలకు అందజేయాలన్నారు. బూత్ లెవల్ ఏజంట్లు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలోని ఓట్లు ఉన్నదీ, లేనిదీ తనిఖీచేసి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. ఓటు హక్కు కల్గిన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు వీలుగా ఎన్నికల సంఘం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎన్‌విఎస్‌పి.ఏపి.జిఒవి.ఇన్‌లో పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవల్ అధికారులు పోలింగ్‌బూత్‌లలో అందుబాటులో ఉంటారని ఓటర్ల జాబితాలో తమ ఓటు ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకోవాలని, లేనిపక్షంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓట్లను సుమోటోగా తొలగించే హక్కు ఎవరికీ లేదని, కేవలం డెత్ సర్ట్ఫికెట్, ఫారం-7 ఆధారంగానే ఇది జరుగుతుందన్నారు. ఎన్నికల సంఘం జిల్లాలో మొత్తమీద అనుమానాస్పద ఓట్లు 2 లక్షలు ఉన్నట్లుగా గుర్తించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని బిఎల్‌ఒలు పరిశీలిస్తున్నారని, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజంట్లు కూడా బిఎల్‌ఒలతో కలిసి పరిశీలిస్తే ఓటరు జాబితాలు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. సర్వేల ద్వారా ఎటువంటి ఓట్ల తొలగింపు జరగదని, అపోహలను నమ్మవద్దన్నారు. డోర్ నెంబర్ లేని గృహాలకు ఓటు హక్కు కల్పించేందుకు తాత్కాలిక నెంబర్లను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో తమ ఓటును పరిశీలించుకునేందుకు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నామని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిఆర్‌ఒ శ్రీలత, ఎఇఆర్‌ఒలు చక్రపాణి, ఎం ఏసుదాసు, డిసిపి సత్యనారాయణ, తహశీల్దార్ నాగిరెడ్డి, ఎలక్షన్ డిటిలు రమేష్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఎన్నికలు బాబుకో గుణపాఠం
* వైసీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు అప్పిరెడ్డి
గుంటూరు, డిసెంబర్ 11: డబ్బుతోనే రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఎన్నికలు ఒక గుణపాఠం అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. రాజకీయ స్వార్థంతో చంద్రబాబు మహాకూటమితో కలిసిపోటీచేసినా ఫలితం లేదని అన్నారు. మంగళవారం పట్ట్భాపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడారు. రాజకీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చంద్రబాబు చూశారని, ప్రజలు వాస్తవాలను గమనించి ఓటు ద్వారా తగిన బుద్ధిచెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 600కు పైగా హామీలు ఇచ్చి వాటిని పరిష్కరించకుండా పక్క రాష్ట్రానికి వెళ్లి శ్రీరంగ నీతులు చెప్పడం ఆ ప్రాంత ప్రజలు పసిగట్టి తరిమివేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పే ఏపీలో కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, మాజీ కార్పొరేటర్ బత్తులదేవా, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి, పల్లపు మహేష్‌బాబు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బుజ్జితో పాటు వాసిరెడ్డి విజయమాధవి, జగన్ కోటి, బందా రవీంద్రనాద్, గురవయ్య, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీలకు దీటుగా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం
* కేసన శంకరరావు
గుంటూరు (పట్నంబజారు), డిసెంబర్ 11: రాజకీయ పార్టీకు దీటుగా బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు స్పష్టంచేశారు. మంగళవారం స్థానిక చుట్టుగుంటలోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం అర్బన్ ఉపాధ్యక్షుడుగా ఉప్పతళ్ల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా మారం కిషోర్, అధికార ప్రతినిధిగా దాసరి రమేష్‌లను నియమించారు. ఈ సందర్భంగా వారికి నియామకపత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశానికి సంఘ జిల్లా అధ్యక్షుడు కన్న మాస్టారు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేసన శంకరరావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలపై రాజకీయ పార్టీలు వివక్ష చూపుతున్నాయన్నారు. 139 సామాజికవర్గాలు బీసీల్లో ఉన్నాయని, స్వతంత్ర భారతావనిలో బీసీలు పల్లకీ మోసే బోయలుగా ఉన్నారే తప్ప వారి సంక్షేమం పట్ల పాలకప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధ్యక్షుడు కన్న మాస్టారు, బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ మాట్లాడుతూ సామాజికన్యాయాన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉపయోగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సంఘ బలోపేతానికి గట్టి చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో అర్బన్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాదినేడి వంశీకృష్ణ, యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరశా రంగనాథ్‌తో పాటు కోలా మణికంఠ, తన్నీరు ఆంజనేయులు, పావులూరి హనుమంతరావు, బత్తుల శంకరరావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

వాలీబాల్ టోర్నీ విజేత చీరాల ఇంజనీరింగ్ కళాశాల

నరసరావుపేట, డిసెంబర్ 11: స్థానిక ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల జెఎన్‌టీయూకే పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు నిర్వహిస్తున్న దాదా సాహెబ్ వాలీబాల్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో చీరాల ఇంజనీరింగ్ కళాశాల, తిరుమల ఇంజనీరింగ్ కళాశాల తలపడగా, చీరాల ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించి, రన్నర్స్‌గా నిలిచారు. అనంతరం తిరుమల ఇంజనీరింగ్ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ జీపీ రాజు మాట్లాడుతూ దాదాసాహెబ్ మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొన్న వివిధ కళాశాలల జట్లకు అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్స్‌లో గెలిచిన విన్నర్స్‌కు ఐదువేల రూపాయలు, రన్నర్స్‌కు మూడు వేల రూపాయలను అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మీరావలి, సెక్రటరీ కరీం మొహిద్దీన్, ఎండీ మస్తాన్ షరీఫ్, వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ ఖాసిం, పీడీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడారంగాభివృద్ధికి కృషి
పెదనందిపాడు, డిసెంబర్ 11: రాష్ట్రంలో క్రీడారంగాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మచౌదరి తెలిపారు. అండర్-14,17,19 సీఎం కప్ ఆటల పోటీల నిర్వహణ నిమిత్తం 12 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. క్రీడాంధ్రప్రదేశ్ రూపకల్పనకు అనుగుణంగా వివిధ రకాల ఆటల అభివృద్ధికి నిర్ధిష్ట ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. పెదనందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. రాష్టస్థ్రాయిలో జరిగే వివిధ రకాల ఆటల పోటీలకు 5 కోట్ల రూపాయలు యూనివర్శిటీ స్థాయిలో 20 లక్షలు, 30 ఆటలకు సంబంధించి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం శిబిరాల నిర్వహణకు 30 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అండర్-14,17,19 స్థాయి విభాగాల్లో రాష్టవ్య్రాప్తంగా 10 లక్షల మంది ఆటగాళ్లు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. వీరికి దశలవారీగా పోటీలు నిర్వహిస్తూ రాష్టస్థ్రాయి జట్టుకు అత్యుత్తమ క్రీడాకారులకు అందించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. పెదనందిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియంకు ఈనెల చివర్లో టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. ప్రతిభ గల క్రీడాకారులకు అపారమైన ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయన్నారు. హైస్కూల్ ఆవరణలో బేస్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్లను ప్రోత్సహించే నిమిత్తం కొద్దిసేపు వారిని ప్రోత్సహిస్తూ బేస్‌బాల్ ఆడారు. ఇటీవల జరిగిన అండర్-19 కబడ్డీ పోటీల నిర్వహణకు సహకరించి విజయవంతం చేసిన దాతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హెచ్‌ఎం సుబ్బమ్మ, విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు రావి శివరామకృష్ణయ్య, అశోక హైస్కూల్ డైరెక్టర్ పి లక్ష్మీనారాయణ, నిమ్మగడ గోపి తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో అగ్రి బాధితుడు మృతి
పొన్నూరు, డిసెంబర్ 11: పొన్నూరుకు చెందిన కాటూరి మోహనరావు (64) అగ్రిగోల్డ్ బాధితుడుగా కొంతకాలం ఆసుపత్రిలో చేరి గుండెపోటుకు గురై మంగళవారం మృతిచెందారు. అగ్రిగోల్డ్ ఏజంటుగా ప్రజల చేత డబ్బులు కట్టించిన ఆయన కంపెనీకి సొమ్మును జమచేశారు. కంపెనీ మోసం చేసి మూతవేసిన దగ్గర నుండి బాధితుల నుండి ఒత్తిడి పెరగడంతో మోహనరావు కొంతమందికి సొంత డబ్బు చెల్లించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరక పోవడంతో మరింత ఒత్తిడి పెరిగి ఆరోగ్యం దెబ్బతిన్న మోహనరావు మంగళవారం ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతినికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

రాష్టస్థ్రాయి డిస్కస్‌త్రోలో
వేల్పూరు జెడ్పీఎస్ క్రీడాకారిణి ప్రతిభ
అచ్యంపేట, డిసెంబర్ 11: రాష్టస్థ్రాయి డిస్కస్‌త్రో పోటీల్లో తమ పాఠశాల క్రీడాకారిణి రాష్టస్థ్రాయిలో 4వ స్థానంలో నిలిచి పతిభ కనబర్చిందని జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈనెల 3 నుండి 6 వరకు క్రోసూరు జెడ్పీలో జరిగిన బాలికల సెంట్రల్ జోనల్ ఆటల పోటీల్లో సీనియర్ విభాగంలో బి గాయత్రి, ప్రథమస్థానం సాధించిందన్నారు. అలాగే సీఎం కప్ ఆటల పోటీల్లో జిల్లా స్థాయి పోటీలు అండర్-14 విభాగం డిస్కస్‌త్రోలో ప్రథమస్థానం సాధించి కడప జిల్లా పొద్దుటూరులో ఈనెల 8,9 తేదీల్లో జరిగిన పోటీల్లో పాల్గొందని, ఈ పోటీల్లో 4వ స్థానం సాధించిందని చెప్పారు. క్రీడాకారిణికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పీడీ రాజేశ్వరి, క్రీడాకారిణి గాయత్రిని పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయులు రాంబాబు, జ్యోతిరెడ్డి, సత్యవతి తదితరులు అభినందించారు.

కరాటేలో సత్తెనపల్లి విద్యార్థులకు పతకాల పంట
సత్తెనపల్లి, డిసెంబర్ 11: ఈ నెల 9వ తేదీన ఒంగోలులో జరిగిన మావాతికా షిటోరియో స్టేట్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో సత్తెనపల్లి విద్యార్థులు వ్యక్తిగత, కటా, కుమితే విభాగాలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. అంతేకాకుండా స్టేట్ ఓపెన్ గ్రాండ్ చాంపియన్ షిప్, కటా, కుమితే విభాగాలలో సైతం స్టేట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తెనపల్లి పేరును రాష్ట్ర నలుమూలలా చాటారు. టివి కార్తీక్‌రెడ్డి, ఎం షణ్ముఖ, వివి సిద్దివినయ్, కె ఎస్ సంపత్, ఎస్ కిరణ్, వి ప్రేమ్‌కుమార్, కె ఇమ్మానియేల్, కె అజయ్‌పాండులు వ్యక్తి కటా విభాగంలో గోల్‌డమెడల్స్‌ను సాధించారు. కె ప్రసన్నకుమార్, ఎస్ పల్లవి, టి నిఖిత, టివి ఎస్ ఎం తేజ, పి చంద్రఅఖిల్, ఎస్ ప్రణవ్‌లు వ్యక్తి కటా విభాగంలో సిల్వర్ మెడల్స్‌ను సాధించారు. అదేవిధంగా ఎవి ఎల్ బాలాజి, ఎస్ ఈశ్వర్, యు నాగసుమంత్, కె శివసందీప్, సిహెచ్ నాగఅవినాష్, సి హెచ్ రఘురామ్, కె జశ్వరంత్‌లు వ్యక్తి కటా విభాగంలో బ్రాంజిమెడల్స్ సాధించారని శిక్షకులు అనుముల రామయ్య విలేఖర్లకు తెలిపారు. వ్యక్తిగత కుమితే విభాగంలో ఎస్ పల్లవి, ఎవి ఎల్ బాలాజీలు గోల్డ్‌మెడల్‌ను సాధించగా కె నాగమల్లేశ్వరరావు, సిల్వర్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడని, ఎస్ విఘ్నేష్, డిఎస్ కిరణ్ బ్రాంజ్‌మెడల్స్‌ను సాధించారని వివరించారు. మంగళవారం సత్తెనపల్లి షిటోరియో కరాటే స్కూల్‌కు చెందిన సెన్‌సాయ్ అనుముల రాంబాబు, మాస్టర్ అనుముల రామయ్య విద్యార్థులను అభినందించారు.

ఓట్ల గల్లంతుపై అపోహలొద్దు: జేసీ
మంగళగిరి, డిసెంబర్ 11: ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు గల్లంతుపై అపోహలు వద్దని, అర్హులైన వారి ఓట్లన్నీ జాబితాలో చోటు చేసుకుంటాయని, స్థానికంగా నివాసం ఉంటూ జాబితాలో ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి అర్హులైతే జాబితాలో పేర్లు చేరుస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ లెవల్ ఆఫీసర్, ఏజంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి నాగశివరావు అధ్యక్షత వహించారు. ఓట్ల జాబితాలో తొలగించాలన్నా, చేర్చాలన్నా ఎలక్ట్రోరోల్ రిజిస్ట్రేషన్ అధికారికి మాత్రమే అధికారం ఉంటుందని, ఇతరులెవరూ దీనిలో జోక్యం చేసుకోలేరని జాయింట్ కలెక్టర్ అన్నారు. నియోజకవర్గంలో 12 వేల ఓట్లను జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ పెండింగ్‌లో ఉంచడంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఓట్లలో 75 శాతం ఇప్పటికే జాబితాలో చేర్చడం జరిగిందని, మిగతా ఓట్లు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి విచారణ అనంతరం అర్హులైతే తిరిగి జాబితాలో చేరుస్తారని జేసీ అన్నారు. కొత్తగా ఫారం - 6 లో దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఒక పార్టీకి చెందిన ఓట్లు మరొక పార్టీ వారు తొలగించే సంస్కృతి ఎప్పుడూ లేదని, అపోహలొద్దని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. పట్టణంలోని సీకే హైస్కూల్‌లో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఏర్పాట చేయడం ద్వారా ఎన్నికల రోజు ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని, పరిశీలించాలని ఎఎంసి చైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్ అన్నారు. మంగళగిరి, తాడేపల్లి తహశీల్దార్లు వసంతబాబు, పద్మనాభుడు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు జగ్గారపు శ్రీనివాసరావు, మునగపాటి వెంకటేశ్వరరావు, వైసీపీ నేతలు మునగాల మల్లేశ్వరరావు, చిన్ని తిరుపతయ్య (సీపీఐ), జేవీ రాఘవులు (సీపీఎం), ఎంవీ మారుతీరావు (టీడీపీ) తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.

సంగం డెయిరీలో రైతులకు గేదెల పంపిణీ
చేబ్రోలు, డిసెంబర్ 11: వడ్లమూడి సంగం డెయిరీలో మంగళవారం మొర్రా జాతి సూడి గేదెలను రైతులకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పంపిణీ చేశారు. తుమ్మపూడి, నూతక్కి, దోనేపూడి, కూచిపూడి గ్రామాలకు చెందిన 24 మంది రైతులకు మొత్తం 23,31,776 రూపాయల విలువ గల 24 గేదెలను కామధేను పథకం కింద పంపిణీ చేశారు. ఈ గేదెలను హర్యానా రాష్ట్రం నుండి కొనుగోలు చేసి తెచ్చినట్లు ఎమ్మెల్యే నరేంద్రకుమార్ తెలిపారు. గుంటూరు రీజియన్ పరిధిలో గల ఎస్‌బిఐతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా 8.65 శాతం అతి తక్కువ వడ్డీతో సంగం డెయిరీ మూడు సంవత్సరాల కాలంలో ఏడాదికి 6 వేల చొప్పున మొత్తం 18 వేల రూపాయలను సబ్సిడీగా రైతులకు ఇస్తారన్నారు. ప్రతి రైతు తరపున మార్జిన్ మనీగా 20 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని, ఎస్‌బిఐ నుండి 70 వేల రూపాయలు రుణంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగం డెయిరీ ఎండి కె గోపీనాథ్, ఎస్‌బిఐ గుంటూరు రీజియన్ చీఫ్ మేనేజర్ వి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.