గుంటూరు

చేబ్రోలులో గొంతుదిగని మంచినీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, జూలై 17: ప్రజలను ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చిన గ్రామ పంచాయతీ పాలకవర్గం కనీసం ప్రజలకు శుద్ధమైన మంచినీటిని కూడా అందించలేక పోతోంది. కోట్లాది రూపాయలతో రక్షిత మంచినీటి పథకాలను నిర్మించినప్పటికీ అవి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడం లేదు. గ్రామ పంచాయతీ పాలకవర్గ బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామ ప్రజానీకానికి రక్షిత మంచినీరు మృగ్యమైంది. సుమారు 30 వేల మంది జనాభా కల్గిన చేబ్రోలు గ్రామంలో రెండు మంచినీటి చెరువులు ఉన్నాయి. 2006లో సుమారు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో కొమ్మమూరు కెనాల్ పక్కనే 21.53 ఎకరాల భీమేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూమిలో మంచినీటి చెరువును నిర్మించారు. అంతకుముందే గ్రామంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణం కల్గిన మరో చెరువు ఉంది. ఈ రెండు చెరువులు గ్రామ ప్రజానీకానికి స్వచ్ఛమైన మంచినీటిని అందించలేక పోతున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే ప్రతియేటా గ్రామంలో మంచినీటి సరఫరా దాదాపుగా నిలిచిపోతోంది. ఒకవేళ మంచినీరు పుష్కలంగా సరఫరా అవుతుంది అనుకుంటే ఆ నీరు తాగడానికి గొంతుదిగడం లేదని ప్రజానీకం దుమ్మెత్తి పోస్తున్నారు. మంచినీటిని క్లోరినేషన్ చేసి సరఫరాచేయాల్సిన అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా సరాసరి చెరువులో నుంచి పైపుల ద్వారా మంచినీటి కొళాయిలకు నీరు సరఫరా చేయడంతో పురుగులు వస్తున్నాయని ప్రజానీకం ఆరోపిస్తున్నారు. కొమ్మమూరు ఛానల్ పక్కనే ఉన్న పెద్ద చెరువు వద్ద ఆపరేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చెరువు వద్ద ఏర్పాటుచేసిన ఫిల్టర్‌బెడ్‌లు, సంప్‌లు పనిచేయడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా లక్షలాది రూపాయలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్ కూడా మూలనపడింది. దీంతో చేసేదేమీ లేక పంచాయతీ అధికారులు మంచినీటిని శుద్ధి చేయకుండానే సరఫరా చేస్తున్నారు. మంచినీటిలో పురుగులు వస్తుండటంతో ప్రజానీకం భయాందోళనకు గురవుతున్నారు. పంచాయతీ వారు సరఫరా చేస్తున్న మంచినీరు మింగుడు పడక పోవడంతో ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్లే దిక్కయ్యాయి. దీంతో పంచాయతీ వారు సరఫరా చేస్తున్న నీరు కేవలం గేదెలను కడుక్కోడానికి, ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగ పడుతున్నాయి. ఈ విషయం పంచాయతీ అధికారులకు, పాలకవర్గానికి తెలియదనుకుంటే పొరపాటే. కోట్లాది రూపాయల ఖర్చుతో రక్షిత మంచినీటి పథకాలు చేపడుతున్నప్పటికీ అవి ఉపయోగపడక పోవడం పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.