గుంటూరు

విలువల వారధి... విజయాల సారథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి, సెప్టెంబర్ 29: ‘మనిషిలోని దివ్యత్వాన్ని ఆవ్కిరించేదే నిజమైన విద్య’ అన్న స్వామి వివేకానంద ప్రబోధాన్ని నినాదంగా స్వీకరించి శ్రీకారం చుట్టుకున్న చదువుల కొలువు శ్రీ రామకృష్ణ విద్యాలయం. ఎక్కువగా నిరుపేదలు నివసించే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో శ్రీ రామకృష్ణ పరమహంస పేరుతో ప్రారంభమైన ఈ పాఠశాల ఐదు దశాబ్దాల క్రితం ఓ చిన్న పూరిపాకలో ఓనమాలు దిద్దుకుని నేడు పూర్తి స్థాయి భవనాలతో, సౌకర్యాలతో పరిఢవిల్లుతోంది. రామకృష్ణ సంఘం పదమూడవ సర్వాధ్యక్షులైన స్వామి రంగనాథానందజీ ఆశీస్సులతో, స్థానిక న్యాయవాది, సేవా తత్పరులు పెన్మత్స బాపిరాజు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ విద్యాలయానికి అంకురార్పణ చేశారు. ఆ సౌజన్యమూర్తి సంకల్పంతో 1965 జూలై ఒకటిన ముగ్గురు ఉపాధ్యాయులు, యాభై ఆరు మంది విద్యార్థులతో వసతి గృహ పాఠశాలగా ప్రారంభమై, ఎన్నో బాలారిష్టాలనూ ఎదుర్కొన్న ఆ జ్ఞానదీపం నేడు అఖండ జ్యోతియై అనంత కాంతులీనుతున్నది. దాదాపు ముఫై ఏళ్లపాటుగా ఎందరో ఉదార హృదయుల ఆధ్వర్యంలో కొనసాగిన శ్రీ రామకృష్ణ విద్యాలయం 2001లో రామకృష్ణ సంఘ నిర్వహణలోకి వచ్చింది. రామకృష్ణ మిషన్ హైస్కూల్‌గా సరికొత్త రూపుదాల్చింది. తెలుగు, ఆంగ్ల భాష మాధ్యమ బోధనే కాకుండా గ్రంథాలయం, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలు విద్యార్థులకు సమకూర్చుతూ వారి ఉజ్వల భవితకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు వివేకానంద విద్యార్థి నిలయం పేరిట ఉచిత వసతి సౌకర్యాన్ని కల్పించటం విశేషం. చాలా పాఠశాలలకు భిన్నంగా ఈ రామకృష్ణ మిషన్ హైస్కూల్ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తోంది. ఉపాధ్యాయులకూ స్వామీజీలు ఆధ్యాత్మిక తరగతులూ నిర్వహించటం గమనార్హం. ఈ నేపథ్యంలో భారతరత్న అబ్దుల్ కలామ్ ఈ పాఠశాలకు ముఖ్య అతిథిగా హాజరై అభినందనలు కురిపించటం చిరస్మరణీయం. కాగా తమకోసమే కాదు పరుల కోసం బతకాలన్న సదాశయంతో రామకృష్ణ మిషన్ హైస్కూల్ విద్యార్థులు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలలో ఈ విద్యాలయం నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ వంతు సాయమందించారు. ఈ పాఠశాల ప్రమాణాలకు గుర్తింపుగా 1992లో ఈ విద్యాలయం ప్రధానోపాధ్యాయుడిని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. ప్రతిష్ఠాకరమైన రామకృష్ణ మిషన్ హైస్కూల్ యాభై వసంతాల పండుగకు సిద్ధమైంది. గాంధీ జయంతి పర్వదినాన పాఠశాల అక్టోబర్ 2న స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నట్లు విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శశికాంతానందజీ తెలిపారు. ఆ రోజు సాయంత్రం జరిగే కార్యక్రమానికి రామకృష్ణ సంఘం వరిష్ఠ సాధుపుంగవులు స్వామి గౌతమానందజీ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని, ప్రత్యేక అతిథులుగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్ చినరాజప్ప, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరవుతారని వివరించారు.