గుంటూరు

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి: ముప్పాళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), మే 2: ఆర్థిక కుంభకోణంలో బాధితులుగా మారిన అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి హిందూ కళాశాల కూడలిలో మానవహారం నిర్వహించారు. అక్కడి నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 32 లక్షల కుటుంబాలను మోసంచేసిన అగ్రిగోల్డ్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఇప్పటికే 96 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అలాగే జిల్లాలో ఆరుగురు మృతిచెందారని తక్షణం వీరి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని, బినామీలను అరెస్ట్‌చేసి ఆస్తులను త్వరితగతిన అమ్మకాలు జరిపి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, రాష్ట్రాల్లో జరిగిన ఆర్థిక కుంభకోణాల్లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రులు 300 నుండి 500 కోట్లను కేటాయించారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని బాధితులను ఆదుకునేందుకు 1000 కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే ఈనెల 10వ తేదీ తర్వాత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థకు అప్పుల కంటే ఆస్తులే అధికంగా ఉన్నాయని, కొంతమంది ఆ ఆస్తులను అప్పనంగా కాజేసి ప్రజల నెత్తిపై కుచ్చుటోపీ పెట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. సిఐడి విభాగం వద్దనున్న ఖాతాదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టి బాధితులకు భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వం స్పందించక పోతే అసెంబ్లీ ముట్టడి, మహానాడు ఎదుట ధర్నా తదితర కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా పరిషత్‌లో కలెక్టర్ కాంతిలాల్‌దండేను కలిసి నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, అసోసియేషన్ నాయకులు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంచినీటి సమస్యను పట్టించుకోరా?
పొన్నూరు, మే 2: శుష్కవాగ్దానాలతో ప్రజలను బురిడికొట్టించి రాష్ట్రంలో అధికారపీఠమెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీల అమలును మరచి, ప్రజలను నట్టేటముంచి, అన్యాయం చేశారని నియోజకవర్గ వైసిపి కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కునే విషయంలో పాలకులకున్న అమితమైన శ్రద్ధ సమస్యల పరిష్కారంలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఇదేం అన్యాయమని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చూపుతున్న శ్రద్ధ గర్హనీయమన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు, మంచినీటి ఎద్దడికి ప్రభుత్వం చూపుతున్న అలక్ష ధోరణికి నిరసనగా వైసిపి పిలుపుమేరకు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు సోమవారం జరిపిన ధర్నాలో రావి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పెద్దఎత్తున వైసిపి మహిళా కౌన్సిలర్లు ఖాళీ బిందెలతో తరలివచ్చి నిరసన వ్యక్తంచేశారు. వెంకటరమణ మాట్లాడుతూ మట్టిని దోపిడీ చేసే విషయంలో స్థానిక నేతలకు ఉన్న ఆసక్తి మంచినీటి సమస్య పరిష్కారంలో లేకపోవడం సరికాదన్నారు. స్వర్ణపురి ప్రజల దాహార్తిని తీర్చేందుకు అనువుగా వందకు పైగా ఎకరాల విస్తీర్ణమున్న వాటర్ స్టోరేజ్ చెరువు ఉంటే ఆ చెరువు గట్టు మరమ్మతులకు పిలిచిన టెండర్లను మూడుసార్లు సైతం ఓకే చేయక పోవడం పాలకులకు ప్రజా సమస్యలపై గల శ్రద్దను తేటతెల్లం చేస్తుందన్నారు. అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని, ఉడుత ఊపులకు భయపడమని, పాలకుల దురాగతాలను అడ్డుకుంటామని పలువురు వైసిపి స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గేరా సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ధర్నాలో వైసిపి నేతలు సయ్యద్ సుల్తాన్, ఎల్ పిచ్చిరెడ్డి, ఆకుల వెంకటేశ్వరరావు, గేరా సంజీవ్, తజ్ముల్‌బేగ్, వాహెదుల్లా, మొల్లా కరీమ్, చంద్రశేఖర్‌రెడ్డి, వై రామకృష్ణ, బి రాజారావు, బి రంగారావు, ఎం లాబాను, అల్లం సాంబయ్య, మునిసిపల్ కౌన్సిలర్లు శివనాగరాజు, నయింబాషా, సుఫియా, అనిలకుమారి, కమలమ్మ, షర్మిల, గేరా కుమారి, ఎం విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ప్రదర్శన, ధర్నా
మంగళగిరి, మే 2: మంచినీటి ఎద్దడి, రాష్ట్రంలో నెలకొన్న కరువుపట్ల టిడిపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యాన సోమవారం పట్టణంలో వైసీపీ ఆధ్వర్యాన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తదితరులు ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ నదుల అనుసంధానం అన్న ఆలోచన సృష్టికర్త దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే నేడు రాష్ట్రం కరవుకోరల్లో చిక్కుకునేది కాదని అన్నారు. పోలవరం పూర్తి చేయకుండా పట్టిసీమ అనే అవినీతి ప్రాజెక్టును చేపట్టి దానిఖర్చులో 80 శాతం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు దిగమింగారని ఆర్కే ఆరోపించారు. పట్టిసీమ పూరె్తై నదుల అనుసంధానం నిజంగా జరిగి ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానది ఎందుకు అడుగంటిందని ఆయన ప్రశ్నించారు. గోదావరి నుంచి చెంబునీరు తీసుకువచ్చి కృష్ణానదిలో పోసి నదులు అనుసంధానం చేశామని చెబుతున్న ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న డెల్టా, రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆర్కే డిమాండ్ చేశారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా అవతరించి కోట్లు దోచుకుంటున్నాడని, అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నారని, ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన వైఎస్‌ఆర్ సీపీ బలహీన పడుతుందనుకోవడం భ్రమేనని ఆర్కే అన్నారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతి కారణంగా నదీతీరం వెంట ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు కూడా నీటికోసం అల్లాడుతున్నారని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు, రూరల్ మండల కన్వీనర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు ఏళ్ల విజయలక్ష్మి, బుర్రముక్కు వేణుగోపాలరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, పచ్చల రత్నకుమారి, కత్తిక రాజ్యలక్ష్మి, వడ్డేశ్వరపు రజనీకాంత్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సెక్యూరిటీ గార్డుల తొలగింపు అప్రజాస్వామికం
గుంటూరు (పట్నంబజారు), మే 2: కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేడే ప్రకటనకు గుంటూరు మార్కెట్‌యార్డు సెక్యూరిటీ గార్డుల తొలగింపు విరుద్ధంగా ఉందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె నళినీకాంత్ పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది అక్రమ తొలగింపులను నిరసిస్తూ సోమవారం గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేసిన అనంతరం నళినీకాంత్ మాట్లాడారు. గత 15 సంవత్సరాలుగా మార్కెట్‌యార్డులో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న 44 మందిని అకారణంగా విధుల నుండి తొలగించారన్నారు. ప్రతియేడాది కాంట్రాక్టరు మారినా, గార్డులనే కొనసాగిస్తున్నారన్నారు. ఫిట్‌నెస్ సమస్య తప్ప మరే యితర కారణాలతో సెక్యూరిటీ సిబ్బందిని తొలగించవద్దని మార్కెటింగ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ జారీచేసిన ఉత్తర్వులు సైతం నీరుగారాయన్నారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి ముత్యాలరావు, రాజేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రేణుశ్రీని సత్కరించిన ఎంపి రాయపాటి
గుంటూరు (పట్నంబజారు), మే 2: విద్యారంగంలో మహిళలు ఉన్నత స్థానంలో నిలవడం అభినందనీయమని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలోనే 3వ ర్యాంకు, జిల్లాలో ఫస్ట్ ర్యాంకు సాధించిన నరసరావుపేటకు చెందిన విద్యార్థిని రేణుశ్రీని ఆయన సత్కరించారు. సోమవారం స్థానిక లక్ష్మీపురంలోని ఎంపి రాయపాటి కార్యాలయంలో ఉన్న రాయపాటిని రేణుశ్రీ, ఆమె తండ్రి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి రాయపాటి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి, పట్టుదలతో పేదరికాన్ని జయించి ఎటువంటి విజయాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణ రేణుశ్రీ అని అభినందించారు. రేణుశ్రీ విజయం జిల్లాకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, జాలాది సత్యం, చల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు అత్యుత్తమ వైద్యం అందించడమే ధ్యేయం
గుంటూరు, మే 2: ప్రతి పేదవానికి అత్యుత్తమ వైద్యాన్ని అందించడమే ముఖ్యమంత్రి సహాయ నిధి లక్ష్యమని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. గుండెజబ్బు కారణంగా అనారోగ్యం భారినపడి మెరుగైన వైద్యచికిత్స కోసం సిఎం రిలీఫ్‌ఫండ్ నుండి సహాయం పొందిన తూమాటి నాగేశ్వరరావుకు మంజూరైన లక్షా 40 వేల రూపాయల చెక్కును సోమవారం తన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా మోదుగుల మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, అర్హులంతా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాల ద్వారా లబ్ధిపొందాలన్నారు. అనంతరం ఆయన నగరంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కలెక్టరేట్ ఎదుట రోడ్డు వెంబడి వ్యాపారాలు నిర్వహిస్తున్న పండ్ల వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని మిర్చియార్డు కార్యదర్శికి సూచించారు. మిర్చియార్డులో ఉన్నపరంగా 44 మంది సెక్యూరిటీ గార్డులను తొలగించిన నేపథ్యంలో అధికారులతో సమావేశమయ్యారు. తప్పు రుజువైన వారిపై చర్యలు తీసుకుని మిగిలిన వారిని విధుల్లోకి తీసుకోవాలని మోదుగుల ఆదేశించారు.

ఎంత దోచుకోవాలి ఎక్కడ దాచుకోవాలి
* ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం
తాడేపల్లి, మే 2: ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎంత దోచుకోవాలి ఎక్కడ దాచుకోవాలి, సింగపూర్, జపాన్ అంటూ ఏవిధంగా మోసం చేయాలి, కరవు పరిస్థితులను ఏవిధంగా క్యాష్ చేసుకోవాలి అనే అంశాలపైనే దృష్టి సారించింది తప్ప రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు పరిస్థితులను రూపుమాపటానికి ఏమాత్రం శ్రద్ద చూపటంలేదని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కరవు స్థితిని సైతం హెరిటేజ్ సంస్థ రూపంలో క్యాష్ చేసుకోవటానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రెండు రూపాయలకే మినరల్ వాటర్ అందిస్తామని చేసిన వాగ్దానాన్ని విస్మరించారన్నారు. ఎంఎల్‌ఏల కొనుగోలు దాహంతో ఉన్న చంద్రబాబుకు కరువు నివారణకు అధికారులతో రివ్యూలను నిర్వహించటానికి మాత్రం తీరిక ఉండటం లేదన్నారు. ఈకార్యక్రమంలో కరువు పరిస్థితులను తెలిపేందుకు పశువులను సైతం భాగస్వాములను చేయటం విశేషం. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో వైసిపి నాయకులు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, కేళి వెంకటేశ్వరరావు, ఎంపిపి కత్తిక రాజ్యలక్ష్మి, ఎండి గోరేబాబు, మాచర్ల అబ్బూ, ఓలేటి రాము, ముదిగొండ ప్రకాష్, శివరామిరెడ్డి, మహిళలు భారీగా బిందెలతో ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు.