గుంటూరు

మెట్టరైతుల కొత్త డిమాండ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 14: రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణాల కోసం శరవేగంగా ముందుకెళ్తున్న క్రమంలో మెట్టరైతులు గతంలో ఇచ్చిన ప్యాకేజీ కంటే అదనంగా 100 గజాల వాణిజ్యస్థలం ఇవ్వాలంటూ సిఆర్‌డిఎ అధికారుల ఎదుట ప్రతిపాదనలు చేస్తున్నారు. గ్రామకంఠాల జాబితా సిద్ధంచేసిన అధికారులు ప్రకటించే క్రమంలో గ్రామాల మధ్యగా రహదారులు వస్తున్నాయంటూ సర్వేనెంబర్లు వెల్లడించారు. దీంతో 6 గ్రామాల రైతులు రహదారులకు భూములిచ్చేది లేదంటూ ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి అధికారులకు అందజేశారు. మంత్రులు గ్రామాల్లో పర్యటిస్తే తమ సమస్యలను స్వయంగా చెప్పుకుంటామని తెగేసి చెబుతున్నారు. ఈనేపథ్యంలో మెట్టప్రాంత రైతులు ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని గుర్తుచేస్తున్నారు. జరీబు రైతులంతా అదనపు ప్యాకేజీ కోరిన సమయంలో రాష్ట్రప్రభుత్వం తొలుత ప్రకటించిన 1000 గజాల ఇళ్లస్థలం, 200 గజాల వాణిజ్యస్థలానికి బదులు వాణిజ్యస్థలాన్ని 450 గజాలుగా పెంచుతూ ప్రకటన చేసింది. అయితే మెట్టరైతులకు మాత్రం తొలుత ప్రకటించిన ప్యాకేజీని యథాతథంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో మెట్టరైతుల యజమానులు అనేకసార్లు అదనంగా100 గజాల స్థలం కేటాయించాలని మంత్రులను కోరుతూ వచ్చారు. మంత్రులు కూడా ప్రభుత్వం దృష్టికి మెట్టరైతుల సమస్యను తీసుకెళ్లి అదనంగా 50 గజాలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేరక పోవడంతో రైతులు గ్రామకంఠాల సమస్యపై పట్టు బిగించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని తద్వారా నెరవేర్చుకునే ప్రయత్నంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

భోగి వేడుకలతో సంక్రాంతి లక్ష్మికి శుభస్వాగతం

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 14: మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలిచిపోతున్న పండుగలలో అత్యంత జనాదరణ కల్గిన భోగి, సంక్రాంతి సంబరాలు జిల్లావ్యాప్తంగా వేడుకగా కొనసాగుతున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం రాష్ట్రప్రభుత్వం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రప్రభుత్వ పండుగగా అధికారికంగా ప్రకటించి నిర్వహించడంతో ఈ సంబరాలకు ప్రత్యేకత సంతరించుకుంది. జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాలు, మారుమూల గ్రామాల్లో కూడా గురువారం భోగి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోగా పాత రోజులు జ్ఞాపకానికి వచ్చాయి. మార్గశిర, ధనుర్మాసాల్లో సంక్రాంతి సంబరాలు ప్రతియేటా జరుపుకోవడం ఒక విశేషమైతే ఈ ఏడాది మరింత ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక ఔన్నత్యం కూడా తోడైంది. ఈ సందర్భంగా అన్ని గ్రామాలు, పట్టణ ప్రధాన కూడళ్లలో కూడా తెల్లవారుజామున భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని చలి కాగారు. సంప్రదాయానికి అనుగుణంగా ప్రతి లోగిలి ముందు తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. చిన్నారులపై భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. భోగి వేడుకలతో సకల శుభాలను చేకూర్చే సంక్రాంతి లక్ష్మికి జిల్లా ప్రజానీకం ఆనందపూర్వక స్వాగతం పలికింది. హరిదాసుల భక్తిసంకీర్తనలు, కళాకారుల నృత్య విన్యాసాలు, గాయనీ గాయకుల స్వాగత గీతాల నడుమ ఈ ఏటి సంక్రాంతి సంబరాలు ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలువురు మంత్రులు, అధికారులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ రైతాంగ స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి వారి జీవితాల్లో వెనె్నల వెలుగులు ప్రసరింపజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతన్నలకు అండదండగా నిలుస్తుందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన భోగి, సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భోగభాగ్యాలను ప్రసాదించి ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. పలు దేవాలయాలు, నివాసాల్లో బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేయగా ఉత్సాహంగా బాలబాలికలు, గృహిణిలు ఈ బొమ్మల కొలువులను ఆసక్తిగా తిలకించారు.

రమణీయం... గోదారంగనాథుల కల్యాణం
గుంటూరు (కల్చరల్), జనవరి 14: పరమపావనమూర్తి, శ్రీవల్లీపుత్తూరులో జన్మించి, విష్ణుచిత్తుని కలలను సాకారం చేసిన శ్రీ గోదాదేవి, సాక్షాత్తు నారాయణస్వరూపుడైన రంగనాథుల పవిత్ర కల్యాణోత్సవాలు గురువారం గుంటూరు నగరంలో రమణీయంగా జరిగాయి. గత 30 రోజులుగా మార్గశీర్ష, ధనుర్మాసాలకు వేదికలైన నగరంలోని 22 వైష్ణవ ప్రధాన మందిరాలు, దేవస్థానాల్లో 30వ పాశురం పూరె్తైన సందర్భంగా సంక్రాంతి పండుగ ఒక్కరోజు ముందైన భోగినాడు శ్రీ గోదారంగనాథుల కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. కృష్ణనగర్‌లోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధనకుధరం సీతారామానుజాచార్య స్వామి స్వీయ పర్యవేక్షణలో నాలుగు గంటల పాటు భద్రాచలం, శ్రీరంగం, తిరుమల, శ్రీవల్లీపుత్తూర్‌లో జరిగేలాగా గోదా ఆండాళ్‌తల్లి, రంగనాథుల కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తుల దేవస్థానం నుంచి విచ్చేసిన వైష్ణవ అర్చకబృందం ఈ కల్యాణతంతును ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా నిర్వహించింది. అసంఖ్యాకంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి సీతారామానుజాచార్యస్వామి మంగళాశాసనం చేస్తూ భక్తులపాలిటి ఇలవేల్పుగా శ్రీగోదారంగనాథులు ఇలపై వెలిశారన్నారు. అచంచలమైన భక్తి, నిండైన ఆత్మవిశ్వాసం, హృదయం నిండా మెండుగా కలిగిన భగవత్ భక్తితత్వాన్ని మేళవించుకుని శ్రీ గోదాదేవి ఆండాళ్‌తల్లి రోజుకొక్కటిచొప్పున పాశురాన్ని రచించి దశావతారాల వైశిష్ఠ్యాన్ని తన పాశుర ప్రబంధ సాహిత్యం ద్వారా లోకానికి అందించి రంగనాథునిలో ఐక్యమై భక్తిసామ్రాజ్యంలో తనస్థానాన్ని సుస్థిరం చేసుకుందని ఆచార్యస్వామి కొనియాడారు.
సిఎం చంద్రబాబుకు ఎంపి రాయపాటి
సంక్రాంతి శుభాకాంక్షలు
గుంటూరు (పట్నంబజారు), జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ గురువారం విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో చంద్రబాబునాయుడిని కలిసి దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్రప్రజలు పాడి పంటలతో, భోగభాగ్యాలతోనూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. సిఎంను కలిసి అభినందనలు తెలిపిన వారిలో టిడిపి నాయకులు నర్రా శ్రీరామమూర్తి, కంపా వరప్రసాద్, షేక్ అల్లాభక్షు, మట్టా లక్ష్మయ్య, పేరేచర్ల సొసైటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, రాజపుత్ర సత్యంసింగ్ తదితరులున్నారు.

భక్తిరస ప్రధానం శ్రీనివాస కల్యాణం
గుంటూరు (కల్చరల్), జనవరి 14: భోగి, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని గురువారం సాయంత్రం నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియం వేదికగా తిరుపతికి చెందిన సుబ్బరాజు కళాపరిషత్ ఆధ్వర్యాన శ్రీనివాస కల్యాణం పౌరాణిక పద్యనాటక ప్రదర్శనను ఏర్పాటుచేశారు. బంగారునంది అవార్డుగ్రహీత కోనేరు సుబ్బారావు రచనా దర్శకత్వంలో రెండు గంటల పాటు ఈ పద్యనాటకాన్ని ప్రదర్శించిన అధికసంఖ్యలో తరలివచ్చిన వీక్షకులు కనురెప్ప ఆర్పకుండా తిలకించారు. కళాకారులు ఆయా పాత్రలకు వనె్నతెచ్చి తిరుమల శ్రీనివాసుని వైభవాన్ని, పద్మావతీ శ్రీనివాస కల్యాణోత్సవాన్ని తమదైన రీతిలో ఆవిష్కరించారు.
పెదకూరపాడులో దుస్తులు పంపిణీ
పెదకూరపాడు, జనవరి 14: సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని స్థానిక ఆనందపేటలో గల బాప్తిజం చర్చి వద్ద పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్ పాల్గొన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలోని రామాలయం వద్ద ఏర్పాటుచేసిన ముగ్గుల సంబరాల్లో శ్రీ్ధర్ పాల్గొని సంక్రాంతి విశిష్ఠతను తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన అందాల గొర్రెల పోటీల్లో పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్, మాజీ ఎంపిపి గల్లా బాబురావు, సొసైటీ డైరెక్టర్లు భాష్యం ఆంజనేయులు, వట్టికూటి శివయ్య, టిడిపి నాయకులు చెరుకూరి శంకర్, వడ్లమూడి అప్పారావు, చెరుకూరి పుల్లయ్య, దుప్పటి పాములయ్య, కరణం వెంకటేశ్వరరావు, బెల్లంకొండ రాంబాబు, వేమూరి వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన పొనకల శేషయ్య, కర్నాటి మోహనరావులను ఎమ్మెల్యే శ్రీ్ధర్ వారి స్వగృహాలకు వెళ్లి పరామర్శించారు.

ఘనంగా గోదాదేవి కల్యాణం, గ్రామోత్సవం
మంగళగిరి, జనవరి 14: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్మామివారి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సంక్రాంతి ముందురోజు వచ్చే భోగిని పురస్కరించుకుని గురువారం గోదాదేవి, శ్రీ కృష్ణుని కల్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని గోదాదేవి కల్యాణాన్ని నేత్రపర్వంగా తిలకించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు దివి అనంద పద్మనాభాచార్యులు, నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు శాస్త్రోక్తంగా గోదాదేవి కల్యాణం నిర్వహించారు. అనంతరం పుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకుని పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఎ నాగలక్ష్మి, ఎవి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
గ్రామాల అభివృద్ధికి పాటుపడండి
* పెదగొట్టిపాడు జెడ్పీ హైస్కూల్ స్వర్ణోత్సవ ముగింపు సభలో ఎంపి రాయపాటి
ప్రత్తిపాడు, జనవరి 14: మారుమూల గ్రామాల్లో పుట్టి నేడు విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు వారు పుట్టి పెరిగిన గ్రామానికి, విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని ఎంపి సాంబశివరావు అన్నారు. గురువారం మండలంలోని పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపి రాయపాటి మాట్లాడుతూ ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతి వ్యక్తి సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే తోడ్పాటుతో పాటు ఎన్నారైలు కూడా కొంత ఫండ్ అందజేస్తే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయన్నారు. తాను గుంటూరు ఎంపిగా ఉన్న సమయంలో గుంటూరు ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాల అభివృద్ధికి ఎన్నారైలు సహాయం అందించారన్నారు. అనంతరం పాఠశాల అధ్యాపకులు, రిటైర్డ్ అధ్యాపకులు, పాఠశాల పూర్వవిద్యార్థుల సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ఐఐఎస్ అధికారి అంచా అయ్యేశ్వరరావు, పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు పాతూరి కృష్ణారావు, సర్పంచ్ బాబురావు, నాగార్జున సాగర్ కుడికాల్వ కమిటీ చైర్మన్ భుజంగరాయలు, ఎంఇఒ విజయపాల్, హెచ్‌ఎం అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

క్రీడలను ప్రోత్సహించాలి
పెదకూరపాడు, జనవరి 14: రాష్ట్రప్రభుత్వం క్రీడారంగాన్ని ప్రోత్సహించేందుకు ముందుందని, క్రీడలను అందరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్ పేర్కొన్నారు. పెదకూరపాడులో జిఆర్‌సిఆర్‌కె శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీలను గురువారం ఆయన ముఖ్యఅతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదికపై ప్రసంగిస్తూ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం తలపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, రెండు కోట్ల రూపాయలు సిద్ధమని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ముఖ్యంగా గ్రామ యువతలో క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. అనంతరం షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ఎండి గుత్తా కవిత, రాము మాస్టారు, ఎంపిపి శివమ్మ, మండల టిడిపి అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్, మాజీ ఎంపిపి గల్లా బాబురావు, అభినందన ఎండి సాయిచరణ్, దుప్పటి పాములయ్య, ఎంపిటిసి ముంతాజ్, వివేకానంద విద్యాసంస్థల అధినేత కొల్లి చంద్రశేఖరరెడ్డి, బిసి చైర్మన్ వడ్లమూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నేడు కవిరాజు రామస్వామి విగ్రహావిష్కరణ
గుంటూరు (పట్నంబజారు), జనవరి 14: మానవతామూర్తి, హేతువాది, కవిరాజు త్రిపురనేని రామస్వామిచౌదరి కాంస్య విగ్రహాన్ని సంక్రాంతి పర్వదినం రోజైన శుక్రవారం స్థానిక జెకెసి కళాశాల రోడ్డులోని ఆర్‌విఆర్ అండ్ జెసి బిఇడి కళాశాల ప్రాంగణంలో ఆవిష్కరిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ గద్దె మంగయ్య తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన కర్షకకవి బొద్దులూరి నారాయణరావు, కొండా శివరామిరెడ్డి, కొల్లా కృష్ణారావు, ధనేకుల వెంకటేశ్వరరావు, టివి కృష్ణ, సుబ్బారావు, కాట్రగడ్డ హనుమంతరావు, రావెల సాంబశివరావులను సత్కరించనున్నట్లు తెలిపారు.

హాయ్‌లాండ్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

మంగళగిరి, జనవరి 14: మండల పరిధిలోని చినకాకానిలో గల అగ్రిగోల్డ్ సంస్థ హాయ్‌లాండ్ ప్రాంగణంలో గురువారం సంక్రాంతి సంబరాల్లో భాగంగా గంగిరెద్దుల విన్యాసాలు, ఆంధ్రాఫోక్ డాన్స్, మణిపురి బాంబ్ డాన్స్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులను సంక్రాంతి సంబరాలు అలరించాయి. ఆదివారం వరకు సంక్రాంతి సంబరాలు కొనసాగుతాయని మేనేజర్ పివి సుబ్బారావు తెలిపారు.