గుంటూరు

రోడ్ల విస్తరణకు భూములిచ్చేది లేదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జనవరి 19: తమ గ్రామంలో రోడ్ల విస్తరణ పేరిట నివాస గృహాలను తొలగిస్తే సహించబోమని మంగళవారం మండల పరిధిలోని నవులూరు గ్రామస్థులు సిఆర్‌డిఎ అధికారుల ఎదుట ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. నివాస గృహాల మధ్య రోడ్లు విస్తరించే ప్రతిపాదన ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో సిఆర్‌డిఎ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటైన సభలో గ్రామస్థులు నివాస గృహాలను తొలగించ వద్దని ముక్తకంఠంతో కోరారు. డెప్యూటీ కమిషనర్ రఘునాధరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మాస్టర్‌ప్లాన్‌ను వివరించారు. రాజధాని కోసం భూములిచ్చామని, ఇళ్లు కూడా లాక్కుంటారా అని పలువురు ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లు, తాగునీరు, విద్యుత్ మొదలైన సౌకర్యాలు లేకపోయినా పాములు, తేళ్లు మధ్య గడిపామని, రెక్కల కష్టంతో ఇళ్లు నిర్మించుకున్నామని, ఇళ్లు తొలగించడానికి ఒప్పుకునేది లేదని, 165 అడుగుల మేర రోడ్లు ఎవరికోసమని ప్రశ్నించారు. గ్రామ కంఠాల సమస్య ఇంతవరకు ఎందుకు తేల్చలేదని సిఆర్‌డిఎ అధికారులను నిలదీశారు. మంత్రుల్నే రమ్మనండి తేల్చుకుంటామంటూ కొందరు బిగ్గరగా అన్నారు. ఇళ్లుపోతే ఆత్మహత్యలే శరణ్యమని పలువురు ఆవేదనగా అన్నారు. గ్రామానికి చెందిన రాధాకృష్ణ, శేషగిరి, మోహన్‌బాబు, ఈపూరి ఆదాం తదితరులు ఇళ్లు తొలగించే ప్రతిపాదన ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. సిఆర్‌డిఎ కమిషనర్ ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదని, ప్రజలు ఇష్టపడితేనే అమలవుతుందని, మార్చుకోవడం మనచేతుల్లోనే ఉందని, ప్రజల అభిప్రాయం కోసమే వచ్చామని, ఇళ్లు తొలగిస్తామని ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. గ్రామ కంఠాల సమస్య కూడా రెండుమూడురోజుల్లో పరిష్కారం అవుతుందని, 2014 డిసెంబర్ 8 నాటికి ఉన్న ఇళ్లను తొలగించడం జరగదన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే గ్రామకంఠాలు ఉంటాయని శ్రీకాంత్ అన్నారు. సమీకరణకు భూములిచ్చిన రైతులకు తిరిగి ఇచ్చే గజాల భూమిని ప్రభుత్వం ప్రతిపాదించిన చోట వద్దని చెబుతున్నందున ఎక్కడ కావాలో చెబితే పరిశీలిస్తామని శ్రీకాంత్ అన్నారు. అసైన్డ్ భూముల విషయమై ప్రభుత్వం వద్ద చర్చ నడుస్తోందని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని, అసైన్డ్ భూములు చేతులు మారినందున ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో భూమి కోల్పోతే భూమికి భూమి ఇవ్వడంతో పాటు అందులో ఉన్న ఇంటి విలువ ఆర్ అండ్ బి అధికారులు లెక్కించి రెట్టింపు విలువ ఇవ్వడం జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో ఇప్పుడున్న లక్ష జనాభా 2050 నాటికి 25 లక్షల జనాభా అవుతారని అంచనా వేస్తున్నామని, ఆ జనాభా అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు జరుగుతాయని శ్రీకాంత్ అన్నారు. బేతపూడిలోను మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సిఆర్‌డిఎ డిప్యూటీ కమిషనర్, ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నేనూ పల్నాడు వాడినే.. పౌరుషం ఉంది..
* ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేట,జనవరి 19: నేను స్వతహాగా డాక్టర్‌ని... పల్నాడు వాడినే.. నాకూ పౌరుషం ఉంది.. నేను మొండివాడిని.. ప్రజల కోసం పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘నేను ఎవరినీ వదలిపెట్టను, ఏలాంటి పోరాటానికైనా సిద్ధమే’నన్నారు. ప్రజల కోసం ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా, సమస్యల పరిష్కారం కోసం ముందుంటానన్నారు. నరసరావుపేటలో వ్యాపారస్థుల వద్ద ఎవరైనా డబ్బుల కోసం దందాలు చేస్తే తన దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. వ్యాపారులకు అండగా ఉంటామన్నారు. పోలీసుల వత్తిడి మేరకే తాను రిపోర్టు ఇచ్చానని మంగళవారం రొంపిచర్ల తహశీల్దార్ ఇంటర్వ్యూలో చెప్పారని, ఆ ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్‌ను విలేఖరులకు చూపించారు. తన మీద శాసనసభా హక్కుల్ని కాపాడాల్సిన సభాపతి కేసు పెట్టించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ప్రజలు తనపై ఉన్న నమ్మకంతో స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తొలుత 353కేసు పెట్టి, దానికి సంబంధించిన సంతకాలు తీసుకుని, నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రజా మద్దతు చూసి పోలీసులు మనసు మార్చుకుని స్టేషన్ బెయిల్ ఇచ్చారని చెప్పారు. తనపై తప్పుడు కేసు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తున్నానని అన్నారు. పట్టణ సిఐ వీరయ్యచౌదరి వ్యక్తిగత కోపంతో లాఠీఛార్జి చేసి, మహిళలని కూడా చూడకుండా దూషించాడని అన్నారు. బెయిల్ అనంతరం ఇంటి వద్దకు వచ్చిన తర్వాత కూడా తమ కార్యకర్తలపై లాఠీ చార్జి చేశారని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

అంగలకుదురులో ఉద్రిక్తత
* శామ్యూల్ జాన్ మృతదేహంతో రోడ్డుపై నిరసన
* బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతల డిమాండ్
తెనాలి/తెనాలి రూరల్, జనవరి 19: శామ్యూల్ జాన్ మృతికి కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరు తూ ఎమ్మెర్పీఎస్ నాయకులు మం గళవారం తెనాలి రూరల్ మండలం అంగలకుదురు గ్రామంవద్ద ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. చుండూరు మండలం దుండిపాలెంకు చెందిన శామ్యూల్ జాన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గా యాలు కాగా.. అది ప్రమాదం కాదని, కావాలనే దాడిచేశారని బంధువులు ఆరోపిస్తూ సోమవారం రాస్తారోకో కూడా చేశారు. శామ్యూల్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. బంధువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు మృతదేహంతో అంగలకుదురు గ్రామంవద్దకు చేరుకొని గుంటూరు-తెనాలి రహదారిపై నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ శామ్యూల్‌జాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, కావాలనే అగ్రవర్ణాల వారు దాడిచేసి అతని చావుకు కారణమయ్యారని ఆరోపించారు. బాధ్యులపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటూ సాయంచేయాలని డిమాండ్ చేశారు. చుండూరు మండలంలో మరోమారు దళితులపై ఇటువంటి దాడులు జరుగకుండా ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు మధ్య శామ్యూల్‌జాన్ మృతదేహాన్ని దుండిపాలెంకు తరలించారు. గ్రామంలో పికెట్ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వర్సిటీ ప్రతిష్ఠను ఇనుమడింప చేస్తా

* నూతన వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్
నాగార్జున యూనివర్సిటీ, జనవరి 19: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాం తంలో ఉన్న ఆచార్య నాగార్జున యూ నివర్సిటీ ప్రతిష్ఠను అంతర్జాతీయస్థాయికి పెంచడానికి కృషి చేస్తానని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నూతన వైస్ చాన్సలర్ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళవారం వర్సిటీలోని వీసీ చాంబర్‌లో నాగార్జున యూనివర్సిటీ 16వ వైస్ చాన్సలర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన పాలనలో విద్యార్థులు, సిబ్బంది సంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. త్వరలో నాక్ అక్రిడిటేషన్‌కు వెళ్లనున్నామని, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి నాక్ ఎ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సంస్థలోని సభ్యులంతా కలసికట్టుగా కృషి చేసినప్పుడే ఆ సంస్థ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, సిబ్బందిలో సమష్టితత్వాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని తెలిపారు. నాగార్జునలో విద్యాబోధన, పరిశోధనా రంగాలను మరింత అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు చేపట్టనున్నామని, విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందించడానికి ప్రముఖ సామాజికవేత్తల ఉపన్యాస కార్యక్రమాలను వర్సిటీలో విరివిగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రాయూనివర్సిటీలో అనేక పదవులు నిర్వహించానని, తద్వారా వచ్చిన అనుభవంతో రానున్న రోజుల్లో వర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఒక సమగ్రమైన ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.

ఎసిబి వలలో చెక్‌పోస్ట్ చేపలు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 19: ఎసిబి అధికారులు వలపన్ని పొందుగల చెక్‌పోస్ట్‌కు సంబంధించిన సిబ్బందిని గుంటూరు లాడ్జిసెంటర్‌లో మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి డిఎస్‌పి సిహెచ్‌డి శాంతో కథనం ప్రకారం... దాచేపల్లి మండలం, పొందుగల చెక్‌పోస్ట్ సీనియర్ అసిస్టెంట్ మందడపు మల్లిఖార్జునరావు, జూనియర్ అసిస్టెంట్ పగడాల శ్రీనివాసరావులు యంత్రాలు తరలిస్తున్న పాలపర్తి శ్రీనివాసరావును 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. విద్య స్పైసెస్ అండ్ మిర్చి కంపెనీకి చెందిన యంత్రాలను ఇటీవల గుంటూరుకు పొందుగల మీదుగా తీసుకువస్తున్న సమయంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు 20 వేల రూపాయలు డిమాండ్ చేయడంలో ప్రస్తుతానికి డబ్బులు లేవని, నాలుగు రోజుల్లో 15 వేల రూపాయలు ఇస్తానని పాలపర్తి శ్రీనివాసరావు వారికి చెప్పారు. ఈ విషయంపై పాలపర్తి శ్రీనివాసరావు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎసిబి పధకం ప్రకారం మంగళవారం 15 వేల రూపాయలను తీసుకోవాల్సిందిగా శ్రీనివాసరావు ఫోన్‌చేసి సమాచారం అందించడంతో ఇరువురు అసిస్టెంట్లు గుంటూరుకు చేరుకున్నారు. గుంటూరు లాడ్జిసెంటర్‌లో 15 వేల రూపాయలు అందిస్తున్న తరుణంలో ఎసిబి అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

’ఆరోగ్యాన్ని పెంచే క్రీడలను ప్రోత్సహించాలి‘
* ఎఎన్‌యు అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ టోర్నీ ప్రారంభం
తాడికొండ, జనవరి 19: మండల పరిధిలోని లాం చలపతి ఫార్మసీ కళశాలలో మంగళవారం ఎఎన్‌యు అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ టోర్నమెంట్‌ను ముఖ్యఅతిథులుగా గుంటూరు వైద్య కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ జి సుబ్బారావు, ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్, డైరెక్టర్ ప్రొ. వై కిషోర్ , శ్రీచైతన్య కళాశాలల, టెక్నో స్కూల్స్ అసిస్టెంట్ జిఎం ఈమని దుర్గాప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథి జి సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తిని, పోరాట పటిమను, ఒడిదుడుకులను ఎదుర్కొనే స్థైర్యాన్ని నింపే క్రీడల పట్ల ఆసక్తిని తల్లిదండ్రులు, కళాశాలలు ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతో ఉందన్నారు. గౌరవ అతిథి ఎఎన్‌యు ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ కిషోర్ మాట్లాడుతూ పాఠశాలల స్థాయి వరకు ఉన్న పై చదువులకు వచ్చేసరికి తగ్గిపోతోందన్నారు. ఎఎన్‌యు మొదటి నుండి క్రీడలకు పె ద్దపీట వేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో విద్యార్థులు ఏటా సాధిస్తున్న పతకాలు ఇందుకు నిదర్శనమన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు వివిధ రకాల ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు చెప్పారు. క్రీడల కోటాలో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చునన్నారు. అతిథులను శాలువ, జ్ఞాపికలతో వైవి అంజనేయులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 2 కోట్లు
* ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
గుంటూరు (కొత్తపేట), జనవరి 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుంటూరు రీజియన్ పరిధిలో ఆల్‌టైమ్ రికార్డును సాధించినట్లు ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ డిపోల నుంచి దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపడం ద్వారా రీజియన్ వ్యాప్తంగా 2,11,41,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గతంలో గోదావరి పుష్కరాలు, దసరా సమయంలో పొందిన ఆదాయం కన్నా సంక్రాంతి ఆదాయం అధికంగా ఉందన్నారు. మొత్తం గుంటూరు రీజియన్ నుండి 5,94,000 కిలోమీటర్లు బస్సులు తిరిగాయన్నారు. ఈ రికార్డు నెలకొల్పేందుకు కృషిచేసిన అధికారులు, సూపర్‌వైజర్, కార్మికులను అభినందిస్తూ ఈ స్ఫూర్తితో మరింత ఆదాయం సంస్థకు చేకూర్చేలా కృషి చేయాలని శ్రీహరి కోరారు. పండుగలకు వచ్చి తిరుగుప్రయాణం చేసే వారి కోసం బుధవారం కూడా ప్రత్యేక బస్సులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్ కొనుగోలుకు ఆదేశం
* మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, జనవరి 19: వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే సుబాబుల్ తదితర పంటలను పేపర్ యాజమాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో రైతులు, పేపర్ యాజమాన్య ప్రతినిధులు, వ్యాపారస్తులతో సుబాబుల్ తదితర పంటల కొనుగోలుపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ప్రసంగించారు. 2016 ఫిబ్రవరి 1వ తేదీ నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారానే కొనుగోలు ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుబాబుల్, జామాయిల్, యూకలిఫ్టస్, సరుగుడు పంటలను సాగు చేస్తున్నారన్నారు. కృష్ణాజిల్లాలో 62,300 ఎకరాల్లో సుబాబుల్ పంట పండిస్తుండగా ప్రకాశం జిల్లాలో 38,578 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 15,700 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారన్నారు. యూకలిప్టస్ పంటను ప్రకాశం జిల్లాలో మాత్రమే 72,733 ఎకరాల్లో పండిస్తున్నట్లు తెలిపారు. 2015 సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం టన్నుకు 4,400 రూపాయల నుండి 4,600 వరకు చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. మధ్య దళారీల కారణంగా రైతులకు గిట్టుబాటు ధర దొరకక నష్టపోతున్నారని, వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. రైతులు, పేపర్ యాజమాన్య ప్రతినిధులు సూచనల మేరకు గతంలో నిర్ణయించిన ధరనే అమలు చేయాలన్నారు. 1999లో మార్కెట్ కమిటీల ద్వారానే కొనుగోలు చేసిన విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నామన్నారు. రైతులు నేరుగా తమ పంటలను కమిటీలకు చేర్చాలన్నారు. మరో 200 రూపాయల ధరను పెంచాలని రైతులు కోరగా కమిటీని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్, సంయుక్త సంచాలకులు కమిటీకి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారన్నారు. కమిటీ సభ్యులు అందరితో చర్చించిన అనంతరం ధరలపై నిర్ణయం జరుగుతుందన్నారు. ముందుగా కమిటీ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు సంబంధించిన చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా జరుగుతాయన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరను యాజమాన్యం తప్పనిసరిగా చెల్లించాలన్నారు. రైతుల డిమాండ్ మేరకు పంటల ధరపెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లిఖార్జునరావు, గుంటూరు జెసి డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్, మార్కెటింగ్ శాఖ జెడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తొలుత పశుసంవర్ధకశాఖ రూపొందించిన క్యాలెండర్‌లు మంత్రులు ఆవిష్కరించారు.

రాజధాని నుండి మా గ్రామాన్ని మినహాయించండి
తాడేపల్లి, జనవరి 19: భూసమీకరణకే భూములివ్వమని తేల్చిచెప్పాం, ఇప్పుడు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఉండవల్లిని పూర్తిగా రహదారులతో నింపారు, దీనికి మేం ససేమిరా ఒప్పుకోమంటూ ఉండవల్లి గ్రామస్థులు సిఆర్‌డిఏ అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ అవగాహనకు మంగళవారం ఉండవల్లిలోని రామాలయంలో ఏర్పాటు చేసిన సదస్సు సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో జరిగింది. ఈసందర్భంగా తొలుత ఉండవల్లి గ్రామసర్పంచ్ మనె్నం సుజాత మాట్లాడుతూ గ్రామం మధ్య 50 మీటర్ల రహదారి నిర్మించటం వలన వందల ఇళ్ళు తొలగించాల్సివస్తుందని, వారంతా వీధిన పడతారని, అందుకు అంగీకరించబోమని తెలిపారు. సిపియం నాయకుడు జొన్న శివశంకర్ మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్ వలన గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గ్రామంలో సుమారు 6 రహదారులు నిర్మాణానికి రూపకల్పన చేశారని, తొలగించే ఇళ్ళకు నష్టపరిహారం ఏవిధంగా ఇస్తారో స్పష్టం చేయలేదన్నారు. కాగా రాజధాని నిర్మాణానికి ఉండవల్లిలో భూములిచ్చిన వారంతా భయపడి భూములిచ్చారని కొందరు స్థానికులు ప్రస్తావించగా, తాము చంద్రబాబుపై విశ్వాసంతో భూములిచ్చామని, ప్రభుత్వం ప్రజలకు తప్పక న్యాయం చేస్తుందని నమ్ముతున్నామని, మీ డిమాండ్లేమిటో చెప్పండంటూ ఉండవల్లి తెలుగుదేశం నాయకుడు చెప్పటంతో వేదికపై నుండి దిగిపోవాలని రైతులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. అసలు అధికారులకు రాజధాని మాష్టర్‌ప్లాన్ అమలు విషయంలో ఎంత వరకూ అధికారాలు ఉన్నాయో ముందు స్పష్టం చేయాలని, లేకుంటే భూసమీకరణను ప్రోత్సహించిన మంత్రులు పుల్లారావు, నారాయణ ప్రజల వద్దకు రావాలని స్థానిక డాక్టర్, మాజీ బిజెపి నాయకుడు కన్నారావునాయుడు అధికారులను ప్రశ్నించారు. మాస్టర్‌ప్లాన్ రూపంలో రాజధాని ప్రాంతంలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోందని, రైతుల తరఫున గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. ఒకదశలో వైసిపి, టిడిపిల మధ్య వాగ్వాదం జరిగి సదస్సు రసాభాసగా మారింది.
పోలీసు అధికారి ఓవరాక్షన్: కాగా ఈ సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని, ఏకుంటే చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్ అధికారి హెచ్చరించటంతో రైతులు ఒక్కసారిగా ధ్వజమెత్తారు. ఆ పోలీసు అధికారి వేదికపై నుండి వెంటనే దిగిపోవాలని, సదరు పోలీస్ క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇంతలో సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ జోక్యం చేసుకుని సదరు పోలీస్ అధికారి తరఫున తాను క్షమాపణ చెపుతున్నానని, శాంతించాలని కోరారు. అయితే రైతులు పట్టుపట్టడంతో సదరు పోలీస్ అధికారే స్వయంగా క్షమాపణ చెప్పటంతో రైతులు శాంతించారు.
ప్రజల సమ్మతిలేకుండా ఇళ్ళు తొలగించం
ప్రజల సమ్మతిలేకుండా రహదారుల నిర్మాణం కోసం ఇళ్ళు తొలగించేదిలేదని సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ ఈసందర్భంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజల సహకారం కోరతామని, ఎవరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో సిఆర్‌డిఏ ఉండవల్లి డిప్యూటీ కలెక్టర్ కెఇ సాధన, ప్రసన్న వెంకటేశ్వర్లు, భారీ సంఖ్యలో రైతులు, స్థానికులు, సిపియం నాయకులు కొర్రపోలు ఈశ్వరరెడ్డి, బూరగ వెంకటేశ్వర్లు, పలకలూరి గాంధీ, ఈమని రామారావు, లెనిన్‌బాబు, ఓలేటి శ్రీనివాసరావు, వైసిపి నాయకులు దంటు బాలాజీ, మానం బోసురెడ్డి, సాంబిరెడ్డి, సంజీవరెడ్డి, దేశం, జనసేన నాయకులు జంగాల సాంబశివరావు, దాసరి కృష్ణ, శింగంశెట్టి మల్లికార్జునరావు, ప్రముఖ వ్యాపారి శింగంశెట్టి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.