కృష్ణ

అవకాశం ఇస్తే నగర నిర్మాణాల్లో ఇజ్రాయేల్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కమిషనర్ వీరపాండియన్, మేయర్ శ్రీధర్‌లతో చర్చించిన ప్రతినిధులు
విజయవాడ , డిసెంబర్ 5: విజయవాడ నగరపాలక సంస్థలో చేపట్టే వివిధ నిర్మాణాల్లో తమకు అవకాశం ఇస్తే పూర్తి ఆధునికత, నాణ్యత ప్రమాణాలతో కూడిన వివిధ ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు చేపడతామని ఇజ్రాయేల్ దేశ జ్యూరీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌కు చెందిన ప్రీకా సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ నేతృత్వంలో ఇజ్రాయేల్ జ్యూరీ ప్రతినిధులతోపాటు ఆ దేశ ఇంజనీర్లు కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కమిషనర్ వీరపాండియన్‌ను, మేయర్ ఛాంబర్‌లో మేయర్ కోనేరు శ్రీధర్‌ను కలిసిన సందర్భంగా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆధునీకరణ నిర్మాణాలతోపాటు విఎంసి ప్రధాన కార్యాలయ అవరణలో విఎంసి కార్యాలయ కార్యకలాపాల తోపాటు ఇతర అవసరాల కోసం రూ.30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 10 అంతస్తుల బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై చర్చించిన వారు ప్రప్రథమంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ కాలంలోనే ఆయా నిర్మాణాలను పూర్తిచేస్తామని వివరిస్తూ ఆయా పనుల కాంట్రాక్ట్‌ను తమకు అప్పగించాలని కోరారు. ఇజ్రాయేల్ టెక్నాలజీని ఉపయోగించి కేవలం 2నెలల కాలంలో 5 అంతస్తుల భవనాన్ని నిర్మించిన విధంగానే విఎంసిలో కూడా చేపడతామన్నారు. ఇందుకు స్పందించిన కమిషనర్ వీరపాండియన్ ఆయా నిర్మాణాలకు సంబంధించి డిజైన్ రూపకల్పన చేసి రానున్న కృష్ణా పుష్కరాల నాటికల్లా పూర్తియ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్‌ను కౌన్సిల్ భవనంలోని మేయర్ ఛాంబర్‌లో కలుసుకొన్న ఇజ్రాయేల్ ప్రతినిధులు 10 అంతస్తుల భవన నిర్మాణంపై చర్చించారు. ఈకార్యక్రమంలో ఇఇ పివికె భాస్కర్, డిఇఇ గంగరాజు తదితరులు పాల్గొనగా మేయర్‌తోపాటు కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు, కోసూరి శైలజ, విఎంసి సిఇ ఎంఎ షుకూర్ తదితరులు పాల్గొన్నారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసాం
* ఎంపి కేశినేని శ్రీనివాస్
విజయవాడ, డిసెంబర్ 5: విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ లాంటి వారు మనందరికీ గర్వకారణం. ట్రాఫిక్ రద్దీ నివారణ కోసం గత నాలుగు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమై ఉన్న దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం ఆయన ఎంతగానో ఆరాటపడ్డారు. పరితపించారంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎంతో ఉత్కంఠతతో కేశినేనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ముందుగానే నాలుగైదు డిజైన్‌లు సిద్ధం చేసుకుని తన వెంట తీసుకువస్తుండేవారు. ఢిల్లీ వచ్చినప్పుడల్లా ముందుగా తన ఫ్లైఓవర్ సంగతేమిటంటూ ప్రశ్నించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాలికి బలపం కట్టుకు తిరిగాడంటూ అభినందించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరగాలంటే ఇలాంటి వారు ఉండాలన్నారు. ఎంపి కేశినేని మాట్లాడుతూ కోస్తా ప్రాంతానికి ముఖద్వారం అయిన విజయవాడ దుర్గ గుడి వద్ద ట్రాఫిక్ సమస్య నివారణకు చేపట్టిన ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసామన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక సోఫెస్టికేటెడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. ఈ నిర్మాణంకు కలెక్టర్ బాబు ఎ ఇతర అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనపరిచారంటూ వారిని అభినందించారు. ఒక్క విజయవాడ నగరంలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు 4వేల కోట్ల రూపాయలు వినియోగించామన్నారు.

రాజకీయాలకతీతంగా బందరు ఔన్నత్యాన్ని కాపాడాలి
మచిలీపట్నం , డిసెంబర్ 5: బందరు పట్టణ ఔన్నత్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక బచ్చుపేట మహతి లలిత కళావేదికలో శనివారం డా. బృందావనం ధన్వంతరి ఆచార్య రచనల ఆవిష్కరణ సభ జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బందరు పట్టణం కళలకు కాణాచిగా, విద్యాకేంద్రంగా, సాంస్కృతిక వైభవానికి పుట్టినిల్లుగా బాసిల్లిందన్నారు. దేశంలోనే రెండవ పురపాలక సంఘం ఏర్పడిన బందరు పట్టణ జనాభా నానాటికీ తగ్గిపోతోందని, అవనిగడ్డ జనాభా పెరుగుతోందన్నారు. ఒకప్పుడు గ్రామంగా ఉన్న విజయవాడ నేడు మహానగరంగా మారిందన్నారు. రాజధానికి దగ్గరగా ఉన్న బందరు పట్టణానికి పూర్వ వైభవం సంతరింప చేయడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు. తెలుగు భాషపై పట్టు సాధించాలన్నారు. ఆంగ్ల భాషకు తాను వ్యతిరేకం కాదన్నారు. ఉపాధి అవకాశాల కోసం ఆంగ్ల భాషను అభ్యసించడంలో తప్పులేదన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి, సంఘ సంస్కరణలకు సాహిత్యం దోహదం చేస్తుందన్నారు. గురజాడ అప్పారావు రచించిన దిద్దుబాటు కథ, కన్యాశుల్కం, అడవి బాపరాజు రచించిన నారాయణరావు నవల నాటి సాంఘిక, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టడంతో పాటు సమాజంలోని లోపాలను ఎత్తి చూపాయన్నారు. డా. బి ధన్వంతరి ఆచార్య వైద్య సేవలు అందించటంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ రచనలు చేయడం ముదావహమన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, కేంద్రీయ హిందీ సంస్థాన్ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ధన్వంతరి ఆచార్య రచించిన నాలుగు పుస్తకాలను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. బుద్ధప్రసాద్ ఆవిష్కరించిన ‘జీవన సంధ్య’ రచనను డా. గుమ్మా సాంబ శివరావు పుస్తక సమీక్ష చేశారు. ‘సుపథం’ పుస్తకాన్ని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించగా డా. మాదిరాజు రామలింగేశ్వరరావు సమీక్షించారు. ‘ఒంటరి పక్షులు జంట అయ్యాయి’ కథా సంకలనాన్ని జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డా. జివి పూర్ణచంద్ ఆవిష్కరించగా గుడిపూడి రాధికా రాణి సమీక్షించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు ‘స్వయంకృతం’ పుస్తకాన్ని ఆవిష్కరించగా డా. జి నాగలక్ష్మి సమీక్షించారు. తొలుత పట్టిసపు ప్రగీత ఆలపించిన కీర్తనలు శ్రోతలను అలరించాయి. గుత్తికొండ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భవిష్య, చలమలశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు ప్రభుత్వాల కృషి
జగ్గయ్యపేట , డిసెంబర్ 5: వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువచ్చి నేలల సారాన్ని కాపాడేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. గరికపాడు డాక్టర్ కెఎల్ రావు క్రిషి విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన కిసాన్ మేళాను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం రాజశ్రీ అధ్యక్షతన జరిగిన రైతు సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగు చేయాలని, శాస్తవ్రేత్తల సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేలల్లో సారం తగ్గుతుందని, దీని కోసం సేంద్రీయ ఎరువుల వాడకం పెంచాలన్నారు. మనిషికి హెల్త్ కార్డులు ఎలాగో వ్యవసాయ భూమికి భూసార పరీక్షల రిపోర్టు అంత అవసరమని, భూసార పరీక్షలు చేయించిన తరువాతే దానికి అనుకూలవంతమైన పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని, పెట్టుబడులు తగ్గించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ తమ భూముల్లోని మట్టిని పరీక్షలు చేయించేందుకు కెవికెకి తెచ్చినా అధికారులు, శాస్తవ్రేత్తలు స్పందించడం లేదన్నారు. ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయి భూసార పరీక్షలు చేయించి నివేదికలు రైతులు అందేలా చర్యలు చేపడతామని శాస్తవ్రేత్తలు రాజశ్రీ, బాలినేని వెంకటేశ్వరరావులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులతో నేలలు కాపాడతామని ప్రతిజ్ఞ చేయించారు. వ్యవసాయ అనుబంధ రంగాల పుస్తకాలను శాస్తవ్రేత్తలతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

కౌలు రైతు కుటుంబాన్ని
పరామర్శించిన ఎమ్మెల్యే
పెనుగంచిప్రోలు, డిసెంబర్ 5: గుండెపోటుతో ఒక దళిత కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ముచ్చింతాల గ్రామంలో తెల్లవారుజామున జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెద లాజరు (50) 10 ఎకరాల మాగాణి భూమి కౌలుకు తీసుకొని సాగు చేశాడు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పైరు మొత్తం ఎండిపోవడంతో సుమారు రూ.3లక్షల వరకూ పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన లాజరు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన మృతదేహాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జడ్‌పిటిసి గింజుపల్లి శ్రీదేవి, ఎంపిపి వెల్ది జ్యోతి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గోనెల శివ, మాజీ సర్పంచ్ పొన్నం నర్శింహరావులు సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.