కృష్ణ

జైలు నుంచి విడుదలైన మల్లాది విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: కల్తీ మద్యం కేసులో గత రెండు వారాలుగా జైలుశిక్ష అనుభవిస్తున్న నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బెయిల్‌పై శనివారం ఉదయం 7.45 నిమిషాల ప్రాంతంలో వెలుపలకు వచ్చారు. తెల్లవారుఝాము నుంచే జైలు వెలుపల వేచి వున్న కార్యకర్తలు, అనుచరులు పలువురు ఎదురేగి స్వాగతం పలికి తమ వెంట లబ్బీపేటలోని ఆయన నివాస గృహానికి తోడ్కొని వెళ్లారు. విష్ణు వెంట ఆయన సోదరుడు శ్రీనివాస్ కూడా వెలుపలకు వచ్చారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ నిజం నిలకడపై తెలుస్తుందన్నారు. రెండు రోజుల్లో వాస్తవ పరిస్థితులన్నింటిని మీడియాకు వివరిస్తానన్నారు. విష్ణుకు స్వాగతం పలికినవారిలో కాంగ్రెస్ నేతలు కుందేటి శ్యాం, వెన్నం రత్నారావు, మద్దిరాల కమలాకర్, పేటేటి రాజశేఖర్, తల్లాప్రగడ తదితరులున్నారు.

వాయదాలపై వాయదాలతో
ప్రజల్లో అసహనం
* సుప్రీం కోర్టు జస్టీస్ ఎన్‌వి రమణ
విజయవాడ (క్రైం), జనవరి 23: వివిధ కారణాలతో ఏళ్ల తరబడి కేసులు వాయిదా పడుతుంటే ప్రజలు విసిగిపోయి ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించే ప్రమాదం ఉంటుందని, దీని వల్ల సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఎన్‌వి రమణ అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, లాయర్లు పోలీసులపై ఆధారపడకుండా కేసుల విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లనుద్ధేశించి ఆయన అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (క్యాడర్) తొలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజలకు సత్వర న్యాయం అందించకుంటే నమ్మకం పోతుందన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల్లో అత్యంత గౌరవం ఉందని, కాని న్యాయం జరగడంలో జాప్యం నివారించాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మేజిస్ట్రేట్లకు సత్సంబంధాలు సహజమని, అయితే న్యాయాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థలో కీలకమైన ఏపిపిలు ఆ చనువుని దుర్వినియోగం చేయరాదన్నారు. నేరస్థునికి శిక్షలు పడాలిగాని, పరిమితులు దాటరాదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. శిక్ష శాతం పెరగాలి కాబట్టి శిక్షలు కోరడం సరికాదన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వద్దకు చాలామంది పలుకుబడి కలిగిన వ్యక్తులు వస్తుంటారని, అలాంటి సమయాల్లో ఎపిపిలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. న్యాయమూర్తులను ప్రజలు గమనిస్తున్నట్లే ప్రజలు లోతుగా ఏపిపిల వ్యవహార శైలిని కూడా పరిశీలిస్తుంటారని గుర్తు చేశారు. 2014 లెక్కల ప్రకారం వివిధ న్యాయస్థానాల్లో నమోదైన కేసుల్లో 25.7 శాతం మాత్రమే నేర నిర్థారణ జరిగి శిక్షలు పడ్డాయని చెప్పారు. ఏపిపిలకు వృత్తి పరమైన శిక్షణ అవసరముందన్నారు. సాయంత్ర సమావేశానికి హాజరైన నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ చట్టాల గూర్చి పోలీసులకు అవగాహన కలిగించాల్సిన అవసరముందన్నారు. ఏపిపిలు, పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ నేరస్థులకు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జస్టిస్ రమణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అసోసియేషన్ ఘన సత్కారం చేసింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ జి భవానీస్రాద్, జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి పి రవీంద్రబాబు, రాష్ట్ర న్యాయ కార్యదర్శి సిఎస్‌ఎస్‌వి దుర్గాప్రసాద్, ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ సిసి సుబ్రహ్మణ్యం, డెప్యూటీ డైరెక్టర్ అజయ్ ప్రేమ్‌కుమార్, క్యాడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు టి శ్రీనువాసుల రెడ్డి, జిల్లా డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రాంకోటేశ్వరరావు, జిల్లా న్యాయాధికారులు, 13 జిల్లాల నుంచి వచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.

నగర సుందరీకరణకు
అవుట్‌డోర్ మాస్టర్‌ప్లాన్
* ప్రైవేటు సంస్థకు బాధ్యలప్పగించిన కమిషనర్ వీరపాండియన్
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 23: రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు విఎంసి కమిషనర్ వీరపాండియన్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నగర భౌగోళిక పరిస్థితుల కనుగుణంగా ఏయే చర్యలు తీసుకోవచ్చునన్న అంశంపై న్యూఢిల్లీకి చెందిన ఛోసెన్‌కో అడ్వర్‌టైజింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో శనివారం నగరంలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అవుట్‌డోర్ అడ్వటైజ్‌మెంట్ పాలసీలను దృష్టిలో పెట్టుకొని విఎంసి పరిధిలోని నగర పరిసరాల్లోని వివిధ బహిరంగ ప్రదేశాల్లో ప్రకటన బోర్డులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌తోపాటు స్ట్రీట్ ఫర్నీచర్‌ను తయారు చేసి సంవత్సర కాలం లోపుగా నివేదించాలని సూచించారు. ప్రజలను మరింతగా ఆకర్షించే విధంగా నగర స్థితిగతులను బట్టి ఏయే ప్రాంతాల్లో ఏయే బోర్డులను ఏర్పాటు చేయాలి, ఏర్పాటుచేసే అన్ని బోర్డులూ ఒకే యూనిఫామ్‌గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నగర పరిధిలో గుర్తించిన 64 ప్రధాన రహదారులను అధ్యాయనం చేసి వ్యాపార రద్దీ ఉండే కమర్షియల్ ప్రాంతాల్లో మరింత ఆకర్షణీయ అభివృద్ధి అంశాలపై కేంద్రీకరించాలన్నారు. నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం నగర భౌగోళిక, నైతిక స్వరూపం తెలుసుకునేలా సూచిక బోర్డుల ఏర్పాటుపై కూడా దృష్టిసారించాలన్నారు. రానున్న కాలంలో నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దే భాగంలో చేపడుతున్న గ్రీనరీలు, రహదారులు, ఫుట్‌పాత్‌లు ఇతర అభివృద్ధి పనులకు దీటుగా హోర్డింగ్‌లు, డిజిటల్ బోర్డులు, రోడ్డుపక్కన ఫుడ్‌కోర్టులు, బస్ షెల్టర్ల ఆధునీకరణ తదితర అంశాలపై అందమైన నివేదిక అందించాలని హితవుపలికారు. పెరుగుతున్న ట్రాఫిక్ వ్యవస్థకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నగర ప్రవేశ ద్వారాల ఏర్పాటులో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా అవుట్‌డోర్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీని రూపొదించాలని తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటు చేసే ఈ పాలసీతో విఎంసి ఖజానాకు ప్రస్తుతం సమకూరుతున్న ఆదాయం కన్నా రెండు రెట్లు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. అలాగే ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం బస్‌స్టేషన్ల నిర్మాణం, రైళ్ల, బస్‌ల సమాచారం తెలిపే విధంగా ఏర్పాటు చేయడంతోపాటు పబ్లిక్ టాయ్‌లెట్స్, డస్ట్‌బిన్లు ఏర్పాటుపై కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు తరుణ్‌ఖన్నా తదితరులు పాల్గొన్నారు.

నాకు ఇష్టమైన పాత్రే అభిమానులకు నచ్చింది
* డిక్టేటర్ చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 23: తనకు ఇష్టమైన పాత్రే అభిమానులకు నచ్చిందని డిక్టేటర్ చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. వేదస్వ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన డిక్టేటర్ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా శనివారం చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా శనివారం చిత్ర యూనిట్ నగరానికి విచ్చేసింది. నగరంలో చిత్రం ప్రదర్శింపబడుతున్న అన్నపూర్ణ థియేటర్‌లో ప్రేక్షకులను కలిశారు. ఇప్పటివరకు 98 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించానని, తన తండ్రి నందమూరి తారక రామారావు అభిమానులు ఆశించిన రీతిలో తన నటనతో మెప్పించగలిగానన్నారు. తన 99వ చిత్రమైన డిక్టేటర్ చిత్రంలో తనకు ఇష్టమైన పాత్ర డిక్టేటర్ అని, ఇది తప్పక ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశించానన్నారు. ఆశించిన విధంగానే చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు తన కృతజ్ఞతలు చెప్పారు. సకుటుంబ సపరివారంగా చూడగలిగే విధంగా ఈ చిత్రాన్ని దర్శకులు తెరకెక్కించారన్నారు. ప్రేక్షకుల ఆదరణ తనకు మరింత ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తుదిశ్వాస వరకు అభిమానుల ఆకాంక్షల కనుగుణంగా నటిస్తూనే ఉంటానన్నారు. చిత్ర దర్శకులు శ్రీవాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నాడు బాలకృష్ణ చిత్రం విడుదలైందంటే అది తప్పక విజయవంతం అవుతుందని ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారన్నారు. చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతోనే చిత్రాన్ని చక్కగా తెరకెక్కించగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన 30 ఇయిర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చిన్నా, అన్నపూర్ణ థియేటర్ అధినేత ఎఎల్‌ఎస్‌ఆర్ కుమార్, కృష్ణాజిల్లా చిత్ర పంపిణీదారుల ఇంద్ర ఫిలింస్, శక్తి రమేష్, అన్నపూర్ణ థియేటర్ మేనేజర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
నటరత్న ఎన్టీఆర్ పేరుతోనే టిడిపి మనుగడ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన తన తండ్రి నందమూరి తారక రామారావు భౌతికంగా లేకపోయినా ఇప్పటికీ ఆయన పేరుతోనే పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు.

నిబంధనల మేరకే షాపుల మ్యూటేషన్
* విఎంసి ఎస్టేట్ అధికారులకు మేయర్ శ్రీ్ధర్ సూచన
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 23: విజయవాడ నగరపాలక సంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్సుల షాపుల మ్యూటేషన్‌ను నిబంధనల మేరకే చేపట్టాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ విఎంసి ఎస్టేట్ అధికారులకు సూచించారు. ఈసందర్భంగా శనివారం ఉదయం తన ఛాంబర్‌లో ఎస్టేట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కార్పొరేషన్ ఆస్తులను ఇష్టానుసారం లీజుల కిచ్చి వివాదాలను సృష్టించవద్దని, విఎంసి తరఫున వివిధ స్థాయి కోర్టులలో ఉన్న కేసులు ఎస్టేట్ విభాగ కేసులే ఎక్కువ ఉన్నాయంటే ఎస్టేట్ సెక్షన్‌లో ఇప్పటివరకూ పనిచేసిన అధికారుల పనితీరే ప్రధాన కారణం కావడం గర్హనీయమన్నారు. ఎటువంటి లీజు వ్యవహారాలైనా స్టాండింగ్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకురావడంతోపాటు రూల్స్‌లను అనుసరించి ఇకముందు లీజుకిచ్చే భాగస్వామ్య అగ్రిమెంట్‌ను 500 రూపాయల స్టాంప్ డ్యూటీతోతప్పనిసరిగా రిజిస్టేషన్ చేయించాలన్నారు. అలాగే షాపుల పేరుమార్పిడి చేసే మ్యూటేషన్ ప్రక్రియ కూడా నిర్థిష్టమైన కండీషన్లతో చేయాలన్నారు. ఈ సమీక్షలో ఎస్టేట్ అధికారి గోపాలశాస్ర్తి తదితరులు పాల్గొన్నారు.

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన
సబ్ రిజిస్ట్రార్ బినామీ బావ అరెస్టు
విజయవాడ (క్రైం), జనవరి 23: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన సబ్‌రిజిస్ట్రార్ బినామీని ఏసిబి అధికారులు శనివారం అరెస్టు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు అరెస్టు చేసినట్లు డిఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపారు. అక్రమ సంపాదనకు పాల్పడిన వారి బినామీల భరతం కూడా పడతామని ఇప్పటికే ఆయన హెచ్చరించారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కేసులో ఆయన అక్రమ ఆస్తులకు అతని బావ అడిగొప్పల వెంకటలక్ష్మీ బినామీగా ఉన్నారు. ఏలూరు రేంజ్ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు డిఐజి కార్యాలయం సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ పోతంగి వీర వెంకట దుర్గాప్రసాద్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈనెల 19న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోటికి పైగా ఈయన వద్ద అక్రమాస్తులు గుర్తించారు. ప్రస్తుతం రిమాండులో ఉన్నాడు. కాగా.. ఈ ఆస్తులకు ఏలూరుకు చెందిన అతని సోదరి భర్త అడిగొప్పల బాల వెంకట సత్యరాంప్రసాద్‌ను బినామీగా ఉన్నట్లు ఏసిబి అధికారులు గుర్తించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ ఆస్తులకు సంబంధించి తాను అప్పులు తీసుకున్నానని, అవి తీర్చేలేనందున తనకు అప్పు ఇచ్చిన వారి నుంచి లీగల్ నోటీసులు కూడా అందాయని ఏసిబి విచారణలో వెల్లడించాడు. దీనిపై ఆరా తీయగా అప్పులిచ్చిన వ్యక్తుల్లో ముగ్గురు తెల్లరేషన్ కార్డుదారులు కాగా, మరో ఐదుగురు అడ్రస్‌లే లేవని, మిగిలిన నలుగురు అతని బంధువులు కాగా.. వీరికి పూరిగుడెసెలు తప్ప ఆస్తులు లేనట్లు విచారణలో గుర్తించారు. అంటే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు అప్పులు అనే కథకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన అధికారులు సబ్ రిజిస్ట్రార్ బినామీ అయిన అతని బావ సత్యరాంప్రసాద్‌ను శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఫిబ్రవరి 3వరకు రిమాండు విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.

పటమటలో గంజాయి నిల్వలు పట్టివేత
విజయవాడ (క్రైం), జనవరి 23: తమకందిన సమాచారం మేరకు పటమట పోలీసులు ఓ ఇంట్లోని వాహనంలో భారీగా గంజాయి నిల్వలు గుర్తించారు. ఇబ్రహీంపట్నం పోలీస్టేషన్ పరిథిలోని కొండపల్లి ఐడిఏ వద్ద ఓ లారీని స్వాధీనం చేసుకుని అనుమానంతో పరిశీలించిన పోలీసులు లారీలో సుమారు 3,200 కేజీల గంజాయిని గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఇబ్రహీంపట్నం పోలీసుల దర్యాప్తులో వెల్లడైన సమాచారం మేరకు పటమట పోలీసులు అప్రమత్తమై శనివారం మరో గంజాయి నిల్వలు కనుగొన్నారు. భారతీనగర్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఓ రేకుల షెడ్డు ఇంటిపై సోదాలు నిర్వహించారు. నిర్మానుష్యంగా ఎవరూ లేకుండా ఉన్న ఇంటి ఆవరణలో నిలిపి ఉంచి ఓ వ్యానులో గంజాయి నిల్వలు గుర్తించారు. 49 సంచుల్లో సుమారు 700 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇంత భారీ మొత్తంలో గంజాయి నిల్వలు పటమట పోలీస్టేషన్ పరిధిలో గుర్తించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకువచ్చి పెద్ద మొత్తంలో ఇక్కడ నిల్వలు చేసి ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి స్వాధీనం చేసుకున్న పటమట సిఐ కెనడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మినీ కాపునాడు
* హాజరుకానున్న పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 23: అధికారమే పరమావధిగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులను బిసి జాబితాలో చేరుస్తానంటూ హామీలు గుప్పించి నేడు కమిషన్‌ల పేరిట కాలయాపన చేస్తున్నారంటూ పిసిసి ప్రధాన కార్యదర్శులు ఆకుల శ్రీనివాసకుమార్, మీసాల రాజేశ్వరరావు ధ్వజమెత్తారు. శనివారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 31 తేదీ తణుకులో జరిగే కాపునాడుకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మద్దతు నిస్తున్నదంటూ దీనిలో భాగంగా ఆదివారం ఉదయం ఐవి ప్యాలెస్‌లో మినీ కాపునాడు నిర్వహిస్తున్నామన్నారు. పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య, జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. కాపుల సంక్షేమం కోసం ప్రతి ఏటా వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో ఐదువేల కోట్లు జమచేస్తామని చెప్పిన చంద్రబాబు గత రెండేళ్లలో కేవలం వంద కోట్లు మాత్రమే జమ చేసారని అన్నారు. కాపు సామాజిక వర్గంలో పుట్టి పెరిగి అన్ని అవకాశాలు అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కాపుల ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారన్నారు. 50 శాతం రిజర్వేషన్లు మించి రాలేదంటూ 2004లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటూ చంద్రబాబును వెనకేసుకురావడం శోచనీయమన్నారు. అసలు చంద్రబాబు ఏది తలచుకుంటే జరుగదని అన్నారు. బోండా ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని కాపునాడు మద్దతు నివ్వాలన్నారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌సి సెల్ రాష్ట్ర కన్వీనర్ పొదిలి చంటిబాబు, సీనియర్ నేత ఎస్‌వి రాజు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం నిర్వహణపై మేయర్ శ్రీ్ధర్ మండిపాటు
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 23: నగర పాలక సంస్థ పాఠశాలల్లో ప్రభుత్వం విద్యార్థులకు అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా బాధ్యతగా చేపట్టాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా 16వ డివిజన్‌లోని తాడికొండ సుబ్బారావు విఎంసి స్కూల్లో విద్యార్థులకు సక్రమంగా భోజనం అందజేయకుండా చేతివాటం చూపుతున్న ఏజెన్సీ విషయాన్ని తెలుసుకొన్న మేయర్ శ్రీ్ధర్ స్థానిక కార్పొరేటర్ మద్దా శివశంకర్‌తో కలిసి శనివారం స్కూల్‌కు వెళ్లి అక్కడ జరుగుతున్న భోజన పథకం తీరును పరిశీలించిన ఆయన పథకం అమలుచేస్తున్న ఏజెస్సీల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, అల్పాదాయ వర్గాల పిల్లల కోసం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలుచేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్న విషయాన్ని గుర్తించి పథకాన్ని నిర్వహించే ఏజెన్సీలపై నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యార్థులకు కడుపు నిండుగా భోజనం పెట్టకుండా అరాకొరా భోజనంతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి సత్వరమే మెరుగైన ఏజెన్సీలకు అప్పగించాలని విఎంసి విద్యాధికారులను ఆదేశించారు.

జన్మభూమి అర్జీలకు సత్వర పరిష్కారం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 23: మూడవ విడత జన్మభూమి గ్రామసభల్లో వచ్చిన అర్జీలపై తక్షణం స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులను ఆదేశించారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. 2, 4, 1, 7 స్థారుూ సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్ అనూరాధ మాట్లాడుతూ జన్మభూమి అర్జీలపై మొక్కుబడి తంతుగా కాకుండా సమగ్ర విచారణ జరపాలన్నారు. జిల్లాలో 3లక్షల 38వేల మందికి రూ.36కోట్ల 21లక్షల మేర ప్రతినెలా సామాజిక పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. జన్మభూమిలో పెన్షన్ల కోసం సుమారు 20వేల అర్జీలు వచ్చాయని, ఇందులో 16వేల అర్జీలను ఆన్‌లైన్ చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. మిగిలిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి ఆన్‌లైన్ చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. 2015-16 సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 20వేల 370 డ్వాక్రా గ్రూపులకు 745 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించినట్లు తెలిపారు. స్ర్తి నిధి పథకం కింద రూ.60కోట్లు వడ్డీ లేని రుణాలు అందించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.10కోట్లు మాత్రమే పంపిణీ చేయటం ఏమిటని చైర్‌పర్సన్ అనూరాధ డిఆర్‌డిఎ పీడీ చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. అలాగే స్ర్తి నిధి కింద మండలానికి ఒకటి చొప్పున కాంక్రీట్ మిక్స్ యూనిట్లు అందిస్తామని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారుల జాబితా అందించాలని కోరారు. దీనిపై స్పందించిన పలువురు సభ్యులు మండలానికి కనీసం ఐదు యూనిట్లు అయినా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈవిషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అనూరాధ హామీ ఇచ్చారు. వికలాంగ పెన్షన్లకు సంబంధించి సదరం క్యాంప్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని చైర్‌పర్సన్ ఆదేశించారు. జిల్లాలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణను డ్వాక్రా సభ్యులకు అప్పగించామని, అన్ని పాఠశాలలకు ఈ విధానాన్ని అమలు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఇస్తున్న రూ.2వేలు ఏమాత్రం సరిపోవడం లేదని, ఇందులో వెయ్యి రూపాయలు క్లీనింగ్ సామగ్రికే ఖర్చవుతోందని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. గృహ నిర్మాణ శాఖపై జరిగిన చర్చలో పీడీ శరత్ కుమార్ మాట్లాడుతూ జన్మభూమిలో గృహ నిర్మాణాల కోసం 62వేలు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి 1250 చొప్పున గృహాలు మంజూరయ్యాయని అధికారులు తెలియచేయగా మంజూరైన గృహాల్లో 50శాతం లేఅవుట్లలో నిర్మించాలన్న నిబంధనపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఅవుట్లు లేని మండలాలకు గృహాల మంజూరు తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చైర్‌పర్సన్ అనూరాధను కోరారు. కొత్త ఇసుక విధానం అమలుకు జిల్లాలో 11 రీచ్‌లకు ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు టెండర్లు పిలిచినట్లు సంబంధిత అధికారి తెలిపారు. క్యూబిక్ మీటరు రూ.500లకు మించి అమ్మరాదని, మాన్యువల్ ప్రకారమే ఇసుక తవ్వించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ నాగార్జున సాగర్, జెడ్పీటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సినిమాల్లోని మంచే మనకు స్ఫూర్తి
గన్నవరం, జనవరి 23: సినిమాల ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుందని, సినిమాలు చూసి జనం ప్రభావితులవుతారని, సినిమాల్లో మంచిని మాత్రమే స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు హితవు పలికారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా శనివారం ఉదయం ఈ సినిమా ప్రదర్శిస్తున్న శాంతి థియేటర్‌కు ఆయనతో పాటు, ఆ సినామా డైరెక్టర్ శ్రీనివాస్, క్యారెక్టర్ నటుడు ఫృధ్విరాజ్ తదితరులు వచ్చారు. వీరికి దుర్గా ఫిలింస్ పంపిణీదారులు తుమ్మల రామ్మోహనరావు, గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనదరావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ సినిమా చరిత్రలో తెలుగు సినిమాకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఎందరో నటులు తమ నటనాచాతుర్యంతో ప్రజల హృదయాలను దోచుకున్నారన్నారు. ఇక నుండి ప్రతి ఏటా సంక్రాంతి పండుగ నాడు తన సినిమా విడుదల అయ్యేలా చూస్తానని, అభిమానులకు హామీ ఇచ్చారు. తనను ఆదరిస్తున్న అభిమానులను రుణపడి ఉంటానన్నారు. పట్టుదలతో కృషి చేస్తే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చని డిక్టేటర్ సినిమా రుజువు చేసిందన్నారు. అభిమానులు సమాజ సేవలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సినిమా విజయానికి పాటుపడిన వారందరికీ బాలయ్య అభినందించారు. పృధ్విరాజ్ మాట్లాడుతూ నట సింహాలైన అన్న ఎన్టీఆర్‌తోపాటు బాలకృష్ణ సరసన నటించడం అదృష్టమన్నారు. డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ సినిమాను ఆదిరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీ, దాసరిలు ప్రసంగించారు. అనంతరం బాలకృష్ణ ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా పంపిణీదారులు తుమ్మల రామ్మోహనరావు బాలయ్యను గజమాలతో సత్కరించారు. బాలయ్య అభిమానులు కేరింతలు కొట్టారు. బాలకృష్ణ రాక సందర్భంగా సినిమా థియేటర్ వద్ద పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గొంది సాంబశివరావు, మండవ లక్ష్మి, బొబ్బా రామారావు, వీరమాచినేని నాగ శ్రీనివాసరావు, పాతూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మానసిక ఆందోళనతో
టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
కంచికచర్ల, జనవరి 23: పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానిక గౌతమి హైస్కూల్ హాస్టల్‌లో శనివారం జరిగింది. మండలంలోని మొగులూరుకు చెందిన వెలగా నర్సయ్య, సునీత దంపతుల కుమారుడైన వినయ్‌కుమార్ (16) స్థానిక గౌతమి హైస్కూల్ హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్‌కుమార్ ఉరి వేసుకొని ఉండటాన్ని గమనించిన విద్యార్థులు కరస్పాండెంట్ నాగేశ్వరరావుకు తెలియజేయగా ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా వారు అక్కడకు చేరుకున్నారు. పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతుండటంతో మానసిక ఆందోళనకుగురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ అవినాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పోస్టుమార్టం రూమ్‌లో బాలుడి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
నూజివీడు, జనవరి 23:్భరతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం వంటిదని సబ్ కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు పొందేలా భారత ఎన్నికల సంఘం చట్టం చేసిందని, నేటి యువత ఓటు హక్కు ప్రాముఖ్యతతో పాటు అవగాహన కలిగి ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇందుకుగాను అవగాహన కల్పించడానికి ఈనెల 25న ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా రాజీవ్ సర్కిల్ నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని, అనంతరం ధర్మ అప్పారావు కళాశాలలో సమావేశం జరుగుతుందన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాలలోని విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు నిర్వహించామని, విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. నూజివీడులోని ధర్మ అప్పారావు కళాశాలలో నిర్వహిస్తున్న ఓటరు దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సబ్ కలెక్టర్ లక్ష్మీశ పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దారు ఇంత్యాజ్ పాషా, ధర్మ అప్పారావు కళాశాల ప్రిన్సిపాల్ జివి రామారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళి
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి వేడుకలను శనివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, పలు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నేతాజీకి ఘన నివాళులర్పించారు. చల్లరాస్తా సెంటరులో సామాజిక కార్యకర్త మైనంపూడి సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయులను ఎదిరించి ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని తయారుచేసి అండమాన్, నికోబార్, బర్మారంగూన్ ప్రాంతాలను విముక్తి చేసిన మహాయోధుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, టిడిపి మైనార్టీ నాయకులు షేక్ వౌలాలి, గుమ్మడి విద్యాసాగర్, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు అచ్చాబా, కాంగ్రెస్ నాయకులు రబ్బాని, బిజెపి నాయకులు పంతం గజేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, పట్టణ ప్రముఖుడు హుస్సేన్ మాష్టారు, పివి ఫణికుమార్, వైకాపా నాయకులు మాదివాడ రాము, లంకిశెట్టి బాలాజీ, వి ఉమాదేవి, చరిత కార్తీక్, తదితరులు పాల్గొన్నారు. రామానాయుడుపేట సెంటరులోని బిజెపి కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ఘన నివాళులర్పించారు. పార్టీ నాయకులు పంతం వెంకట గజేంద్రరావు, చిలంకుర్తి పృధ్వీప్రసన్న, కూనపరెడ్డి శ్రీనివాస్, ఎన్ మురళీకృష్ణ, కంభాల శంకరబాబు, వైవిఆర్ పాండురంగారావు, కూనపరెడ్డి సుబ్బయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు. పట్టణ నడిబొడ్డు కోనేరు సెంటరులో భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఎపిలో రాజ్యాధికారం కోసం
రాజీలేని పోరాటం చేస్తాం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, విజయవాడ మాజీ డెప్యూటీ మేయర్ వి సత్యనారాయణ అన్నారు. స్థానిక ఈశ్వర్ రెసిడెన్సీలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బిసి వర్గాలతో కలిసికట్టుగా పనిచేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి జిల్లా కమిటీలను గుర్తించి కోర్ కమిటీ ముందు ఉంచుతామన్నారు. రెండు మూడు నెలల్లో జిల్లా కమిటీల నియామకం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే ములాయంసింగ్ యాదవ్, లాలూ యాదవ్ వంటి గొప్ప నాయకులతో విజయవాడ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు చర్యలు చేపట్టామన్నారు. యాదవులంతా సమష్టిగా పనిచేసి మహాసభ బలోపేతానికి కృషి చేయాలన్నారు. యాదవులను చిన్నచూపు చూస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు బొర్రా విఠల్, కొలుసు హరి, నాలి మాధవ, శ్రీనివాస్, రాజా, కొండా, తదితరులు పాల్గొన్నారు.

రైతుల హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వం
తోట్లవల్లూరు, జనవరి 23: రాజధాని ప్రాంతంలోని మండలాలను అభివృద్ధి చేయాల్సిన టిడిపి ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాసేందుకు తోట్లవల్లూరు మండలాన్ని గ్రీన్‌జోన్-ఏలో ప్రకటించటం దారుణమని జిల్లా పరిషత్‌లో వైపాకా ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి విమర్శించారు. తోట్లవల్లూరు మండలాన్ని సిఆర్‌డిఎ డ్రాఫ్ట్ ప్లాన్ గ్రీన్‌జోన్-ఏలో చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ అత్యవసర సమావేశం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మండల పరిషత్ ప్రత్యేక సమావేశానికి పలువురు ఎంపిటిసిలు సభ్యులు, సర్పంచ్‌లు హాజరయ్యారు. సమావేశంలో పద్మావతి మాట్లాడుతూ మండలంలో ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా అగ్రికల్చర్ జోన్‌లో చేర్చటం సమంజసం కాదన్నారు. ఈ జీఓ వల్ల రైతులు వారి భూములపై సర్వాధికారాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఎంపిపి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధిని అడ్డుకోటానికే ప్రభుత్వం గ్రీన్‌జోన్ అంటూ నాటకాలు అడుతోందని, దీన్ని కనుక రద్దుచేయకపోతే రైతులందరితో సంఘటితమై పాలకుల మెడలు వంచైనా సాధిస్తామన్నారు. అగ్రికల్చర్ జోన్‌ని రద్దుచేయాలని ఎంపిపి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని శనివారమే సిఆర్‌డిఎకు రిజిస్టర్ పోస్ట్ చేయాలని వెంకటేశ్వరరెడ్డి అధికారులకు సూచించారు. మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఎన్ రాజేంద్ర మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే అగ్రికల్చర్ జోన్‌ని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి సిఆర్‌డిఎకి పంపించారని తెలిపారు. సమావేశంలో ఎంపిడిఓ ఈశ్వరపద్మసుధ, వైస్ ఎంపిపి పిఎస్ కోటేశ్వరరావు, ఎంపిటిసిలు మూడే శివశంకర్, ఆరేపల్లి శ్రీనివాసరావు, ఈఓపిఆర్‌డి అరుణకుమారి, ఆర్‌ఐ సునీత, ఏఓ శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సర్వీస్ ఈనాం భూములు
అర్చకులకే అప్పగించాలి
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 23: అర్చకుల సర్వీస్ ఈనాం భూములను వారికే వదలాలని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య జిల్లా శాఖ డిమాండ్ చేసింది. స్థానిక జిల్లా అర్చక సమాఖ్య కార్యాలయంలో శనివారం జిల్లా కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు ఘంటసాల పద్మనాభ శర్మ మాట్లాడుతూ మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వంశ పారంపర్యంగా పనిచేస్తున్న అర్చక ఈనాం భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకుందన్నారు. దీనిపై ఎన్నిసార్లు మాట్లాడినా అర్చకస్వామికి భూమి అప్పిగించలేదన్నారు.
అర్చకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు పిలుపు మేరకు జిల్లాలోని అర్చకులు ఫిబ్రవరి మొదటి వారం నుండి ఆందోళన చేయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రతినిధులు మామిళ్ళపల్లి నాగేంద్రం, అగ్నిహోత్రం ఫణిగోపాల్, బృందావనం సుధీర్‌బాబు, బద్దు పవన్‌కుమార్, వేణుగోపాలాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి సర్వీస్ రూల్