రాష్ట్రీయం

ఎమ్మెల్యేకు రెండున్నరేళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 2వేల జరిమానా
పరిశ్రమపై దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు
అప్పీల్‌కు నెల రోజుల గడువు

సంగారెడ్డి, డిసెంబర్ 10: ఓ కార్మికుడి మృతికి కారణమైన పరిశ్రమపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మెదక్ జిల్లా పటన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి రెండున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానం జడ్జి డి.దుర్గాప్రసాద్ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జిల్లా కోర్టుకు వెళ్లేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. పటన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మహేశ్ పాశమైలారం పారిశ్రామిక వాడలోని వర్ష టైల్స్ ఆటో కాంపొనెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్మికునిగా పనిచేశాడు. 2014 మే 6వ తేదీన మహేశ్ పారిశ్రామిక వాడలో అనుమానస్పద రీతిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కార్మికుడు పరిశ్రమలోనే చనిపోయాడని, యాజమాన్యం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని, కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని పటన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వంద మంది అనుచరులతో వెళ్లి పరిశ్రమపై దాడి చేసి ఆస్తులను ధ్వంసం చేసినట్లు పరిశ్రమ యజమాని ఐలా అధ్యక్షుడు పొట్టి చందుకుమార్ బిడిఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్మికుడి కుటుంబానికి 15 లక్షల రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వాలని బలవంతంగా చెక్కును రాయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న బిడిఎల్ పోలీసులు మహిపాల్‌రెడ్డిపై 342, 448, 504, 508, 386 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 19 నెలల పాటు సంగారెడ్డిలోని అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానంలో కేసు పూర్వాపరాలను జడ్జి దుర్గాప్రసాద్ పరిశీలించారు. ఒక్కో సెక్షన్‌కు ఒక్కో రకమైన శిక్షను విధిస్తూ మొత్తం రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, 2 వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల వెసులుబాటు కల్పించడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై పటన్‌చెరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రజల కోసం, కార్మికుల కోసం రెండున్నరేళ్లు కాదు జీవితాంతం జైలులో ఉండటానికైనా సిద్ధమని ప్రకటించారు.
చర్చనీయాంశమైన తీర్పు
మహిపాల్‌రెడ్డికి రెండున్నర సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించిన విషయం రాజకీయ వర్గాలకు క్షణాల్లో చేరింది. వార్డు స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఇదే అంశంపై చర్చ కొనసాగింది. వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ల ద్వారా ఎమ్మెల్యేకు జైలు శిక్ష అన్న సందేశాలను పంపుకోవడం విశేషం. ఎమ్మెల్యే స్థాయి నాయకునికి మొట్టమొదటి సారిగా జైలు శిక్ష ఖరారు కావడం పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు జైలు శిక్ష పడటం టిఆర్‌ఎస్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.