జనాంతికం - బుద్దా మురళి

క్యాంపస్ సెలక్షన్.. పెళ్లిచూపులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎన్నికల ఫలితాల కోసం ఇంకో రెండు వారాలు వేచి చూడాల్సిందే, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తాడా? లేక మరో దేవెగౌడ పుట్టుకొస్తాడా? ఈసారి ఉత్తరాది ప్రధానా? దక్షణాది ప్రధానా? ఏది తేలాలన్నా ఈనెల 23వరకూ ఆగాల్సిందే. ప్రధానమంత్రి పదవి నాకు వద్దంటే వద్దు, నేను రేస్‌లో లేను అని ఎంతమంది ప్రకటించినా, ఆ పదవిని ఎవరో ఒకరు స్వీకరిస్తారులే! నువ్వంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా, ఏకపార్టీ పాలన వచ్చినా నీ జీతానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. నీ ఇంక్రిమెంట్ గురించి దిగులొద్దు. ఇంతకూ నువ్వు క్వొశ్చన్ మార్క్ పెట్టింది దేని గురించి? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఎప్పుడో తెలిసిపోయింది.’’
‘‘సినిమాలో ఎవడు ఎవడిని చంపితే నాకేంటి? కథలో ఎవరు ఎవరిని చంపినా కథ డిమాండ్ , దర్శకుడి సృష్టి మేరకే జరుగుతుంది నాకా విషయం తెలియదా? ఐనా నేనా సినిమా టీవీలో వచ్చినా చూడలేదు. రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారో, కేంద్రంలో ఎవరు గెలుస్తారో నాకు స్పష్టత ఉంది. దాని కోసం అస్సలు టెన్షన్ లేదు. దేశంలో ఏం జరిగినా నా జీతానికే కాదు, రిటైరైన తరువాత పెన్షన్‌కు కూడా ఎలాంటి ఢోకా ఉండదనే విషయం నాకు తెలుసు.’’
‘‘మరి.. అంత సీరియస్‌గా ఆలోచిస్తున్న విషయం ఏంటి?’’
‘‘చరిత్ర సృష్టించడం అంటే ఏమో అనుకున్నా.. కానీ నిజమే..’’
‘‘ఎవరు చరిత్ర సృష్టించారు? ఏమా కథ’’
‘‘చరిత్ర సృష్టించడమో, చరిత్ర పునరావృతం కావడమో ఏదైతేనేం.. కానీ అది నిజమే అనిపిస్తోంది’’
‘‘ఇంతకూ ఏమైంది?’’
‘‘అమెరికా జాతీయ పతాకాన్ని కూడా చైనావాడే తయారు చేస్తాడు తెలుసు కదా?’’
‘‘ఇది ప్రపంచానికంతా తెలు సు. అదేకాదు చివరకు మన దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారం కూడా చైనావాడు తయారు చేసిన స్మార్ట్ఫోన్లలోనే సాగుతుంది. ఇంతకూ విషయం ఏంటో చెప్పు’’
‘‘ప్రపంచానికంతటికీ కావలసినవి ఉత్పత్తి చేస్తున్న చైనా దేశంలో పెళ్లీడు కుర్రాళ్లకు అమ్మాయిలను మాత్రం పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారట! పాకిస్తాన్‌లోని పేద క్రైస్తవ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బులు చెల్లించి పెళ్లి చేసుకుంటున్నారట!’’
‘‘నిజంగా చైనావాడు చిత్రమైన వాడేనోయ్. పిల్లల ఉత్పత్తిలో ఆంక్షలు పెట్టి, వస్తువుల ఉత్పత్తిలో టార్గెట్లు పెట్టాడు. తీరా పాపం.. ఆ చైనా కుర్రాళ్లకు పెళ్లికళ లేకుండా చేసేశారు. ఒకే సంతానం అనే విధానం వారి కొంపలను కూల్చేట్టుగా ఉంది’’
‘‘చూస్తుంటే చైనాలో కన్యాశుల్కం మళ్లీ మొదలవుతుందేమో! ’’
‘‘ఒక్క చైనానే ఎందుకు? అంతటా ఇలానే ఉంది కదా? ’’
‘‘చైనా అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయి పెళ్లిచూపులు ఎలా ఉంటాయో ఊహిస్తేనే వింతగా ఉంది కదూ’’
‘‘వీరి ఉర్దూ వారికి అర్థం కాదు. వారి చైనా భాష వీరికి అర్థం కాదు. భలేగా ఉంటుంది కాపురం’’
‘‘భార్యాభర్తల్లో ఒకరి భాష ఇంకొకరికి అర్థం కాకపోవడానికి మించిన వరం ఇంకోటి లేదోయ్! ఆ దంపతుల మధ్య అస్సలు కీచులాటలు ఉండవు’’
‘‘ప్రపంచానికి వస్తువులు ఎగుమతి చేస్తూ, అదే ప్రపంచం నుంచి పెళ్లి కూతుళ్లను దిగుమతి చేసుకుంటే చైనా భవిష్యత్తు ఎలా ఉంటుందో?’’
‘‘చైనా అబ్బాయి, పాకిస్తాన్ అమ్మాయి పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకుంటారంటావ్’’
‘‘ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడమే అదృష్టం అని చైనా కుర్రాళ్లు అనుకుంటుంటే ఇక- మాట్లాడుకోవడం, వంట వచ్చా, డ్యాన్స్ వచ్చా.. అని అడగడం కూడానా?’’
‘‘చైనా భాష నేర్చుకోవడం చాలా కష్టం అంటారు కదా? కాపురానికి వెళ్లిన అమ్మాయి ఆ భాష నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో?’’
‘‘మాట్లాడుకోవడానికి భాష కావాలి కానీ కాపురం చేయడానికి భాషతో పనేంటోయ్! రాజ్యసభ సభ్యుడు, భాజపా నాయకుడు సుబ్రమణ్యస్వామి తెలుసు కదా? ఆయనకు చైనా భాష వచ్చు, ఎందుకు నేర్చుకున్నాడో, ఎంత కాలంలో నేర్చుకున్నాడో ?’’
‘‘ఇండియా, పాక్‌ల కథతో అమీర్ ఖాన్ సినిమా తీసి వందల కోట్లు సంపాదించాడు కదా? పాకిస్తాన్ అమ్మాయి, చైనా అబ్బాయి పెళ్లి చూపులు, కాపురం అనే కథతో సినిమా తీస్తే అంతర్జాతీయ సినిమా అవుతుందా? కామెడీ సినిమా అవుతుందా? ’’
‘‘మనం ఇంకా అమలాపురం అబ్బాయి, అమెరికా అమ్మాయి, తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అబ్బాయి కథల దగ్గరే తచ్చాడుతున్నాం’’
‘‘తెలుగు సినిమాలు అంటే నీకెప్పుడూ చిన్నచూపే కానీ ఆ రెండు దేశాల వారి మధ్య పెళ్లిచూపులు ఎలా ఉంటాయో తలచుకుంటేనే నవ్వొస్తోంది’’
‘‘పెళ్లిచూపులు కాలాన్ని బట్టి మారుతుంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నట్టుగానే ముందు నుంచీ లేవు పెళ్లిచూపులు. ఒక్కో కాలంలో ఒక్కో రకంగా పెళ్లిచూపులు ఉండేవి.’’
‘‘గురజాడ అప్పారావు కాలం నాటి కన్యాశుల్కం ఒక రకమైన సమస్య. అప్పుడు అమ్మాయిలే దొరికేవారు కాదు, డబ్బులిచ్చి వధువులను కొనుక్కుని పెళ్లి చేసుకునే వారు. ఇప్పుడు చైనాలో ఆధునిక కన్యాశుల్కం కనిపిస్తోంది.’’
‘‘చూస్తుంటే మళ్లీ స్వయం వరం కాలం వచ్చేట్టు ఉంది. స్వయం వరం అంటే ప్రస్తుతం కనిపించే పెళ్లిచూపులకు పూర్తిగా రివర్స్‌గా సాగే పెళ్లి చూపులు’’
‘‘నిజానికి ఇప్పటి పెళ్లిచూపులు ఎప్పుడు ప్రారంభం అయ్యాయో కానీ రామాయణ, మహాభారత కాలంలోనూ స్వయం వరాలే ఉన్నాయి’’
‘‘రామాయణంలో సీతా స్వయం వరం, మహాభారతంలో ద్రౌపదీ స్వయం వరాలే కదా కథను ముందుకు తీసుకువెళ్లే ప్రధాన ఘట్టాలు’’
‘‘అంకుల్.. గంట నుంచీ మీ చర్చ వింటున్నాను. మీ అంచనా ప్రకారం అలాంటి స్వయం వరం రోజులు మళ్లీ వస్తాయా?’’
‘‘వస్తే రావచ్చు.. నీకెందుకు భయం? ’’
‘‘వా.. వా..’’
‘‘ఏమైంది? అలా ఏడుస్తున్నావ్..’’
‘‘కానె్వంట్ చదువు నుంచి ఇంజనీరింగ్ వరకు ర్యాంకుల టెన్షన్‌లో ఉద్యోగం రాకముందే జుట్టు ఊడింది. కళ్లకు అద్దాలు వచ్చాయి. చివరకు క్యాంపస్ సెలక్షన్‌లో- మేరా బారీ కబ్ అయేగా.. అని ఊపిరి బిగబట్టి ఫలితాల కోసం చూస్తున్నా.. ఈ గండం నుంచి బయట పడక ముందే చివరకు పెళ్లికి కూడా క్యాంపస్ సెలక్షన్‌లా క్యూలో నిలబడినా- నా వంతు రాకపోతే? తలుచుకుంటేనే భయంగా ఉంది’’
*

buddhamurali2464@gmail.com