రాష్ట్రీయం

కాల్వలో పడిన ఆంబులెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 14: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో ఆదివారం వేర్వేరుచోట్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మరణించారు. విశాఖ జిల్లా యలమంచిలి వద్ద అంబులెన్స్ ఒకటి వంతెనపైనుంచి కాల్వలో పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఒడిశాలోని బాలేశ్వర్ ప్రాంతానికి చెందిన నిరంజన్‌గిరి (70) చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో మృతిచెందాడు. అతని మృతదేహాన్ని తీసుకుని ఆంబులెన్స్‌లో ఒడిశాకు బయలుదేరగా యలమంచిలి మలుపువద్ద కాల్వలోకి బోల్తాకొట్టింది. ప్రమాదంలో నిరంజన్‌గిరి కుమారుడు రవికుమార్ (40), అతని కొడుకు జిగా, భార్య పవిత్రగిరి (65), సోదరి మనిశి (45) అక్కడికక్కడే మృతిచెందారు. రవికుమార్ భార్య స్వర్ణలత, ఇద్దరు కుమార్తెలు మమత, నమత, రవికుమార్ తమ్ముడు సీతారాం, అంబులెన్స్ డ్రైవర్‌లు వెంకటరమణ, శ్రీనివాస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు.
అతి వేగానికి వ్యక్తి బలి
ఇద్దరు ప్రేమికుల అజాగ్రత్తకు వ్యక్తి బలైపోయాడు. విశాఖకు చెందిన ప్రేమికులు ఆడి కారులో అతివేగంగా అన్నవరానికి వెళ్తూ, పెదపల్లి కూడలి వద్ద మోటారు సైకిల్‌పై వెళ్తున్న ప్రభాకరరావు (55)ను ఢీకొట్టారు. ప్రమాదంలో ప్రభాకరరావు అక్కడికక్కడే మరణించాడు. అలాగే అచ్యుతాపురం మండలం పూడిమడక రోడ్డులో మోటారుసైకిల్‌ను బొలెరో వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో మరో వ్యక్తి మృతిచెందాడు.
ఆటో-బస్సు ఢీ: ఇద్దరి మృతి
పాలకొండ (టౌన్): శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సిరికొండ గ్రామ సమీపంలోని మలుపువద్ద ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో గిరిజనులు సవర జమ్మయ్య (25), సవర సన్నాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. సీతంపేట మండలం బుడ్డుగూడ, తొత్తడి గ్రామాలకు చెందిన గిరిజనులు బూర్జ మండలం లక్కుపురంలో బంధువు ఇంటికి శుభకార్యాయానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. సవర చంద్రరావు, గంగయ్య, సవర తుంబలి, నర్సమ్మ, వసంతరావు, సవర శిమ్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.
పెళ్లి కారు ఢీకొని వ్యక్తి మృతి
బొబ్బిలి: పెళ్లి కారు, మోటారుసైకిల్ ఢీకొన్న సంఘటనలో మోటారుసైకిల్‌పై వెళ్తున్న రొంపల్లి గ్రామవాసి ఎం అప్పలనాయుడు (40) అక్కడికక్కడే మృతిచెందాడు. పెళ్లికొడుకు సహా మరో నలుగురు గాయపడ్డారు. బొబ్బిలి నుంచి పెళ్లి కారు విజయనగరం వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. అలాగే, రామభద్రపురం నుంచి బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌కు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో తిరుపతిరావు (25) అనే వ్యక్తి మృతిచెందాడు. వాహనంపై వెనుకనున్న రామస్వామి గాయపడ్డాడు.
తమిళనాడులో ఐదుగురు మృతి
తడ: ఆంధ్ర సరిహద్దు తమిళనాడులోని ఆరంబాకం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సంభవించిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. నెల్లూరుకు చెందిన శీనయ్య, నాగరాజు, నజీర్, మోహన్ పుచ్చకాయల కొనుగోలు నిమిత్తం టాటా ఏసీ వాహనంలో తమిళనాడులోని మాదరంబాకం వెళ్తుండగా ఆరంబాకం సమీపంలో చెన్నై నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన శీనయ్య (50), నాగరాజు (55) అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నై ఇసిఆర్ రోడ్డులోని సెయింట్ జోసఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సెప్రిక్ (19), అబ్రహ్మం లింకన్ (19), క్లిస్ట్ఫోర్ (19), హరీఫ్ (19) నలుగురు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని ఉప్పలంమడుగుకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. గాయపడ్డ వీరందరినీ స్థానికులు తమిళనాడు 108 వాహనం ద్వారా చెన్నై ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా నజీర్ (50) మృతి చెందాడు. గాయపడిన వారికి చికిత్స చేస్తుండగా హరీఫ్ (19) మృతి చెందాడు. నెల్లూరుకు చెందిన మరో వ్యక్తి మరణించినట్టు సమాచారం. సెప్రిక్, అబ్రహ్మం లింకన్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఆరంబాకం సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.