గుంటూరు

భక్తజనంతో పోటేత్తిన కోటప్పకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*శివనామ స్మరణతో మార్మోగిన త్రికూటాద్రి
*ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో కొండకు చేరుకున్న స్పీకర్, వీవీఐపీలు,వీఐపీలు
*్భక్తుల కోసం పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు
*ఎట్టకేలకు చిలకలూరిపేట మేజర్‌కు నీరు విడుదల
నరసరావుపేట, మార్చి 7: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శైవక్షేత్రం భక్తజనంతో సోమవారం పోటేత్తింది. కిక్కిరిసిన భక్తజనంతో కొండ నిండుగా మారింది. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. వేలాది మంది భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. త్రికూటాచలం శివనామస్మరణతో మార్మోగింది. ఒకవైపు మెట్లమార్గం, మరోవైపు ఘాట్‌రోడ్డులో భక్తులు వేలాదిగా స్వామివారిని చేరుకున్నారు. నూతన దంపతులు మెట్లపూజలు చేసి, స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు.వృద్ధులు, చిన్నారులు ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కొండపైకి చేరుకున్నారు. ఈ ఏడాది వీవీఐపీ, విఐపీల వాహనాలకు పాస్‌లను పూర్తిగా రద్దుచేయడంతో ఆర్టీసీ వారు ఏర్పాటు చేసిన హైటెక్ బస్సుల్లో కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కొండ ఎగువ ప్రాంతంలో దేవాలయ అధికారులు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బారికేడ్ల ద్వారా వీవీఐపీలు, వీఐపీలు స్వామివారి వద్దకు చేరుకున్నారు. అనంతరం వారు స్వామివారి ఆశీస్సులను అందుకున్నారు. ఉచిత దర్శనం ఏర్పాటు చేయడంతో భక్తులు ఎక్కువ మంది స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లలోని భక్తులకు మంచినీటి ప్యాకెట్లను వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, దేవాలయాధికారులు అందచేశారు. పులిహోరను భక్తులకు అందచేశారు. స్వామివారి లడ్డూ, అరిసె ప్రసాదాలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. కొండ దిగువ మెట్లమార్గం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ స్టేషన్ ద్వారా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
చిలకలూరిపేట, నరసరావుపేట మార్గాల వారికి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్టాండ్‌లు ఏర్పాటు చేశారు. పాస్‌ల్లేని వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో కొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొండ దిగువ భాగంలో చిన్నారులకు వివిధ రకాల స్టాల్స్, హోటల్స్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్, కూల్‌డ్రింక్స్ షాపులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నానికి సుమారు 15ప్రభలు కొండకు చేరుకున్నాయి. మరిన్ని ప్రభలు రోడ్డుమార్గం నుండి కొండకు చేరుకుంటున్నాయి. రాత్రి సమయానికి కొండ దిగువ ప్రాంతమంతా విద్యుత్ ప్రభలతో దేదీప్యమానంగా వెలుగొందింది. సాయంత్రానికి భక్తులు రద్దీ ఎక్కువైందని దేవాలయ ఇవో శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా చిలకలూరిపేట మేజర్ కాలువకు తెల్లవారుఝామున సాగర్ జలాలు రావడంతో కొంత వరకు దేవాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ నీరు ఎర్రగా ఉండడంతో ఎక్కువ మంది స్నానాలు ఆచరించేందుకు సుముఖత చూపలేదు. దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక అర్టీసీ బస్సులో కొండకు చేరుకున్న సభాపతి కోడెల, వీవీఐపీలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నరసరావుపేటలోని ఆయన స్వగృహం నుండి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిది గంటలకు కుటుంబ సభ్యులతో కొండ వద్దకు చేరుకున్నారు. ఘాట్‌రోడ్డు వద్ద వీవీఐపీలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక హైటెక్ ఆర్టీసీ బస్సులోకోడెల, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణించారు. మార్గమధ్యలోని పర్యాటక కేంద్రంలో వివిధ రకాల పక్షులు, ఆక్వేరియం, కాళిందిమడుగు వద్దకు వెళ్ళి పర్యాటకులతో ముచ్చటించి, వారి అనుభూతులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల సౌకర్యాలను పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు.
స్వామివారిని దర్శించుకున్న వీవీఐపీలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని తొలుత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు డాక్టర్ కోడెల శివరామకృష్ణ, కోడలు పద్మప్రియ, డాక్టర్ పూనాటి విజయలక్ష్మీ, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా కుటుంబ సభ్యులు, కాంటెనెంటల్ హాస్పిటల్ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, సినీ నటులు శ్రీకాంత్, మురుగుడు హనుమంతురావు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, ఎల్ అప్పిరెడ్డి తదితరులు దర్శించుకున్నవారిలో ఉన్నారు.
వెండి ప్రభను స్వామివారికి బహూకరించిన జడ్జి వెనె్నల
నరసరావుపేట కోర్టుకు చెందిన మొదటి ప్రిన్సిపల్ జడ్జి వెనె్నల దంపతులు సోమవారం స్వామివారికి వెండి ప్రభను బహూకరించారని ఆలయ ఇవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ వెండి ప్రభను స్వామివారికి స్పీకర్ కోడెల అందచేస్తారని వివరించారు.
కొండపైన యాగశాలలో 40ఏళ్ళ నుండి యాగాలు
భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో కొండపైన 40 సంవత్సరాలుగా బొల్లేపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో గణపతి, రుద్ర, చండీ హోమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా హోమాలు నిర్వహించారు. ఈ హోమాది కార్యక్రమాల్లో స్పీకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి కోసం 1976 నుండి ఈ యాగాలు చేస్తున్నట్లు నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 19మంది రుత్విక్కులు పాల్గొన్నారని వివరించారు
రాష్ట్రం అష్టకష్టాల నుండి అధిగమించాలి:స్పీకర్ కోడెల
మహాశివరాత్రి పర్వదినం రోజున స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వామిని దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. విడిపోయిన రాష్ట్రంలో విభజనతో అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలను అధిగమించే దిశగా పయనించాలని స్వామివారిని కోరుకున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భగవంతుడు ఇవ్వాలని కోరుకున్నానని అన్నారు. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు త్రికోటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ప్రభను ఆలయ ఇవో శ్రీనివాసరావు, అర్చకులకు అందచేశారు.