కృష్ణ

కృషి, పట్టుదలతో ఏదైనా సాధించగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 23: యువశక్తిని ప్రయోజనకరమైన అద్భుతమైన శక్తిగా మలిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం, ఏపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర జాతీయ కళాశాల కళామందిర్‌లో బుధవారం జరిగిన నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. నిరుత్సాహపడకుండా ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. దేశీయ, విదేశీ సంస్థలు నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన నెలలోపే విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. రెండేళ్లలో బందరులో పోర్టు నిర్మిస్తామన్నారు.
పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి పనికొచ్చే విధంగా యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. ప్రతిఒక్కరూ భావావిష్కరణ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫార్మసీ విభాగం డైరెక్టర్ ప్రసాద్, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డి సూర్యచంద్రరావు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకె సుందరకృష్ణ, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు మీరావలి, రమ్య, అగస్టీన్, డా. జయశంకరప్రసాద్, డా. సిఎం వినయ్ కుమార్, డా. కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

ఉచిత ఇసుక.. అందని ద్రాక్షే!
తోట్లవల్లూరు, మార్చి 23: తోట్లవల్లూరు మండలంలో ఉచిత ఇసుక ప్రజలకు అందని ద్రాక్షలా తయారయింది. మండలంలో 8 ఇసుక క్వారీలు ఉన్నా ఒక్క క్వారీని కూడా అధికారులు ఉచితానికి గుర్తించలేదు. దీంతో 20 కిలోమీటర్ల దూరాన ఉన్న పెదపులిపాక క్వారీకి వెళ్లి ఇసుక తెచ్చుకునే దుస్థితి ఏర్పడింది. నదీతీరం వెంట ఉన్నప్పటికీ మండల ప్రజలు ఒక ట్రాక్టరు ఇసుక తెచ్చుకోవాలంటే రూ.3వేల నుంచి రూ.4,500 వరకు చెల్లించుకోవలసి వస్తోంది. మండలంలో ఐలూరు, దేవరపల్లి, కళ్ళంవారిపాలెం, చాగంటిపాడు, భద్రిరాజుపాలెం, రొయ్యూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు క్వారీలు ఉన్నాయి. మొన్నటి వరకు రొయ్యూరు క్వారీలో డ్వాక్రా సంఘాల పేరుతో ఇసుక తవ్వకాలు జరిపారు. ఆ సమయంలో క్యూబిక్ మీటరు ఇసుకకు రూ.650 చొప్పున మీ సేవ కేంద్రంలో చెల్లించేవారు. ఒక ట్రాక్టరుకు మూడు క్యూబిక్ మీటర్ల ఇసుక పట్టేది. అంటే మూడు క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ.1950 డిడి తీస్తే కిరాయి రూ.400 కలిపి రూ.2350లకు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకునేవారు. ఇపుడు ఉచిత ఇసుక విధానం ఏర్పాటు చేశాక మండలంలోని ఒక్క క్వారీని కూడా ‘ఉచిత’ జాబితాలోకి చేర్చలేదు. ప్రస్తుతం పెనమలూరు మండలం పెపులిపాక క్వారీలో మాత్రమే ఉచిత ఇసుక లభిస్తోంది. పెదపులిపాక క్వారీ తోట్లవల్లూరు నుంచి 20కిలోమీటర్ల దూరం లో ఉంది. తోట్లవల్లూరుకు ఇసుక తేవాలంటే ఒక ట్రాక్టర్‌కు రూ.3వేల నుంచి రూ.4,500 వరకు కిరాయితో కలిపి తీసుకుంటున్నారని వినియోగదారులు చెపుతున్నారు. అదే ఐలూరుకు రూ.4,500లు చెల్లించాల్సి వస్తోందని గ్రామస్తులు చెపుతున్నారు. ఉదయం వెళ్లిన ట్రాక్టర్ సాయంత్రానికి వస్తుండటంతో ట్రిప్పులు పడటంలేదని, ట్రాక్టర్‌కు ఎక్కువ కిరాయి అడుగుతున్నారని ప్రజలు చెపుతున్నారు. తోట్లవల్లూరు మండలంలోని 8 క్వారీల్లో కనీసం రెండిటిలోనైనా ఉచిత ఇసుక విధానం అమలుచేస్తే ఫలితం ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.

వైద్యరంగంలో
నర్సుల పాత్ర కీలకం
గన్నవరం, మార్చి 23: చిన్నఅవుటపల్లి డాక్టర్ శోభనాద్రి సిద్ధార్థ నర్సింగ్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ హాజరయ్యారు. సిపి మాట్లాడుతూ నర్సింగ్ విద్య ఉత్తమమైనదన్నారు. యువత ఈ రంగంలో రాణించాలని ఆయన సూచించారు. యువతరానికి పోలీసు సహకారం ఉంటుందన్నారు. వైద్య రంగంలో నర్సుల పాత్ర కీలకమని, వారివారి సేవలతోనే సమాజం బాగుటుందన్నారు. సభకు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గ్రేస్ మెటిల్డా అధ్యక్షత వహించారు. వార్షిక నివేదిక సభకు సమర్పించారు. నర్సింగ్ కళాశాల కన్వీనర్ వి శశికళ మాట్లాడుతూ బిడ్డగా కన్ను తెరిచి, జీవితానంతరం కన్నుమూసే వరకు నర్సుల సేవలు అనన్యమన్నారు. సిద్ధార్థ అకాడమీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి నాగేశ్వరరావు, అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, లక్ష్మణరావు, జబమాల మేరీ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.

నేడు జిల్లాకు కాంగ్రెస్ బస్సు యాత్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 23: దళిత, ఆదివాసీ, బిసి, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత ఆదివాసీ, బిసి, మైనార్టీల సామాజిక న్యాయ సాధికారత యాత్ర గురువారం మచిలీపట్నం రానుంది. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి నేతృత్వంలో గత నెల 20న విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగిసి కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం మచిలీపట్నం రానుంది. డా. బిఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవం సందర్భంగా ఆయా వర్గాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనబరుస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు చేపట్టిన ఈ యాత్రను విజయవంతం చేయాలని బందరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చలమలశెట్టి ఆదికిరణ్ తెలిపారు. బుధవారం తన నివాసంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సాయంత్రం 4గంటలకు హుస్సేన్‌పాలెం నుండి వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. జెడ్పీ సెంటరు మీదుగా లక్ష్మీటాకీసు సెంటరుకు చేరుకుని అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్‌కు నివాళులర్పిస్తారన్నారు. అక్కడి నుండి కోనేరుసెంటరు వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఈ యాత్రలో రాజ్యసభ సభ్యులు జెడి శీలం, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పనబాక లక్ష్మి, దేవినేని నెహ్రూ, కడియాల బుచ్చిబాబు, తదితరులు పాల్గొనున్నట్లు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, దళితులు, బిసిలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆదికిరణ్ కోరారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు, జాన్ విక్టర్, యేసుపాదం, మానేపల్లి ఆదాం, కె చంద్రశేఖర్, కుమారి, శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.
భగత్‌సింగ్‌కు నివాళిగా
కాగడాల ప్రదర్శన
మైలవరం, మార్చి 23: భగత్‌సింగ్ 85వ వర్ధంతిని పురస్కరించుకుని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మైలవరం పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మహాత్మా గాంధీ గ్రంథాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల్లో సాగింది. ‘్భగత్‌సింగ్ అమర్ రహే.. జోహార్ భగత్‌సింగ్..’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక బోసుబొమ్మ సెంటరులో కొద్దిసేపు మానవహారంగా ఏర్పడి ప్రపంచ శాంతి వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. గిరిజన సంఘం నేత జె బాలయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
త్యాగధనుడు భగత్ సింగ్
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 23: ప్రజల్లో విప్లవ స్ఫూర్తి, చైతన్యం నింపిన త్యాగధనుడు భగత్ సింగ్ అని సిఐటియు రాష్ట్ర నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఎ గఫూర్ అన్నారు. స్థానిక ఎల్‌ఐసి డివిజనల్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం భగత్ సింగ్ 85వ వర్ధంతి జరిగింది. ఈసందర్భంగా జరిగిన సభలో ప్రధాన వక్తగా గఫూర్ మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చైతన్య పూరితమైన పోరాటం చేసిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు. కార్మిక వర్గం, రైతాంగ పోరాటాలతోనే దేశం సంపూర్ణ విముక్తి దిశలో ముందుకు సాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసిఇయు ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, వివిధ సంఘాల నాయకులు సాంబశివరావు, ధన్‌రాజ్, ఉమామహేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, జనార్ధనరావు, రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

నాట్య ప్రదర్శనలతో మైమరచిన కళాలోకం
కూచిపూడి, మార్చి 23: నాట్యక్షేత్రం కూచిపూడి అగ్రహారంలో అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధేంద్ర నాట్య మహోత్సవాలు నాల్గవ రోజైన బుధవారం కోల్‌కత్తా, ముంబై, విశాఖపట్నం నుండి వచ్చిన కళాకారుల భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో కళాలోకం అభినందనలు అందుకున్నారు. విశాఖపట్నంకు చెందిన కళారత్న ఎబి బాలకొండలరావు కుమారుడు అనుకుల ఆదిత్య బుల్లిబ్రహ్మం వచ్చెను అలివేలుమంగ.. అంటూ హిందోళరాగం, అన్నమాచార్య కీర్తనను శ్రీ వెంకటేశ్వరస్వామి దగ్గరకు అలివేలుమంగమ్మను తీసుకెళుతున్న సందర్భాన్ని అత్యంత వైభవంగా ప్రదర్శించారు. థిల్లానాను సురటి రాగం, ఆదితాళంలో సమ్మోహనంగా ప్రదర్శించారు. కోల్‌కత్తాకు చెందిన డా. దేబాల్ దేవ్ జానా భరతనాట్య రీతిలో గణేశ గౌత్వం అనే అంశాన్ని హంసధ్వని రాగం, ఆదితాళంలో వినాయక ప్రార్థన చేశారు. ధన్యాసిరాగం, ఆదితాళంలో వర్ణాన్ని ప్రదర్శించిన తీరు అబ్బురపర్చింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ విరచిత థిల్లానాను కథనకుతూహల రాగం ఆదితాళంలో ప్రదర్శించారు. చివరగా ముంబైకి చెందిన ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన విద్యార్థులు నాట్యాచార్య మహంకాళి శ్రీరామచంద్రమూర్తి నట్టవాంగంలో ఎస్‌వి భుజంగరాయశర్మ రచించిన జయముజయము లలిత కళావాణికి అనే అంశాన్ని లిఖిత, భార్గవి, పూజితలు రాగమాలిక రాగం, ఆదితాళంలో, పద్మశ్రీ డా. వేదాంతం సత్యనారాయణ శర్మ నృత్య దర్శకత్వంలో భాగవతుల వెంకట్రాయ రచించిన కృష్ణశబ్దాన్ని మోహన రాగం, ఆదితాళంలో సత్యవతి ప్రదర్శించారు.
కులుకుచూ నడవరో.. అనే అన్నమాచార్య కీర్తనను లిఖిత, అనుష్క అఠాణా రాగం ఆదితాళంలో, పరమ పురుషుడితడే.. అన్నమాచార్య కీర్తనను లిఖిత, అనుష్క, భార్గవి, సత్యవతి, పూజిత, లహరి, నందిని అఠాణా రాగం ఆదితాళంలో, కొలువైతివా శ్రీ రంగసాయి.. అనే అన్నమాచార్య కీర్తనను లిఖిత, అనుష్క, భార్గవి, పూజిత, లహరి మోహన రాగం ఆదితాళంలో, మేనకా విశ్వామిత్ర అనే నృత్యాంశాన్ని భార్గవి, పూజిత, నిశ్చిత, లిఖిత, అనుష్క ప్రదర్శించి ప్రేక్షకుల సుదీర్ఘ కరతాళ ధ్వనులందుకున్నారు. కళాకారులు, నాట్యాచార్యులకు నిర్వాహకులు అతిథులు ద్వారా జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలను అందజేసి సత్కరించారు.

కృష్ణానదిలో దూకి తల్లీబిడ్డ ఆత్మహత్య
పాతబస్తీ, మార్చి 23: నాలుగు నెలల పాపకి గుండె పడిన చిల్లు ఓ కన్నతల్లి పెగుబంధాన్ని సహితం తెంపేసింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లి తన చేతులు మీదగానే నాలుగు నెలల పాపను నదిలో విసిరేసింది. అనంతరం తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. హృదయవిధారకమైన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపురానికి చెందిన ఎర్రంశెట్టి దుర్గ్భావాని (22) అనే యువతికి రెండేళ్ల క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు గుండెలో చిల్లు ఉందని డాక్టర్లు చెప్పగానే ఆ కన్న తల్లి గుండె విలవిల్లాడింది. పలువురు వైద్యులకు చూపించి తన బిడ్డన బతికించమని వేడుకుంది. వైద్యపరమైన ఇబ్బందులు ఆ పాప గుండె చిల్లును పూడ్చలేకపోయాయి. అది తమ కాదని వైద్యులు తెలపటంతో కన్నతల్లి హృదయం మొద్దుబారిపోయింది. ఇక ఈ జన్మ అనవసరం అనుకుని బుధవారం విజయవాడ చేరుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ చేరుకుని మోడల్ గెస్ట్ హౌస్ వద్ద నదిలో ఈ ఘాతుకానికి పాటుపడింది. సమాచారం అందిన వన్‌టౌన్ పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో తల్లీబిడ్డల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును వన్‌టౌన్ సిఐ పి వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణాజిల్లా నుంచే చంద్రబాబు రాజకీయ పతనం ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 23: ఎన్నికల హామీలను నిసిగ్గుగా అటకెక్కించడమే గాక నూతన రాజధాని పేరిట లక్షలాది ఎకరాల భూముల కబ్జాకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృష్ణా జిల్లా నుంచే రాజకీయ పతనం ఆరంభం కానుందని వైకాపా జిల్లా ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మధ్యంతర ఎన్నికలు రావాలని తామెవరం కోరుకోవటం లేదు. అయితే ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపికి సింగిల్ డిజిట్‌కు మించి సీట్లురాబోవన్నారు. గాంధీనగర్‌లో రెండంతస్తులలో ఏర్పాటైన వైకాపా జిల్లా కార్యాలయాన్ని బుధవారం వందలాది మంది పార్టీ నేతలు, కార్యకకర్తల సమక్షంలో పెద్దిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జాబు కావాలంటే బాబు రావాలి. రైతులు, డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, లేదా నిరుద్యోగ భృతి అంటూ ఇలా ఎనె్నన్నో హామీలు గుప్పించిన చంద్రబాబు గడచిన రెండేళ్లలో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేకపోయారంటూ ఈ విషయంలో వైకాపా గ్రామస్థాయి నుంచి ఆందోళన చేపట్టనుందన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగకపోవటంతో కొత్తగా రుణాలు లభించడం లేదన్నారు. కనీసం పెన్షన్‌లు కూడా అర్హులందరికీ దక్కడం లేదంటూ దివంగత నేత వైఎస్ హయాంలో కుల, మతం, పార్టీ తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ పెన్షన్లురాగా నేడు జన్మభూమి కమిటీలపై ఎంపిక ఆధారపడి ఉందన్నారు. ఇప్పటివరకు ఒక్కరికైనా ఇల్లు లభించిన దాఖలాలు లేవన్నారు. రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాల భూములను సమీకరించిన చంద్రబాబు నేడు బడా బాబులకు వాటిని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్భ్రావృద్ధి ఆయనలో ఏ కోశానా కన్పించడం లేదన్నారు.ఈ కార్యక్రమంలో తూర్పు, పశ్చిమ, కృష్ణాల అధ్యక్షులు కొడాలి నాని, కె.పార్థసారథి, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రాఘురామ్, నగర ఇన్‌ఛార్జి లేళ్ల అప్పిరెడ్డి, శాసనసభ్యులు మేకా ప్రతాప అప్పారావు, రైతు సంఘ అధ్యక్షులు నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, మాజీ జడ్‌పి వైస్ ఛైర్మన్ పద్మావతి, పైలా సోమినాయుడు తదితరులు మాట్లాడారు.

ఎమ్యూజ్‌మెంట్ జోన్‌గా రాజీవ్‌గాంధీ పార్కు అభివృద్ధి
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 23: రాష్ట్ర రాజధాని నగరంగా రూపుదిద్దుకొంటున్న విజయవాడ నగరంలో పిల్లలు, పెద్దలకు నూరుశాతం ఆహ్లా దం కలిగించే విధంగా రాజీవ్‌గాంధీ పార్కును ఎమ్యూజ్‌మెంట్ జోన్‌గా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం అర్బన్ గ్రీనింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రమోహ న రెడ్డితో కలిసి పరిశీలించిన ఆయన హైదరాబాద్ సంస్థ రాజ్ ఎక్స్‌డిడ్సి రూపొందించిన ఆర్కిటెక్ట్ ప్లాన్ అమలులో గల సాధ్యాసాధ్యాలను సమీక్షించారు. నగరంలో ఉన్న అతిపెద్ద ఏకైక పార్కు రాజీవ్‌గాంధీ పార్కును సమగ్రాభివృద్ధి పర్చాలని, వినోదం కలిగించడంతోపాటు ఆహ్లాదకరించే పార్కు గా రూపుదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. దుర్గ బ్రిడ్జి నిర్మాణానికి పార్కు స్థలం కొంత కోల్పోతున్న విషయాన్ని గుర్తించి శాశ్వత కట్టడాలైన మ్యూజిక్ ఫౌంటైన్, స్కేటింగ్ రోల్, వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పార్కును అభివృద్ధి పర్చే అంశాలపై డిజైన్ రూపొందించి 30కల్లా నివేదించాలని ఆదేశించారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల కాల్వగట్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన కెనాల్ బండ్‌ను శుభ్రపర్చి గ్రీనరీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. లోబ్రిడ్జి రోడ్డుకిరువైపులా విచ్చలవిడి గా ఉన్న వాల్ పోస్టర్లు, వాల్ రైటింగ్స్ ను పూర్తిగా తొలగించేందుకు ఆ యా సంస్థలతోనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు మార్జిన్ స్థలాల్లో ఉన్న మట్టి దిబ్బలను తొలగించి ట్రాఫిక్‌కు అవాంతరాలు తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో విఎంసి సిఇ ఎంఎ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ఇఇ ఓంప్రకాష్, భాస్కర్, ఎడిహెచ్ ఆనంద్ పాల్గొన్నారు.

ఘనంగా కలశ పూజలు
ఇంద్రకీలాద్రి, మార్చి 23: శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి దేవస్థానం (పాతశివాలయం)లో బుధవారం ఉదయం ఆలయ ఇవో కెవియన్‌డికె ప్రసాద్ ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన అర్చకుడు కె మురళీధరన్ నంబూద్రి ఆధ్వర్యంలో 108మంది దంపతులచేత కలశ పూజలను చేయించారు. స్వామి అయ్యప్ప జన్మదినోత్సవం, ఆలయ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఈప్రత్యేక కార్యక్రమాలను కేరళ సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. బుధవారం వేకువ జామున అయ్యప్పకు గంధాభిషేకం, మృతాభిషేకం, విశేష పూజలు, అర్చనలు, విశేష పుష్పాలంకారం నిర్వహించారు. తర్వాత 108మంది పుణ్యదంపతులు 108మంది కలశాలు ముందుకూర్చోబెట్టి కలశాలకు ప్రత్యేక పూజలను భక్తులచేత స్వయంగా చేయించారు. కేరళ సంప్రదాయం పద్ధతిలో ఆలయ ప్రధాన అర్చకుడు కె మురళీధరన్ నంబూద్రి, ఆలయ ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ నిష్ఠగా నిర్వహించారు. సుమారు 3వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈకార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం విచ్చేసి భక్తులందరికీయ స్వామివారి మెమొంటోలు అందచేశారు.

విద్యార్థులపై దాడి అమానుషం
విజయవాడ, మార్చి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులపై అమానుషంగా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఐద్వా రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి ప్రభావతి, డి రమాదేవి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 17న రోహిత్ వేముల మరణానికి ప్రధాన కారకులైన విసి అప్పారావు తిరిగి 22న క్యాంపస్‌లోకి ప్రవేశించడంతోనే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని భయానకంగా మార్చివేశారన్నారు.

బాలల హక్కుల పరిరక్షణలో
ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 23: బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించాలని, బాల్యం ఎక్కడ వర్థిల్లుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్లని నగర పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్ అన్నారు. హోటల్ మురళి ఫార్చూన్, సెమినార్ హాల్లో ఛైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (క్రాఫ్) మరియు ఆంధ్రప్రదేశ్ అల్లియన్స్ ఫర్ ఛైల్డ్ రైట్స్ వారి సంయుక్త నిర్వహణలో బుధవారం రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ మోడల్ రూల్స్ ఆఫ్ జువైనల్ జస్టిస్ (సంరక్షణ, రక్షణ పిల్లల) చట్టం-2015పై కన్సల్టేషన్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ జువైనల్ జస్టిస్ (సంరక్షణ, రక్షణ పిల్లల) చట్టం-2015 అనేది బాల్యానికి భరోసా ఇవ్వడానికి కొత్త సవరణలతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగినదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ జువైనల్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ బిడివి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జువైనల్ జస్టిస్ చట్టం 2015 రూపొందించడం చట్టం తాలూకు రూల్స్‌లో కావలసిన అనుసంధానాలను ప్రాధాన్యత బాలల హక్కుల సంఘాలు, కార్యకర్తలు కలిసి చర్చించడం చాలా అవసరమని తెలిపారు. విశిష్ట అతిథులుగా విచ్చేసిన కృష్ణా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె.కృష్ణకుమారి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణలో మా శాఖ ముందుందని, విభిన్న కుటుంబాల వల్ల బాలలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలలో తల్లిదండ్రులు బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన ఉంటే, బాలలు ఆనందంగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బాలరాజు మాట్లాడుతూ అంతరాలు లేని సమాజాన్ని బాలలకు అందించాలని చట్ట సవరణను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. మార్పుచేసిన జువైనల్ జస్టిస్ చట్టం 2015పై విస్తృత ప్రచారం, అవగాహన, చైతన్యం అవసరమని తెలిపారు. ఇంకా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.సరస్వతి రాజు అయ్యర్, సెంట్రల్ లా యూనివర్శిటీ, డీన్ డా.పి.శ్రీదేవి, ఆంధ్ర యూనివర్శిటీ ప్రొఫెసర్ డా.సంపత్‌కుమార్, విజయవాడ సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ డా.దివాకర్ బాబు తదితరులు మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ టి.ఎన్.స్నేహన్, చిత్తూరు జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్‌పర్సన్ డి.రామకృష్ణ, హెల్ప్ డైరెక్టర్ నిమ్మరాజు రామమోహన్ మరియు తదితరులు ఈ చట్టం యొక్క కేంద్ర మోడల్ రూల్స్‌పై బృంద చర్చలు జరిపి, సరియైన సూచనలతో రూల్స్‌ను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వముచేత నియమింపబడిన కమిటీకి సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ అల్లియన్స్ ఫర్ ఛైల్డ్ రైట్స్ డి.రోషన్ కుమార్ నేతృత్వంలో ఛైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ (కాఫ్) ప్రోగ్రామ్ డైరెక్టర్ పి.ఫ్రాన్సీస్ తంబి నిర్వహణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

భక్తి ప్రపత్తులతో శిలువయాత్ర
పటమట, మార్చి 23: ఏసుక్రీస్తు తపస్సుకాలంలో భాగంగా గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పవిత్రవారాన్ని పురస్కరించుకొని శిలువపై ఏసుక్రీస్తు అనుభవించిన కఠోర శ్రమలను చాటిచెబుతూ వన్‌టౌన్ తారాపేట సెయింట్ పీటర్స్ కథెడ్రల్ విచారణకర్తలు ఫాదర్ లాము జయరాజు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నగరంలో వేలాది మంది క్రైస్తవులతో ‘వాక్ ఫర్ క్రైస్ట్’ (క్రీస్తు కొరకు పాదయాత్ర) జరిగింది. సెయింట్ పీటర్స్ కథెడ్రల్ (ఆర్‌సియం) చర్చి నుంచి గుణదల మేరిమాత పుణ్యక్షేత్రం వరకు సాగిన ఈ పాదయాత్రను ఉదయం 6 గంటలకు విచారణకర్తలు ఫాదర్ లాము జయరాజు ప్రారంభించారు. వన్‌టౌన్ నుండి ప్రారంభమైన వాక్ ఫర్ క్రిస్ట్ లోబ్రిడ్జి, రైల్వేస్టేషన్, ఏలూరులాకులు, పెజ్జోనిపేట పప్పులమిల్లు సెంటర్, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా చుట్టుగుంట, ఏలూరు రోడ్డు, మాచవరం, పడవలరేవుమీదుగా గుణదల లూర్ధునగర్ నుండి మేరిమాత పుణ్యక్షేత్రానికి చేరుకొని ముగిసింది. దాదాపు 2 గంటలపాటు కొనసాగిన క్రీస్తు కొరకు శిలువయాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని క్రీస్తుశ్రమలను స్మరించుకొంటూ, క్రీస్తుపాటులను గుర్తుతెచ్చుకొంటూ జపమాల ధాన్యంతో ముందుకుసాగారు. అనంతరం గుణదల మేరిమాత పుణ్యక్షేత్రంలో విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, సెయింట్ పీటర్స్ కథెడ్రల్ విచారణకర్తలు ఫాదర్ లాము జయరాజు, పెజ్జోనిపేట ఆర్‌సియం దేవాలయం విచారణ కర్తలు ఫాదర్ తోట మరియదాస్ తదితర గురువులు వాక్ ఫర్ క్రైస్ట్ ముగింపు‘సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు బిషప్ జోసఫ్ రాజారావు సందేశమిస్తూ క్రీస్తును చేరాలంటే వాక్ ఫర్ క్రైస్ట్ వంటి యాత్రలు దోహదం చేస్తాయన్నారు. 40 రోజుల క్రీస్తుశ్రమలకాలం క్రైస్తవులు ఎంతో పవితమైన దినాలుగా పరిగణిస్తారన్నారు. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ నాటికి ప్రతి క్రైస్తవుడు ఏసుక్రీస్తుతో మమేకమై హృదయ పరివర్తనపొంది నూతన జీవితంలోకి ప్రవేశించాలని కోరారు. మానవుల రక్షణార్థం క్రీస్తు శిలువపై తన రక్తన్నా ఛిందించి ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెయిట్ పీటర్స్ కథెడ్రల్ వికారియేట్ పరిధిలోని ప్యారీస్ ప్రిస్ట్‌లు, సిస్టర్స్, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

జగన్ సిఎం కావటం ఖాయం
ఇంద్రకీలాద్రి, మార్చి 23: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శక్తులు అడ్డం పడినా వైయస్ జగన్ సియం చేసే వరకు కార్యకర్తలు నిద్రపోరని వక్తలు పేర్కొన్నారు. ప్రలోబాలకు తలొగ్గి జలీల్‌ఖాన్ వంటి స్వార్థపరులు పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మొత్తం ఒకే తాటిపై ఉండి జగన్ బాటలోనడుస్తున్నారని ఇంతకంటే వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ఏమి కావాలన్నారు. మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాలులో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధవారం ఉదయం శాసన సభ్యుడు కొడాలి నాని అధ్యక్షతన జరిగింది. మోసకారి ఈప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆది తప్పకుండా నారా చంద్రబాబునాయుడు మాత్రమేన్నారు. మాజీ మంత్రి విజయవాడ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్ ఆశీస్సులతో ఎన్నికైనా శాసన సభ్యుడు పార్టీని వీడితే ఇక్కడ పరిస్థితిని అంచనా వేసేందుకు వస్తే అందుకు భిన్నంగా ఉందన్నారు. ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, రాష్టన్రాయకుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ మోసానికి నిజస్వరూపం అంటూ ఉంటే అది చంద్రబాబునాయుడికి సరిగ్గా సరిపోతోందన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్మికసెల్ రాష్ట్ర అధ్యక్షుడు పి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ జలీల్‌ఖాన్ పార్టీని వీడిపోవటంతో పార్టీకి పట్టిన శని పోయిందన్నారు. స్టేట్ యూత్ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీని వీడిపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి తిరిగి గెలిపించుకునే సత్తా చంద్రబాబునాయుడు ఉందా అని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జగన్ వెంటే పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. మాజీ మంత్రి కె పార్థసారథి మాట్లాడుతూ జలీల్‌ఖాన్ పార్టీని వీడిపోవటంతోనే నగరంలో పరోక్షంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ బలోపేతంగా మారిందన్నారు. సమావేశంలో వాణిజ్యసెల్ అర్బన్ అధ్యక్షుడు కొణిజేటి రమేష్, యస్‌సిసెల్ రాష్ట్ర నాయకులు కామా దేవరాజ్, బూదాల శ్రీనివాస్, విజయవాడ నగరపాలక సంస్థ వైకాపా ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల, కార్పొరేటర్లు, సీనియర్ నాయకుడు పైలా సోమినాయుడు, కంది గంగాధర్, డివిజన్ అధ్యక్షులు పైడిపాటి మురళీ, కంపా గంగాధర్‌రెడ్డి, పీతామోహనరావు,గౌస్ మొహిద్ధీన్ ప్రసంగించారు.