కృష్ణ

పారిశ్రామిక హబ్‌గా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ మైలవరం, ఆగస్టు 20: రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పుష్కరాల 9వ రోజైన శనివారం ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతినిచ్చే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో యువత భవితను తీర్చిదిద్దేందుకు పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం వంటి ఆదాయాన్నిచ్చే రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. పలు ఉత్పత్తులను తయారుచేసే పారిశ్రామిక రంగాన్ని, పెట్టుబడిదారులను రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న విద్యుత్ కొరత నుండి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారు చేశామన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు అందిస్తున్నట్లు తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఈవిషయంలో తాను రాజీలేని పోరాటం చేస్తున్నానని వివరించారు.
గోదావరి - కృష్ణా నదుల సంగమం అతి పవిత్రమైనదని, దేశంలోనే నదులను అనుసంధానం చేసిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో ఈప్రాంతానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదని, కానీ నదుల అనుసంధానంతో అధిక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. దీన్ని మరింత ఇనుమడింపజేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ కూడా శాశ్వతంగా వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు ఇక్కడ 25ఎకరాల స్థలాన్ని కూడా కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పవిత్ర సంగమంలో స్నానం చేసిన భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తారన్నారు. రెండు నదుల సంగమం పవిత్రత ఆలయ నిర్మాణంతో మరింత ఇనుమడిస్తుందన్నారు. నదుల అనుసంధానం, నీటి లభ్యత, ఆ నీరు ఏఏ ప్రాంతాలకు చేరేది, తదితర విషయాలపై ఎగ్జిబిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పవిత్ర సంగమం ఆవలి ఒడ్డున నిర్మించే ఆంధ్రుల రాజధాని అమరావతి దీంతో ప్రపంచ ప్రసిద్ధ మేటి నగరంగా రూపుదిద్దుకుంటుందని చంద్రబాబు వివరించారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధి మృత్యుంజయ రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని కొనియాడారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. అంతకుముందు పారశ్రామికంగా ఎదిగిన కొందరు దళిత పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పీతల సుజాత, ఎంపి కేశినేని నాని, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

తుది ఘట్టానికి కృష్ణా పుష్కరాలు
పద్మావతి ఘాట్‌కి పోటెత్తిన యాత్రికులు
పటమట, ఆగస్టు 20: కృష్ణా పుష్కరాలు మరో మూడు రోజుల్లో ముగియనుండడంతో శనివారం 9వ రోజు పద్మావతి ఘాట్‌కు యాత్రికులు పోటెత్తారు. పుష్కరాలు తుది ఘట్టానికి చేరుకుంటున్న నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము యాత్రికులు ఘాట్‌కు చేరుకున్నారు. పుణ్యస్నానాలు చేయటానికి బారులు తీరారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రావటంతో బస్టాండ్, రైల్వేస్టేషన్, కృష్ణలంక రోడ్డు, బందర్ రోడ్డు భక్తులతో కళకళలాడింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులను ఘాట్ వద్ద పోలీసులు కంట్రోల్ చేస్తుండగా, ఘాట్‌లో సిబ్బంది భక్తులు సాఫీగా పుష్కర స్నానం చేసేందుకు సహకరించారు. ఘాట్ వద్ద తప్పిపోయినవారి వివరాలు మైకుల ద్వారా ప్రచారం చేస్తూ వారి బంధువుల వద్దకు అధికారులు చేరుస్తున్నారు. ఘాట్‌లో భక్తులు పిండ ప్రదానాలు చేస్తున్నారు. యాత్రికుల దాహార్తి తీర్చటానికి ఎప్పటికప్పుడు సిబ్బంది వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు స్నానం చేసి, కనకదుర్గా వారధి, కృష్ణలంక గీతానగర్‌లో ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌లో భోజనాలు చేసి తిరుగుముఖం పడుతున్నారు.