కృష్ణ

పేద బాలల్ని అమ్మల్లా ఆదరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, విజయవాడ 7: అక్షరాస్యత వల్ల ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, దీనికి మన రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీలు, డ్వాక్రా సంఘాలు విరివిగా కృషి చేయాలని, ఉద్యోగులుగా కాకుండా పేద బాలలకు తల్లులుగా సేవలందించినప్పుడే ఇది సాధ్యవౌతుందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గురునానక్ నగర్ నాక్ కల్యాణ మండపంలో జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో ఎంపిడివోలు, ఎంఈవోలు, డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీల కోసం ఏర్పాటు చేసిన ‘ఆహార జ్యోతి- పౌష్టికాహారం- చిరుధాన్యాల’పై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కోడెల మాట్లాడుతూ కేరళలో నూరుశాతం అక్షరాస్యత వల్ల కాన్పుల్లో గర్భిణులు, శిశువుల మరణాలు జీరో స్థాయిలో వున్నాయని తెలిపారు. అక్కడ నగరాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యానికి కూడా ప్రాముఖ్యం ఇస్తున్నారన్నారు. కేరళలో 93 శాతం మంది పారిశుద్ధ్య నిబంధనలు పాటిస్తున్నారని, దానికి కారణం అక్కడ అక్షరాస్యత ఎక్కువగా వుండటమేనన్నారు. చిరుధాన్యాలు తినటమంటే నామోషీగా భావిస్తున్నారని, ప్రజలు ఇలాంటి అపోహల నుంచి బయటపడాల్సిన అవసరం వుందన్నారు. తన చిన్నతనంలో వరి అన్నం తినాలంటే ఏ పండుగో, చుట్టాలో రావాలని, అప్పుడే వరి అన్నం తినేవాళ్లమని ఆయన గుర్తుచేశారు. అంగన్‌వాడీలు బాగా పనిచేస్తున్నారని, రాబోయే కాలంలో దేశానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తులను తయారు చేస్తున్నారని కోడెల ప్రశంసించారు. మహిళలకు అవగాహన పెరిగేలా గ్రామ, మండల స్థాయిలో అధికారులు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం వుందని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీ్ధర్, తదితరులు పాల్గొన్నారు.

నోట్ల మార్పిడి ముఠా గుట్టు రట్టు
* రూ.2.70లక్షల కరెన్సీ స్వాధీనం * ఏడుగుపై కేసు నమోదు

మైలవరం/ విస్సన్నపేట, డిసెంబర్ 7: పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తామని కొందరు నల్లకుబేరులతో 30శాతం కమీషన్‌పై ఒప్పందం కుదుర్చుకుని కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక వ్యక్తి నుండి అందిన సమాచారాన్ని అందిపుచ్చుకుని మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో అత్యంత చాకచక్యంగా ప్రణాళికా బద్ధంగా చేసిన చర్యలకు ముఠా చిక్కింది. గత కొన్ని రోజులుగా లక్షలాది రూపాయలు మార్పిడి చేయించిన ఈముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖర్లకు వివరించారు. మండలంలోని పొందుగలకు చెందిన ఇస్లావత్ నరశింహారావు, బాణావతు నాగరాజులు కలిసి రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వకు చెందిన తొమ్మటక్క శ్రీనివాసరావు, విస్సన్నపేటకు చెందిన వాసా గిరిరెడ్డి, కుక్కడపు సతీష్, పోతూరి కేశవరావు, చాట్రాయి మండలం చనుబండకు చెందిన దుర్గం కృష్ణంరాజులతో కలిసి పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇచ్చేవిధంగా నల్లకుబేరులతో 30శాతం కమీషన్‌కు ఒప్పందం కుదుర్చుకుని విస్సన్నపేటకు సమీపంలోని ఒక మామిడి తోటలో నోట్లను లెక్కించే మిషన్ సైతం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సమాచారం అందుకున్న మైలవరం ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి కొందరు మధ్యవర్తులను తీసుకుని మండలంలోని వెల్వడం గ్రామం సమీపంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద పాత నోట్ల మార్పిడి కోసం వచ్చిన పార్టీలమని చెప్పి నమ్మించి వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 136 రెండువేల రూపాయల కరెన్సీ నోట్లు(2లక్షల 70వేల రూపాయలు), నగదు లెక్కించే మిషన్‌ను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పాత నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తామని ఎవరైనా నోట్ల మార్పిడి వ్యవహారానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అంతేగాక కొత్త నోట్లు వీరికి ఎలా వచ్చాయనే విషయంపై కూపీ లాగి సంబంధిత వ్యక్తులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంత మొత్తంలో ఈముఠాకు కొత్త కరెన్సీ అందుతుందంటే వీరి వెనుక బ్యాంకర్లు, పోస్ట్ఫాస్ సిబ్బంది పాత్రలపై కూడా నిఘా పెట్టామన్నారు. బ్యాంకర్లు, పోస్ట్ఫాస్ సిబ్బందికి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. నోట్ల మార్పిడి ముఠా వ్యవహారం జిల్లాలో ఇదే మొదటిదని ఆయన వెల్లడించారు.

ఇంకెన్నాళ్లీ యాతన..?
* బ్యాంక్‌ల వద్ద తరగని ‘క్యూ’ లైన్‌లు
* కరెన్సీ వెతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
* సామాన్యుల సహనాన్ని పరీక్షిస్తున్న నగదు కొరత
* రోజులు గడుస్తున్నా పరిష్కార చర్యలు శూన్యం
* బ్యాంక్‌లకే పరిమితవుతున్న ప్రజానీకం
* నేటికీ తెరుచుకోని ఎటియంలు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 7: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. నెల రోజుల నుండి ప్రజలంతా బ్యాంక్‌లకే పరిమితమయ్యారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు మార్పిడి, డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం అన్ని వర్గాల ప్రజలు బ్యాంక్‌ల బాట పట్టిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు రోజులు తరబడుతున్నా తీరడం లేదు. పని పాట మానుకుని ప్రజలు బ్యాంక్‌ల వద్ద బారులు తీరుతున్నా నగదు కొరతతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. బ్యాంకర్లతో వాదోపవాదాలకు దిగుతున్నారు. కొంత మంది వృద్ధులైతే క్యూల్లోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి పూర్తిగా రూపుమాపుతుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు తొలుత హర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి. కానీ ఆ తర్వాత ఏర్పడిన కరెన్సీ కష్టాలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటంతో ప్రజలు పట్టరాని కోపంతో ఉన్నారు. ఏ బ్యాంక్ వద్ద చూసినా బారులు తీరిన జనమే. నగదు విత్ డ్రా కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూ లైన్‌లలో నిలబడినా చివరకు నిరుత్సాహంతోనే వెనుతిరుగుతున్నారు. వారానికి రూ.24వేలు వరకు విత్ డ్రా చేసుకోవచ్చని ఆర్‌బిఐ చెప్పినా తగినంత నగదు నిల్వలు లేని కారణంగా బ్యాంకర్లు చేతులెత్తేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజల 1వతేదీ కష్టాలు నేటికీ తీరలేదు. బ్యాంక్ ఖాతాల్లో పడ్డ జీతభత్యాలు, పెన్షన్ సొమ్మును తీసుకునేందుకు ఉద్యోగులు, పెన్షనర్లు బ్యాంక్‌ల వద్ద పడిగాపులు పడుతున్నా చేతికి మాత్రం చిల్లిగవ్వ కూడా రావడం లేదు. బ్యాంక్‌లు తెరిచిన కొన్ని గంటలకే నో క్యాష్ బోర్డులు తగిలిస్తుండటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. బ్యాంకర్లు మాత్రం వచ్చిన కొద్దిపాటి నగదునే అందరికీ సర్దుబాటు చేస్తున్నామని, ఈ విషయంలో తాము కూడా తీవ్ర పని ఒత్తిళ్ళకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఎనీ టైమ్ మనీ (ఎటియం)ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలో 24గంటలు పని చేసిన ఎటియంలు నేడు రోజుకు 10 నిమిషాలు కూడా పని చేయని పరిస్థితి. ఎటియంలలో ప్రజల అవసరాల మేరకు నగదును నింపలేకపోతున్నారు. 90శాతం ఎటియంలు మూతబడే ఉంటున్నాయి. కొద్దిపాటి ఎటియంలలోనే అరకొరకగా డబ్బు నింపుతున్నారు. చిల్లర నోట్ల సమస్య కొరకరాని కొయ్యగా మారింది. ఇప్పటి వరకు రూ.2వేలు నోట్లు కొద్దీగొప్ప జిల్లాకు వచ్చినా రూ.500 నోట్ల అడ్రస్ గల్లంతయ్యింది. తొలి విడతగా రూ.24వేల కోట్లు మాత్రమే కొత్త రూ.500 నోట్లు జిల్లాకు వచ్చాయి. అవి కూడా విజయవాడ నగర పరిధిలోని ఎటియంలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ కొత్త రూ.500 నోట్లు జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా పెద్ద నోట్ల రద్దు సామాన్యుల పాలిట శాపంగా మారింది. కరెన్సీ కష్టాలు ఎప్పుడు తీరుతాయా.. అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పెద్దనోట్ల రద్దుతో సహకార సంఘాల నడ్డి విరిచారు

* రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి హరిబాబు ధ్వజం

ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, డిసెంబర్ 7: పెద్దనోట్ల రద్దు సహకార సంఘాల నడ్డి విరిచిందని జిల్లా కౌలురైతుల సంఘం కార్యదర్శి ఎం హరిబాబు మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు, నోట్ల మార్పిడి విషయంలో సహకార సంఘాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న వివక్షతను నిరసిస్తూ స్థానిక సిపిఎం కార్యాలయంలో రైతు సంఘం, కౌలు రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నుముక అంటూనే సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సంఘాల్లో నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం పో వడంపై పెద్ద ఎత్తున ఉద్యమించనున్నట్లు హెచ్చరించారు. ఈ నెల 13న తహశీల్దార్ కార్యాలయాల వద్ద, 19వతేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పిఎసిఎస్ ఉద్యోగుల సంఘ నాయకుడు జన్యావుల రామాంజనేయులు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఖరీఫ్ కోతలు ప్రారంభమైన తరుణంలో సహకార సంఘాల్లో నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి రవి, పౌర హక్కుల సంఘం కార్యదర్శి కొడాలి శర్మ, కౌలు రైతు సంఘం జిల్లా సభ్యుడు వాకా రామచంద్రరావు, కో-ఆపరెటివ్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భోగాది శ్యాంప్రసాద్, కో-ఆపరేటివ్ బ్యాంక్ యూనియన్ నాయకుడు సిహెచ్ రాంబాబు, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, ఎఐటియుసి నాయకుడు నాగరాజు, సిఐటియు నాయకుడు సజ్జా మూర్తిరాజు, కౌలు రైతు సంఘం నాయకులు కె రామారావు, విన్నకోట వెంకటరత్నం, రైతు సంఘం నాయకుడు పెదబాబు, ఐసిఇయు డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, టి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, హాకీ పోటీలకు కవుతవరం విద్యార్థులు
గుడ్లవల్లేరు, డిసెంబర్ 7: త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, హాకీ పోటీలకు మండల పరిధిలోని కవుతవరం గ్రామంలోని శ్రీ కానూరి దామోదరయ్య హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు బిఎస్‌విఎన్ జ్యోతి, కె ఝాన్సీ భవాని, ఎస్‌కె షఖిళ, ఎ తేజశ్రీ ఎంపికవ్వగా బాక్సింగ్ పోటీలకు ఎస్ వంశీకృష్ణ, ఎన్ వెంకటేశ్వరరావు, హాకీకి ఎస్‌కె రియాజ్, సిహెచ్ భువనేష్, సిహెచ్ చాణిక్య ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారి తెలిపారు. వీరిని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఇమ్మడి వెంకట నారాయణ, ఇన్‌ఛార్జ్‌లు జివి రమణ, నంబూరి కిరణ్ తదితరులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు వంశీ ఎంపిక
కూచిపూడి, డిసెంబర్ 7: ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో స్థానిక శ్రీ సిద్ధేంద్ర జిల్లా పరిషత్ ఓరియంటల్ పాఠశాల 10వ తరగతి విద్యార్థి మద్దాల వంశీ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా బుధవారం ఆ విద్యార్థిని సిలికానాంధ్ర చీఫ్ ఇంజనీరు లొల్లా మురళీమోహన్ జ్ఞాపికతో అభినందించారు. పాఠశాల హెచ్‌ఎం కొల్లి సత్య జగదీశ్వరరావు, పిఇటి టి రత్నశేఖర్, కుప్పా అరుణ కుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సైనికుల త్యాగం చిరస్మరణీయం
* హోం మంత్రి చినరాజప్ప
విజయవాడ (క్రైం), డిసెంబర్ 7: దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది డిసెంబర్ 7వ తేదీ సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. దేశం కోసం సైనికుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. యుద్ధంలో మరణించిన వీర సైనికులను స్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ వెలగపూడి సచివాలయంలో బుధవారం కార్యక్రమం జరిగింది.