కృష్ణ

చెరకు కోతలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, డిసెంబర్ 14: మండలంలో చెరకు పనులు మొదలయ్యాయి. కూలీలు చెరకు నరకటం, రైతులు ఎడ్లబండ్లపై చెరకును ఉయ్యూరు కెసిపికి తరలించటం చేస్తున్నారు. కెసిపి ఫ్యాక్టరీ పరిధిలో ఎక్కువగా తోట్లవల్లూరు మండలంలోనే చెరకు సాగయ్యేది. లంక పొలాలు చెరకు సాగుకి అనుకూలంగా ఉండి మంచి దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది రైతులు కేవలం 3,625 ఎకరాల్లో మాత్రమే చెరకును సాగుచేశారు. అదే గతేడాది 6,400 ఎకరాల్లో చెరకు సాగుచేశారు. అంటే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 2,775 ఎకరాలలో చెరకుసాగు తగ్గిపోయింది. గత సంవత్సరం మినుములకు విపరీతమైన రేటు పలకటం, పసుపు, కందకు కూడా ఆశించిన ధరలు లభించటంతో రైతులు చెరకుసాగుని పక్కన పెట్టారు. దాంతో మండలంలో అతి తక్కువ విస్తీర్ణంలో చెరకు సాగయింది. ఈ సంవత్సరం టన్ను చెరకుకి రూ.2650 ధరను కెసిపి యాజమాన్యం ప్రకటించింది. గతం నుంచి చెరకు సాగు రైతులకు లాభాలు ఇచ్చేదిగా ఉన్నా ప్రస్తుతం కూలీల కొరత వారిని బాధిస్తోంది. టన్ను చెరకుకి ఇచ్చే ధరలో సగం డబ్బుని నరుకుడు, తోలుడుకి చెల్లించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. దీంతో పెద్దగా లాభాలు ఉండక ఇతర పంటలను సాగుచేస్తున్నామని రైతులు తెలిపారు.

జిల్లా కబడ్డీ పోటీలకు బందరు డివిజన్ క్రీడాకారులు ఎంపిక
కూచిపూడి, డిసెంబర్ 14: మొవ్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో బందరు డివిజన్ స్థాయి ఆర్‌ఎంఎస్ కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి జట్టుకు క్రీడాకారులను ఎంపికచేసినట్లు పీడిలు పి పూర్ణచంద్రరావు, ఎం హరగోపాల్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా అండర్-14, అండర్-17 విభాగాలలో 12 మండలాల నుండి తరలి వచ్చిన క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అండర్-14 క్రీడా కారులుగా మొవ్వ జెడ్పీ స్కూల్‌కు చెందిన గోళ్ళ జయనాగ సుందరరావు, దేవబోయిన తేజశివ, గుళ్ళ శశిబాబు, దెయ్యాల వీర వెంకట్, గొరిపర్తి పూర్ణచంద్రరావు, జొన్నలగడ్డ రఘు, అంగడాల గోపిసాయి, జి వెంకటేశ్వరరావు తదితరులు ఎంపికయ్యారు. అంతర్-17 విభాగంలో నాగాయలంకకు చెందిన పి పవన్ కుమార్, ఏడుకొండలు, మొవ్వకు చెందిన హరికృష్ణ, సురేష్, జానకీరామయ్య, ఫణికుమార్, రాధాకృష్ణ, లక్ష్మణకుమార్, పెడసనగల్లు తదితర పాఠశాలల నుండి విద్యార్థులను ఎంపిక చేసినట్లు పీడిలు తెలిపారు. ఇన్‌ఛార్జి హెచ్‌ఎం మండవ లక్ష్మీనీలవేణి పోటీలను ప్రారంభించారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 19న ఉయ్యూరు మండలం కాటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీల్లో బందరు డివిజన్ జట్టులో ఆడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి కుమార్‌లాల్, వి వెంకటేశ్వరరావు, జి రాజు తదితరులు పాల్గొన్నారు.

తానీషా యువ మహోత్సవాలకు కూచిపూడి వేదిక
కూచిపూడి, డిసెంబర్ 14: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి కళావేదికపై తానీషా యువ నాట్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్‌కు చెందిన స్మితాశాస్ర్తీ శిష్య బృందం, హైదరాబాద్‌కు చెందిన గిరిజాకిషోర్ బృందం, ఢిల్లీకి చెందిన గీతాకుమారి శిష్య బృందం మొత్తం 30 మంది కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. చీబా విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ జపాల్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు తెలిపారు. పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్మృత్యర్థం నిర్వహించనున్న ఈ నాట్యోత్సవానికి కెసిపి సిఓఓ జి వెంకటేశ్వరరావు, అయ్యంకి మురళీకృష్ణ తదితరులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేశవప్రసాద్ కోరారు.

వైభవంగా కలశ జ్యోతి ఉత్సవం
మైలవరం, డిసెంబర్ 14: భవానీ దీక్షాపరుల కలశ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది. మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని సత్యం గురు భవానీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక శ్రీబ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి భవానీ దీక్షాపరులు, అయ్యప్ప దీక్షాపరులు, శివస్వాములంతా కలిసి కలశ జ్యోతులతో కనక తప్పెట్లు, ప్రత్యేక దేవతామూర్తుల అవతారాలతో దుర్గామాత చిత్రపటంతో వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు దాదాపు 450 మంది ఈగ్రామోత్సవంలో పాల్గొన్నారు. పురవీధులలో తిరిగిన అనంతరం తిరిగి శివాలయానికి చేరుకుని అక్కడ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతియేటా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తుండటం విశేషం.

జంక్షన్, వీరవల్లిలో సినీనటి రోజా సందడి

హనుమాన్ జంక్షన్, డిసెంబర్ 14: సినీనటి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, నగరి శాసనసభ్యురాలు రోజా బుధవారం హనుమాన్ జంక్షన్‌లో కోద్దిసేపు సందడి చేశారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో జరిగే గడపగడపకు వైకాపా కార్యక్రమంలో పాల్గోనేందుకు నరసాపురం నుంచి రోడ్డుమార్గాన వచ్చిన రోజా గన్నవరం నియోజకవర్గ వైకాపా కన్వీనర్ డా దుట్టా రామచంద్రరావు నివాసానికి వచ్చారు. ఈసంధర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అమెకు ఘనస్వాగతం పలికారు. రోజా డా దుట్టా కుటుంబ సభ్యులుతో అప్యాయంగా గడిపి తేనీటి విందును స్వీకరించారు. బాపులపాడు మండలం వీరవల్లిగ్రామంలోని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం డా దుట్టాతో కలిసి తేలప్రోలులో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజనయ్యేందుకు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో వైకాపా వైద్యవిభాగ రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శివ భారత్‌రెడ్డి, వైకాపా జిల్లా మహిళా అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి, వైకాపా నాయకులు నక్కా గాంధీ, కోడెబోయిన బాబి తదితరులు పాల్గొన్నారు.

ఆటల పోటీల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రభంజనం

గుడ్లవల్లేరు, డిసెంబర్ 14: స్థానిక ఎఎఎన్‌ఎం అండ్ వివిఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్ర సాంకేతిక విద్యామండలి నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్-2016 పోటీల్లో తమ ప్రతిభను చాటారు. నూజివీడు పాలిటెక్నిక్ కేంద్రంగా ఈనెల 10 నుండి 13 వరకు జరిగిన కృష్ణా జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల క్రీడా పోటీల్లో గుడ్లవల్లేరు విద్యార్థులు మంచి ప్రతిభను కనబర్చారు. బాలికల విభాగంలో టెక్నికాయిట్ (డబుల్)లో శ్యామల, మాధవి, చెస్‌లో దుర్గా భవానీ, వాలీబాల్‌లో అమలేశ్వరి, త్రిష, శ్రీవౌనిక, కృష్ణప్రియ, ప్రసన్న, తులసి, ప్రియాంక, చంద్రిక, స్వప్న విజేతలుగా నిలిచారు. టెన్నీకాయిట్ సింగిల్స్‌లో శ్యామల, ఖోఖో విభాగంలో వౌనిక, సంధ్య, ప్రణవి, కుందన, పావని, జాహ్నవి, శ్రీలక్ష్మి, సుమతి, జనని, షర్మిలా విజేతలుగా నిలిచారు. స్పోర్ట్స్ విభాగంలో 100, 200, 400 మీటర్ల పరుగుపందెంలో పి ప్రణవి మొదటి స్థానంలో నిలిచింది. 800 మీటర్ల పరుగుపందెంలో వౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది. తులసి ద్వితీయ స్థానంలో నిలిచింది. లాంగ్‌జంప్, త్రిబుల్ జంప్‌లో జె సంధ్య మొదటి స్థానంలో నిలిచింది. షార్ట్‌పుట్‌లో సంధ్య ద్వితీయ స్థానం సాధించింది. ఛాంపియన్‌గా పి ప్రణవి నిలిచిందని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వి రామాంజనేయులు తెలిపారు. బాలురు విభాగంలో ఛెస్, షటిల్ డబుల్స్, టేబుల్ టెన్నీస్ డబుల్స్, వాలీబాల్, బాల్‌బ్యాట్మింటన్, టేబుల్ టెన్నీస్ సిగల్స్‌లో విన్నర్స్‌గా నిలిచారు. 100, 200 మీటర్ల పరుగుపందెంలో మొదటి, ద్వితీయ స్థానంలో నిలిచారు. 400 మీటర్ల పరుగుపందెంలో రాజేంద్రప్రసాద్ ద్వితీయ స్థానం, 800, 1500 మీటర్ల పరుగుపందెంలో పి గోపి మొదటి స్థానంలో నిలిచాడు. 1500 మీటర్ల పరుగుపందెంలో ప్రభాకర్ ద్వితీయ స్థానం సాధించాడు. లాంగ్ జంప్‌లో ఎన్‌వి కిషోర్ మొదటి, ద్వితీయ స్థానంలో నిలిచారు. ఎస్ ఆనంద్ త్రిబుల్ జంప్‌లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. డిస్కస్‌త్రో, షార్ట్ఫుట్ పోటీల్లో డి ప్రశాంత్ ద్వితీయ స్థానం సాధించగా జావెలెన్‌లో భవానీ శంకర్ తృతీయ స్థానం సాధించాడు. ఈనెల 20న జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులు పాల్గొంటారని ప్రిన్సిపాల్ రామాంజనేయులు తెలిపారు. విజేతలైన విద్యార్థులను ఛైర్మన్ డా. వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శులు సత్యనారాయణ, రామకృష్ణ, శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు.

సాగునీటిని ఇచ్చి వరి పంటను కాపాడాం: ఎమ్మెల్యే కాగిత
బంటుమిల్లి, డిసెంబర్ 14: సాగునీటి ఎద్దటి తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని 60 నుంచి 70 టిఎంసిల సాగునీటిని ఇచ్చి వరి పంటను కాపాడామని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపిపి పి వనవలమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా కాగిత మాట్లాడుతూ వార్ధా తుపాను ప్రభావం ఎలా ఉన్నా అర్ధరాత్రి కూడా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్రమత్తం చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. బంటుమిల్లి కేంద్రంగా 132/33 కెవి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ.10కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. చినపాండ్రాక 24గంటల ప్రభుత్వాసుపత్రిని అప్‌గ్రేడ్ చేసి రూ.3కోట్ల 85లక్షలతో 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. బంటుమిల్లి-సింగరాయిపాలెం రోడ్డు మరమ్మతులు, వైడింగ్‌కు రూ.18కోట్లు మంజూరు చేయగా ప్రస్తుతం టెండర్ల దశలో ఉందన్నారు. వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ ఎఇ విజేష్ కన్నా మాట్లాడుతూ మండలానికి 350 గృహాలు మంజూరయ్యాయని తెలిపారు. వెలుగు ఎపిఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రన్న బీమా కింద మండలంలో 22034 మందికి బీమా పథకం వర్తింప చేశామన్నారు. విద్యుత్ ఎఇ భానుప్రకాష్ మాట్లాడుతూ ఈనెల 16న ఉదయం 9గంటలు నుండి 1గంట వరకు బంటుమిల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో పని చేయని ఎల్‌ఇడి బల్బులను వినియోగదారులు మార్చుకోవచ్చునన్నారు. ఈ సమావేశంలో డ్రైనేజి, ఎపిఎస్ ఆర్టీసి, పోలీసు, ఎక్సైజ్, ఆర్‌అండ్‌బి శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ చింతా కళావతి, జెడ్పీటిసి దాసరి కరుణాజ్యోతి, మార్కెట్ యార్డు ఛైర్మన్ వాటాల నరసింహస్వామి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొల్లా వెంకన్న డిఎల్‌పిఓ జె సత్యనారాయణ, మండల స్పెషల్ ఆఫీసర్ నేతల ఆంజనేయులు, వైస్ ఎంపిపి వీరంకి రాజారావు, పి వీర వెంకటేశ్వరరావు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

దివ్య దర్శనం దరఖాస్తుల ఆహ్వానం
మోపిదేవి, డిసెంబర్ 14: స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద డెప్యూటీ తహశీల్దార్ పి శివరామకృష్ణ దివ్య దర్శనం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అందుకోసం ప్రత్యేక పెట్టెను బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ దివ్య దర్శనం ప్రభుత్వ పథకం ద్వారా పేద ప్రజలు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించే అవకాశం ఏర్పడిందన్నారు. అందుకు అవసరమైన దరఖాస్తులు మండల పరిధిలోని ఆయా గ్రామాల విఆర్‌ఓలు, కార్యదర్శుల వద్ద ఉచితంగా ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెలో వేయాలన్నారు. లాటరీ ద్వారా భక్తులను ఎంపిక చేసి పుణ్య క్షేత్రాలకు పంపటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.