కృష్ణ

ముంథుకు కదలని వాన్‌పిక్ భూముల వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 26: వాడరేవు..నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) భూముల స్వాధీనం వ్యవహారంలో అడుగు ముందుకు పడటం లేదు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్ కోసం సేకరించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి రెండేళ్లవుతున్నా ఎలాంటి పురోగతీ లేదు. ఇప్పటి వరకు భూముల స్వాధీనం పై ఏపి సర్కార్ ఎలాంటి న్యాయపరమైన సంప్రతింపులు కూడా జరపలేదు. ఇడి అటాచ్‌మెంట్ చేసిన బోర్డులు మినహా అక్కడ ఏ రకమైన భూముల వినియోగం జరగటంలేదు. ఒప్పందానికి మించి వేలాది ఎకరాల భూమిని అప్పగిస్తూ అప్పట్లో ప్రభుత్వం రస్ ఆల్ ఖైమా (అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన సంస్థ) కన్సల్టెన్సీతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ నేతృత్వంలోని మాట్రిక్స్ హోల్డింగ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున క్విడ్‌ప్రోకో జరిగినట్లు సిబిఐ విచారణలో తేలింది. గుంటూరు జిల్లా నిజాంపట్నం, ప్రకాశం జిల్లా వాడరేవు పోర్టులను బిల్ట్‌ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బిఒఒటి) పద్దతిన నిర్మించేందుకు రస్ ఆల్ ఖైమా సంస్థతో రాష్ట్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అప్పట్లో 4 వేల ఎకరాల భూములు కట్టబెడుతూ 2008లో కేబినెట్ ఆమోదించింది. అయితే మొత్తం 24వేల ఎకరాల్లో 16వేల కోట్లతో పోర్టు వెంట సెజ్‌లు, ఇండస్ట్రియల్ కారిడార్‌లను నెలకొల్పాలని భావించి మరోవిడత ఎంఒయు కుదుర్చుకుంది. దీని ద్వారా ఐదు లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి కల్పన జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడే పెద్దఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వాన్‌పిక్‌కు ప్రభుత్వం నిర్దేశించిన స్థలంతో పాటు ప్రభుత్వ అసైన్డు భూములు, ప్రైవేటు వ్యక్తులు, రైతుల వద్ద నుంచి కారుచౌకగా భూములు కొనుగోలు చేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కంపెనీలలో 850 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారని సిబిఐ గుర్తించింది. అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావటంతో పాటు కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. నాటి నౌకా, విమానయాన శాఖ మంత్రి మోపిదేవి రమణారావు ఈ వ్యవహారంలో కీలక సూత్రదారిగా సిబిఐ గుర్తించింది. గుంటూరు జిల్లాలో ఐదువేల ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి సేకరించారు. నిజాంపట్నం, అడవులదీవి, దిండి, అముదాలపల్లి గ్రామాల్లో 3778.72 ఎకరాల ప్రభుత్వ అసైన్డు, ప్రైవేటు, పట్టా భూములను వాన్‌పిక్‌కు ధారాదత్తం చేశారు. నిజాంపట్నంలో 612 సర్వేనెంబర్‌లో 1651 ఎకరాలు, దిండి గ్రామంలో 334 సర్వే నెంబర్‌లో 923.5 ఎకరాలు, ఆముదాలపల్లిలో 552.2 సర్వే నెంబర్‌లో 481.63 ఎకరాలు, అడవులదీవిలో సర్వే నెంబర్ 717లో 722.45 ఎకరాల భూమిని ప్రభుత్వం రస్ ఆల్ ఖైమాకు అప్పగించింది. దీంతో పలువురు వాన్‌పిక్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. తీరప్రాంత మత్స్యకారులు, రైతులు భూములు కోల్పోయారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు 2015లో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు సభ్యులుగా ఉన్న ఉపసంఘం వాన్‌పిక్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు న్యాయ నిపుణులను సంప్రతించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ ప్రారంభంకాలేదు. సిబిఐ విచారణలో ఉన్న నేపథ్యంలో కొన్ని సర్వే నెంబర్లలో ఇడి అటాచ్‌మెంట్ బోర్డులు వెలిసాయి. ప్రస్తుత ప్రభుత్వం పోర్టు ఆధారిత సెజ్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న నేపథ్యంలో దిండి గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే తీర ప్రాంతంలో ఫార్మా కంపెనీ నెలకొల్పరాదని పరిసర గ్రామాల ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం ఎకరానికి లక్ష రూపాయలు చెల్లించి బలవంతంగా తమ వద్ద నుంచి భూములు లాక్కుందని, తమ భూములు తిరిగి ఇస్తే సాగు చేసుకుంటామని రైతులు కోరుతున్నారు.