కృష్ణ

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమైన తెదేపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 8: సభ్యత్వాల నమోదును పూర్తి చేసుకున్న అధికార తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతున్న జన్మభూమి గ్రామసభల ముగింపు అనంతరం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కమిటీల స్థానంలో నూతన కమిటీలను వేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల 28వతేదీన ప్రారంభమయ్యే ప్రక్రియ మహానాడు నాటికి పూర్తి కానుంది. ఇప్పటికే పార్టీ సభ్యత్వాల నమోదును పూర్తి చేసిన అధిష్ఠానం త్వరలో జరగనున్న గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ఎన్నికలకు అవసరమైన ప్రణాళికను రూపొందించింది. పలు స్థాయిల్లో ఏర్పాటు చేయనున్న కమిటీల ఎన్నికల నిర్వహణకు ఆయా స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలను గుర్తించి ఎన్నికల అధికారులుగా ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన వారికి గుంటూరు జిల్లాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ద్వారా కమిటీల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 11తో జన్మభూమి గ్రామసభలు ముగియనున్నాయి. సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల 23వతేదీ నుండి 31వతేదీ వరకు గ్రామ కమిటీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులను గుర్తించనున్నారు. వీరికి ఫిబ్రవరి 3, 4, 5, 6వ తేదీల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 9వతేదీ నుండి 28వతేదీ వరకు గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మండల కమిటీ ఎన్నికల ప్రక్రియను మార్చి నెలలో ప్రారంభించనున్నారు. మార్చి 1వతేదీ నుండి 6వతేదీ వరకు ఎన్నికల అధికారులను గుర్తించి 10, 11, 12తేదీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 19వతేదీ నుండి ఏప్రిల్ 5వతేదీ లోపు మండల, డివిజన్ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రధానమైన జిల్లా కమిటీల ఎన్నికలను ఏప్రిల్ 21వతేదీ నుండి 28వతేదీ వరకు నిర్వహిస్తారు. జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహణకు పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కమిటీ వేసి వారి ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. సంస్థాగత ఎన్నికల అనంతరం మే 11వతేదీ నుండి 23వతేదీ వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహించి ఆయా జిల్లాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించి తీర్మానం చేస్తారు. 27, 28, 29తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరగనున్న మహానాడులో మినీ మహానాడులో చేసిన తీర్మానాలపై చర్చించనున్నారు.

భక్తులతో పోటెత్తిన పుణ్యక్షేత్రాలు
జగ్గయ్యపేట రూరల్, జనవరి 8: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆదివారం వేదాద్రి, తిరుమలగిరి క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీయోగానంద లక్ష్మీనర్శింహస్వామి వారిని, శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వేదాద్రిలో స్వామివారు, అమ్మవార్లకు సన్నాయి మేళాలు, వేద మంత్రాల నడుమ గరుడవాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వెలగపూడి ఇందిరాదత్, రాజా వాసిరెడ్డి చంద్రకుమార్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలగిరిలో ఉదయం 6.30గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం కల్పించిన అధికారులు స్వామివారి ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి కొలువుతీర్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ మండపంలో పరిమళ పుష్పాలతో అలంకరించారు. పాలకవర్గ చైర్మన్ దర్శి విజయనర్శింహరావు, అర్చకుడు తిరునగరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించగా కార్యనిర్వహణ అధికారి వివిఎస్‌కె ప్రసాద్, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉచిత ప్రసాద వితరణ చేశారు.