కృష్ణ

పరుగులు పెడుతున్న ప్రైవేటీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: ప్రైవేటీకరణ విధానాలను ఎన్‌డిఎ ప్రభుత్వం కాంగ్రెస్ కంటే వేగంగా అమలు చేస్తోందంటూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ధ్వజమెత్తారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 125ఏళ్ల సంస్కరణలు ఫలితాలు అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మార్క్సిస్టు యోధుడు మాకినేని బసవపున్నయ్య స్మారకోపన్యాసం చేశారు. ప్రకాశ్ కారత్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగాయన్నారు. కాంగ్రెస్‌కు వామపక్షాల మద్దతు ఉండటం వల్లే 2008లో బ్యాంకింగ్, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను అడ్డుకున్నామన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ సంస్థలలో 100 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటా ఇప్పుడు 50 శాతానికి తగ్గి పోతుందన్నారు. తొలి జాతీయ బ్యాంక్ ఐడిబిఐని పూర్తిగా ప్రైవేటీకరించారని, అలాగే బ్యాంకింగ్, బీమా రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరువగా కార్మిక ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడంతో ప్రైవేటీకరణ ఆగిందన్నారు. సహజ వనరులను కార్పొరేట్‌లకు అప్పనంగా పాలకులు దోచిపెడుతున్నారంటూ కారత్ ధ్వజమెత్తారు. మరోవైపు రైతులకు విద్యుత్, రుణాల పంపిణీ, సబ్సిడీలను తగ్గించనున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి బుక్ హౌస్ ముద్రించిన మాకినేని రచనలను పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆవిష్కరించారు. ఈ సభకు సిపిఎమ్ సీనియర్ నేత పాటూరి రామయ్య అధ్యక్షత వహించారు.

రైల్వే వారోత్సవ ముగింపు సందర్భంగా పురస్కారాల వెల్లువ
విజయవాడ (రైల్వేస్టేషన్), ఏప్రిల్ 17: రైల్వే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే రైల్వే వారోత్సవాలలో ప్రతిభ కనబరచిన ఉద్యోగ, కార్మికులను సత్కరించుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ అన్నారు. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లోని ఎసి ఆడిటోరియంలో 61వ రైల్వే వారోత్సవాల ముగింపు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిఆర్‌ఎం అశోక్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పురస్కారాలు అందుకోవడానికి విచ్చేసిన పలువురిని ఉద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రైల్వేలో అందరూ కలసికట్టుగా పనిచేస్తేనే రైలు గమ్యస్థానానికి చేరుకోగలదన్నారు. రైల్వే వ్యవస్థ 1853, ఏప్రిల్ 16న ఏర్పడిందన్నారు. దినదినాభివృద్ధి చెందుతూ నేడు దేశంలోనే ఒక పెద్ద వ్యవస్థగా నిలబడిందన్నారు. ఇలా అభివృద్ధి చెందడానికి ప్రతి రైల్వే ఉద్యోగి పాత్ర ఉందన్నారు. నేడు జరిగే రైల్వే వారోత్సవాలలో నగదు అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని పొందిన వారిని అభినందించారు. ఈ అవార్డులను డిఆర్‌ఎం అవార్డ్‌లుగా పిలుస్తారు. దీనికింద గత సంవత్సరం వరకు వ్యక్తిగత అవార్డు కింద ఎనిమిది వందలు, వెయ్యి రూపాయలు ఇచ్చారు. దానిని రెండు వేలకు పెంచి ప్రస్తుతం డిఆర్‌ఎం అశోక్‌కుమార్ అందజేశారు. అలాగే గ్రూప్ అవార్డు కింద అయిదు వేల రూపాయలుగా పెంచి అందజేశారు. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 352 మందికి వ్యక్తిగత అవార్డు కింద రెండు వేల రూపాయల వంతున డిఆర్‌ఎం అందజేయగా గ్రూప్ అవార్డు కింద 49 మందికి అయిదువేల రూపాయల వంతున అందజేశారు. అలాగే వివిధ విభాగాల్లోని తొమ్మిది మందికి డిఆర్‌ఎం రోలింగ్ షీల్డ్‌లను అందజేశారు. వీరే కాకుండా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కార్యక్రమాల వంటి వాటిలో పాల్గొన్న వారు, కళారంగానికి చెందిన వారు సైతం ఈ పురస్కారాలను అందుకున్నారు. అలాగే భద్రతా విభాగానికి చెందిన వారు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) విభాగంలో పనిచేసే పదిమందికి అశోక్ కుమార్ ఈ పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కె.వేణుగోపాలరావు, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసరు ఎం.శ్రీరాములు, డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సీతా శ్రీనివాస్‌లతో పాటు వివిధ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు, పదోన్నతి అధికారులు, ఎసిఎం, ఇన్‌ఛార్జి పిఆర్‌ఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు రిక్షావాలా మృతి
పాతబస్తీ, ఏప్రిల్ 17: విజయవాడ పాతబస్తీలో మరుపిళ్ల చిట్టి పార్కు వద్ద ఆదివారం రాత్రి ఓ రిక్షావాలా వడదెబ్బకి మృత్యువాత పడ్డాడు. సుమారు 50ఏళ్ల వయస్సు గల రిక్షా కార్మికుడు రిక్షాలోనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి వడదెబ్బకే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. పోలీసులు మాత్రం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే నిర్థారిస్తామంటున్నారు.

నగరంలో సేదతీరిన మిలటరీ గుర్రాలు
విజయవాడ (రైల్వేస్టేషన్), ఏప్రిల్ 17: న్యూఢిల్లీలోని మిలిటరీ దళానికి చెందిన టీమ్ యుద్ధ సమయంలో ఉపయోగపడే సవారీ గుర్రాలను తీసుకుని బెంగుళూరు వెళుతున్నారు. న్యూఢిల్లీలోని ఎఎస్‌పి సెంటర్ నార్త్ ఇక్యస్ట్రేయిన్ టీమ్ న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి విజయవాడకు ఆరు గుర్రాలు కలిగిన విపి పార్శిల్ వ్యాన్ చేరుకుంది. ఈ వ్యాన్‌ని ఆరు, ఏడు ప్లాట్‌ఫారాల మధ్య సికింద్రాబాద్ వైపు మార్గంలో ఉన్న విఐపి సెలూన్‌లు నిలిపే ప్రదేశంలో పెట్టారు. అయితే బెంగుళూరుకు తీసుకువెళుతున్న గుర్రాలు తీవ్ర ఎండలకి తట్టుకునేందుకు వీలుగా వాటికి పెడస్టల్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు. పదిమంది మిలటరీ టీమ్ వీటిని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎండ తీవ్రతకు వాటికి విశ్రాంతి కలుగచేసేందుకు ఇక్కడ నిలిపామని మిలటరీ సోల్జర్ రామోధర్ సింగ్ తెలిపారు. బెంగుళూరులో శిక్షణ ఇవ్వటానికి ఈ గుర్రాలను తీసుకువెళ్తున్నట్లు వారు వివరించారు. ఇవి ఆదివారం రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరనున్నట్లు తెలిపారు.