కృష్ణ

గాంధీజీ దివిసీమ పర్యటనకు 88 ఏళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఏప్రిల్ 13: మహాత్మ గాంధీజీ దివి తాలూకాలో పర్యటించి నేటికి సరిగ్గా 88 సంవత్సరాలు నిండాయి. ఆయన పర్యటనకు 88 యేళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛ అవనిగడ్డ కార్యకర్తల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8గంటలకు కొత్తపేట రేవు వద్ద గాంధీ మహాత్ముడు, కస్తూరిబా విగ్రహాలకు పుష్పాంజలి ఘటించనున్నారు. సంస్మరణ సభలో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటారు. ఏప్రిల్ 14న గాంధీజీ బందరు నుండి బయలు దేరి చినముత్తేవి, పెదపూడి, కూచిపూడి, నరసన్నపాలెం, మొవ్వ, కొడాలి, తాడేపల్లి, ఘంటసాల, సాలెంపాలెం గ్రామాల మీదుగా కొత్తపేట రేవు దాటి అవనిగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పలు సమావేశాలలో ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడగా అందరూ ఖద్దరు ధరించాలని, విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, మద్యాన్ని మానాలని, అంటరానితనాన్ని పాటించరాదని గాంధీజీ ప్రబోధించారు. పలు ప్రాంతాలలో మహిళలు నూలు ఒడకటం చూసి గాంధీజీ చాలా సంతోషించారు. చివరిగా గాంధీజీ అవనిగడ్డ వద్ద ఏరు దాటుతున్నప్పుడు కనిపించిన దృశ్యం వర్ణనాతీతం. కనీసం 10వేల మంది ప్రజలు ఇరువైపులా కృష్ణానది ఒడ్డున నిలబడి మహాత్ముని రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఆయన సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు చూసిన దృశ్యం కన్నుల పండువగా ఉందని ప్రజలతో అనడం గమనార్హం. ఆ సమయంలో ఏరు పాటులో ఉండటంతో మహాత్ముని నావతో పాటు ప్రజలు అన్ని వైపులా నీటిలో నడిచారు. నదీ గర్భమంతా జన సంచారమైంది. నీరు కనపడలేదు. కృష్ణానది జనరూపం దాల్చి ఒక గట్టు నుండి ఇంకొక గట్టుకు ప్రవహిస్తుందో అన్నట్లు గోచరించింది. ఆ మహాత్ముని హృదయాంతరాళాల్లో ఆ ముహూర్తంలో ఎట్లాంటి భావాలు ఉత్తుంగ తరంగతాలైనాయి. మహాత్ముడు తన నయన జ్యోతులను పైకెత్తి సంధ్యాదేవికి నీరాజనాలు అర్పిస్తున్నట్లు తోచింది. మహాత్ముని దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న ఆ మహాజనం సంతోషాంతరంగులై జయధ్వానాలు చేశారు. వెనుక శ్రీరామచంద్రుడు అయోధ్యాపురి నుండి కారడవికి పోయేటప్పుడు సరయూ నదిని దాటటాన్ని గురించి వాల్మీకి వర్ణించిన దృశ్యం అందరికీ జ్ఞప్తికి వచ్చిందని ముట్నూరి కృష్ణారావు కృష్ణా పత్రిక సంపాదకీయంలో వర్ణించారు.