కృష్ణ

ఇద్దరు మంత్రులున్నా పురోగతి సున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 20: రాజధాని నగరంలో అధికార తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు రాను రాను మందగిస్తున్న తీరుపై కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాకు ఇద్దరు మంత్రులున్నా పార్టీ పురోగమించకపోవడం, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒంటెత్తు పోకడలు, మరో మంత్రి కొల్లు రవీంద్ర నిర్లిప్త వైఖరి, నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న నాన్ సీరియస్ వ్యవహారశైలిపై అటు నాయకత్వానికీ అసంతృప్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్చార్జిగా వ్యవహరిస్తోన్న యువ మంత్రి లోకేష్ కష్టం ఫలిస్తుందా అన్న చర్చకు తెరలేచింది. కృష్ణా జిల్లాలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం తొలినాళ్లలో ఉత్సాహంగా జరిగినా, తర్వాత రాను రాను మందగిస్తున్న తీరు అటు నాయకత్వాన్నీ అసంతృప్తికి గురిచేస్తోంది. విజయవాడ నగరంలోని రెండు నియోజకవర్గాల్లో తప్ప, కృష్ణా జిల్లాలో మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అంతంతమాత్రంగానే ఉంది. ఒక్కో నియోజకవర్గంలో జిల్లా నేతలందరితో సభలు పెట్టాలని బాబు ఆదేశించినా దానిని అమలుచేసే దిక్కులేదంటున్నారు. కాగా, ఇటీవల బాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో జిల్లా, నగరంలో ఇప్పటివరకూ పార్టీ ఆఫీసు నిర్మించుకోలేని అసమర్థతపై ఉమనుద్దేశించి బాబు స్వయంగా అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ నగరంలోనే రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోగా, మీరు మాత్రం ఇప్పటిదాకా పార్టీకి సొంత ఆఫీసు నిర్మించుకోలేకపోయారని బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక మరో మంత్రి కొల్లు రవీంద్ర తన నియోజకవర్గానికి పరిమితమయి, ఎక్కువగా పత్రికాప్రకటనలు, మీడియా భేటీలతోనే కాలక్షేపం చేస్తున్నారంటున్నారు. విజయవాడలో బొండా ఉమ, గద్దె రామ్మోహన్‌రావు, జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య, గన్నవరంలో వంశీ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోనే ఇంటింటికి తెలుగుదేశం బాగా జరుగుతోందని నాయకత్వానికి నివేదికలొచ్చాయి. కాగా విజయవాడ నగరంపై వైసీపీ సీరియస్‌గా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, ఇన్చార్జిగా వచ్చిన లోకేష్ పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటివరకూ ఆయన మూడు సమావేశాలు నిర్వహించారు. అయితే, ఇద్దరు మంత్రులు.. నగర, జిల్లా అధ్యక్షులు నేతలను ఏకతాటిపై నడిపించడం బదులు, పనులు చేయడం లేదని అధికారులపై లోకేష్‌కు ఫిర్యాదులు చేస్తున్న వైనంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న కేవలం మీడియా ప్రకటనలకే పరిమితమై, నియోజకవర్గ పర్యటనలు, క్షేత్రస్థాయి సమావేశాలు విస్మరిస్తున్నారంటున్నారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నాగుల్‌మీరా నియోజకవర్గంపై దృష్టి సారించడం లేదని, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు కూడా నిమిత్తమాత్రంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆయన పూర్తిగా మంత్రి ఉమ చెప్పింది చేస్తున్నారే తప్ప, సొంతగా కార్యక్రమాలు రూపొందించే సాహసం చేయడం లేదంటున్నారు.