కృష్ణ

ఇంటి కోసం ఇంటింటి సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : ఇంటి కోసం ఇంటింటి సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వేకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రానున్న ఉగాది నాటికి అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే గ్రామాల వారీగా ఆమోదయోగ్యమైన నివేశన స్థలాల గుర్తింపుకు శ్రీకారం చుట్టిన యంత్రాంగం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇప్పటికే నివేశన స్థలాల కోసం కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను గుర్తించేందుకు గాను నేటి నుండి వారం రోజుల పాటు ఇంటింటి సర్వే పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ఈ ఇంటింటి సర్వేలో గ్రామ, వార్డు వలంటీర్లు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు నివేశన స్థలాల కోసం 3లక్షల 850 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు గాను 2వేల 550 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో గ్రామాల వారీగా నివేశన స్థలాల గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. సుమారు వెయ్యి ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందుబాటులో ఉన్న వెయ్యి ఎకరాలు కాకుండా ఇంకా 1550 ఎకరాల భూమిని నివేశన స్థలాల కోసం సమకూర్చాల్సి ఉంది. ఈ భూములను సేకరించేందుకు గాను ప్రభుత్వంపై రూ.1500కోట్లు భారం పడనుంది. ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం గుర్తించిన 3లక్షల 850 దరఖాస్తుదారులే కాకుండా ఇంకెవ్వరైనా నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. నేటి నుండి వారం రోజుల పాటు నిర్వహించే ఇంటింటి సర్వేలో దరఖాస్తులను సైతం ప్రజల నుండి స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వలంటీర్లే నేటి నుండి ఈ నెల 31వతేదీ వరకు వారికి కేటాయించిన 50 కుటుంబాల వారిని కలిసి అర్హులను గుర్తించనున్నారు. ఆయా కుటుంబాల ప్రాథమిక సమాచారం సేకరించనున్నారు. ప్రాథమిక సమాచార సేకరణపై ఇప్పటికే వలంటీర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు సైతం నిర్వహించారు. వలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల వారిని కలిసి నివేశన స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నారా..? చేసుకుంటే వారి అర్హతలు పరిశీలించడం, అర్హులై దరఖాస్తు చేసుకోకుంటే వారి నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఏ విధమైన లబ్ధి పొందారు అనే సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. ప్రాథమిక సమాచార సేకరణ కోసం అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఫార్మెట్ తయారు చేసి వలంటీర్లకు అందజేశారు. పూర్తి స్థాయిలో నింపిన ఫార్మెట్‌లను వలంటీర్లు చివరి రోజైన 31వతేదీన తహశీల్దార్ కార్యాలయాలకు అందజేయనున్నారు. ఈ వివరాలను అధికారులు నవరత్నాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత అదనంగా అందిన నివేశన స్థలాల దరఖాస్తులు, అందుకు అవసరమైన భూముల గుర్తింపు, భూసేకరణ ద్వారా అయ్యే అంచనాల వ్యయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు.