కృష్ణ

పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 5: పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి కట్టుబడి పని చేస్తున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 11వేల మంది పేద బ్రాహ్మణులకు రూ.35కోట్ల మేర రుణాలుగా అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంఘానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌లో కార్పొరేషన్‌కు రూ.65కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను నిజమైన పేద బ్రాహ్మణ లబ్ధిదారులకు రుణాలుగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పేద బ్రాహ్మణుల పిల్లల విద్యాభివృద్ధికి ఎన్నో సరికొత్త పథకాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గాయత్రి పథకం ద్వారా 1 నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. చదువు పూర్తి చేసుకున్న వారికి వశిష్ఠ పథకం కింద పోటీ పరీక్షల నిమిత్తం గుర్తింపు కలిగిన కోచింగ్ సెంటర్‌లలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. చాణుక్య పథకం కింద పేద బ్రాహ్మణులకు సబ్సిడీపై బ్యాంక్ లింకేజీ రుణాలు ఇస్తున్నామన్నారు. వృద్దాప్య పెన్షన్‌లు పొందని వారికి ప్రతి నెలా వెయ్యి రూపాయలు, వృద్దాశ్రమంలో ఉంటే వారికి రూ.3వేలు నేరుగా బ్యాంక్ ఎకౌంట్‌లో జమ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని నివృత్తి చేసేందుకు ప్రాంతాల వారీగా ప్రత్యేకంగా నెట్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే విజయవాడలో ఒక నెట్ సెంటర్‌ను ప్రత్యేకంగా దరఖాస్తులు ఆప్‌లోడ్ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ వెంకట్ మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పారదర్శక సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రుణాలు పొందేందుకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా లబ్ధిదారులు నేరుగా 18001023579 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అలాగే బ్రాహ్మణ రెస్పాన్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత యేడాది కన్నా ఈ యేడాది కార్పొరేషన్‌కు రెండు రెట్లు బడ్జెట్ కేటాయింపు జరిగిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారుల సంఖ్యను మూడు రెట్లు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు ఆనంద సూర్య, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పివి ఫణి కుమార్, జిల్లా అధ్యక్షులు వాడవల్లి బాలాజీ సువర్ణ కుమార్, ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు వి సుందరరాం తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణులు రాజకీయ శక్తిగా ఎదగాలి - బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు

మచిలీపట్నం, జూన్ 5: బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు కోరారు. రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక సువర్ణ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కృష్ణారావు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానిక తటస్థ నాయకత్వంలో సంఘటితం కావాలని, రాజకీయాల్లో సముచిత స్థానం కోసం చురుకైన పాత్ర పోషించాలన్నారు. బ్రాహ్మణులు ఓటు వేయరు అనే అపవాదు పోగొట్టాలని, ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఉన్నత స్థితిలో ఉన్న బ్రాహ్మణ వర్గం సామాజికంగా తమ కమ్యూనిటీ అభివృద్ధికి పాటు పడాలన్నారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలో ఎంతో గౌరవం కలిగిన బ్రాహ్మణ వర్గం దేశ చరిత్రలో రాజకీయాలు శాసించిన, సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టిన మేటి వర్గమన్నారు. దేశంలో మొట్ట మొదటిగా మన రాష్ట్రంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత యేడాది నుండి ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా రూ.125కోట్లు పేద బ్రాహ్మణుల విద్య, ఉపాధికి ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), కార్పొరేషన్ యండి చంగవల్లి వెంకట్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య, ప్రధాన కార్యదర్శి వేమూరి రామకృష్ణారావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈమని సూర్యనారాయణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పివి ఫణి కుమార్, జిల్లా శాఖ అధ్యక్షులు వాడవల్లి బాలాజీ సువర్ణ కుమార్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు సింగలూరి శ్రీనివాస్, గాదె లలిత కుమారి, మాచర్ల తిరుమరావు, గండూరి మహేష్, సుందరాం, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతానికి ఇద్దరి మృతి
ఆగిరిపల్లి, జూన్ 5: కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఆదివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు ఎం వెంకట గోపాలరావు(68) ఇంట్లో అదే గ్రామానికి చెందిన ముల్లంగి నీలిమ సంవత్సర కాలంగా పనిచేస్తోంది. ఆయన ఇంట్లో ఆదివారం ఉదయం నీలిమ దుస్తులు ఉతికి ఆరేస్తుండగా దుస్తులు ఆరవేసే తీగకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కొట్టింది. ఆమె బిగ్గరగా కేకలు వేయటంతో గోపాలరావు విని రక్షించబోయారు. ఈసందర్భంలో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. నీలిమ అక్కడికక్కడే మృతి చెందగా గోపాలరావు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని హనుమాన్‌జంక్షన్ సిఐ జయకుమార్, వీరవల్లి ఎస్‌ఐ మురళీకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, వివిధ పార్టీల నాయకులు సందర్శించారు. సిఐ జయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగేశ్వరరావు హత్యకేసులో మరొకరు అరెస్టు
తిరువూరు, జూన్ 5: అక్కపాలెం సర్పంచ్ దోమతోటి వెంకటరమణ భర్త, డిసిసి కార్యదర్శి దోమతోటి నాగేశ్వరరావు హత్య కేసులో ఆదివారం మరో ముద్దాయిని అరెస్టు చేసినట్లు ఎస్సీ, ఎస్‌టి డిఎస్‌పి కె హరిరాజేంద్రబాబు తెలిపారు. గత నెల 17న నాగేశ్వరరావు అక్కపాలెంలో వాటర్ ట్యాంక్ వద్ద దారుణ హత్యకు గురైన విషయం విదితమే. గత నెల 22న నలుగురు ముద్దాయిలను గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన శివశంకరరెడ్డి హత్య అనంతరం నాగేశ్వరరావు మోటార్‌సైకిల్‌పై పరారవుతూ మైలవరం దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని అన్నారు. చికిత్స పొంది కోలుకున్న తరువాత శంకరరెడ్డిని అరెస్టు చేసి ఈరోజు తిరువూరు మండల తహశీల్దార్ , మండల మేజిస్ట్రేట్ గడ్డం బాలకృష్ణారెడ్డి ఎదుట హాజరుపర్చగా ముద్దాయికి ఆరురోజుల రిమాండ్ విధించినట్లు ఆయన చెప్పారు. రిమాండ్ ఖైదీని నూజివీడు తరలించామన్నారు. కాగా ప్రధమ ముద్దాయి శ్రీనివాసరెడ్డి తన నేర అంగీకార వాగ్మూలంలో పేర్కొన్న మరో ముగ్గురిని గత నెల 30న అరెస్టు చేసినట్లు డిఎస్‌పి వివరించారు. దీంతో నాగేశ్వరరావు హత్య కేసులో ఇప్పటివరకు ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లయింది.

పిడుగు పాటుతో ఎనిమిది మంది కూలీలకు గాయాలు
చల్లపల్లి, జూన్ 5: మండల పరిధిలోని సిడేపూడి ఇసుక క్వారీలో పిడుగుపాటుకు ఎనిమిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఇసుక క్వారీలో పిడుగు పడింది. దాని ధాటికి సమీపంలో ఉన్న నిమ్మగడ్డ గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు, గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు గాయాలపాలయ్యారు. స్థానికులు మద్దాల నాగరాజు, మాతంగి సుధ, వెంకట రమణలను చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి, పెనుమాక ఉష, కంచర్ల విజయ, మతంగి భిక్షాలను స్థానిక ప్రైవేటు వైద్యశాలకు, గూడూరు మండలం పోలవరం గ్రామస్థులను మచిలీపట్నం తరలించారు. వీరిలో మద్దాల నాగరాజును వైద్యుల సూచనల మేరకు 108లో మచిలీపట్నం తరలించారు. ఇదే సమయంలో స్థానిక పెదకళ్ళేపల్లి రోడ్డులో పిడుగు పాటుకు చెట్టుకూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాధితులకు డా. రత్నకుమారి, సాంబశివరావు తదితరులు వైద్య సహాయం అందిస్తున్నారు.