కరీంనగర్

సిఐడి విచారణకు హాజరైన అడిషనల్ ఎస్పీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 21: తన ఫైనాన్స్‌లో రూ.90లక్షలు పెట్టుబడులు పెట్టినట్లు మోహన్‌రెడ్డి వెల్లడించిన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ బి.జనార్దన్ రెడ్డి శనివారం సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరైనట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని గంటల పాటు కొనసాగిన విచారణలో తాను ఏలాంటి పెట్టుబడులు పెట్టలేదని జనార్దన్‌రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. జనార్దన్‌రెడ్డితోపాటు మరికొందరిని విచారించినట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జనార్దన్‌రెడ్డిని హైదరాబాద్ డిజి కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.

మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
* తెలంగాణ బెస్త సంఘం నేత శివకుమార్

కరీంనగర్ టౌన్, నవంబర్ 21: తెలంగాణలోని మత్స్యకారులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని తెలంగాణ బెస్త (గంగపుత్ర) సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ శివకుమార్ అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక తెలంగాణ చౌక్‌లో సంఘం ఆధ్వర్యంలో కేట్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివకుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ పునర్ నిర్మాణంలో గంగపుత్రులు, మత్స్యకారులందరూ భాగస్వాములవుతామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల నిర్మాణంలో మత్స్యకారులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలు వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం అలాగే మిగిలిందని, గంగపుత్రులను ఎస్టీల్లో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. బిసి ‘ఎ’ గ్రూప్‌లోకి ఎల్లాపి కులాన్ని చేర్చడం వల్ల గంగపుత్ర విద్యార్థులకు రిజర్వేషన్‌లో నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు ముదిరాజ్‌లను బిసి ‘ఎ’లో చేర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరారు. గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాక, ముదిరాజ్‌లను బిసి ‘ఎ’లోకి మార్చాలని అన్నారు. ఎంఎండిలో చేపలు పెంచుకునేందుకు గంగపుత్ర మత్స్యకారులకు కేజ్ కల్చర్ విధానంలో రెండు బాక్స్‌లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆప్క్ఫా చైర్మన్ చేతి ధర్మయ్య, సంఘం నాయకులు దోలి రంగస్వామి, దోలి రాజన్న, శేర్వ లక్ష్మినారాయణ, పాక పావనకృష్ణ, పెద్దపల్లి సురేందర్, నాగుల కిషన్, దేశ వేదాద్రిలతోపాటు పలువురు పాల్గొన్నారు.

మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహం ధ్వంసం
* కార్యకర్తలు ధర్నా, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

యైటింక్లైన్‌కాలనీ, నవంబర్ 21: కాలనీలో దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు విగ్రహం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. గతంలో రెండు సార్లు ధ్వంసం చేసిన వ్యక్తులను ఫిర్యాదు చేసినా పట్టుకోలేదని, ఆ వ్యక్తులే విగ్రహం ధ్వంసం చేశారనే అనుమానంతో ఆందోళన చేశారు. ధర్నా అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిఐ చల్లా దేవారెడ్డికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నో శ్రీపాదరావు విగ్రహాలు ఉన్నా కేవలం మంథని నియోజకవర్గంలో విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని, విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వ్యక్తులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన దుండగులను సాధ్యమైనంతవరకు పట్టుకుంటామని పోలీస్‌లు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఏది ఏమైనా విగ్రహం ధ్వంసంతో కాలనీలో మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ధర్నా కార్యక్రమంలో నాయకులు ఐరెడ్డి సంపత్ రెడ్డి, కొండగట్టు ఆలయ డైరెక్టర్ జక్కుల దామోదర్ రావు, మారెల్లి రాజరెడ్డి, సర్పంచ్ చాట్ల సదానందం, గుండేటి రాజేష్, ముత్తారం జెడ్‌పిటిసి సదానందం, విజేందర్ రెడ్డి, శంకర్‌నాయక్, తాజ్, ప్రశాంత్, మల్లిఖార్జున్, రేసవేణి కేశవులు, లక్ష్మణ్ రావు, తొట్ల తిరుపతి యాదవ్ తదితరులున్నారు. గత మే 18న శ్రీపాద రావు విగ్రహాన్ని ధ్వంసం చేయగా, మరల ఇదే సంవత్సరంలో విగ్రహం ధ్వంసం చేయడంపై కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే సంఘటన జరిగినప్పుడు మాత్రమే నెల రోజులపాటు పోలీస్‌లు సంఘన స్థలం వద్ద హోంగార్డ్‌ను నియమించడం ఆ తరువాత మర్చిపోవడం వల్లే కాలనీలో ఫ్లెక్సీలు చిరగడం, విగ్రహాలు ధ్వంసం చేయడం మామూలయింది. ఈ సారైన పోలీస్‌లు దృష్టిపెట్టాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.

అరాచకాలు కప్పిపుచ్చుకునేందుకే టిఆర్‌ఎస్ ఆరోపణలు
* నిరుద్యోగ ఇంజనీర్లకు మిషన్‌కాకతీయ పనులు అప్పగించాలి
* టిడిపి అధికార ప్రతినిధి శివరామకృష్ణ

కరీంనగర్ టౌన్, నవంబర్ 21: అధికారం ముసుగులో టిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలు కప్పిపుచ్చుకునేందుకే ఆపార్టీనేతలు ఎన్‌డిఎపై ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి కొరిటాల శివరామకృష్ణ విమర్శించారు. శనివారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 16 మాసాలనుంచి మోసపూరిత మాటలతో రాష్ట్రప్రజలను వంచిస్తోందని, అభివృద్ధి పేర సిఎం కుటుంబసభ్యులు రాష్ట్ర ఖజానాను పక్కదోవ పట్టిస్తూ, దివాలా తీయిస్తున్నారని దుమ్మెత్తారు. ప్రభుత్వ అజమాయిషీ కరువై బ్యాంకర్లు అప్పులు ఇవ్వక రైతన్నలు, చేనేతలు వీధినపడుతుంటే చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కొత్తరాష్ట్రం ఏర్పాటైతే ఏటేటా లక్షలాది ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తూ, నిరుద్యోగులను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఖాళీల భర్తీపై దృష్టిసారించకపోవటం శోచనీయమన్నారు. ఫలితంగా యువత నిరాశ,నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతూ, అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కప్పిపుచ్చుకునేందుకు జాతీయ ప్రజాస్వామ్య వేదికపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు, కేంద్రమంత్రులపై విమర్శలు చేయటం అవివేకమన్నారు. సిఎం కెసిఆర్ కూతురుకు నిన్నటిదాకా కేంద్రంలో మంత్రి పదవి లభిస్తుందనే ఆశతో ఉండగా, తాజాగా అది బెడిసికొట్టడంతో ఎంపి కవిత ఆరోపణల పర్వానికి తెరలేపిందని దుయ్యబట్టారు. కేవలం తనకూతురికి మంత్రిపదవి ఇస్తే తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరంలేదంటూ కేంద్రంతో చేసుకున్న రహస్య ఒప్పందం వాస్తవం కాదా అని కొరిటాల ప్రశ్నించారు. ఐటి మంత్రి కెటిఆర్ చెప్పిన మాటలు నీటిమూటలేనని తేలిపోయిందని, రాష్ట్రంలో ఐటి కంపెనీలు పెట్టుబడులు పెడతాయంటూ, నిరుద్యోగయువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయంటూ ఘంటాపథంగా చెప్పి, నేడు ఆ ఊసే ఎత్తకపోవటంలో ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారని, కంపెనీల్లో వాటాలు అడుగుతున్న ముఖ్యమంత్రి కుటుంబం వేధింపులు భరించలేక ఇతర రాష్ట్రాలకు కంపెనీలు పరుగులు తీస్తున్నాయన్నారు. కొత్తరాష్ట్రంలో తమ కష్టాలు తీరుతాయని భావించిన యువతకు కష్టాలు తప్పటంలేదని, నిరుద్యోగ ఇంజనీర్లకు మిషన్‌కాకతీయ పనులు అప్పగిస్తే, వారికి ఉపాధి కల్పించటంతో పాటు ఆంధ్రా గుత్తేదారులకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించారు. ఈసమావేశంలో టిడిపి నగరశాఖ అధ్యక్షురాలు నూజెట్టి వాణి, బిజెపి నాయకురాళ్ళు రాగుల లక్ష్మి, మాదరి నీరజ, చింతపుల్ల వాణి, పోతుగంటి సుజాతలతో పాటు పలువురు పాల్గొన్నారు.