కరీంనగర్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, జనవరి 21: రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్‌ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో ఉన్న పలువురు కంది రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి జిల్లా వంగపల్లికి చెందిన జూకంటి ప్రమీల, లింగాలఘణపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన బాషుపాక రాజులతో పాటు పలువురు కంది రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన కందులను మార్కెట్‌కు తెస్తే లేనిపోని నిబంధనలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావుకు మొరపెట్టుకున్నారు. పక్కనే ఉన్న ఎఫ్‌సిఐ, మార్కెటింగ్ అధికారులతో రైతులు చెప్పే విషయం వాస్తవమేనా అని అడగగా వారు నిబంధనల ప్రకారం మాత్రమే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తేమతో పాటు నాణ్యత గల కందులను మాత్రమే కొనుగోలు చేయాల్సి వస్తుంద అన్నారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. తమపై రైతులు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరిస్తున్నారని పలువురు అధికారులు మంత్రికి మొరపెట్టుకున్నారు. ఆయన రైతులతో మాట్లాడుతూ అధికారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి తమ సరుకులను విక్రయించాలని అన్నారు. అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, జెఎసి జిల్లా కన్వీనర్ ఆకుల సతీష్‌లు ఇచ్చిన వినతిపత్రం స్వీకరించి వెంటనే వాహనంలోకి వెళ్లారు. తమ సమస్యలు వినాలని రైతులు నినాదాలు చేయడంతో మంత్రి హరీష్‌రావు వాహనం నుంచి వచ్చి వారితో మాట్లాడారు.
వినతిపత్రంలో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషిచేస్తానని, ప్రతి అంశాన్ని రాద్దాంతం చేయవద్దని నాయకులను కోరారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్న వాస్తవాన్ని గ్రహించాలని అన్నారు. అంతకు ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కందుల కొనుగోలు చేస్తున్న కృషిని వివరించారు. కందుల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రంలో 80కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 63కేంద్రాలను ప్రారంభించి తద్వారా 17వేల మంది రైతుల నుంచి 1,85,656క్వింటాళ్ల కందులను సేకరించిందన్నారు. రెండు, మూడు రోజుల్లోనే మిగతా సెంటర్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ యేటా వర్షాలు సమృద్ధిగా కురిసినందున ఖరీప్ సీజన్‌లో అధికంగా వరిధాన్యం వచ్చే అవకాశం ఉందని ముందే గ్రహించి రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్నారు. మూడు, నాలుగు గ్రామాలను యూనిట్‌గా తీసుకొని ఐకెపి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సరుకులు విక్రయించేందుకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్థానిక అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మయాదగిరిరెడ్డి, వైస్ చైర్మన్ నామాల బుచ్చయ్య, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి, జెసి గోపాలకృష్ణ ప్రసాద్‌రావు, డిఎంవో నాగభూషనశర్మలు పాల్గొనగా డిసిపి వెంకన్న, ఎసిపి పద్మనాభరెడ్డిల ఆధ్వర్యంలో పోలీసులు మార్కెట్ ఆవరణలో గట్టి బందోబస్తు నిర్వహించారు. అనంతరం జెసి ప్రసాద్‌రావు ఎఫ్‌సిఐ అధికారులు, రైతు సంఘం, జెఎసి నాయకులతో సమావేశమై కొనుగోళ్లు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.
లక్ష్య సాధనపై దృష్టి పెట్టండి
* కలెక్టర్లకు ఆదేశించిన డిప్యూటీ సిఎం

వరంగల్, జనవరి 21: పూర్వ వరంగల్ జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో నిర్ధేశించిన లక్ష్యాల సాధన విషయంలో ఐదు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఆయా శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్వ వరంగల్ జిల్లాలో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించే చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాల విభజన తరువాత మొదటిసారిగా పూర్వ వరంగల్ జిల్లాప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. చైర్‌పర్సన్ పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయం, మిషన్ భగీరథ పనుల తీరుపై ఉపముఖ్యమంత్రి కడియంతోపాటు పలువురు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో పేరుకుపోయిన సమస్యలు, అధికారుల తీరును సభ్యులు కడియం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని ప్రజలు నమ్మలేని పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని అధికారులు చక్కదిద్దాలని అన్నారు. విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని, చిన్నచిన్న అవసరాలు, సమస్యలను స్థానికంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. మోడల్ స్కూళ్లు, కెజిబివిలలో వౌళిక వసతులు, ఉపాధ్యాయుల కొరత తదితర సమస్యలను సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చినపుడు ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖపై చర్చ జరిగిన సందర్భంలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో నెలకొన్న సమస్యలపై పలువురు సభ్యులు ఫిర్యాదు చేసారు. చాలా పిహెచ్‌సి, సిహెచ్‌సిలలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఉన్న డాక్టర్లు సరిగా విధులకు హాజరు కావటంలేదని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా భారీగా నిధులు ఖర్చుచేస్తున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదని వ్యాఖ్యానించారు. ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు ఎందుకు తక్కువగా జరుగుతున్నాయని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులను ప్రశ్నించారు. పలు ప్రైవేటు ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకు అవకాశాలు ఉన్నా సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల నిర్వహణ సరిగా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. నకిలీ విత్తనాల సరఫరాపై సమావేశంలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు.