కరీంనగర్

భక్తజన సంద్రం.. ధర్మపురి క్షేత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 12: దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా నిత్య సేవలందు కుంటున్న ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆదివారం నిర్వహించిన యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండేగాక, సదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ ఆచారంలో భాగం గా దైవ దర్శనాభిలాషులై ఏతెంచిన జానపదుల బృందగానాలు, భగవన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవాద్యాలు, విదివిధాన వేదోక్త పూజలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. తమ మొక్కులు చెల్లించడానికి శనివారం రాత్రినుండే తరలి వచ్చిన భక్తుల, యాత్రికులతో ఆదివారం ప్రాచీన క్షేత్రం అశేష జనసంద్రమైంది. ప్రధాన రహదారి నిండిపో వడంతో రాకపోకలు స్థంభించిన వేళ, క్యూలైన్లను దేవాలయం ముందు భాగానికి మళ్ళించే చర్యలు చేపట్టి క్రమబద్దీకరించడంపై దృష్టి కేంద్రీకరించారు. నరసింహ శతక పద్యాలు, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు, భక్తి సంగీతాలు, హరికథా కాలక్షేపాలు, అలౌకిక ఆనందాన్ని ఆస్వాదింపజేస్తూ, ఆధ్యాత్మిక లోకాల్లో విహరింపజేశాయి.
ప్రసాదాలే మృష్టాన్నాలు
నృసింహుని తెప్పోత్సవ సందర్భం గా క్షేత్రం భక్తజన సంద్రంగా మా రింది. పట్టణంలో తినుబండారాలు కరువైన సందర్భంలో దేవస్థానంలో విక్రయించిన పులిహోర, లడ్డూలు ఇత్యాది ప్రసాదాలు, దేవస్థాన ఉచిత అన్నదాన కార్యక్రమం హోటళ్ళ తినుబండారాలే షడ్రుచుల భోజనాలుగా ఆరగించి, అలసటలతో దేవాలయాలప్రాంగణాలలోనే విశ్రమించారు. గోదావరినది వద్ద పవళించారు. దేవాలయాలలో గండాదీపం, వల్లుబండ, కోడె మొక్కులు, తలనీలాలు, పట్టెనామాలు, కోరమీసాలు, తదితర మొక్కులను తీర్చుకున్నారు. పెరిగిన రద్దీ దృష్ట్యా ఆర్మూరు, నిజామాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, కోరుట్ల, మెట్‌పెల్లి తదితర డిపోలనుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపారు. జగిత్యాల ఎఎస్పీ అనంత శర్మ నేతృత్వంలో, డీఎస్పీ కరుణాకర్, ధర్మపురి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో జిల్లాలోని ఎస్‌ఐలు, అధిక సంఖ్యాకులైన సివిల్, ప్రత్యేక పోలీసులు ఎలాంటి అవాంఛనీయాలు చోటుచేసుకోకుండా వ్యూహాత్మకంగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
తాత్కాలిక గుడారాలు
గోదావరి తీరంలో, మంగలి గడ్డ, సోమవిహార్ పుష్కర ఘాట్ల పైన మేదరి పుల్లలు, బట్టలు, ప్లాస్టిక్ కవర్లతో వేసుకున్న తాత్కాలిక గుడారాలు నిలువ నీడనిచ్చాయి. నాందేడ్, నాగపూర్, పూణె, అంకుసాపూర్, కుస్తాపూర్, బాల్‌కొండ, మోర్తాడ్ తదితర ప్రాంతాలనుండి అరుదెంచిన భక్తులు పిల్లా పాపలతోఎండవేడికి తాళజాలక గుడారాలలో తలదాచుకున్నారు.
ప్రత్యేక పూజలు
బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం వంశపారంపర్య యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మల ఆధ్వర్యంలో అర్చకులు వివిధ ఆలయాలలో ఉదయాత్పూర్వంనుండి నిత్య హవన, యువాగ్నిధ్యానం, సప్తజిహ్వాహోమం, అగ్నిజటాఝూట ఆధారాది పద్మాంతం యోగపీఠ హవనం, అష్టాక్షరీ మంత్రన్యాస, ద్వాదశాక్షరీ మంత్రన్యాస హో మం, షడఙ్గన్యాసం, షోడశోపచార పూజలు, మూర్తి మూలమంత్ర హవనములు, నృసూక్త, పురుషసూక్త, విష్ణుసూక్త, భూసూక్త, నీలాసూక్త హవనములు, పరావార హోమములు, ఉత్సవ ప్రదాన హోమము, వ్యాహృతి హోమం, నిర్వహించారు.
అన్నదానికి భక్తుల వితరణలు
బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం అనూహ్యంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా దేవస్థానంలో నిర్వహించిన అన్నదానానికై పలువురు దాతలు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు తదితరాలను సమర్పించారు. స్థానిక వర్తక, వాప్యారులతోపాటు వివిధ ప్రాంతాల భక్తులు తమవంతు విరాళాలను అందజేశారు. పలువురు స్వచ్చంద సేవకులు, చైతన్య భారతి విద్యార్థులు స్వచ్చంద సేవలు అందించారు. 15వేల మంది అన్నదానాన్ని ఉపయోగించు కున్నారు.
రూ. 4.67 లక్షల ఆదాయం
దేవస్థానంలో బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా నాలుగో రోజున రూ. 4,67,529 ఆదాయం లభించింది. స్వామి వారల ప్రత్యేక పూజా కార్యక్రమాల ద్వారా దేవస్థానానికి ప్రసాదాల, వివిధ టిక్కెట్ల ద్వారా, అన్నదాన కార్యక్రమం ద్వారా ఈఏడు ఆదాయం గణనీయంగా పెరుగుతున్నదని దేవస్థానం ఎసి,ఇఓ సుప్రియ తెలిపారు.
గోదావరి నదిలో
మంగళ స్నానాలు
బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమై న కోరిన కోర్కెలు తీర్చే యోగానంద నారసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా పౌర్ణమి తిథియుక్త ఆదివారం ఉదయాత్వూర్వం నుండి గోదావరిలో స్నానాలను సుదూర ప్రాంతాలకు చెందిన అశేషభక్తులు సంప్రదాయాచరణలో భాగంగా ఆచరించారు. పౌరోహితులచే సంకల్పాది సత్కర్మలను ఆచరించి, పీడా నివారణార్థం దానధర్మాలు చేసుకున్నారు.

ప్రతి శాఖకు కేంద్ర నిధులు
* కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్
ఎల్లారెడ్డిపేట, మార్చి 12: రాష్ట్రంలో ప్రతి శాఖకు కేంద్ర నిధులు కేటాయించామని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమా ర్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తి, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం ప్రవేశ పెట్టడడం జరుగుతోందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచీకరణలో కనుమరుగైన కుల వృత్తులను కాపాడుకుని నిలదొక్కుకునేలా బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నామన్నారు. విద్య కోసం 500 పైచిలుకు గురుకులను కేటాయించారన్నారు. ఐఏఎస్, పార్లమెంటు సభ్యుడు, మంత్రి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదివే విధంగా సామాన్య ప్రజలకు విద్య అందించాలనేది సింఎం కేసిఆర్ లక్ష్యమన్నారు. సమాన విద్యనే కేజీ టు పీజి అన్నారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాల మేరకు బడ్జెట్‌ను రూపొందించారన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సంబరాలు జరుపుకోవాలని ఎంపి చెప్పారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు ఆగయ్య, టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు, ‘సెస్’ డైరెక్టర్ మల్లారెడ్డి, మార్కెటు కమిటి అధ్యక్షుడు సుభాష్, బొప్పాపూర్ సర్పంచ్ భీమేశ్వర్, నాయకులు మోహన్, కొండ రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, హసన్, రాజునాయక్, గణపతి, తదితరులు పాల్గొన్నారు.