కరీంనగర్

గుండారెడ్డిపల్లికి గోదావరి నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోహెడ, జూలై 18: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల్ని తొలుతగా మండలంలోని గుండారెడ్డిపల్లికే మళ్లించనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లిలో ఒగ్గువాగుపై 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న చెక్‌డ్యామ్ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన తొలి గ్రామంగా ఎంపికకావడంతో పది లక్షల వ్యయంతో మహిళా స్వశక్తి భవనం మంజూరీ ఇచ్చి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. మిషన్ కాకతీయ క్రింద 28 లక్షలతో కుంట పనుల్ని ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామం నుండి బద్ధిపడిగె వెళ్లే దారిలోని వాగుపై బ్రిడ్జి కమ్ చెక్‌డ్యామ్ నిర్మాణానికి నిధులు మంజూరీ చేస్తున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక్ సాగర్ వద్ద 3టిఎంసిల రిజర్వాయర్ పనులు పూర్తి కావస్తున్నాయని, దీని ద్వారా గుండారెడ్డిపల్లికి తొలుతగా 2,280 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. దీనికి సుమారు 70 ఎకరాలు రైతుల నుండి కాలువ పనులకై భూమిని సేకరించాల్సి ఉందని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల జలాలు, చెక్‌డ్యామ్‌లు, కుంట పునర్నిర్మాణాలు, జారు నీళ్లతో ఇకపై బోర్లు ఎండవని, బావుల్లో నీళ్లు అడుగంటవని అన్నారు. పూర్తిగా వెనుకబడిన గ్రామంలో ఇకపై రెండు పంటలతో రైతులు సుఖంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులను దశలవారీగా విస్తరిస్తూ నాలుగు కోట్ల పైచిలుకు పనుల్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో బంగారు తెలంగాణ సాకారం చేసుకునేందుకు సిఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ ఏడు రబీలో 50 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందని, రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలు వినియోగంలోకి వస్తే మరింత ఎక్కువగా పంటలు పండుతాయని, రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్, ఎంపిపి స్వామి, జడ్పీటిసి లక్ష్మణ్, విండో చైర్మన్ శ్రీహరి, సర్పంచ్ కనుకయ్య, నీటి పారుదల శాఖ ఇఇ రవీందర్ రెడ్డి, డిఇ విద్యాసాగర్, ఆర్‌డిఓ శంకర్ నాయక్, తహశీల్దార్ నరేందర్‌లతో పాటు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఉద్యమంలా మొక్కలు నాటాలి
* హరితనగరంగా తీర్చిదిద్దాలి * జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్, జూలై 18: హరితహారం కార్యక్రమంలో నగరంలోని ప్రజలందరూ భాగస్వాములై ఉద్యమంలా మొక్కలు నాటి హరితనగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం తీగలగుట్టపల్లిలోని రైల్వేస్టేషన్ వద్ద శాసనసభ్యులు గంగుల కమలాకర్‌తో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి మూడవ విడత హరితహారం కార్యక్రమాన్ని కరీంనగర్‌లో ఘనంగా ప్రారంభించారని, వారి మంచి ఆశయాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. నగరంలో రోజు ఒకచోట హరితహారంలో భారీ ఎత్తున మొక్కలు నాటుతున్నామని కలెక్టర్ తెలిపారు. మంగళవారం రైల్వే లైన్ వెంబడి రెండు వేల మొక్కలు నాటామని అన్నారు. ఒక రోజు మార్క్‌ఫెడ్‌లో 8 వేల మొక్కలు, శాతవాహన యూనివర్శిటిలో 25 వేలు, పాలిటెక్నిక్ కాలేజీలో 5వేలు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 5 వేలు, రోడ్ల వెంబడి, నగరంలోని వివిధ డివిజన్లలో ఇండ్ల ఎదుట మొక్కలు నాటామని కలెక్టర్ తెలిపారు. నాటిన మొక్కలన్నింటికీ ట్రీ గార్డులు అమర్చామని, బ్లాక్ ప్లానిటేషన్ చేసిన చోట ఫినిషింగ్ చేయించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం తీసుకున్నదని, ఈసారి నాటిన ప్రతీ మొక్కను రక్షించుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక్, మండల పరిషత్ అధ్యక్షులు వాసాల రమేష్, ఆర్‌డిఓ రాజాగౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్, హార్టికల్చర్ శ్రీనివాస్, ఎంపిడిఓ దేవేందర్, తహశీల్దార్లు రాజ్‌కుమార్, శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

విద్యా రంగానికి పెద్ద పీట
* నూతన జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రం మరింత అభివృద్ధి * ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి వెల్లడి

హుస్నాబాద్, జూలై 18: తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడుతూ గత పాలకుల విధానం వల్లనే విద్యారంగం వెనుక బడిందని పేర్కొన్నారు. కళాశాలలు మంజూరీ ఇచ్చారు గానీ.. వాటికి స్థలాలు చూపించక పోవడం వల్లనే నేడు తెలంగాణలో ఎక్కడా పక్క్భావనాలు లేవని అన్నారు. కెసిఅర్ నాయకత్వంలో రాష్టంలో 57 కళాశాలకు 367 కోట్లరూపాయలు మంజూరీ అయినట్లు తెలిపారు. దానిలో భాగంగానే నేడు హుస్నాబాద్‌లో రూ.8 కోట్లతో గత సంవత్సరం మంజూరుకాగా నేడు భవన ప్రారంభం జరిగిందని తెలిపారు. హుస్నాబాద్‌కు మహిళా డిగ్రీ కళాశాలను వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ పాఠశాలలకు కోటి రూపాయలు ఇస్తామన్నారు. ఈ కళాశాలకు రోడ్డు, ప్రహరీ గోడ, సిసి కెమెరాలు, చక్కని టాయిలెట్లు నిర్మిస్తామని అన్నారు. 220కోట్లు నూతన భవనాల కోసం, 160 కోట్లు ప్రహరీ గోడల నిర్మాణం ఎస్సీ, ఎస్‌టిలు మైనార్టీలు ప్రత్యేక గురుకులాలు, కేజీ టూ పీజీ గురుకులాలకు 525కోట్లు ఖర్చు చేస్తుందని పేర్కోన్నారు. ఇంతే కాకుండా రాష్టంలో పేదల కోసం 40వేల మందికి 38లక్షల ఫించన్లు ఇస్తూ ఏటా 530 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్యెల్యే ఒడితెల సతీష్‌బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఎంపిపి భూక్య మంగ, జెసి పద్మాకర్, ఆర్డీఓ శంకర్‌కుమార్, తహశీల్దార్ టి.వాణి, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీహరి, పన్యాల భూపతిరెడ్డి, ఆరు మండలాల ఎంపిపిలు, జడ్పీటిసిలు, అధికారులు పాల్గొన్నారు.

లెక్కలు కాదు..రక్షణే ముఖ్యం

* లక్ష్యం మేర మొక్కలు నాటాలి * మొక్కలు వంద శాతం రక్షించాలి
* ఎన్ని నిధులైనా మంజూరు చేస్తాం * ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్, జూలై 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో లెక్కల కోసం మొక్కలు నాటవద్దని, నాటిన ప్రతి మొక్కను రక్షించడమే ముఖ్యమని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లాలో నాటిన మొక్కలు వందశాతం రక్షించబడాలని, ఇందుకు అవసరమైన ట్రీగార్డ్స్, ఫెన్సింగ్‌కు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని, వెంటనే అంచనాలు తయారుచేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి హరితహారంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఈ నెల 12న సిఎం కెసిఆర్ ప్రారంభించిన హరితహారాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి వర్షాలు కురుస్తున్న తరుణంలో లక్ష్యం మేరకు జిల్లాలో మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు. మొక్కలు నాటడం ప్రాక్టికల్‌గా ఉండాలని అన్నారు. మొదటి విడత హరితహారంలో వర్షాలు పడలేదని, రెండవ విడతలో వర్షాలు కురిసిన మొక్కలు సరిగా రక్షించబడలేదని అన్నారు. ఈ సారి మూడవ విడతలో పకడ్బందీగా స్కూల్స్, కళాశాలలు, ఖాళీ స్థలాలలో నాటిన మొక్కలకు ఫెన్సింగ్ చేయించి రక్షిస్తామని అన్నారు. రోడ్ల పక్కన, ఇళ్ల ముందు నాటిన మొక్కలకు వెంటనే ట్రీగార్డులు ఏర్పాటు చేసి రక్షణ బాధ్యతలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు హరితహారంలో జిల్లాకు రూ.4కోట్ల నిధులు వచ్చాయని, ఇంకా ఎన్ని నిధులైన మంజూరు చేస్తామని తెలిపారు. వచ్చే పది రోజులు జిల్లాలో ఉద్యమ రూపంలో, ఒక జాతరలా మొక్కలు నాటే కార్యక్రమం గ్రామం, పట్టణం, ఊరు, వాడలలో జరగాలని అన్నారు. జిల్లాలో తనతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపిపిలు, జడ్పీటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆటోలలో పూలు, పండ్ల మొక్కలు పెట్టుకుని ఇంటింటా తిరిగి మొక్కలు పంపిణీ చేస్తామని, ఆ మొక్కలను నాటి రక్షించుకోవాలని ఇంటి యజమానులను కోరారు. ఈత, తాటి చెట్లు నాటినచోట వాటి రక్షణకు డ్రిప్ మంజూరు చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు. గుట్టలపై మొక్కలు నాటుటకు వీలుందని, గుట్టలపై కేవలం నెమలి నార, సీతాఫలం, కానుగ, మోదుగ, వేప తదితర చెట్లు నాటాలని సూచించారు. గ్రామాలలో సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద, ఎస్సారెస్పీ కాలువల వెంబడి, దేవాదాయ భూములు, స్మశాన వాటికలు, వాగుల వెంబడి, చెరువు గట్ల వెంబడి మొక్కలు నాటాలని కోరారు. ఒక్క మొక్క కూడా ట్రీగార్డు లేకుండా ఉండకూడదని మంత్రి ఆదేశించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్‌లో కదంబ, నేరెడు, బొడ్డుమల్లే చెట్టును ఇళ్లల్లో పెట్టుకునేందుకు మహిళలు ఉత్సాహం చూపుతున్నారని, ఈ మొక్కలు లక్ష తెప్పించి ఇస్తే నగరంలో మహిళలచే నాటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డిఆర్వో అయేషామస్రత్ ఖానం, డిఎఫ్‌ఓ శ్రీనివాస్, డిఆర్‌డిఓ వెంకటేశ్వర్‌రావు, మెప్మా పిడి పవన్‌కుమార్, జెడిఏ శ్రీ్ధర్, డిపిఓ నారాయణరావు, సిపిఓ సుబ్బారావు, హర్టికల్చర్ ఎడి శ్రీనివాస్, ఆర్డీఓ రాజాగౌడ్, ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.

మేమేం పాపం చేశాం?

* మా కారుణ్యంపై కాఠిన్యమెందుకు?
* 201016 మద్యకాలంలో... మరణించిన పోస్టల్ కుటుంబాల కన్నీటి ప్రశ్న
* 20న చీఫ్ పోస్ట్ మాస్టర్ ఆఫ్ జనరల్ కార్యాలయం ఎదుట ఆందోళన

కరీంనగర్ టౌన్, జూలై 18: వారంతా ఒకే శాఖలోకొలువులు చేశారు. విధి నిర్వహణలోఅంకితభావం ప్రదర్శిస్తూ, నామమాత్రపువేతనాలతోతమ కుటుంబాలను నెట్టుకొచ్చారు. సాదాసీదాగా నడుస్తున్న వారి జీవననౌకను విధి వెక్కిరించింది. విధుల్లోనే మరణించగా, వారిని ఆదుకోవాల్సిన ఆశాఖ కొంతమందిపై మాత్రమే కనికరం చూపింది. నిబంధనల పేర మిగతావారిని విస్మరించింది. దీంతోఅంతా ఏకమై మేమేం పాపం చేశాము. మా కారుణ్యంపై ఎందుకింత కాఠిన్యం చూపుతున్నారని కన్నీటితోప్రశ్నిస్తూ, ఆందోళనకు సిద్దమవుతున్నారు. నిత్యం ప్రజలతోమమేకమై, వారి క్షేమసమాచారాలు చేరవేసే తంతి తపాలాశాఖ విభాగంలో గ్రామీణ ఢాక్ సేవక్‌లుగా చిరుద్యోగాలు చేస్తూ మరణించిన కొంతమంది కుటుంబాలు తమకు జరిగిన అన్యాయంపై ఎలుగెత్తేందుకు సన్నద్దమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబాల్లోని అర్హులైన వారికి కారుణ్య నియామకంలో భాగంగా ఉద్యోగావకాశం కల్పించటం ఆశాఖల బాధ్యత. తపాలాశాఖ కూడా ఈవిధానాన్ని అనుసరిస్తూ,అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈశాఖ దేశవ్యాప్తంగా ఒకేరీతిలోకారుణ్య నియామకాలు చేపడుతుంది. అయితే, 2010నుంచి మాత్రం నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలోకేవలం ఎస్సెస్సీ అర్హత ఉన్నా ఉద్యోగ బాధ్యతల నిర్వహణకు అనుమతించే అవకాశముండగా, సవరించిన నిబంధనలతోకనీస విద్యార్హతను డిగ్రీకి పెంచారు. పాయింట్ల విధానం అనుసరించగా,రెండు తెలుగు రాష్ట్రాల్లో 700కు పైగా అభ్యర్థుల ధరఖాస్తులు కారుణ్య నియామకాల తిరస్కరణకు గురయ్యాయి. 2016వరకు ఈనిబంధనలే కొనసాగగా, అనంతరం జీవోడిజిఎల్‌ఆర్ నెం.171/2017 జిడిఎస్ పేర గత మే 30న భారతీయ తపాలా శాఖ కొత్త ప్రొసీడింగ్ విడుదల చేసింది. దీని ప్రకారం పాత పద్దతిలోనే కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఆదేశాలు జారీచేసింది.అయితే, 2010నుంచి 2016 మద్య కాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను మాత్రం విస్మరించింది. దీనిని గమనించిన సంబంధిత కారుణ్యార్ధులు చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌ను సంప్రదించారు. దీనిపై తామేమి చేయలేమని, కేంద్రకార్యాలయంలో సంప్రదించాలంటూ సూచించగా, కేంద్ర కమ్యూనికేషన్లశాఖ మంత్రి మనోజ్ సిన్హాను కూడా కొద్దిరోజుల క్రితం కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అయినా, న్యాయం జరిగే సూచనలు కన్పించకపోవటంతోరెండు తెలుగు రాష్ట్రాల్లోని పోస్ట్‌మాస్టర్ జనరల్ ప్రధాన కార్యాలయాల ఎదుట ఈనెల 20న ఆందోళన చేపట్టేందుకు ఉపక్రమించారు. దీంతోనైనా అధికారులు కళ్ళు తెరవకపోతే, నిరవధిక దీక్షలకు దిగుతామని జిడి ఎస్ తెలంగాణ కారుణ్యనియామకాల సాధన సమితి రాష్ట్రఅధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్‌కె అక్బరుస్సేన్, కె.వేణుగోపాల్‌లు స్పష్టం చేస్తుండగా, వీరి నిరసనపై ఆశాఖ వర్గాల్లో చర్చ మొదలైంది.

ఫీజుల దోపిడీ నిరసిస్తూ 21న ప్రైవేట్ పాఠశాలల బంద్
కరీంనగర్ టౌన్, జూలై 18: జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ, పేద,మద్యతరగతి కుటుంబాలను ఆర్దిక దోపిడీ చేస్తున్న తీరును నిరసిస్తూ బిసి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 21న బంద్‌కు పిలుపునిచ్చినట్లు జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎన్నం ప్రకాశ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు రాకేశ్‌లు తెలిపారు. మంగళవారం నగరంలోని బిసి విద్యార్థి సంఘం జిల్లాకార్యాలయంలోనిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశంలోవారు పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవటంలోవిద్యాశాఖ నిర్లక్ష్యం వహిస్తుండటం వెనుక ఆంతర్యమేంటని వారు ప్రశ్నించారు. 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉండగా పట్టించుకోవటం లేదని, పాఠశాలల్లో వౌళిక వసతుల కల్పనపై కూడా తనిఖీలు చేపట్టకుండా పరోక్షంగా వారికే విద్యాశాఖాధికారులు మద్దతు తెల్పుతున్నారని మండిపడ్డారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని తేవాలని,అనుమతుల్లేకుండా కొనసాగుతున్న పాఠశాలలు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చి పాఠ్య,నోటుపుస్తకాలు, డ్రెస్సులు, బూట్లు విక్రయిస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని, అధిక ఫీజులు వసూలు చేస్తూ, వ్యాపార కేంద్రాలుగా మారిన పాఠశాలలపై పిడి యాక్టు అమలు చేయాలన్నారు. తోకపేర్లతో చెలామణి అవుతున్న పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలను మోసం చేస్తున్న వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలనే డిమాండ్లతోశుక్రవారం తలపెట్టిన పాఠశాలల బంద్‌లో అన్ని విద్యార్థి సంఘాలు, స్వచ్చంధ సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈసమావేశంలోబిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగుల కనుకయ్య, నాయకులు రాచమల్లు రాజు, పెంట శ్రీనివాస్, కాయితోజు బ్రహ్మచారి, బోనాల సత్యం, గూడూరి సురేశ్, ఎస్.రాజేశ్‌గౌడ్, మహిళా నాయకురాళ్ళు గీత, పద్మ మమత, లక్ష్మి, నల్ల మంజులతతో పాటు పలువురు పాల్గొన్నారు.

అత్యాచారయత్నం కేసులో రెండేళ్ల జైలుశిక్ష

లీగల్ కరీంనగర్, జూలై 18: వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు తడగొండ హన్మంతు (45)కు కరీంనగర్ అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మైత్రేయి మంగళవారం రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన తడగొండ హన్మంతు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. 27.11.2015న అదే గ్రామానికి చెందిన వివాహిత తన ఇంటి సమీపంలో గడ్డివాము కుప్పలు వేస్తుండగా హన్మంతు అక్కడికి చేరుకొని అత్యాచారయత్నానికి ప్రయత్నించి కత్తితో చంపుతానని బెదిరించాడు. భయంతో వివాహిత కేకలు వేయడంతో ఆమె భర్త రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన సంఘటనపై బాధితురాలు రామడుగు పోలీస్ స్టేషన్‌లో నిందితునిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చి, చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖలీమ్ మోయినోద్దీన్ వాదించారు. కేసుపై పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి మైత్రేయి నిందితునిపై నేరం రుజువుకావడంతో రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం

* హుస్నాబాద్ రైతు బజారుకు రూ.4 కోట్లు
* హుస్నాబాద్ సమగ్రాభివృద్దికి కృషి చేస్తా * భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

హుస్నాబాద్, జూలై 18: తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల కోసం 24గంటల కరంటు ఇస్తుందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం హుస్నాబాద్‌లోపలు కార్యక్రమాల్లో పాల్గోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో 3కోట్లతో నిర్మించిన 5వేల మెట్రిక్‌టన్నుల సామర్య్థాంగల గోదాములను ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణ అభివృద్దికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.హుస్నాబాద్ అర్‌టిసి డిపోకు 20 కొత్త బస్సులను నెల రోజుల్లో వచ్చె ఏర్పాటు చేస్తామన్నారు.పట్టణంలోని ఎల్లమ్మ చెరువు,మినిస్టేడియం పనులను,మహాసముద్ర గండి పనులు వంటి పనులు జరుగుతున్నాయని అన్నారు.గత ప్రభుత్వలు రైతులకు కరంటు కోసం ధరా లు చేశారు.రువుల కోసం క్యూలుకట్టి ఎండకు తట్టుకోకా తమ చెప్పులను వరుసలో పెట్టారని నేడు తెలంగాణ ప్రభుత్వం అలాంటి కష్టలు లేవన్నారు. రైతులకు ఎరువుల పండిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు నిరంతరం 24 గంటలు కరంటు ఇస్తుంటే రైతు బావుల్ల నీటి కొరత వల్ల 24టగంటలు కరంటు వద్దంటున్నారు.60 సంవత్సరాల పాలనలో రైతులకు ఎమి చేసిందోచెప్పమనండి.గౌరవెల్లి,గండిపెల్లి ప్రాజెక్టుల భూ నిర్వాసితులకు 8లక్షల ప్యాకేజి ఇప్పించామని త్వరలో ఈ ప్రాజెక్టులో పనులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామన్నారు.మార్కెట్ యార్డులో సిసి రోడ్డువేయాలని సూచించారు. స్థానిక ఎమ్యెల్యేసతీష్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, నాయకులు కర్రశ్రీహరి పి.్భపతిరెడ్డి, ఎంపిపి,మంగ, మార్కెట్ చైర్మెన్ సాయన్న,వైస్ చెర్మెన్ రాజారెడ్డి,అర్డీవో శంకర్‌రావు, ఎంపిపిలు,జడ్స్‌టిసీలు, మార్కెటింగ్ అధికారులు, తహశీల్డాదార్ వాని డైరెక్టర్లుపాల్గోన్నారు.

పోలీసు శాఖ పెట్టిన ప్రతి మొక్కను వృక్షంగా మారుస్తుంది
* ‘హరితహరం’లో జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి
* జిల్లాలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యం
సిరిసిల్ల, జూలై 18: పోలీసు శాఖ పెట్టిన ప్రతి మొక్కను బితికించి వృక్షాలుగా ఎదగడానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో మూడో విడత చేపట్టిన ‘హరితహరం’ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పోలీసు ఆధికారులు, సిబ్బందిచే మొక్కలను నాటించారు. అనంతరం ఎస్పీ విశ్వజిత్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి పిలుపు మేరకు తమ డిజిపి ఆదేశాల మేరకు పోలీసు శాఖ పక్షాన రాష్ట్రంలో కోటి మొక్కలు నాటి వృక్షాలను పెంచాలని లక్ష్యాన్ని నిర్ణంచారని, ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్ష మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే 10 వేల మొక్కలు నాటామన్నారు. పండ్లు, నీడ నిచ్చే చెట్ల మొక్కలను పెంచనున్నట్టు తెలిపారు. మూడు నెలల్లో తమ లక్ష మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, అవసరమైతే లక్ష్యాన్ని మంచి మొక్కలు నాటుతామని ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డిఎస్పీ చంద్రశేఖర్ అవదాని, 17వ బెటాలియన్ కమాండెంట్ ఎంఐ.రమేశ్, అసిస్టెంట్ కమాండెంట్ పిసివి.రామస్వామి, సిరిసిల్ల సిఐ శ్రీనివాసరావు, రూరల్ సిఐ శ్రీ్ధర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

భావితరాల భద్రతకు నాటిన మొక్కలను వృక్షాలుగా చూడాలి
* జిల్లా స్థాయి ప్రజాప్రతినిథుల ‘హరతహారం’ సదస్సులో కలెక్టర్ కృష్ణ్భాస్కర్
సిరిసిల్ల, జూలై 18: ప్రజాప్రతినిథుల చొరవ ఉంటేనే జిల్లాలో చేపడుతున్న తెలంగాణ హరితహరం కార్యక్రమం సఫలం అవుతుందని జిల్లా కలెక్టర్ డి.కృష్ణ్భాస్కర్ అన్నారు. భావి తరాల ఆరోగ్య భద్రత కోసం మొక్కలు నాటి వృక్షాలుగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహరం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లా కాకుండా ఇందులో పాల్గొని మొక్కలు నాటి సంరక్షించడంను సామాజిక బాధ్యతగా చూడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హరితహరం కార్యక్రమంపై స్థానిక పద్మనాయక ఫంక్షన్ హాలులో జిల్లాలోని సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడత హరితహరం కార్యక్రమం కింద జిల్లాలో 80 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ప్రజా భాగస్వామ్యం, ప్రజాప్రతినిథుల సహకారంతో హరిత హరం కార్యక్రమం జయప్రదం చేసేందుకు కృషి చేయాలని కోరారు. హరితహరంలో ప్రధానంగా మూడు అంశాలున్నాయని, లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు సిద్దం చేసుకోవడం, నాటడం, బతికేలా చూడడం లాంటివి ప్రాముఖ్యత అంశాలన్నారు. మొక్కలు నాటడం, బతికేలా చూడడంలో ప్రజాప్రతినిథులదే కీలక పాత్ర అన్నారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ హరితహరంను మూడవ అతి పెద్ద మానవ ప్రయత్నంగా అభివర్ణిస్తుంటారని అన్నారు. రాష్ట్రంలో 240 కోట్ల మొక్కలు నాటడడం లక్ష్యం కాగా, చైనా, బ్రెజిల్ తర్వాత ఇదే అతి పెద్ద లక్ష్యమన్నారు. ప్రజాప్రతినిథులు, ప్రజల సహకారం ఉంటేనే ప్రభుత్వ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 24 శాతం గ్రీన్ కవర్‌ను 33 శాతం పెంచాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిని ప్రజాప్రతినిథులు గుర్తించాలన్నారు. అన్ని రకాల మొక్కలు నాటితేనే ప్రకృతి నియమానుసారం సర్వైవల్ రేటు అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ప్రజాప్రతినిథులు, ప్రజల అభిప్రాయాల మేరకు ఈసారి అధికంగా పండ్ల మొక్కలను నర్సరీలో పెంచామన్నారు. ప్రతి గ్రామానికి నిర్దేశించిన లక్ష్యంను వచ్చే మూడు వారాల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు. లక్ష్యంను త్వరితగతిన పూర్తి చేసేందుకు గ్రామాలలో ఉండే 35 నుండి 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంబంధిత వ్యక్తులచే గ్రామాన్ని 40 ఏరియాలుగా విభజించుకోవాలన్నారు. నాటిన ప్రతి మొక్క ప్రభుత్వ పరంగా ట్రీగార్డు అందించలేమని, సొంత చొరవతో మొక్కల సంరక్షణ ముమ్మాటికి సాధ్యమేనన్నారు. జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ గ్రామాలలో హరితహరం విజయవంతం చేసి, తర్వాత నాయకత్వ ప్రతిభను నిరూపించుకోవచ్చన్నారు. నిర్దేశిత లక్ష్యం కంటే రెండింతల లక్ష్యం చేరుకునేలా ప్రజాప్రతినిథులు కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిథుల కంటె పెద్ద ట్రీగార్డు ఎవరుంటారని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ద పెడితే మొక్క సర్వైవల్ ఉంటుందన్నారు. సమన్వయం, చక్కని ప్లానింగ్‌తో కార్యక్రమంను విజయవంతం చేయాలని జెసి కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో పాండురంగ, డిపివో శేఖర్, సర్పంచులు, జడ్పిటిసిలు, ఎంపిపిలు, ఎంపిటిసిలు పాల్గొన్నారు. ఈసందర్భంగా సాంస్కృతిక సారధులు టీం లీడర్ ఎడ్మల శ్రీ్ధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై ఆట పాటలతో చైతన్యం కలిగించారు.