కరీంనగర్

శిరస్త్రాణం..శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 1: హెల్మెట్..హెల్మెట్. నగరంలోని ఏ ద్విచక్రవాహనదారుని నోట విన్నా ఇదే మాట. శుక్రవారం నుంచి నగరంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ చట్టం అమలుకు శ్రీకారం చుట్టగా, ద్విచక్రవాహనదారులు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. తలకు శిరస్త్రాణం లేకుంటే భారీగానే జరిమానాలు విధిస్తూ, నేరుగా వారి ఇళ్ళకే ఈ చలాన్‌లు పంపే ప్రక్రియను పోలీసులు అంకురార్పణ చేశారు. దీంతోటూవీలర్లంతా హెల్మెట్‌ల బాట పట్టారు. ఇది లేకుంటే ప్రమాదాల్లో తమకు తగిలే గాయాలు దేవుడెరుగు, తాము మాత్రం జరిమానాలతోజడుసుకోవటం తథ్యమనే భయంతోద్విచక్రవాహనదారులంతా శిరస్త్రాణం..శిరోధార్యమంటున్నారు.్ఫలితంగా కొనుగోళ్ళతో దుకాణాలు కిక్కిరిస్తుండగా, వ్యాపారులకు పోలీసులు వెలికితీసిన చట్టం వరంగా మారింది. దీంతో ఏళ్ళనాడు తెచ్చి అమ్మకాల్లేక అటకెక్కించిన హెల్మెట్‌ల దుమ్మ దులుపుతున్న వ్యాపారులు ఇనే్నళ్ళు కాపాడి విక్రయిస్తూ, వడ్డీతో సహా రాబడుతున్నారు. నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో టూ వీలర్లే అత్యధికంగా గాయాలపాలవుతున్నారు. ఈనేపథ్యంలోతప్పనిసరి హెల్మెట్ ధరించాలంటూ గతంలోనే రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోజిల్లాలో పోలీసు యంత్రాంగం దీనిని అమలు చేసేందుకు ప్రయత్నించింది. ముందుగా తమ శాఖలోని సిబ్బందితోప్రారంభించింది. దీంతో కొంతకాలం సక్రమంగానే కొనసాగినా,అనంతరం అటు పోలీసులు, ఇటు రవాణాశాఖ కూడా పెద్దగా పట్టించుకోకపోవటంతోతిరిగి మొదటికొచ్చింది. ప్రమాదాలు షరా మామూలుగానే మారాయి. వీటిని తగ్గించాలంటే హెల్మెట్ చట్టం అమలుతోనే సాధ్యమనే భావనతోజిల్లాపోలీసు యంత్రాంగం మరోసారి అమలు చేసేందుకు నడుం బిగించింది. గత నెలరోజుల నుంచి హెల్మెట్ చట్టంపై అనేక రకాలుగా అవగాహన చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1నుంచి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలుచేస్తామంటూ ప్రకటింగా, ఈమేరకు శుక్రవారం నుంచి హెల్మెట్‌లు ధరించని వారికి ఈ చలాన్‌లతో జరిమానా విధించటం ఆరంభించింది. నగరంలోని పలు కూడళ్ళలో పోలీసు సిబ్బంది హెల్మెట్ లేని వాహనాల నెంబర్లు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఒక వాహనం ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కితే, అన్ని సార్లు జరిమానా చెల్లించేలా ఈ చలాన్‌లు రూపొందిస్తుండగా, బెంబేలెత్తుతున్న టూవీలర్ల యజమానులు పుట్‌ఫాత్‌లపై జరుగుతున్న విక్రయాలు, ఆటోమోబైల్ దుకాణాల ఎదుట క్యూలు కట్టారు. కొనుగోలు చేసిన వారంతా వాటిని ధరించి, నగరంలోతిరుగుతుండగా ఎటు చూసినా, ఎవరి తలలపై చూసినా శిరస్త్రాణాలే దర్శనమిస్తున్నాయి. హెల్మెట్ ధారణను పరిశీలించేందుకు సిపి విబి కమలాసన్‌రెడ్డి నగరంలోపర్యటించగా, 70శాతానికి పైగా టూవీలర్లు వాటిని ధరించటంతోసంతృప్తి వ్యక్తం చేశారు. మరోరెండు రోజుల్లో వంద శాతానికి చేర్చుతామనే ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని ఆర్ ఎంపి, పి ఎంపిల సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు తెలంగాణచౌక్‌లో నిర్వహించిన హెల్మెట్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిరస్త్రాణ ధారణ శిరోధార్యం కావాలని, శిరోభారమని భావించకూడదన్నారు. తమ తలను మనమే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

సినిమాలంటే పాటలు, ఫైటింగ్‌లు కాదు

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 1: సినిమాలంటే పాటలు, ఫైటింగ్‌లు కాదని, మానవ సంబంధాలను పెంపొందించే బాలల చలన చిత్రాలు చూడడం ముఖ్యమని సమాచార శాఖ ఉపసంచాలకులు ఎన్.వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం కరీంనగర్ ఫిలిం భవన్‌లో ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు బాలల చలన చిత్రాలను ప్రదర్శించారు. ఈ బాలల చిత్రాన్ని దాదాపు 200 లకు పైగా విద్యార్థినీ, విద్యార్థులు తిలకించారు. ఈ సందర్భంగా బాలల చలన చిత్రంపై విద్యార్థుల స్పందన తెలుసుకొనుటకు వీలుగా ఫిలిం భవన్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్ ఫోరమ్‌లో చిల్డ్రన్స్ సొసైటీ ప్రతినిధులు అఖిల, ప్రసాద్, బాలల చలన చిత్రోత్సవాలకు జూరీ మెంబర్లుగా వ్యవహరించిన ఉమ మహేశ్వర్, ప్రభాకర్ జైనీ, వారాల ఆనంద్, కఫిసో అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, కార్యదర్శి ముజఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అమూల్యం బాలల చలన చిత్రంపై స్పందనను తెలుపుచూ అమూల్యం బాలల చిత్రం మా ఎంతో స్పూర్తి నింపిందని అన్నారు. ఆధునిక యుగంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని, ఈ సినిమాలో వారి కుటుంబంలో నానమ్మకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక పట్టణం వదిలి పల్లెకు నానమ్మతో వెళ్లిందన్నారు. పట్టణంలో కన్నా గ్రామాల్లోనే విద్యార్థులకు మానసిక, శారీరక అభివృద్ధి సాధించుటకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని, అవి ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని విద్యార్థులు తెలిపారు. పట్టణాలలో కలుషితమైన చిరుతిండ్లు తిన్న విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని, ఈ బాలల చిత్రంలో చూపించారని వారు తెలిపారు. ఈ బాలల సినిమాలో పాటలు, వినోదము లేకున్నా విద్యార్థులకు జీవిత విలువలు నేర్పే విధంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినీ విమర్శకులు వారాల ఆనంద్ విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ ఇటీవల మీరు తల్లిదండ్రులతో కలిసి చూసిన కమర్షియల్ సినిమాలకు ఈ అమూల్యం బాలల చలన చిత్రానికి మధ్య వ్యత్యాసం ఏమీ గమనించారని అడుగగా, విద్యార్థులు ఎక్కువ సినిమాలో హీరోయిజమ్ ప్రదర్శించగా ఈ సినిమాలో మానవ విలువలు తెలిపారని పిల్లలు జవాబు ఇచ్చారు.

ముహూర్తంనేడే

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 1: ఇరవై అయిదు రోజులుగా కొనసాగిన పల్లెపోరు బుధవారంతో ముగియగా, పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారితోకొత్త పాలక వర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. ఫిబ్రవరి 2ను అపాయింటెడ్ డేగా ప్రభుత్వం ప్రకటించగా, ఆయా పంచాయితీలకు ప్రత్యేకాధికారులుగా కొనసాగుతున్న వారు సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో శనివారం ప్రమాణ స్వీకారం చేయించి, పదవీ బాధ్యతలు అప్పగించనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ నుంచి వెలువడగా, ఇందుకవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. స్పెషలాఫీసర్లు లేనిచోట గ్రామ కార్యదర్శులు బాధ్యతలు అప్పగించనున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంటుంది. పాలకవర్గం పగ్గాలు చేపట్టిన మొదటిరోజే పంచాయతీ తొలి సమావేశం నిర్వహించాలంటూ ప్రభుత్వం సూచించటంతో, సిబ్బంది ఆదిశగా చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 1210 పంచాయితీల్లో సర్పంచ్‌లతో పాటు, 11,132 వార్డు సభ్యులు కూడా నేడే బాధ్యతలు చేపట్టనున్నారు. గత నెల 7నుంచి మొదలైన సం‘గ్రామం’ 30 నాడు ముగియగా, మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికలు అసెంబ్లీ పోరును తలపించాయి. ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులు, వారికి మద్ధతునిచ్చిన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, గెలిచిన ఉత్సాహంతో ఉన్న వీరికి బాధ్యలప్పగిస్తే అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశాలున్నాయని రచ్చబండ చర్చలు చెబుతున్నాయి. ప్రత్యేకాధికారుల పాలనలోగ్రామాల్లో అభివృద్ధి కుంటుపడగా, కొత్త పాలకవర్గాలతో ఇక నుంచి ప్రగతిపథంలోపయనించనున్నాయని పలువురు విశే్లషకులు పేర్కొంటున్నారు. మేజర్ పంచాయితీలకు అనుబంధంగాకొనసాగిన గ్రామాలు, తండాలు కొత్త పంచాయతీలుగా ఆవిర్భవించి,స్పెషలాఫీసర్ల పాలనలో ఉండగా, ఇకనుంచి పాలకవర్గాలతో కళకళలాడనున్నాయి. కొత్త జీపీల్లో సౌకర్యాల కొరత వేధిస్తుండగా, పాలకవర్గాలకు సవాలుగా మారనుంది. అత్యధికచోట్ల కొత్తగా ఎన్నికైన సర్పంచులే గ్రామపంచాయితీల్లో అవసరమైన సామాగ్రి తెప్పిస్తున్నారు. అలాగే, కొత్తగా ఎన్నికైన సర్పంచులకు పరిపాలన పరమైన అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పంచాయితీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతన పంచాయితీరాజ్ చట్టంతో పాటు గ్రామస్థాయిలోప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎంపిడివోలు, ఈవోపీఆర్డీలు, కార్యదర్శులకు రాష్టస్థ్రాయిలో శిక్షణ ఇప్పటికే మొదలుకాగా, ఈనెల 10వరకు కొనసాగనుంది. ఇది ముగిసిన వెంటనే జిల్లాకేంద్రాల్లో ఈనెల 11నుంచి మూడు విడతలుగా సర్పంచులకు శిక్షణ ఇవ్వనున్నారు.

కేవీకి ఘన నివాళులు

ధర్మపురి, ఫిబ్రవరి 1: పాతతరంకు చెందిన 95ఏళ్ళ తలపండిన రాజకీయ వేత్త, స్వాతంత్య్ర సమరయోధులు, కార్మిక నాయకులు, అవిభక్త తెలుగు రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల సంఘం వ్యవస్థాపక బాధ్యులు, జాతీయ కాంగ్రెస్, బీసీ అగ్రనేత, మాజీ మంత్రి కర్నె వెంకట కేశవుల శకం ముగిసింది. శుక్రవారం దివంగత నేత అంత్య క్రియలు ముఖ్యమంత్రి ఆదేశానుసారం, ప్రధాన కార్యదర్శి జోషి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి. తమ బాల్యానికి తీపి గుర్తుగా ఉన్న గోదావరీ తీరస్థ పాత స్వగృహం వద్ద ఆయన కోరిక మేరకు పార్థివ దేహ సంస్కారం జరగగా, వందలాదిగా శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్‌లో మృతి చెందిన కేశవుల భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం ధర్మపురికి తీసుకు వచ్చి, స్థానిక పురపాలక సంఘ స్థలంలో ఉంచగా, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అలంకృత వాహనంపై ఉంచి, అంతిమయాత్రలో భాగంగా, నంది కూడలి, దేవస్థానం ప్రధాన రహదారి గుండా వందలాదిగా కలిసి రాగా, కేశవులు గృహం వద్దకు చేరుకుని, అక్కడ పార్థివ శరీరాన్ని ఉంచారు. పండితుల ద్వారా అంతిమ సంస్కార అపరకర్మ జరిపించిన అనంతరం తాజామాజీ చీఫ్‌విప్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పూలమాల వేసి, నివాళులు అర్పించగా, జేసి రాజేశం, అడిషనల్ ఎస్పీ మురళీధర్, ఆర్డీఓ డాక్టర్ నరేందర్, సిఐ లక్ష్మీబాబు, తహశీల్‌దార్ కలీం, డిటి సుమన్, ఎస్‌ఐ శ్రీకాంత్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. వందలాది మంది క్షేత్రవాసి కేశవులు దేవస్థాన తొలి చైర్మన్‌గా, లక్ష్మీనరసింహ నాటక సంస్థ వ్యవస్థాపక బాధ్యులుగా, స్వాతంత్య్ర ప్రకటన నాటి అర్థరాత్రి జాతీయ పతాకావిష్కరణ గావించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని, విలపించారు. తర్వాత క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి, భౌతిక కాయాన్ని భజస్కంధాలపై తీసుకెళ్ళి, గోదావరి వద్ద చివరి సంస్కారాలు గావించారు. ఏఆర్ డీఎస్పీ ప్రతాప్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది తుపాకీలతో గౌరవ వందనం గావించగా, గౌరవ సూచకంగా ఆర్వీ రిజర్వుడ్ ఫోర్స్ గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కేశవులు పెద్ద కుమారుడు మురళీధర్ చితికి నిప్పంటించారు. కుటుంబ సభ్యులతో పాటు వందలాది మంది నాయకులు, బంధు, కుల బాంధవులు, క్షేత్రవాసులు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు.