మాతో - మీరు

సండే గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ వారం ‘సండే గీత’లో పనిమనిషి కథనం స్ఫూర్తిదాయకంగా ఉంది. మానవులందరూ ఏదో ఒక కార్యం నెరవేర్చేందుకు ఆ పరమాత్మ చేత సృష్టించబడిన వారేనని, అందరూ ఏదో ఒక ప్రత్యేకత వున్నవారని, అందరిలో వున్న ఆత్మస్వరూపుడైన ఆ సర్వేశ్వరుని దర్శించి, సర్వ మానవ సౌభ్రాతృత్వం అలవరచుకోవాలన్న వేదోక్తిని చక్కగా చెప్పినందుకు కృతజ్ఞతలు. అలాగే ‘బంగారు ఉంగరం’ ఆలోచింపజేసేదిగా ఉంది. ‘చాలామంది ఏదో మంచి మన జీవితంలో జరగాలని వేచి చూస్తుంటారు. దానివల్ల ఫలితం లేదు. వేచి చూడ్డం కాదు అది జరిగేలా చూడాలి’ అన్న మాటలు మాకెంతో నచ్చాయి. మన జీవితంలోనూ అంతే! మన చుట్టూ ఎన్నో అవకాశాలు, మంచి కావాలని మనమందరం కోరుకుంటాం. కానీ సమస్య ఏమిటంటే అవి జరిగేలా మనం ప్రయత్నం చేయం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
స్ఫూర్తి
ఆదివారం అనుబంధంలో బాగా ఆకర్షించేది మల్లాది వారి ‘స్ఫూర్తి’ కథలోని నీతి. పిల్లలే కాదు పెద్దలూ అవశ్యం అనుసరించాల్సిన నీతి ఆ కథలో ఉంది. మనం అసలేదీ తెలియకుండానే ఎదుటి వారిలో లోపాలు ఊహించుకొని వాగేసి శత్రువులను పెంచుకుంటాం. కానీ - నీతా.. ఎదుటివారిని పరిశీలించి వారిలోని మంచిని గుర్తించి వారిని ప్రశంసించి మిత్రులను పెంచుకున్నట్టే మనమూ చేయాలి.
-జె.జ్ఞానబుద్ధ (సిద్ధార్థనగర్)
సుఖం
శ్రమ జీవుల శరీరాలకు, సమస్యలతో మనసు కలత చెందినవారికి, శారీరక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రశాంతమైన నిద్ర కొండంత ఉపశమాన్నివ్వడమే గాక నూతనోత్సాహంతో దైనందిన కార్యక్రమాలు చేయగలుగుతారు. నిద్ర సుఖమెరుగదన్న సామెత వాస్తవం. ‘జోజో.. లాలి’ ఆదివారం అనుబంధానికి కొత్త అందాన్ని తెచ్చింది. ‘సడిసేయకో గాలి..’ అన్న గాన‘లీలా’మృతం, ‘నిదురపోరా తమ్ముడా..’ అన్న ‘లతా’మృతం మరువగలమా?
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
ఓ చిన్న మాట
ఈ శీర్షికన అందిస్తున్న కథలు బాగుంటున్నాయి. ‘బంగారు ఉంగరం’ కూడా. ఏదో జరగాలని చూడటం కాదు. అడుగు ముందుకు వేయండి. పనిలోకి దిగండి’ అంటూ చక్కగా తెలియజేశారు. సిసింద్రీలో ‘కనువిప్పు’ కథ బాగుంది. ప్రతి మనిషిలోనూ చదువు, సంపదలతోపాటు సంస్కారం, మానవత్వం, పరోపకారం ఉండాలని చక్కగా చెప్పారు. ‘సండే గీత’లో పనిమనిషిని చిరునవ్వుతో పలకరించాలని, పేరుతో పిలవాలని, పనిమనిషిగా కాకుండా మన మనిషిగా చూడాలని చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
వాస్తవం
ఏదో జరగాలని చూడ్డం కాదు. అడుగు ముందుకేసి పని చేయమని ఓ చిన్న మాటగా ఓ వాస్తవాన్ని వెల్లడించారు. అలాగే ‘కూర్మ పురాణం’ అంటూ తాబేళ్ల గురించి వివరించిన వ్యాసం చాలా బాగుంది. ప్రపంచ తాబేళ్ల దినం అంటూ ఒకటుందని ఆ వ్యాసం చదివాకే తెలిసింది!
-కె.సుభాష్ (శ్రీనగర్)
క్రైం కథ
‘చెరపకురా చెడేవు’ అన్న తెలుగు నీతికి పాశ్చాత్య నేపథ్యంలో మరో ఉదాహరణ క్రైం కథ ‘పడవ ప్రయాణీకుడు’ బాగుంది. వౌలికంగా మానవులంతా ఒక్కటే. వారి కథలూ అంతే అనిపించింది. రసవిద్య (ఆల్కెమి)ని మన నుంచే పాశ్చాత్యులు నేర్చుకున్నారనీ, రస విద్యలో నాగార్జునుడు దిట్ట అని తెలిసి ఆశ్చర్యపోయాం. భారతగడ్డ మీద ఇలా మరుగున పడిన మాణిక్యాలు ఎన్ని ఉన్నాయో కదా. అలాగే ‘ఎవరూ చూడటం లేదు కదాని నియమాల్ని ఉల్లంఘించ తగదని’ స్ఫూర్తి కథలో చెప్పిన నీతి చాలా గొప్పది. పిల్లలే కాదు పెద్దలు కూడా అనుసరించాల్సిన గొప్ప నీతి. దక్షిణాది వారికి పొరుగింటి పుల్లకూర బహు రుచి. దాని కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. అందుకే తారలకు దక్షిణాది అంటే అంత మోజు!
-పి.శుభలక్ష్మి (కాకినాడ)
అవీ-ఇవీ
ఉత్తర అమెరికా వారి పిచ్చి అయిన బ్లూబెర్రీస్ ఔషధ గుణాలు, ఆకులను కుట్టి గూళ్లు అల్లుకునే టైలర్ బర్డ్స్, బ్రిటన్ జాతీయ పక్షి రాబిన్ గురించి విశేషాలు అలరించాయి. మన వృత్తిలో ఎదురయ్యే అందరిపైనా దృష్టి పెట్టాలి. వారిని పేరుతో పలకరించాలి. పని మనిషి అయినా సరే.. అన్న సండే గీత మా మనసులను దోచింది. మంత్రులకు తమ శాఖలో కనీస పరిజ్ఞానం ఉండాలని ప్రజలు ఆశించడం సముచితమే. కాని పదవులు కూడా కులాలు, ఉపకులాలు, సామాజిక వర్గాలలు, మతాలు ప్రాతిపదికన ఇస్తున్నప్పుడు చేతగాని వారికి పదవులు దక్కడం అనివార్యం! గుజరాత్‌లో పంచాయతీ మెంబర్లకు, సర్పంచ్‌లకు కనీస విద్యార్హతలు ఉండాలని చట్టం చేస్తే మన మేధావులు రాజ్యాంగ విరుద్ధం అంటూ నిరసిస్తున్నారు.
-కె.సాహిత్యదీప్తి (రమణయ్యపేట)
అన్నీ ముఖ్యమే
ఓ చిన్న మాట - చిన్నమాట కాదు. దశాబ్దాల తరబడి ఇంట్లో వున్న వస్తువులతో ఎంతో అనుబంధం ఏర్పడుతుంది. ఇల్లు ఇరుకై కొన్ని అనవసరమనుకున్న వస్తువులను వదిలించుకుందామంటే మనసొప్పదు. ప్రతి సంవత్సరం సెలవులలో పుస్తకాలు, వస్తువుల దుమ్ము దులపడం, తిరిగి రాక్‌లలో సర్దడం నిత్యకృత్యమై పోతోంది. చదివిన పుస్తకాలు తిరిగి చదివే టైము, ఓపిక లేకపోతున్నాయి. జాన్ రస్కిన్ చెప్పినట్లు ‘బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్’లా అన్నీ ముఖ్యమే.
-ఎన్.పద్మావతి (హైదరాబాద్)