మెయిన్ ఫీచర్

సుమధుర కంఠం.. సుందర రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు, అందునా సాంప్రదాయ కుటుంబీకులు ఎవరూ ఆలోచన కూడా చేసే సాహసం చేయని రోజులలో సాహసించి ప్రతి రంగంలోనూ దూకి తనదైన ప్రత్యేక ముద్ర వేసిన సాహసి మన టంగుటూరి సూర్యకుమారి. సంపన్న కుటుంబాల స్ర్తిలు కూడా అడుగుపెట్టడానికి జంకే రంగాలలో ప్రవేశించి, పరిశోధించి ఆ ఆ రంగాలో జన హితానికి మన దేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాలలలో కూడా విశేష కృషి చేశారు. మానవసేవే మాధవ సేవ అంటూ పనే దైవం, శ్రమే పూజ అని నమ్ముతూ తన చివరిరోజు వరకు అహర్నిశలు పాటుపడింది. మానవాళి అభ్యున్నతికి, ఆధ్యాత్మికతను సమాజంలో పెంచడానికి సూర్యకుమారి చేసిన కృషి విస్తృత విదేశీ పర్యటన ఆ రోజులలో ఆమెను తొలి తెలుగు మహిళగా గుర్తింపజేశాయి. ఆమె ఒక ట్రెండ్‌సెట్టర్, బ్రాండ్ నేమ్‌గా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.
హిందూ సంస్కృతి అన్నా, హిందూ మతం అన్నా అందులోనూ తెలుగు మాట అన్నా తెలుగు పాట అన్నా, తెలుగు పండుగ అన్నా ఆమెకు ఎంతో ఇష్టం. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా విదేశాలలో ఉన్న సూర్యకుమారిగారు తన సంస్కృతిని, తన సహజత్వాన్ని వదులుకోలేదు. భగవద్గీత, భజగోవింద శ్లోకాలను చదువుతూ ఉండేవారు.
అంతేకాకుండా తనలోని ప్రతిభ, విజ్ఞత, ఆధ్యాత్మిక జ్యోతిని గుర్తించి రాయల్ ఫెస్టివల్ హాల్ నిర్వాహకులు ప్రోగ్రాములకు ఆహ్వానిస్తే, ఆమె గానం, నైపుణ్యం, నృత్యం, నటనా వైవిధ్యం జనాలు చాలా కాలంపాటు చెప్పుకున్నారు. తన బహుముఖ ప్రజ్ఞతో సంగీతం, నటన, నృత్యం- వీటిని సామాజిక సేవకు ఉపయోగించింది. ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల తన ప్రదర్శనలతో డబ్బు సేకరించి ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథ శరణాలయాలకు అందించింది. ‘విశ్వకవి’ రవీంద్రనాథ ఠాగూరు నాటకాన్ని తెలుగునించి, వాటి ప్రదర్శనలతో పలు ప్రాంతాల ప్రజలను ముగ్ధులైనారని పత్రికలో రాసారంటే ఆమెకు దేవుడిచ్చిన కళ ఏపాటితో అర్థమవుతుంది. ఆమె పుట్టింది సాంప్రదాయ కుటుంబంలో. తండ్రి నిబద్ధతగల న్యాయవాది, టంగుటూరి శ్రీరాములు, తల్లి రాజేశ్వరి. సాంప్రదాయ ఆదర్శ గృహిణి. పెదనాన్నగారు అసలు భయమేంటో ఏమిటో ఎరుగని ప్రముఖ బారిస్టర్, స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులుగారు. వీరి కుటుంబంలోని వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. కాని పైవాడి లీల చిత్రంగా ఉంటాయి కదా! సూర్యకుమారి మాత్రము బడికి వెళ్ళలేదు తన చిన్నతనంలో. ఆ భగవంతుడు తనని కళామతల్లిని పలు రంగాలలో ఆరాధించమని, తద్వారా ప్రజాసంక్షేమానికి, సమ్మిళిత సాహిత్య వికాసానికి దోహదపరిచే మహాయజ్ఞానికి గాను ఈ భూమికి పంపించాడా అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే కర్ణాటక సంగీతంలో, వయలిన్ వాద్యంలో, కూచిపూడి, భరత నాట్యాలలో, వీణలో శిక్షణ పొంది అన్నింటిలోనూ శభాష్ అనిపించుకుంది. యోగాలో కూడా శిక్షణ తీసుకొని తన సహజ అందానికి మరింత నాజూకును చేర్చుకుని 1950లోనే ఆమె మిస్ మద్రాస్‌గా ఎంపికైంది.
పుట్టుకతో ఆమె ప్రతిభావంతురాలు. సుమధుర కంఠం, సుందర రూపం, తొందరగా గ్రహించే తెలివి ఇచ్చి గోదావరి తీరానికి పంపాడు ఆ పైవాడు. 1926 నవంబర్ 13 ఆమె జననం. ఆమె ఊహ తెలిసినప్పటినుంచి గ్రామఫోన్ పెట్టెముందే సమయం గడిపేది. అందులోంచి ఏ గాయకుల పాట వస్తే అలా విని ఇలా పాడేసేది. ఆమె పెదనాన్నగారు ఆంధ్రకేసరి లక్షణాలైన గంభీరత్వం, ధైర్యం, తెగువ, చొరవ, సాహసం, నటన మొదలైనవి సూర్యకుమారికి పుట్టుకతోనే వచ్చిన సహజగుణాలైనాయి.
ప్రకాశం పంతులుగారు ఏ స్వాతంత్య్ర పోరాట సభలకు వెళ్లినా ప్రారంభగీతం ఈ అమ్మాయి పాడాల్సిందే. ఆమె యొక్క బహుముఖ ప్రజ్ఞకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంతేకాదు తన ప్రార్థనా గీతాన్ని ప్రసంగాల మధ్యలో కూడా అమ్మాయిని అడిగి పాడించుకునేవారట. అలా చిన్నపిల్లగానే దక్షిణాన అన్ని భాషల ప్రజల నోట ఆమె పేరు మారుమ్రోగింది. రాజమండ్రి నుంచి మద్రాస్ వచ్చిన తర్వాత తనకు ఇంత ప్రతిభ ఉండి చదువు లేదంటారేమో అనుకుని తనే స్వయంగా కేంబ్రిడ్జి సీనియర్ మెట్రిక్యులేషన్ ప్రైవేట్‌గా పాసైంది. ఇక అప్పటినుంచి ఆమె మరలా తిరిగి చూసుకోలేదు. విజయాలపైన విజయాలు, అవార్డులపైన అవార్డులు, బిరుదులు అనేకం ఆమె సొంతం. అయినా తెలుగుతనం, తెలుగు నైజం, తెలుగు సంస్కృతిని మరువలేదు. పైగా వాటిని దశదిశలా ప్రజ్వలింపజేయడం ఆమెకే సాధ్యమైంది కాని అన్యులకు కాదు అనుకున్నారు అపుడు. అందుకే ఆమె టంగుటూరి దివ్య జ్యోతి అయింది నాటికి నేటికి.
ఆమెకి 12 ఏళ్ళు నిండాయో లేదో తన గొంతు, గానానికి చాలా సినిమా అవకాశాలు రావడం మొదలైనాయి. 1937లో ఆ కాలంలో హిట్ సినిమా ‘విప్రనారాయణ’లో సూర్యకుమారి కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్‌రాసి చేర్చారు. బాలనటిగా అత్యంత పాపులారిటీ సంపాదించుకొని 1952 వరకు విభిన్న చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసింది. దక్షిణాది అన్ని భాషలలోనే కాక బాలీవుడ్‌లోనూ, హాలీవుడ్‌లోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది మన తెలుగు సుగుణబాల.
తెలుగువారి జాతీయ గీతం ‘మా తెలుగు తల్లికి’ ఆలపించింది ఈ తెలుగు అమ్మాయే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున ‘మాదీ స్వతంత్య్రదేశం’ పాట మద్రాస్ రేడియోలో పాడి అందరినీ స్వాతంత్య్ర సంబరాలలో పాల్గొనేలా చేసింది కూడా ఈ తెలుగు బాలే. జాతిపిత మహాత్మాగాంధీ చనిపోయిన రోజు ‘ఓ మహాత్మా అంటూ పాడితే భారత ప్రధాని నెహ్రూతో సహా కంటతడి పెట్టనివారు లేరు. కొత్త కొత్త అంశాలమీద అధ్యయనానికి అమెరికా, ఇంగ్లాండ్ వెళ్తే బిబిసి ప్రొడక్షన్ చానల్స్‌వారు పాత్రలు ప్రత్యేకించి సూర్యకుమారితో వేయించారు. హాలీవుడ్‌లో రిసెర్చిగా పనిచేసింది.
తరువాత ఇండియా పెర్‌ఫార్మింగ్ ఆర్ట్ సొసైటీని స్థాపించి తన ట్రూప్‌తో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మొదలగు దేశాలలో ప్రదర్శనలిచ్చి, అదే తన జీవితంగా చివరి రోజువరకు కళామతల్లికి తన వంతు సేవ చేస్తూ తరించింది. ఇంగ్లాండ్ తన కేంద్రంగా ఏర్పరచుకుంది.
ఆమె బ్రిటిష్ రాణి ముందు ప్రదర్శన ఇచ్చి, ఆమె మెప్పు, ఆదరణ, ఆహ్వానం పొందడంతో బ్రిటన్‌లో ఈ తెలుగు అమ్మాయి సెలబ్రిటీ అయింది. ఆ రోజులలోనే పరిచయమైన బ్రిటీష్ రచయిత, పర్యాటక ప్రేమికుడు, పెయింటర్ అయిన హెరాల్డ్ ఎల్విన్ అనే కళాతపస్వితో పరిచయమేర్పడింది. కళలే వారిని కలిపింది. వారి పెళ్లి సమయానికి ఆమెకు 46, ఆయనకు 64 సంవత్సరాలు. 1985 వరకు తన మరణం దాకా హెరాల్డ్ భర్తగానే కాక తన మానేజర్‌గా కూడా సహకరించకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు అంటారామె.
1951లో మిస్ ఇండియా పోటీల్లో రెండవ స్థానం దక్కించుకుంది. ఒక సినిమాలో నారదుడిగా కూడా నటించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకుంది. అమెరికన్ మోషన్ పిక్చర్స్ ఇండస్ట్రీ వారు ఆహ్వానించిన భారతీయ బృందంలో సూర్యకుమారి ఒకరు. రాజ్‌కపూర్, నర్గిస్ ఉన్న ఆ బృందంలో ఆమె ఒక్కతే ఇంగ్లీష్‌లో చక్కగా మాట్లాడే ఏకైక కళాకారిణి. ఆమె పాటలకు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ కూడా వీర అభిమాని అయినాడు.
సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమతాల సారాంశం ప్రచారం చేస్తూ శాంతి మార్గాన్ని ఉద్బోధించే ఒక అపురూప నృత్య సంగీత రూపకం తయారుచేసుకొంది. కాని అది కార్యరూపం దాల్చుకోలేదు. అనారోగ్యంతో బాధపడుతూ ఏప్రిల్ 25 2005న ఇంగ్లాండ్‌లోనే కన్ను మూసింది.
టంగుటూరి సూర్యకుమారి చూపిన ధైర్య సాహసాలు, త్యాగనిరతి, కళాపోషణ తద్వారా నవ సమాజ నిర్మాణానికై పడినశ్రమ ఈనాటికీ ఏనాటికీ ఆచరణీయాలు. ఆమె ప్రాతఃస్మరణీయురాలు అనడంలో అతిశయోక్తి లేదనుకుంటాను.

-టంగుటూరి శ్రీరామ్