మెయిన్ ఫీచర్

పదహారేళ్ల పుత్తడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా ఒక ఆటపై మోజు పెంచుకుంటారు. ఆ ఆటనే ఆడతారు. కానీ మనూ భాకర్ మాత్రం తనకెదురైన ప్రతి ఆటనూ నేర్చేసుకుంది. మనూ ఆరేళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి రామ్‌కిషన్ ఆమెను బాక్సింగ్‌లో చేర్పించాడు. తర్వాత ఆమె కబడ్డీ, మణిపురి మార్షల్ ఆర్ట్ అయిన టంగ్‌టా, కరాటే, టెన్నిస్.. ఇలా చాలా ఆటలు నేర్చేసుకుంది. ఆడటమే కాదు పతకాలనూ తెచ్చుకుంది. జాతీయ టంగ్‌టా పోటీల్లో బంగారు పతకం, కరాటేలో జాతీయ పతకం గెలుచుకుని ఆటల కోసమే పుట్టినట్లు తనను తాను తయారుచేసుకుంది.
కొత్త కొత్త ఆటలు నేర్చుకోవడమంటే మనూ భాకర్‌కు సరదానో ఏంటో తెలియదు కానీ పదహారేళ్ళ వయస్సులో తుపాకీని చేపట్టింది. షూటింగ్ మొదలుపెట్టింది. కూతురు ప్రతిభ తెలిసిన ఆ తండ్రి ప్రోత్సహించాడు. ‘నీకు నచ్చింది చేయమ’ని వెన్నుతట్టాడు. అంతటితో ఆగలేదు ఆ తండ్రి. ‘నాన్నా! నాకు తుపాకీ కావాలి.. కొనివ్వవా?’ -అని అడిగిన మరుక్షణం లక్షన్నర ఖర్చుపెట్టి కూతురికి తుపాకీ కొనిచ్చేశాడు. ఫలితంగా ప్రపంచకప్ షూటింగ్‌లో రెండు బంగారు పతకాలు. తన కూతురి సత్తా ఆ తండ్రికి తెలుసు కానీ.. అది దేశానికి ఏకంగా రెండు బంగారు పతకాలు తెచ్చేంత సత్తా అని ఆ తండ్రికి అప్పుడు తెలియలేదు.
మనూ భాకర్ తండ్రి రామ్‌కిషన్ మర్చంట్ నేవీ ఇంజనీర్. తల్లి సుమేధ యూనివర్సల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్. చిన్నప్పటి నుంచి అన్ని ఆటల్లో మేటిగా నిల్చిన మనూ భాకర్ చదువుల్లోనూ మేటే.. కానీ మనూ షూటింగ్ నేర్చుకోవాలని అనుకున్న తర్వాత తన తల్లి పనిచేసే స్కూలుకు మారాలనుకుంది. కారణం ఆ జిల్లా మొత్తంలో షూటింగ్ రేంజ్ కలిగిన స్కూల్ అదొక్కటే. అందుకే ఇంటికి దూరమైనా పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేసి రోజుకి ఐదు గంటలపాటు షూటింగ్ ప్రాక్టీసు చేసేది మనూ. అలాగని ఆమె చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదకొండో తరగతి చదివే ఆమె చదువులోనూ చక్కని ప్రతిభ కనబరిచేది. 2018 జనవరి నుంచి ప్రపంచకప్ షూటింగ్ నియమాలు మారాయి. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా అరవై షాట్లు కొట్టాలనే నిబంధన పెట్టారు. మునుపు స్ర్తీలు కేవలం నలభై షాట్లు మాత్రమే కొట్టేవారు. అరవై షాట్లు కొడితేనే పోటీకి అర్హత సాధించినట్టు. ఇది అందరికీ కష్టమనిపించినా మనూకి అదంత పెద్ద విషయంగా తోచలేదు. అందుకే అరవై షాట్లను అవలీలగా కొట్టేసి మెక్సికో క్రీడాకారిణి అలెజెందాను ఎదుర్కొంది. ఆమెను ఓడించి మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఒక బంగారు పతకం గెలిచిన తర్వాత ఇక చాల్లే.. అనుకోలేదు మనూ. అలా అనుకుంటే మరో స్వర్ణం మన దేశం ఖాతాలో చేరేది కాదు. వచ్చిన పతకం గురించి ఆలోచించకుండా ఆట మీద దృష్టి పెట్టింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీంలో ఓం ప్రకాశ్ మిథర్వాల్‌తో కలిసి, ఆటలో ఆరితేరిన ప్రత్యర్థి జంటను మట్టికరిపించింది. మొదటి ప్రయత్నంలో రెండు బంగారు పతకాలు గెలిచిన మనూ అత్యద్భుతమైన సాంకేతికతో కూడిన శిక్షణ పొందింది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఆమె అలాంటి శిక్షణేమీ తీసుకోలేదు. ఒలంపిక్స్‌లో ఎలక్ట్రానిక్ టార్గెట్స్‌ను షూట్ చేయాలి. కానీ మనూ స్కూల్లో మాన్యువల్ రేంజ్ మాత్రమే సాధన చేసింది. ఎలక్ట్రానిక్ టార్గెట్స్‌ను ఎప్పుడూ షూట్ చేయలేదు. మాన్యువల్‌కి, ఎలక్ట్రానిక్‌కి సాంకేతికంగా చాలా తేడా ఉంటుంది. అయినా సరే మనూ దాన్ని ఛేదించింది.. బంగారు పతకాలు సాధించింది. ఎందుకంటే పోటీలో గెలవటానికి సాధనాలు కాదు ముఖ్యం.. కృషి, పట్టుదల, ఏకాగ్రత, అంకితభావాలు ముఖ్యం.
పదకొండో తరగతి చదువుతున్న పదహారేళ్ళ అమ్మాయి అద్భుతాలను సృష్టించింది. రెండు బంగారు పతకాలతో ఆగకుండా శనివారం జరగబోయే ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది మనూ భాకర్. అంటే భారతదేశానికి మరో బంగారు పతకం రాబోతుందా? ఏమో వేచి చూద్దాం. ఆల్ ద బెస్ట్ మనూ...
ఆమె సత్తా తెలుసు
మనూ విజయం నన్ను ఆశ్చర్యానికి గురిచేయలేదు. ఎందుకంటే ఆడేటప్పుడు ఆమె చూపించే శ్రద్ధ, అంకితభావం నాకు బాగా తెలుసు. షూటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే నా చేత పిస్టల్ కొనిపించుకుంది మనూ. తనకేదైనా కావాలని అడిగిందంటే.. ఆ ఆటను ఆమె అంత తేలికగా తీసుకోవట్లేదని అర్థం. ఆమె సత్తా ఏంటో నాకు తెలుసు. ఆమె ఏదైనా ఆట ఆడుతోందంటే అందులో ఆమె కనబరిచే శ్రద్ధ, ఏకాగ్రతా నాకు తెలుసు.
-రామ్‌కిషన్
సొంత ప్రణాళిక
నేను ప్రపంచ కప్‌లో మొదటిసారి పాల్గొంటున్నా.. ఒక్క బంగారు పతకం గెలుస్తానన్న నమ్మకం లేదు నాకు. కానీ ఒకేసారి రెండు బంగారు పతకాలు వచ్చాయి. షూటింగ్ మొదలుపెట్టేటప్పుడు నేనసలు పతకం గురించే ఆలోచించలేదు. ఎప్పుడూ షూట్ చేసినట్టే షూటింగ్‌ను మొదలుపెట్టాను. పోటీ చివరికి వచ్చాక ఫైనల్స్ గురించి కాకుండా నేను నా టెక్నిక్స్ మీదే దృష్టి పెట్టాలి అని నాకు నేను నచ్చజెప్పుకున్నాను. అదే చేశాను. విజయం వరించింది. శిక్షణ పొందేటప్పుడు కూడా నేను నా సొంత ప్రణాళికతోనే ముందుకు సాగేదాన్ని. కాబట్టే ఈ ఎలక్ట్రానిక్ టార్గెట్‌లు నన్ను భయపట్టలేదు. నేను ఎప్పుడూ ఆట మీదే దృష్టి పెడతాను. అదే నాకు స్ఫూర్తి. ఇప్పుడు అంతర్జాతీయ షూటర్లందరూ నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో నేను మరింత ఎత్తుకు ఎదగటానికి ఈ బంగారు పతకాలే నాకు స్ఫూర్తి. అలాగని వీటినే చూస్తూ కూర్చోను. ఎప్పుడైనా ఆటమీదే నా దృష్టి అంటూ నవ్వేసింది మనూ భాకర్.

-మహేశ్వరి